అక్టోబరులో మనమందించే తేజరిల్లు! ప్రత్యేక సంచిక
1 దాదాపు ప్రతిఒక్కరూ పక్షుల కిలకిలరావాలు, సూర్యాస్తమయంలాంటి వాటిని ఆస్వాదిస్తారు. కానీ, ప్రియమైన పరలోకపు తండ్రి వాటిని సృష్టించాడనే విషయాన్ని గుర్తించడంలో చాలామంది విఫలమవుతున్నారు. తేజరిల్లు! ప్రత్యేక సంచికను అందించడం ద్వారా యెహోవాయే సృష్టికర్త అని సాక్ష్యమిచ్చే ప్రత్యేక అవకాశం మనకు దొరుకుతుంది. (యెష. 40:28; 43:10) అక్టోబరు-డిసెంబరు సంచిక అంతా “సృష్టికర్త ఉన్నాడా?” అనే విషయాన్నే చర్చిస్తుంది.
2 క్షేత్రంలో: వీలుంటే, సంఘంతో కలిసి ప్రతీ శనివారం ఇంటింటి పరిచర్యలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకోండి. వారంలోని మిగతా రోజుల్లో కూడా మీరు ప్రత్యేక సంచికను అందించవచ్చు. ఉపాధ్యాయులు, విద్యారంగంలో పనిచేసే ఇతరులు ఈ సంచికను ప్రత్యేకంగా ఇష్టపడవచ్చు. కాబట్టి, మీ క్షేత్రంలోవున్న అలాంటివారిని కలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చు.
3 ఒక వ్యక్తి ఆసక్తి చూపిస్తే, తర్వాత కలుసుకున్నప్పుడు సమాధానమిచ్చేలా ఆయనకు ఒక ప్రశ్న వేసి రండి. ఉదాహరణకు, ప్రేమగల సృష్టికర్త ఎందుకు ఇంత బాధను అనుమతిస్తున్నాడు అనే ప్రశ్న అడగవచ్చు. మీరు పునర్దర్శనం చేసినప్పుడు బిలు బోధిస్తోంది పుస్తకంలోని 1వ లేదా 11వ అధ్యాయంలోని విషయాలను చూపించవచ్చు లేదా భూమిపట్ల సృష్టికర్త సంకల్పం గురించిన ప్రశ్న అడిగి పునర్దర్శనం చేసినప్పుడు మూడవ అధ్యాయాన్ని చర్చించవచ్చు.
4 స్కూల్లో: మీరు స్కూల్‌కి వెళ్ళే విద్యార్థులైతే, తేజరిల్లు! ప్రత్యేక సంచికను మీ ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు కానుకగా ఎందుకు ఇవ్వకూడదు? బల్లమీద ఒక పత్రికను పెట్టినా చాలు, మన నమ్మకాల గురించి ప్రశ్నలడిగేలా అది వారిని పురికొల్పవచ్చు. తరగతి గదిలో జరిగే చర్చల్లో మీ విశ్వాసాన్ని సమర్థిస్తూ మాట్లాడేటప్పుడు, వ్యాసాల కోసం సిద్ధపడుతున్నప్పుడు ఈ పత్రికలోని సమాచారాన్ని ఉపయోగించే అవకాశాలు మీకు లభించవచ్చు. మీకు సహాయం చేయడానికి, ఈ సంచికలో “యువత ఇలా అడుగుతోంది” అనే శీర్షికలో “సృష్టిపై నా నమ్మకాన్ని నేను ఎలా సమర్థించుకోగలను” అనే విషయం చర్చించబడుతోంది.
5 యెహోవా సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మహిమాఘనతలు పొందడానికి అర్హుడు. (ప్రక. 4:10, 11) అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికను ఉత్సాహంగా అందించడం ద్వారా మన సృష్టికర్తను ఘనపర్చి, ఇతరులు కూడా ఆయనను ఘనపర్చేందుకు సహాయం చేయగలం.