క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
కళ్ళు అద్భుతంగా రూపకల్పన చేయబడ్డాయి. (కీర్త. 139:14) అయినప్పటికీ అవి ఒకే ఒక అంశం మీద దృష్టిని నిలుపగలుగుతాయి. అక్షరార్థంగానే కాక అలంకారార్థంగా కూడా అది సత్యం. మనం స్పష్టమైన ఆధ్యాత్మిక దృష్టిని కాపాడుకోవడానికి మనం దేవుని చిత్తాన్ని చేయడం మీదే మన దృష్టి నిలపాలి. సాతాను లోకపు పరధ్యానంలో పడేసే అంశాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, 2006వ సేవా సంవత్సరపు ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం ‘మీ కంటిని తేటగా ఉంచుకోండి’ అనే మూలాంశాన్ని వివరించడం ఎంత సమంజసమో కదా!—మత్త. 6:22.
యెహోవా నుండి ఆశీర్వాదాలు పొందడానికి మనమేమి చేయాలి? (సామె. 10:22) “కంటిని తేటగా ఉంచుకున్నందువల్ల కలిగే ఆశీర్వాదాలను అనుభవించండి” అనే భాగంలో ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. లేఖన సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చో ఇంటర్వ్యూలు నొక్కి చెబుతాయి. సందర్శక ప్రసంగీకుడు ఇచ్చే “ఈ దుష్టలోకంలో కంటిని తేటగా ఉంచుకోవడం” అనే ప్రసంగం, మన జీవితాలను చిక్కుల్లో పడేసి మన ఆధ్యాత్మిక అభివృద్ధిని క్రమేణా నిరోధించగల విషయాల గురించి హెచ్చరిస్తుంది. “ఉత్తమమైనదానిని” ఎన్నుకోవడం అంటే ఏమిటో కూడా మనం నేర్చుకుంటాం.—లూకా 10:42.
యౌవన క్రైస్తవులు ఆధ్యాత్మిక లక్ష్యాల మీద దృష్టి నిలపడానికి తల్లిదండ్రులు, ఇతరులు వారినెలా ప్రోత్సహించవచ్చు? “సరిగా గురిచూసి తమ చేతిలోని బాణాలను వదిలే తల్లిదండ్రులు,” “ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకొనే యౌవనులు” అనే ప్రసంగాల్లో ఆ ప్రాముఖ్యమైన ప్రశ్న మీద తల్లిదండ్రులు, యౌవనులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉంటాయి. (కీర్త. 127:4) సందర్శక ప్రసంగీకుడు ఇచ్చే ముగింపు ప్రసంగం, ఆయా వ్యక్తులుగా, కుటుంబాలుగా, ఒక సంఘంగా మనం యెహోవా సంస్థతో ఎలా ముందుకు సాగిపోవచ్చు అనే అంశాన్ని వివరిస్తుంది.
మనకు సత్యం క్రొత్తగా పరిచయమైనా యెహోవాను దశాబ్దాలుగా సేవిస్తున్నా మనం ‘మన కంటిని తేటగా ఉంచుకోవడం’ చాలా ప్రాముఖ్యం. మనమలా కంటిని తేటగా ఉంచుకోవడానికే ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం మనకు సహాయం చేస్తుంది.