కుటుంబ కార్యక్రమ పట్టిక—సంఘ కూటాలు
1 మీరు క్రైస్తవ తల్లి లేక తండ్రి అయితే మీ పిల్లలు యెహోవాను ప్రేమించేవారిగా, ఆయనను సేవించేవారిగా ఎదగాలనీ, తుదకు దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో నిత్యజీవం సంపాదించుకోవాలని కోరుకుంటారు. వారు తమ జీవితాల్లో యెహోవా ఆరాధనకు మొదటిస్థానం ఇచ్చేందుకు మీరు ఎలా సహాయం చేయవచ్చు? ఒక ముఖ్యమైన మార్గం మీ ఆదర్శమే. (సామె. 20:7) ఒక సహోదరి సాక్షి అయిన తన తల్లి ఆదర్శాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అంది: “మేము కూటాలకు వెళ్తున్నామా లేదా అనే సందేహం ఎప్పుడూ వచ్చేదికాదు.” అది ఆమె మీద శాశ్వత ముద్ర వేసింది.
2 సంఘ కూటాల ఉద్దేశాన్ని మీ కుటుంబం గ్రహిస్తోందా? ఆ కూటాల్లో మనకు లభించే ఉపదేశం, ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండేందుకు మనకు బలాన్నిస్తుంది, అక్కడ మన సహోదరులతో మనం ఆనందించే సహవాసం ప్రోత్సాహానికి అమూల్యమైన మూలంగా ఉంటుంది. (యెష. 54:13; రోమా. 1:11, 12) అయితే అలాంటి కూటాల ప్రాథమిక ఉద్దేశం యెహోవాను ‘సమాజములలో స్తుతించడమే.’ (కీర్త. 26:12) యెహోవాపట్ల మన ప్రేమను ప్రదర్శించేందుకు, ఆయనను ఆరాధించేందుకు క్రైస్తవ కూటాలు మనకు అవకాశాన్నిస్తాయి.
3 “జాగ్రత్తగా చూచుకొనుడి”: మన కూటాల పవిత్రమైన ఉద్దేశాన్ని గ్రహిస్తే అంతగా ప్రాముఖ్యం కాని విషయాల కోసం కూటాలకు హాజరవకుండా ఉండే అలవాటును క్రమంగా వృద్ధి చేసుకోకుండా ‘జాగ్రత్తగా ఉండేందుకు’ మనం ప్రేరణ పొందుతాం. (ఎఫె. 5:15, 16; హెబ్రీ. 10:24, 25) మీ కుటుంబ కార్యక్రమ పట్టికను తయారు చేస్తున్నప్పుడు ముందుగా మీరు సంఘ కూటాలకు సమయాన్ని కేటాయించవచ్చు. ఇతర కార్యకలాపాలు వాటికి ఆటంకం కలిగించకుండా చూసుకోండి. కూటాలకు హాజరుకావడం మీ కుటుంబానికి ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉండేలా చూసుకోండి.
4 కూటాలకు, సమావేశాలకు హాజరుకావడానికి మన సహోదరులు ఆటంకాలను అధిగమించడాన్ని గురించి చదివినప్పుడు మనం ప్రేరణ పొందమా? మీ పరిస్థితులు అంత అసాధారణంగా ఉండకపోయినా, మీరు కూడా బహుశా సవాళ్ళను ఎదుర్కొంటుండవచ్చు. దేవుని ప్రజలకు, యెహోవాను ఆరాధించడం ఎంతో కష్టమనిపించేలా సాతాను చేస్తున్నాడు. అయినా సంఘ కూటాలకు హాజరుకావడానికి మీ కుటుంబం చేసే గట్టి ప్రయత్నాలను మీ పిల్లలు తప్పకుండా గమనిస్తారు. మీరలా చేయడం ద్వారా ఎన్నటికీ మరచిపోలేని ఆధ్యాత్మిక బహుమానాన్ని వారికి ఇవ్వగలుగుతారు.