పవిత్రంగా, ప్రశంసనీయంగా కనబడే తీరు
1. జిల్లా సమావేశానికి సిద్ధపడుతుండగా, మనం కనబడే తీరు గురించి ఎందుకు ఆలోచించాలి?
1 “యెహోవాసాక్షులు ఉత్తములు! మీరు స్నేహశీలురు, మంచి దుస్తులు ధరిస్తారు, ప్రగాఢమైన గౌరవం చూపిస్తారు” అని గత సంవత్సరం జరిగిన ఒక జిల్లా సమావేశానికి హాజరైన మన సహోదర సహోదరీల గురించి ఒక హోటల్ ప్రతినిధి అన్నాడు. సమావేశం జరిగిన మరొక చోట, హోటల్లో పనిచేసే ఒక స్త్రీ ఇలా వ్యాఖ్యానించింది: “మీరు దేవుణ్ణి సంతోషపెట్టేలా దుస్తులు ధరిస్తారని స్పష్టంగా తెలుస్తోంది.” అవును, సమావేశానికి వచ్చినవారిని ఇతరులు గమనిస్తారు. కాబట్టి మనం “సువార్తకు తగినట్లుగా” ఉండే దుస్తులు ధరించాలి, అది తరచూ సాక్షేతరులు మనల్ని ప్రశంసించేలా పురికొల్పుతుంది, మనం దేవుని పరిచారకులమని స్పష్టం చేస్తుంది. (ఫిలి. 1:27) మనం జిల్లా సమావేశానికి సిద్ధపడుతుండగా, మనం కనబడే తీరు గురించి ముందుగానే ఆలోచించడం సముచితంగా ఉంటుంది.
2. ఒక వ్యక్తి వస్త్రాలంకరణ, కేశాలంకరణ విషయంలో పవిత్రతను కనబరచడం ఎందుకు సవాలుగా ఉంటుంది?
2 “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకో. 3:17) మనం కనబడే తీరులో పవిత్రతను కనబరచడమంటే అదొక సవాలే. సాతాను యొక్క అనైతిక లోకం ప్రజలు అనుచితమైన శైలిని అంటే అమర్యాదకరమైన, ఐహికమైన, విపరీతమైన స్టైళ్ళను అలవరచుకునేలా ప్రభావితం చేస్తోంది. (1 యోహా. 2:15-17) కాబట్టి దుస్తులు, కేశాలంకరణ గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు “మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను” అనే బైబిలు ఉద్బోధను లక్ష్యపెట్టాలి. (తీతు 2:12-13) మనం మన కనబడే తీరు ద్వారా ఇతరులను అంటే మన సహోదరులనైనా, హోటల్, రెస్టారెంట్ల సిబ్బందినైనా, మనల్ని గమనించే ఇతరులనైనా ఇబ్బంది పెట్టాలని ఎన్నడూ కోరుకోము.—1 కొరిం. 10:32, 33.
3. మనం కనబడే తీరును పరీక్షించుకునేందుకు మనకు ఎలాంటి ప్రశ్నలు సహాయకరంగా ఉంటాయి?
3 నిరాడంబరమైన చక్కని దుస్తులు: సమావేశానికి సిద్ధపడుతున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా దుస్తులు నిరాడంబరంగా ఉన్నాయా లేక అనవసరంగా ఇతరుల అవధానం నా వైపుకు మళ్ళించేలా ఉన్నాయా? అవి ఇతరుల భావాల పట్ల గౌరవాన్ని కనబరుస్తున్నాయా? నా జాకెట్లు లోనెక్తో లేక పొట్టిగా ఉన్నాయా? నా డ్రెస్సులు శరీరం కనబడేలా లేక బిగుతుగా ఉన్నాయా? నా దుస్తులు శుభ్రంగా ఎలాంటి దుర్వాసన లేకుండా ఉన్నాయా? హోటల్ వాళ్లు ప్రశంసా సూచకంగా మీకు అందజేసే అల్పాహారం ఆరగిస్తున్నప్పుడు లేక కార్యక్రమం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకొనేటప్పుడు నేను ధరించే దుస్తులు చక్కగా, ఒక పరిచారకునికి తగినట్లు శుభ్రంగా ఉన్నాయా లేక ముడతలు పడిపోయి, అమితమైన ఫ్యాషన్తో, క్రమరహితమయన, సమావేశపు ప్రతినిధి బ్యాడ్జ్ కార్డు ధరించడానికి తగని విధంగా ఉన్నాయా? నేను విరామ సమయంలో ధరించే దుస్తులు, అనియత సాక్ష్యమిచ్చేందుకు ఇబ్బందికరంగా ఉన్నాయా?’—రోమా. 15:2, 3; 1 తిమో. 2:9.
4. మనం కనబడే తీరు పవిత్రంగా ఉండేందుకు ఇతరులు మనకెలా సహాయం చేయవచ్చు?
4 పరిణతి చెందిన క్రైస్తవులను గమనించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. భార్యలు తమ దుస్తులు ఇతరులకు ఎలా కనబడతాయో తమ భర్తలను అడగాలి. దైవభక్తి గల తల్లిదండ్రులు ఈ విషయంలో కౌమార ప్రాయంలో ఉన్న తమ పిల్లలకు సహాయం చేయవచ్చు. అంతేగాక, భక్తిపరులైన వయోధిక సహోదరీలు, కనబడే తీరు విషయంలో ‘యౌవనస్త్రీలు స్వస్థబుద్ధిగలవారిగా, పవిత్రులుగా ఉండాలని బోధించాలి.’ అలా ఉన్నప్పుడు “దేవునివాక్యము దూషింపబడ[దు].” (తీతు 2:3-5) నిరాడంబరమైన, చక్కని దుస్తులకు సంబంధించిన సహాయకరమైన చిత్రాలు మన ప్రచురణల్లో కనబడతాయి.
5. సమావేశ సమయంలో మనమందరం యెహోవాకు స్తుతిని ఎలా తీసుకురాగలము?
5 యెహోవాకు స్తుతిని తీసుకురండి: జిల్లా సమావేశాలు, కార్యక్రమంలో పాల్గొనే వారికి మాత్రమే కాక, మనందరికీ యెహోవాను స్తుతించే గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. మన క్రైస్తవ ప్రవర్తన, సంభాషణ కూడా ఆయనకు ఘనతను తెస్తుందనేది నిజమే. కానీ మనల్ని గమనించే అనేకమందికి మొట్టమొదట కనబడేది మన వస్త్రాలంకరణ, కేశాలంకరణలే. పవిత్రంగా, ప్రశంసనీయంగా కనబడే తీరు ద్వారా మనమందరం యెహోవాకు స్తుతిని తీసుకువద్దాం.—కీర్త. 148:12, 13.
[6వ పేజీలోని బాక్సు]
కనబడే తీరును ప్రశంసనీయంగా ఉంచుకునేందుకు ఇవి సహాయపడతాయి
◼ దేవుని వాక్యం
◼ ఆత్మ పరిశీలన
◼ ఇతరుల అభిప్రాయాలు
◼ క్రైస్తవ ప్రచురణలు