మన పరిచర్య—కనికరాన్ని ప్రతిబింబిస్తుంది
1 తన సందేశాన్ని విన్న అనేకమంది ‘కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరివున్నారని’ యేసు గమనించాడు. (మత్త. 9:36) ఆయన వారికి ప్రేమతో, వాత్సల్యంతో యెహోవా ప్రమాణాలను బోధించాడు, వారిని ఓదార్చాడు, కనికరంతో వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాడు. యేసు మార్గాల గురించి మనం ధ్యానించినప్పుడు, మనం ఆయన ఆలోచించినట్లే ఆలోచించడం, ఆయన భావించినట్లే భావించడం నేర్చుకుని, ఆ కనికరాన్ని మన పరిచర్యలో ప్రదర్శిస్తాం.
2 ఎంతో అవసరంలోవున్న ప్రజలు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనెలా ప్రతిస్పందించాడో ఒక్క క్షణం ఆలోచించండి. (లూకా 5:12, 13; 8:43-48) ఆయన ప్రత్యేక అవసరాలు ఉన్నవారిపట్ల శ్రద్ధచూపించాడు. (మార్కు 7:31-35) ఎదుటివాళ్ళ భావాలను ఆయన గ్రహించి, వారిపట్ల శ్రద్ధ చూపించాడు. బాహ్య రూపాన్నిబట్టి ఆయన ప్రభావితం కాలేదు. (లూకా 7:36-40) నిజానికి, దేవుని వాత్సల్యపూరిత కనికరాన్ని యేసు సంపూర్ణంగా ప్రతిబింబించాడు.
3 ‘కనికరపడ్డాడు’: యేసు తన పరిచర్యను కేవలం కర్తవ్యమన్నట్లుగా నిర్వర్తించలేదు. ఆయన ప్రజలపై ‘కనికరపడ్డాడు.’ (మార్కు 6:34) అదేవిధంగా నేడు కూడా, మనం సందేశాన్ని మాత్రమే ప్రకటించడంలేదుగానీ, అమూల్యమైన ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఆయా విధాలుగా ఎందుకు ప్రతిస్పందిస్తారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారెందుకు చింతిస్తున్నారు లేదా ఆందోళన చెందుతున్నారు? వారు అబద్ధమత కాపరుల ద్వారా నిర్లక్ష్యం చేయబడి తప్పుదారి పట్టించబడ్డారా? మనం ఇతరులపట్ల చూపించే నిజమైన శ్రద్ధ, సువార్తను వినేలా వారిని పురికొల్పవచ్చు.—2 కొరిం. 6:4, 6.
4 కనికరం హృదయాలను స్పృశిస్తుంది. ఉదాహరణకు: తన మూడునెలల పాప చనిపోవడంతో ఒక స్త్రీ తీవ్ర వేదన అనుభవించింది. ఇద్దరు సాక్షులు ఆమెను సందర్శించినప్పుడు, దేవుడు బాధలెందుకు అనుమతిస్తున్నాడన్న విషయం గురించి వాదించాలనే ఉద్దేశంతో ఆమె వారిని లోపలికి ఆహ్వానించింది. కానీ, ఆ స్త్రీ తర్వాత ఇలా అంది: “వారు నేను చెప్పేదాన్ని ఎంతో కనికరంతో విన్నారు, నాకు ఎంత బాగా అన్పించిందంటే, వారు వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ రమ్మని అడిగాను.” మీరు పరిచర్యలో కలిసే ప్రతీ ఒక్కరిపై కనికరం చూపించడానికి కృషి చేస్తారా?
5 కనికరాన్ని అలవర్చుకోవడం, ఇతరులకు నిజమైన ఓదార్పునివ్వడానికి మనకు సహాయం చేస్తుంది. అలా అలవర్చుకోవడంద్వారా, మనం ‘కనికరము చూపించే తండ్రి అయిన’ యెహోవాను మహిమపరుస్తాం.—2 కొరిం. 1:3.