నవంబరులో మనమందించనున్న తేజరిల్లు! ప్రత్యేక సంచిక
1 చాలామందికి బైబిలుకున్న విలువ గురించిన యథార్థమైన ప్రశ్నలున్నాయి. మానవులు దానిని రాస్తే, అది దేవుని వాక్యం ఎలా అవుతుంది? నా జీవితాన్ని నిర్దేశించుకోవడానికి దానిపై ఎందుకు ఆధారపడాలి? బైబిలును చదివి అధ్యయనం చేయడానికి సమయం కేటాయించి, కృషి చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఏ బైబిలు అనువాదాన్ని నేను చదవాలి? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు జవాబులను, నవంబరులో మనమందించనున్న “మీరు బైబిలును నమ్మవచ్చా?” అనే శీర్షికతోవున్న తేజరిల్లు! ప్రత్యేక సంచిక ఇస్తుంది. ఇది ఇంగ్లీషు, తమిళం, మలయాళం భాషల్లో లభ్యమౌతుంది. వేరే భాషల్లో మీరు తేజరిల్లు!ను అందిస్తున్నట్లయితే, “పిల్లలను చక్కగా పెంచడానికి ఏడు చర్యలు” అనే అక్టోబరు-డిసెంబరు సంచికను అందించవచ్చు.
2 తేజరిల్లు! అనే ఈ ప్రత్యేక సంచికను, అక్టోబరు-డిసెంబరు సంచికను మన క్షేత్రంలో విరివిగా అందించాలి. వీలైతే నవంబరు నెలలో, ప్రతీ శనివారం సంఘంతోపాటు కలిసి ఇంటింటి పరిచర్యలో పాల్గొనండి. ఈ తేజరిల్లు! సంచికను, మీ బంధువులకు, పొరుగువారికి, తోటి ఉద్యోగస్థులకు, టీచర్లకు, తోటి విద్యార్థులకు, పునర్దర్శనం చేస్తున్నవారికి అందించండి. అలాగే షాపింగ్ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, మీతోపాటు పత్రికలను తీసుకెళ్ళండి. సంఘంలో కావలసినన్ని పత్రికలు అందుబాటులో ఉండేలా పెద్దలు అదనపు కాపీల కోసం రిక్వెస్టు చేశారు.
3 బైబిలు అధ్యయనాలు ప్రారంభించండి: మీరొకవేళ పత్రికను అందిస్తే మీ సంభాషణను ముగించేలోపే బైబిలు అధ్యయానికి పునాది వేయవచ్చు. ఉదాహరణకు మీరు నవంబరు ప్రత్యేక సంచికను అందిస్తున్నట్లయితే, మీరిలా చెప్పవచ్చు, “‘భూమిపట్ల దేవుని సంకల్పమేమిటి?’ అనే ప్రశ్నకు బైబిలేమి సమాధానమిస్తుందో మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నప్పుడు చూపిస్తాను.” మీతోపాటు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకెళ్ళి దానిలోని 4-5 పేజీలను చూపించండి లేదా 3వ అధ్యాయంలోని 1-3 పేరాలను చర్చించండి. లేదా గృహస్థునితో ఇలా చెప్పవచ్చు: “బైబిలును చదివి అర్థంచేసుకోవడం చాలామందికి కష్టమనిపిస్తుంది. మీరు మీ బైబిలును ఎలా బాగా అర్థంచేసుకోగలరో నేను మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నప్పుడు చెబుతాను.” మీరు వారి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని చూపించి, అధ్యయనాన్ని ప్రదర్శించండి. అక్టోబరు-డిసెంబరు సంచికను అందించినట్లయితే మీరిలా చెప్పవచ్చు, “కుటుంబ జీవితం సంతోషంగా ఉండడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయపడగలవో నేను తిరిగొచ్చినప్పుడు చర్చిస్తాను.” మీరు వారిని మళ్లీ కలుసుకున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 14వ అధ్యాయాన్ని చూపించి 1, 2 పేరాలను గృహస్థునితో చర్చించండి.
4 మనకు “రక్షణార్థమైన జ్ఞానము[నిచ్చే]” “పరిశుద్ధలేఖనములు” కేవలం బైబిల్లోనే ఉన్నాయి. (2 తిమో. 3:14) అందువల్ల, బైబిలుపట్ల ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ఈ తేజరిల్లు! సంచికలను అందించడంలో అందరం ఉత్సాహంగా పాల్గొందాం.