కుటుంబ కార్యక్రమ పట్టిక—దినవచనం
1 ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతీదినం పుష్టికరమైన ఆహారం ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడతారు. దానికన్నా దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక పోషకాహారం వారికి ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యం. (మత్త. 4:4) మీ పిల్లలు ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక ఆకలిని వృద్ధి చేసుకొని ‘రక్షణ విషయములో ఎదిగేలా’ మీరు వారికి సహాయం చేయగల ఒక విధానం, ప్రతీదినం కుటుంబమంతా కలిసి దినవచనాన్ని పరిశీలించడానికి సమయం వెచ్చించడమే. (1 పేతు. 2:1) మీరు మీ కుటుంబ కార్యక్రమ పట్టికలో దీనిని ఎప్పుడు చేర్చవచ్చు?
2 భోజన సమయాల్లో: మీ దినాన్ని దినవచనపు చర్చతో ప్రారంభించడం రోజంతా యెహోవాను మీ మనస్సులో ఉంచుకునేందుకు మీ కుటుంబానికి సహాయం చేస్తుంది. (కీర్త. 16:8) ఒక తల్లి, తన కుమారుడు ఉదయం అల్పాహారం తింటున్న సమయంలో అబ్బాయితో కలిసి లేఖనాన్ని, వ్యాఖ్యానాన్ని చదివి చర్చించాలని, పాఠశాలకు వెళ్ళే ముందు అబ్బాయితో కలిసి ప్రార్థించాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం ద్వారా ఆ పిల్లవాడు, జాతీయతావాదానికి సంబంధించిన సమస్య ఎదురైనప్పుడు రాజీపడకుండా తటస్థంగా ఉండడానికీ, అనైతికమైన చేష్టల్ని నిరోధించడానికీ, తోటి విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికీ అవసరమయ్యే బలాన్ని పొందాడు. పాఠశాలలో ఆయనొక్కడే సాక్షి అయినప్పటికీ ఆయన తాను ఒంటరివాణ్ణి అని ఎన్నడూ భావించలేదు.
3 ఉదయాన్నే దినవచనాన్ని చర్చించడం మీకు ఆచరణయోగ్యంగా లేకపోతే, దాన్ని కుటుంబమంతా కలిసి వేరే సమయంలో పరిశీలించవచ్చు, బహుశా మీరు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు పరిశీలించవచ్చు. కొందరు ఆ సమయంలో తమకు క్షేత్రసేవలో ఎదురైన అనుభవాలను, తమ వ్యక్తిగత బైబిలు అధ్యయనంలో ఆనందించిన అంశాలను కూడా చర్చిస్తారు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అలా చర్చిస్తూ గడిపిన సందర్భాలను కుటుంబమంతా కలిసి సంతోషంగా గడిపిన సమయాలుగా చాలామంది ఆనందంగా గుర్తుచేసుకుంటారు.
4 రాత్రి సమయాల్లో: కొన్ని కుటుంబాలకైతే, పడుకోబోయే ముందు దినవచనాన్ని పరిశీలించడం చాలా అనుకూలంగా ఉంటుంది. కలిసి ప్రార్థించడానికి కూడా అది చక్కని అవకాశంగా ఉండవచ్చు. ప్రతీదినం మీరు యెహోవా గురించి మాట్లాడుతున్నది, ఆయనకు ప్రార్థిస్తున్నది మీ పిల్లలు వింటే ఆయన వారికి ఒక వాస్తవమైన వ్యక్తి అవుతాడు.
5 ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం పుస్తకాన్ని మీరు సరైన విధంగా ఉపయోగిస్తుండగా మీ పిల్లల మనస్సుల్లో సత్యాన్ని నాటాలనే మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించును గాక.