8వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
విద్యార్థులను సంస్థ వైపుకు నడిపించడం
1. ప్రతీ వారం బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు యెహోవా సంస్థ గురించిన ఒక అంశాన్ని బోధించడం ఎందుకు ప్రయోజనకరం?
1 బైబిలు అధ్యయనాలను నిర్వహించడంలోని మన లక్ష్యం, కేవలం విద్యార్థులకు సిద్ధాంతపరమైన సమాచారాన్ని బోధించడమే కాక వారు క్రైస్తవ సంఘంలో భాగం అయ్యేందుకు వారికి సహాయం చేయడం కూడా. (జెక. 8:23) అలా వారికి మనం సహాయం చేయడానికి యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? బ్రోషుర్ సహాయం చేస్తుంది. క్రొత్త బైబిలు విద్యార్థులకు ఒక ప్రతిని ఇచ్చి దానిని చదవమని వారిని ప్రోత్సహించండి. అంతేకాక ప్రతీ వారం అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు యెహోవా సంస్థ గురించిన ఒక అంశాన్ని బోధించడానికి కొన్ని నిమిషాలు వెచ్చించండి.
2. సంఘ కూటాలకు హాజరుకమ్మని బైబిలు విద్యార్థులను మీరు ఎలా ప్రోత్సహించవచ్చు?
2 సంఘ కూటాలు: బైబిలు విద్యార్థులు దేవుని సంస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడే ప్రధాన మార్గం, వారు మనతో సంఘ కూటాల్లో సహవసించడం. (1 కొరిం. 14:24, 25) అందుకే మీరు వారంలో జరిగే ఐదు కూటాల గురించి, ఒక్కో కూటం గురించి ఒక్కోసారి వివరించడం ద్వారా వారిని కూటాలకు పరిచితులను చేయడం ప్రారంభించవచ్చు. తర్వాతి వారంలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగ ముఖ్యాంశాన్ని పేర్కొనండి. కావలికోట అధ్యయనంలో, సంఘ పుస్తక అధ్యయనంలో పరిశీలించే సమాచారాన్ని చూపించండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గురించి, సేవా కూటం గురించి వివరించండి. మీకు పాఠశాలలో నియామకం ఉంటే బహుశా మీరు దానిని వారితో ముందుగా అభ్యాసం చేయవచ్చు. కూటాల్లో అందించే విశేష అంశాలను పంచుకోండి. వారు కూటాల్లో జరిగేవాటిని మనస్సులో చిత్రీకరించుకొనేందుకు సహాయం చేయడానికి మన ప్రచురణల్లోని చిత్రాలను ఉపయోగించండి. వారితో మొదటి అధ్యయనం చేసినప్పటి నుండి వారిని కూటాలకు హాజరుకమ్మని ఆహ్వానించండి.
3. సంస్థకు సంబంధించిన ఏ అంశాలను మనం చర్చించవచ్చు?
3 జ్ఞాపకార్థ ఆచరణ, సమావేశాలు, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం సమీపిస్తున్నప్పుడు ఆ ఏర్పాట్ల గురించి వివరించేందుకు, వాటిపట్ల ఉత్సాహం పెంచేందుకు కొన్ని నిమిషాలు వెచ్చించండి. మనల్ని యెహోవాసాక్షులు అని ఎందుకు పిలుస్తారు? మన కూటాలు జరిగే స్థలాలను రాజ్య మందిరాలు అని మనం ఎందుకు పిలుస్తాం? పెద్దల, పరిచర్య సేవకుల విధులు ఏమిటి? ప్రకటనా పని, క్షేత్రం ఎలా సంస్థీకరించబడతాయి? మన సాహిత్యం ఎలా తయారవుతుంది? సంస్థకు ఆర్థిక మద్దతు ఎలా లభిస్తోంది? పనిని పర్యవేక్షించడంలో బ్రాంచి కార్యాలయం, పరిపాలక సభల పాత్రలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు క్రమంగా జవాబులు ఇవ్వండి.
4, 5. మన వీడియోలు సంస్థపట్ల అవగాహనను, కృతజ్ఞతను ఎలా పెంచగలవు?
4 ఉపదేశాత్మక వీడియోలు: బైబిలు విద్యార్థులు యెహోవా అద్భుత సంస్థ గురించి తెలుసుకోగల మరో మార్గం, మన వీడియోలు. భూదిగంతముల వరకు (ఆంగ్లం) అనే వీడియో మన ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని గురించి వివరిస్తుంది, విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం) అనే వీడియో మన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వం గురించి వివరిస్తుంది, దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు (ఆంగ్లం) అనే వీడియో యెహోవాసాక్షులలో ఉండే ఐక్యతను వివరిస్తుంది. ఐదు సంవత్సరాల నుండి మన పత్రికలను, ఇతర సాహిత్యాలను చదువుతున్న ఒక స్త్రీ యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను చూసి కంటతడి పెట్టింది. ఆమె తనను సందర్శించే సాక్షులను నమ్మేది, కానీ వీడియో చూసిన తర్వాత సంస్థను కూడా తాను నమ్మవచ్చు అని భావించింది. ఆమెతో క్రమబద్ధమైన అధ్యయనం ప్రారంభించబడింది, ఆ తర్వాతి వారం రాజ్య మందిరంలో కూటాలకు హాజరయ్యింది.
5 ప్రతీ వారం మన విద్యార్థులతో కొద్ది నిమిషాలు గడపడం ద్వారా, మనకు అందుబాటులో ఉన్న ప్రచురణలను ఉపయోగించడం ద్వారా నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న ఒకేఒక సంస్థ వైపు బైబిలు విద్యార్థులను క్రమంగా నిర్దేశించవచ్చు.