కుటుంబ కార్యక్రమ పట్టిక—కుటుంబ అధ్యయనం
1 ఒక క్రైస్తవ తల్లిగానో తండ్రిగానో మీరు మీ పిల్లలకు ఇవ్వగల గొప్ప కానుక ఏమిటంటే యెహోవాపట్ల మీకున్న ప్రేమను వారి మనసుల్లో నాటడం. వారపు కుటుంబ బైబిలు అధ్యయనానికి ‘మీ యింట్లో మీరు కూర్చున్నప్పుడు’ వారి మనసుల్లో యెహోవా ప్రేమను నాటేందుకు మీకు అమూల్యమైన అవకాశం దొరకగలదు. (ద్వితీ. 6:5-7) మీ జీవిత భాగస్వామి విశ్వాసి అయినా, మతపరంగా విభాగించబడిన కుటుంబంలో మీరు జీవిస్తున్నా, మీరు ఒంటరి తల్లి లేక తండ్రి అయినా, మీరు క్రమబద్ధమైన కుటుంబ అధ్యయనం చేయడం ద్వారా మీ పిల్లలు మీకూ, యెహోవాకూ సన్నిహితులయ్యేలా మీరు సహాయం చేయగలుగుతారు.
2 కుటుంబ అధ్యయనం ప్రారంభించడం: కుటుంబ అధ్యయనం ప్రారంభించాలంటే మొదట మీరు కుటుంబమంతా కలిసి అధ్యయనం చేసే అలవాటు చేసుకోవాలి. అధ్యయనం ఎప్పుడు నిర్వహించాలో మీకు ఖచ్చితంగా తెలియకపోతే దాని గురించి కుటుంబ సభ్యులందరితో కలిసి ఎందుకు చర్చించకూడదు? (సామె. 15:22) మీకు చిన్న పిల్లలు ఉన్నట్లయితే తక్కువ సమయం తీసుకొనే అనేక అధ్యయన సమయాలు వారమంతా ఏర్పాటు చేయడానికి మీరు ఇష్టపడవచ్చు. మీ ఇంటివారికి ఎలాంటి కార్యక్రమ పట్టిక సరిపోతుందో నిర్ణయించండి. మీ కుటుంబ కార్యక్రమ పట్టికలో అధ్యయనానికి నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి దానికి హత్తుకొని ఉండడానికి తీర్మానించుకోండి.
3 మీరు దేనిని అధ్యయనం చేయవచ్చు? కొందరు ముందటి వారంలో సంఘ పుస్తక అధ్యయనంలో లేక కావలికోట అధ్యయనంలో పరిశీలించబోయే పాఠాన్ని సిద్ధపడతారు. ఇతరులు యౌవనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమాచారాన్ని అధ్యయనం చేస్తారు. యౌవనులైన కుమారుడు, కుమార్తె ఉన్న తండ్రి ఇలా అన్నాడు: “మా అధ్యయనం వారమంతటిలో పిల్లలకు ప్రాముఖ్యమైన అంశంగా చేసే ఒక విషయం ఏమిటంటే, మేము నా బైబిలు కథల పుస్తకము నుండి సన్నివేశాలను నటిస్తాం. ఎన్ని పేరాలు చదువుతున్నామనే దానికన్నా చదివినదాన్ని ఎంత వరకు గ్రహించగలుగుతున్నాం, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది అన్నవే చాలా ప్రాముఖ్యమైన విషయాలు.”
4 ప్రతీవారం అధ్యయనం చేయండి: కుటుంబ అధ్యయనాన్ని క్రమంగా నిర్వహించాలి, కుటుంబ సభ్యులందరూ దాని కోసం ఆనందంతో ఎదురుచూడాలి. అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు వాటితో వ్యవహరించడం కోసం దినమూ, సమయమూ విషయంలో కొంత పట్టువిడుపు చూపించాల్సి ఉంటుంది. చర్చించాల్సిన అంశాలను మార్పు చేయాల్సిన సందర్భాలు కూడా ఎదురుకావచ్చు. అయితే అవసరమైన ఎలాంటి సర్దుబాట్లయినా అలవాటుగా చేసే కుటుంబ అధ్యయన పట్టికను మార్చకూడదు. ఒక ఇంట్లో, కూతురు ఇలా వ్యాఖ్యానించింది: “మా అధ్యయన సమయాన్ని మార్చాల్సి వస్తే, అధ్యయనం ఎప్పుడు జరుగుతుందో మేమందరమూ తెలుసుకోగలిగేలా ఆ కొత్త సమయాన్ని నాన్న ఫ్రిజ్ డోర్ మీద పెట్టేవారు.” క్రమబద్ధమైన కుటుంబ అధ్యయనం చేసేందుకు అలాంటి ప్రయత్నాలు ఎంత మెచ్చుకోదగినవో కదా! యెహోవా “శిక్షలోను బోధలోను” మీ పిల్లలను పెంచుతున్నప్పుడు మీరు వారిపట్ల, మన పరలోక తండ్రిపట్ల మీ ప్రేమను ప్రదర్శించిన వారవుతారు.—ఎఫె. 6:4.