చక్కని ఫలితాలు తెచ్చే ప్రచార కార్యక్రమం
జిల్లా సమావేశం మొదలవడానికి మూడు వారాల ముందు ఆయా సంఘాలు, తమ ప్రాంతంలోని ఆసక్తిపరులను ఆ సమావేశానికి ఆహ్వానించేందుకు ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాయి. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ప్రచార కార్యక్రమంవల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇచ్చే ఆహ్వాన పత్రాన్ని తీసుకుని చదివి సమావేశానికి వచ్చే వాళ్లు, అక్కడిచ్చే లేఖనాధార ప్రసంగాలను, ఒక పద్ధతిగా పనిచేసే విభాగాలను అందులో సేవచేసే స్వచ్ఛంద సేవకులను, మన మంచి ప్రవర్తనను, మనలో ఉన్న ఐక్యతను చూసి తరచుగా ముగ్ధులౌతుంటారు. (కీర్త. 110:3; 133:1; యెష. 65:13, 14) అయితే, సమావేశం జరిగే పట్టణానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో మన ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు వస్తాయా?
2011 జిల్లా సమావేశం తర్వాత, ఒకానొక బ్రాంచి కార్యాలయానికి ఒక మహిళ నుండి ఉత్తరం వచ్చింది. ఆమె సాధారణంగా యెహోవాసాక్షులు తలుపు తట్టినప్పుడు లోపల దాకునేది. అయితే ఆమెకు ఒకరోజు తన ఇంటి గుమ్మం దగ్గర ఒక ఆహ్వాన పత్రం దొరికింది. ఆమె ఇలా రాసింది: “నాకు మంచి ఇల్లు ఉంది, ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు, సంతోషంగా ఉండడానికి కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయని నాకు అనిపించేది. అయినా నాకు ఆనందం లేదు, నా జీవితానికి ఒక అర్థమంటూ లేదు. దాంతో సుమారు 320 కిలోమీటర్లు ప్రయాణించి సమావేశంలో శనివారం జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నాను.” ఆమెకు సమావేశం ఎంతగా నచ్చిందంటే ఆమె తన భర్తకు ఫోన్ చేసి, ఆ రాత్రి అక్కడే ఉంటానని ఆదివారం కార్యక్రమానికి కూడా హాజరై వస్తానని చెప్పింది. “నేను అన్ని ప్రసంగాలను శ్రద్ధగా విన్నాను, చాలామంది యెహోవాసాక్షులను కలిశాను, ఆ సమావేశం ఇంకొన్ని రోజులుంటే బాగుండునని అనిపించింది.” అని ఆమె అంది. ఇంటికి వచ్చాక, ఆమె బైబిలు అధ్యయనం మొదలుపెట్టి నాలుగు నెలల్లోనే బాప్తిస్మం పొందని ప్రచారకురాలయ్యింది. “ఆ ఆహ్వానపత్రం మా ఇంటి దగ్గర దొరికినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను, ఇప్పుడు నా జీవితానికి నిజంగా ఒక అర్థముంది!” అని ఆమె అంటోంది.
ఆహ్వాన పత్రం తీసుకున్నవాళ్లలో కొందరు తప్పకుండా హాజరవుతారు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనండి. మిగిలిపోయిన ఆహ్వానపత్రాలను సమావేశం జరిగే పట్టణానికి తీసుకొచ్చి అనియతంగా సాక్ష్యమిచ్చేటప్పుడు వాటిని ఉపయోగించండి.
[2వ పేజీలోని చిత్రం]
ఆహ్వాన పత్రం ఎలా అందించాలి?
మనం మన ప్రాంతంలో ఎక్కువ మందిని ఆహ్వానించాలంటే క్లుప్తంగా మాట్లాడాలి. మనం ఇలా చెప్పవచ్చు: “నమస్కారమండీ, ఈ ఆహ్వాన పత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించే పనిలో మేము పాల్గొంటున్నాం. ఇది మీ కోసమే తెచ్చాను. మరిన్ని వివరాలు ఈ ఆహ్వాన పత్రంలో ఉన్నాయి.” ఉత్సాహంగా మాట్లాడండి. వారాంతాల్లో ప్రచార కార్యక్రమం చేస్తున్నప్పుడు, సముచితమైతే పత్రికలు కూడా అందించాలి.