కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/06 పేజీలు 3-4
  • పరిపాలక సభనుండి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభనుండి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 3/06 పేజీలు 3-4

పరిపాలక సభనుండి ఉత్తరం

“మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.” పౌలు సంఘాలకు వ్రాసిన అనేక పత్రికల్లో ఈ తరహాలోనే అభినందనలు తెలియజేశాడు. మేము మీ అందరి విషయంలో ఆశించేదానిని కూడా ఆ మాటలు సరిగ్గా వ్యక్తం చేస్తున్నాయి.​—⁠ఎఫె. 1:⁠2.

క్రీస్తు యేసు విమోచన క్రయధన బలి ద్వారా యెహోవా చూపిస్తున్న కృపకు మనమెంత కృతజ్ఞులమో కదా! విమోచన క్రయధనం మూలంగా మనం యెహోవా ఎదుట ఆమోదకరమైన స్థానంలో ఉన్నాం. మనం ఎంత శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేసినా, ప్రకటించినా లేక ఇతర సత్క్రియలు చేసినా, స్వంత ప్రయత్నాలతో మనం ఆ స్థానాన్ని ఎన్నటికీ సంపాదించుకోలేం. పాపాలకు క్షమాపణ, నిత్యజీవం అనేది మనకు మన ప్రయత్నాల ప్రతిఫలంగా అనుగ్రహించబడలేదు, కానీ అవి యేసుక్రీస్తు ద్వారా యెహోవా కృపను ప్రతిబింబించే కానుకలుగా అనుగ్రహించబడ్డాయి.​—⁠రోమా. 11:⁠6.

పౌలు తోటి విశ్వాసులకు ఇలా వ్రాశాడు: “మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ‘అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని’ అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.” మొదటి శతాబ్దంలో యెరూషలేము నాశనమవకముందు “అనుకూలమైన సమయము” ఉంది. యెహోవాను ప్రేమించే యథార్థహృదయులు ఆధ్యాత్మికంగా రక్షించబడ్డారు. సా.శ. 70లో యెరూషలేము నాశనమవకముందు అక్కడినుండి పారిపోయిన విశ్వాసులందరూ చివరకు భౌతికంగా రక్షించబడడానికి అది దారితీసింది.​—⁠2 కొరిం. 6:1, 2.

నేడు మనం కూడా “అనుకూలమైన సమయములో,” “రక్షణ దినములో” జీవిస్తున్నాం. యెహోవా ఎవరినైతే తన సేవకులుగా అంగీకరిస్తాడో, ఎవరైతే ఆధ్యాత్మికంగా రక్షించబడుతున్నారో, వారికి అతి త్వరలో రానున్న “యెహోవా మహా దినమున” భౌతికంగా రక్షించబడే ఉత్తరాపేక్ష ఉంటుంది.​—⁠జెఫ. 1:14.

యెహోవా దినం రావడమనేది మనపై ఒక గంభీరమైన బాధ్యతనుంచుతుంది. మనం దాని గురించి ప్రజల్ని హెచ్చరించాలి. అంతేగాక యథార్థహృదయులు యెహోవా కృపనుండి ప్రయోజనం పొంది, వారు కూడా రక్షించబడేలా మనం సహాయం చేయాలి. ఈ బాధ్యతకున్న గంభీరతను పౌలు గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” ఆయన తన మనోభావాన్ని ఇలా కూడా వ్యక్తం చేశాడు: “జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. కాగా నావలననైనంత మట్టుకు . . . సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.”​—⁠1 కొరిం. 9:16; రోమా. 1:14, 15.

ప్రజలను హెచ్చరించే ప్రాముఖ్యమైన పనిని మనం నిర్లక్ష్యం చేస్తే యెహోవా మనల్ని జవాబుదారులుగా ఎంచుతాడు. యెహోవా, యెహెజ్కేలు ప్రవక్తతో పలికిన ఈ మాటలు మనకు తెలిసినవే: “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గునిగూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.”​—⁠యెహె. 3:17, 18.

ఈ అంత్యదినాలను తాళుకోవడం కష్టం. కుటుంబ బాధ్యతలు, లౌకిక కార్యకలాపాలు, సంఘ కార్యకలాపాలు, ప్రకటించే పని వంటి వాటన్నిటినీ సమతూకంతో నిర్వర్తించడం సులభం కాదు. దానికి తోడు మీలో చాలామంది అనారోగ్యం, మానసిక కృంగుదల, వృద్ధాప్యం వంటి సమస్యలనే కాక, వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నారు. మీలో చాలామంది “భారము మోసికొనుచున్న” వారిలా ఉన్నారు. యేసు చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మేము కూడా మీ పట్ల తదనుభూతి వ్యక్తం చేయాలనుకుంటున్నాము: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త. 11:28) మీరు చిన్నా పెద్దా సవాళ్ళను ఎదుర్కొంటున్నా, యెహోవాను నమ్మకంగా సేవచేయడంలో కొనసాగేందుకు కృషి చేస్తున్న మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందించాలనుకుంటున్నాం.

మీరు ఉత్సాహంతో చేసే ప్రకటనా పని, బోధనా పని ఫలితంగా, యెహోవా ఆశీర్వాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వారానికి సగటున 4,762 మంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. గత సేవా సంవత్సరంలో 1,375 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 120 భాషల్లో అందుబాటులో ఉన్న బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే కొత్త పుస్తకం, ఈ “రక్షణ దినము”లో లక్షలాదిమంది యెహోవా కృపనుండి, సమాధానంనుండి ప్రయోజనం పొందేలా సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం, అలాగే దానికోసం ప్రార్థిస్తున్నాం.

పరిపాలక సభ మిమ్మల్ని ప్రేమిస్తోందనీ, మేము మీ కోసం ప్రార్థిస్తున్నామనే నమ్మకంతో ఉండండి. మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి