కుటుంబ కార్యక్రమ పట్టిక—కుటుంబ క్షేత్ర సేవ
1 యౌవనులు తన నామాన్ని స్తుతించడం చూసి యెహోవా ఆనందిస్తాడు. (కీర్త. 148:12, 13) యేసు కాలంలో ‘బాలురు చంటిపిల్లలు’ దేవుణ్ణి ‘స్తుతించారు.’ (మత్త. 21:15, 16) నేడు కూడా అలాగే జరుగుతోంది. తల్లిదండ్రులారా, క్రైస్తవ పరిచర్యలో యెహోవాను ఉత్సాహంతో స్తుతించేవారిగా మీ పిల్లలు ఎదగడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు? క్రైస్తవ కూటాల గురించి పై ఆర్టికల్లో నొక్కి చెప్పినట్లే, ఈ విషయంలో కూడా మీ ఆదర్శమే ఒక కీలకాంశం. చాలామంది తల్లిదండ్రుల మనోభావాలనే ఒక తండ్రి ఇలా వ్యక్తం చేశాడు: “పిల్లలు మీరు చెప్పినట్లు చేయరు; మీరు చేస్తున్నట్లు చేస్తారు!”
2 దైవభక్తిగల తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఒక సహోదరి ఇలా గుర్తుచేసుకుంది: “పరిచర్యకు మనం వెళ్తున్నామా లేదా అని శనివారం ఉదయాన్నే లేచి మేము ఎప్పుడూ అడగలేదు. మేము వెళ్తున్నామనే మాకు తెలుసు.” అదే విధంగా, ఒక కుటుంబంగా ప్రతీ వారం క్షేత్ర సేవలో భాగం వహించే అలవాటును స్థిరపరచుకోవడం ద్వారా ప్రకటనా పనికి ఉన్న ప్రాముఖ్యతను మీరు మీ పిల్లల మనసుల్లో నాటవచ్చు. అలా భాగం వహిస్తే మీ పిల్లలు మిమ్మల్ని గమనించడం ద్వారా నేర్చుకొనే అవకాశం వారికి లభించడమేకాక మీరు వారి వైఖరిని, మర్యాదను, అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలను గమనించే అవకాశం కూడా మీకు లభిస్తుంది.
3 ప్రగతిశీల శిక్షణ: పిల్లలు పరిచర్యను ఆనందించాలంటే దానిలో సమర్థవంతంగా భాగం వహించేందుకు వారిని సిద్ధం చేయాలి. ఇంతకు ముందు పేర్కొనబడిన సహోదరి ఇంకా ఇలా అంది: “మేము తమ ప్రకటనా పని మీద వెళుతున్న మా తల్లిదండ్రుల వెంట కేవలం తోడుగా వెళ్ళేవారిగా ఎన్నడూ ఉండలేదు. కేవలం డోర్బెల్ మోగించి కరపత్రాన్ని అందించినా, దానిలో మాకు కూడా భాగం ఉందని మాకు తెలుసు. ప్రతి వారాంత కార్యకలాపాల కోసం ముందే జాగ్రత్తగా సిద్ధపడడం ద్వారా, మేము ఏమి చెబుతామో మాకు తెలిసేది.” ప్రతీవారం పిల్లలను పరిచర్యకు సిద్ధం చేయడానికి కుటుంబ అధ్యయనం చేసేటప్పుడు లేక ఇతర సమయాల్లో కొన్ని నిమిషాలు వెచ్చించడం ద్వారా మీరు మీ పిల్లలకు అలాంటి శిక్షణ ఇవ్వవచ్చు.
4 కుటుంబంగా కలిసి ప్రకటించినప్పుడు, మీ పిల్లల్లో సత్యాన్ని నాటే అదనపు అవకాశం మీకు లభిస్తుంది. సమీపంలోని ఒక లోయ ప్రాంతంలో ఉన్న గ్రామస్థులకు బైబిలు కరపత్రాలను పంచిపెట్టడానికి ఒక క్రైస్తవ తండ్రి తన కూతురుతో కలిసి రానుపోను 20 కిలోమీటర్లు నడిచేవాడు. “అలా నడుస్తున్న సమయంలో మా నాన్నగారు నా హృదయంలో సత్యాన్ని నాటాడు” అని ఆమె ఆనందంగా గుర్తు చేసుకుంది. (ద్వితీ. 6:7) మీ వారపు కుటుంబ కార్యక్రమ పట్టికలో క్షేత్ర సేవను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా మీరు కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుతారు.