మనం దేనికి ప్రాధాన్యతనివ్వాలి?
1. పరిచర్య తనకు ఎంతో ప్రాముఖ్యమని యేసు ఎలా చూపించాడు?
1 యేసు పరిచర్యకే ప్రాధాన్యతనిచ్చాడు. సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రకటించడానికి ఆయన చాలా కష్టపడ్డాడు, పాలస్తీనా అంతటా వేలాది కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాడు. పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, దానికే ఎక్కువ శ్రద్ధనివ్వడానికి వీలుగా ఆయన నిరాడంబరంగా జీవించాడు. (మత్త. 8:20) అనారోగ్యంతో ఉన్నవారిని బాగుచేస్తాడనే ఉద్దేశంతో జనసమూహాలు ఆయనను వెళ్ళనివ్వకుండా ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ఆయనిలా అన్నాడు: “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని.”—లూకా 4:43.
2. యేసు పరిచర్యకు ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చాడు?
2 యేసు పరిచర్యకు ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చాడు? యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చాలన్నదే ఆయన ముఖ్యోద్దేశం. (మత్త. 6:9, 10) తన పరలోకపు తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఆయన చిత్తం చేయాలని, ఆయనిచ్చిన ప్రతీ ఆజ్ఞను పాటించాలని కోరుకున్నాడు. (యోహా. 14:31) అంతేగాక ప్రజల పట్ల నిజమైన శ్రద్ధ చూపించాడు, వారికి సహాయం చేయాలని కోరుకున్నాడు.—మత్త. 9:36, 37.
3. పరిచర్యకే ప్రాధాన్యతనిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?
3 యేసును అనుకరించండి: ఈ లోకంలో చాలా విషయాలు మన సమయాన్ని హరించి, మన దృష్టిని మళ్ళిస్తాయి కాబట్టి పరిచర్యకు యేసు ఇచ్చినంత ప్రాధాన్యతనివ్వడం మనకు కష్టం కావచ్చు. (మత్త. 24:37-39; లూకా 21:34) అందుకే, వేటికి ప్రాముఖ్యతనివ్వాలో గ్రహించి, ప్రకటనాపని కోసం సిద్ధపడడానికి, దానిలో క్రమంగా భాగం వహించడానికి సమయ పట్టిక వేసుకోవాలి. (ఫిలి. 1:9-11) మనం నిరాడంబరంగా జీవించడానికి కృషిచేస్తూ, లోకాన్ని పూర్తిగా అనుభవించకుండా ఉందాం.—1 కొరిం. 7:31.
4. ఇప్పుడు మనం సరైనదానికి ప్రాధాన్యతనివ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
4 తెలివైన వ్యక్తి, సమయం తక్కువగా ఉన్నప్పుడు ప్రాముఖ్యమైన పనుల్నే ముందు చేస్తాడు. ఉదాహరణకు, భయంకరమైన తుఫాను రాబోతుందని తెలిసినప్పుడు, ఆయన ముందుగా తన కుటుంబంలోని వారి ప్రాణాల్ని, ఇరుగు పొరుగువారి ప్రాణాల్ని కాపాడడం కోసమే తన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాడు కానీ అంతగా ప్రాముఖ్యం కాని విషయాల గురించి ఆలోచించడు. అర్మగిద్దోను అనే తుఫాను రావడానికి కొంచెం సమయమే మిగిలి ఉంది. (జెఫ. 1:14-16; 1 కొరిం. 7:29) మనల్ని రక్షించుకోవాలన్నా, మనం చెప్పేది వినేవారిని రక్షించాలన్నా మన గురించి, మన బోధ గురించి మనమెంతో జాగ్రత్త కలిగివుండాలి, అది సంఘంలో కావచ్చు, బయట కావచ్చు. (1 తిమో. 4:16) నిజమే, మనం పరిచర్యకు ప్రాధాన్యతనిస్తేనే కాపాడబడతాం.