ప్రశంసించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తిని చూపించండి
1 యథార్థంగా ప్రశంసించడం ప్రజలను ప్రోత్సహిస్తుంది, చర్య తీసుకొనేలా పురికొల్పుతుంది, వారికి సంతోషాన్నిస్తుంది. పరిచర్యలో ఉన్నప్పుడు, యథార్థంగా అనే ప్రశంసాత్మకమైన చిన్న మాటైనా సరే, తరచూ ప్రజలు వినేలా చేస్తుందని చాలామంది ప్రచారకులు కనుగొన్నారు. సువార్తను ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారినెలా ప్రశంసించవచ్చు?
2 గమనించేవారిగా ఉండండి: యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆసియా మైనర్లోని ఏడు సంఘాల మంచి క్రియలను గమనించాడు. (ప్రక. 2:2, 3, 13, 19; 3:8) అదేవిధంగా, మనం పరిచర్యలో కలిసే ప్రజలపట్ల యథార్థమైన ఆసక్తి కలిగివుంటే, వారిని ప్రశంసించడానికి అవకాశాలను వెదికేలా అది మనల్ని పురికొల్పుతుంది. ఉదాహరణకు, ఇంటి ఆవరణను చక్కగా పెట్టుకోవడం, తన పిల్లలను వాత్సల్యంతో చూసుకుంటున్న తల్లి లేక తండ్రి, గృహస్థుని స్నేహపూర్వకమైన చిరునవ్వు, పలకరింపు వంటివన్నీ ప్రశంసించేందుకు మనకు అవకాశాలను కల్పిస్తాయి. మీరలాంటి అవకాశాలను వెంటనే గమనించి, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా?
3 బాగా వినేవారిగా ఉండండి: ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు, సముచితమైన ప్రశ్నలడగడం ద్వారా తమ భావాలను వ్యక్తం చేయడానికి వారిని ఆహ్వానించండి. వారు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా వారిని గౌరవించండి. (రోమా. 12:10) బహుశా వాళ్ళిచ్చే జవాబుల్లో యథార్థమైన ప్రశంసనివ్వగల విషయాన్ని మీరు కనుగొంటారు, ఆ తర్వాత ఇరువురూ ఏకీభవించే విషయంపై సంభాషణను కొనసాగించగలుగుతారు.
4 వివేచనను ఉపయోగించండి: గృహస్థుడు మాట్లాడే విషయం బైబిలు సత్యానికి అనుగుణంగా లేకపోతే మనం ఏమి చేయాలి? వారు చేసిన వ్యాఖ్యానాన్ని తప్పు పట్టేబదులు, గృహస్థుడన్నవాటికి కృతజ్ఞతను తెలిపి, “ఈ విషయంలో మీకు చాలా ఆసక్తి ఉందని నాకనిపిస్తుంది” అంటూ సంభాషణను కొనసాగించండి. (కొలొ. 4:6) ఒకవేళ ఆ వ్యక్తి వాదించేవాడైనా, ఆ విషయంలో ఆయనకున్న యథార్థమైన ఆసక్తిని మనం తరచూ ప్రశంసించవచ్చు. అలాంటి మృదువైన సమాధానం సువార్తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్న వ్యక్తిని మెత్తబరచవచ్చు.—సామె. 25:15.
5 మనం ప్రోత్సహించేవారిగా ఉండాలంటే, యథార్థంగా ప్రశంసించాలి. అలాంటి ప్రోత్సాహకరమైన మాటలు, యెహోవాను ఘనపరచి, ఇతరులను రాజ్యసందేశంవైపు ఆకర్షించవచ్చు.