ఇతరులకు స్వచ్ఛమైన భాషను నేర్పించండి
1 యెహోవాసాక్షులు అనేక ‘జనములలోనుండి, వంశములలోనుండి, ప్రజలలోనుండి, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండి’ వచ్చినప్పటికీ వారు ఐక్యతగల ప్రజలు, వారిది నిజమైన అంతర్జాతీయ సౌభ్రాత్రుత్వం. (ప్రక. 7:9) నేటి విభాగిత ప్రపంచంలో ఇది ఎంతో విశేషమైన విషయం. అదెలా సాధ్యం? ఎందుకంటే మనకు “స్వచ్ఛమైన భాష” ఇవ్వబడింది.—జెఫ. 3:9, NW.
2 అద్భుతమైన ఫలితాలు: స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి? యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి దేవుని వాక్యమైన బైబిలులో కనుగొనబడే సత్యం గురించిన సరైన అవగాహన, ప్రత్యేకించి దేవుని రాజ్యం గురించిన సత్యం. యేసు ముందే చెప్పినట్లుగా ఈ సత్యం భూమిపైనున్న దృశ్య మాధ్యమం ద్వారా అంటే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా వ్యాపింపజేయబడుతోంది, తత్ఫలితంగా “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో” అనేకమంది సత్యారాధనను హత్తుకొంటున్నారు.—మత్త. 24:45; జెక. 8:23.
3 ప్రజలు స్వచ్ఛమైన భాషను నేర్చుకొంటుండగా, యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకొనేలా వారు పురికొల్పబడుతున్నారు. వారు “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, . . . సన్నద్ధులై” ఉండడం నేర్చుకొంటున్నారు. (1 కొరిం. 1:10) దైవిక బోధ, ప్రత్యేకించి ఇతరులతో సువార్తను పంచుకొనే విషయంలో, నిజాయితీతో కూడిన సత్ప్రవర్తనను, సంక్షేమకరమైన సత్యమైన సంభాషణను వారిలో అంకురింపజేస్తుంది. (తీతు 2:7, 8; హెబ్రీ. 13:15) ఈ అద్భుతకరమైన మార్పులు యెహోవాకు ఘనతను తీసుకువస్తాయి.
4 ఉదాహరణకు సువార్తను విన్నప్పుడు ఒక వ్యక్తికి ఎన్నో సందేహాలు కలిగాయి, వాటన్నిటికీ బైబిలు నుండి సమాధానం తెలియజేయబడింది. తాను విన్నదానితో ప్రేరేపించబడిన ఆ వ్యక్తి వారానికి రెండుసార్లు బైబిలు అధ్యయనం చేస్తూ కూటాలకు హాజరవడం ప్రారంభించాడు. రాజ్యమందిరంలో తనకు లభించిన హృదయపూర్వక స్వాగతానికి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే హాజరైనవారిలో అనేకమంది వివిధ జాతులకు చెందిన వారు. కొద్దికాలంలోనే ఆయనా ఆయన భార్యా తమ జీవితాల్లో మార్పులు చేసుకొని బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన దాదాపు 40 మందికి దేవుణ్ణి సేవించేందుకు సహాయం చేశాడు, వారిలో చాలామంది ఆయన కుటుంబ సభ్యులే. ఆయన ఒక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఈ మధ్యే పయినీరు సేవను చేపట్టాడు.
5 ఇతరులకు బోధించడం: ప్రపంచ సంఘటనలు యథార్థవంతులైన అనేకమంది తమ జీవితాలనూ ఆలోచనలనూ పునఃపరిశీలించుకొనేలా చేస్తున్నాయి. యేసులాగే మనం కూడా వారికి సహాయపడాలని కోరుకోవాలి. నిజమైన ఆసక్తిని కనబరిచే ప్రజలు స్వచ్ఛమైన భాషను నేర్చుకొనేందుకు వారికి సహాయపడే విషయంలో సమర్థవంతమైన పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు కీలక పాత్ర వహిస్తాయి.
6 బిజీగా ఉండే ప్రజలతో వారి గుమ్మం దగ్గరే క్లుప్తంగా బైబిలు అధ్యయనాన్ని నిర్వహించే విధానం చాలా సమర్థమైనదిగా రుజువైంది. (km 5/02 పేజీ 1) దీన్ని మీరెప్పుడైనా ప్రయత్నించారా? మీరొక పునర్దర్శనం చేయడానికి సిద్ధపడుతున్నట్లయితే, జనవరి 2002 మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లో నుండి మీ గృహస్థునికి తగిన ఒక అందింపును ఎంపిక చేసుకోండి. అందులో ఇవ్వబడిన అనేక అందింపులు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి లేదా జ్ఞానము పుస్తకం నుండి నేరుగా చర్చలు జరిపేందుకు రూపొందించబడ్డాయి. ఉపోద్ఘాతమైన తర్వాత మీరు సులభంగా ఒక పేరాను చర్చించగలిగేలా అందింపును బాగా అభ్యాసం చేయండి. పేరాలోని ఒకటి లేదా రెండు లేఖనాలను ఎంపిక చేసుకొని చదివి వాటిని చర్చించండి, ముగింపులో అడగవలసిన ప్రశ్నను ముందుగానే సిద్ధం చేసుకోండి. మీరు తర్వాతి సందర్శనంలో చర్చించాలనుకుంటున్న పేరాకు వారిని నడిపించడానికి అది తోడ్పడుతుంది.
7 స్వచ్ఛమైన భాషను నేర్చుకోవడం ద్వారా యెహోవా ప్రజలు ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. “యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించ[డంలో]” మనతో పాటు కలిసేందుకు ఇతరులకు సహాయపడడానికి మనం తీవ్రంగా కృషి చేద్దాం.—జెఫ. 3:9.