క్రైస్తవ పరిచారకులు ప్రార్థించాలి
1. పరిచర్య చేయడానికి మనకేది అవసరం?
1 పరిచర్యను మనం స్వశక్తితో చేయలేము. ఆ పని చేయడానికి మనకు కావల్సిన బలాన్ని యెహోవాయే ఇస్తాడు. (ఫిలి. 4:13) గొర్రెల్లాంటివారిని వెదకడంలో మనకు సహాయం చేయడానికి యెహోవా తన దూతల్ని పంపిస్తాడు. (ప్రక. 14:6, 7) మనం విత్తి, నీళ్ళుపోసిన సత్యపు విత్తనాలను మొలకెత్తింపజేసేది యెహోవాయే. (1 కొరిం. 3:6, 9) కాబట్టి క్రైస్తవ పరిచారకులు ప్రార్థిస్తూ యెహోవాపై ఆధారపడడం ఎంత ప్రాముఖ్యమో కదా!
2. మనం ప్రార్థించాల్సిన కొన్ని విషయాలేమిటి?
2 మన కోసం: మనం ప్రకటిస్తున్న ప్రతీసారి ప్రార్థించాలి. (ఎఫె. 6:18) మనం ప్రార్థించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి? క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు అనుకూల దృక్పథాన్ని, ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థించవచ్చు. (అపొ. 4:29) మంచి హృదయం గలవారితో బైబిలు అధ్యయనం చేసేలా వారియొద్దకు నడిపించమని యెహోవాను అడగవచ్చు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారు ఏదైనా ప్రశ్న అడిగితే, సరైన సమాధానమిచ్చేలా సహాయం చేయమని మనసులోనే యెహోవాను వేడుకోవచ్చు. (నెహె. 2:4) అననుకూల పరిస్థితులున్నా ప్రకటనా పనిలో కొనసాగేలా వివేచన కోసం, ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. (మత్త. 10:16; అపొ. 4:29) పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చేందుకు తగిన జ్ఞానం ఇవ్వమని కూడా ప్రార్థించవచ్చు. (యాకో. 1:5) అంతేకాక, తన సేవలో మనల్ని ఉపయోగించుకుంటున్నందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థిస్తే ఆయనెంతో సంతోషిస్తాడు.—కొలొ. 3:15.
3. ఇతరుల కోసం ప్రార్థించడం ప్రకటనా పనికి ఎలా దోహదపడుతుంది?
3 ఇతరుల కోసం: మనం ‘ఒకరి కోసం ఒకరు ప్రార్థన’ చేయాలి అంటే అవసరమున్నప్పుడు తోటి పరిచారకుల పేర్లు ప్రస్తావిస్తూ ప్రార్థించాలి. (యాకో. 5:16; అపొ. 12:5) అనారోగ్యం కారణంగా మీరు ప్రకటనా పనిలో చేయాలనుకున్నంత చేయలేకపోతున్నారా? అలాగైతే మంచి ఆరోగ్యంతో ఉన్న తోటి పరిచారకుల గురించి ప్రార్థించండి. వారి గురించి మీరు చేసే ప్రార్థనలు ఎంతో మేలు చేస్తాయని గుర్తుంచుకోండి. మన సహోదరులు “నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము,” మన ప్రకటనా పనికి సంబంధించి అధికారులు మంచి అభిప్రాయం కలిగివుండేలా వారికోసం ప్రార్థన చేయడం కూడా సముచితం.—1 తిమో. 2:1, 2.
4. మనం ఎందుకు ప్రార్థనయందు పట్టుదల కలిగివుండాలి?
4 లోకమందంతటా సువార్త ప్రకటించడం అనేది మన స్వశక్తితో చేయగలిగేదేమీ కాదు. మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగి” ఉంటే యెహోవా సహాయంతోనే దానిని చేయగలుగుతాం.—రోమా. 12:12.