ఒక ప్రత్యేకమైన పరస్పర ప్రోత్సాహం
1 యెహోవా ప్రజలు విశ్వాస పరీక్షలను ఎదుర్కోకుండా ఒక్క దినం కూడా గడవదు. అపవాది తనకు సమయం చాలా తక్కువగా ఉందని తెలుసుకుని, యెహోవా పట్ల మనకున్న యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి చివరి దెబ్బ వేయాలని చూస్తున్నాడు. (ప్రక. 12:12) ‘ఆపద్దినమందు ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారమై నిలువబడుటకును శక్తిమంతులం’ కాగలిగేలా ‘ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులమై’ ఉండడం ఆవశ్యకం.—ఎఫె. 6:10, 13.
2 మనం శక్తిని పొందడానికి సహాయం చేసేందుకు యెహోవా చేసిన ఏర్పాటు, తోటి విశ్వాసులతో సమకూడడం. అపొస్తలుడైన పౌలు దీని ప్రాముఖ్యతను గ్రహించాడు. ‘ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణ పొందేందుకు, స్థిరపడేందుకు’ తాను తన క్రైస్తవ సహోదరుల సహవాసంలో ఉండాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. (రోమా. 1:11, 12) దేవుని చిత్తాన్ని చేయడంలో మనల్ని బలపర్చడానికి, త్వరలో జరుగనున్న “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే జిల్లా సమావేశంలో పరస్పర ప్రోత్సాహం నుండి ప్రయోజనం పొందే అవకాశాన్ని పరిపాలక సభ ప్రేమపూర్వకంగా మనకిస్తుంది.
3 ప్రయోజనం పొందడానికి అక్కడ ఉండండి: మూడు రోజులూ హాజరుకావడాన్ని మీ లక్ష్యంగా పెట్టుకోండి. మొదటి పాటకు ముందే రావడం ద్వారా, ముగింపు ప్రార్థన తర్వాత హృదయపూర్వకంగా “ఆమెన్” అని చెప్పేలా చివరి వరకూ ఉండడం ద్వారా మనకు మనం “ప్రయోజనము” చేకూర్చుకుంటాము. (యెష. 48:17, 18) ఈ సంవత్సరం సమావేశాలు పిల్లలందరూ ఉద్యోగాలుచేసే ప్రచారకులందరూ అదనపు సెలవులు ఎక్కువగా తీసుకోకుండానే హాజరవ్వగలిగేలా సెలవు దినాల సమయంలో ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఉత్తరదిశలోనూ ఈశాన్యంలోనూ ఉన్న సహోదరులు ముంబయికి రావడానికి కాస్త ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది, కాబట్టి వారు మూడు రోజులూ హాజరవ్వడానికి సమయం ఉండేలా తమ పనిని ఎంతో ముందుగానే చేసుకోగలిగేలా షెడ్యూల్ను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. పెద్ద సమావేశాలకు హాజరవ్వడానికి అదనపు కృషి అవసరమయినప్పటికీ తన చిత్తాన్ని చేయడానికి సహాయం చేస్తానని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. (1 యోహా. 5:14, 15) సమావేశానికి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి రెండు నెలలు ముందుగానే అవకాశం ఇవ్వబడుతుంది, కాబట్టి ఇప్పటికే బుక్ చేసుకోకపోతే, దేన్నీ అవకాశానికి వదిలేయకుండా టికెట్లు బుక్ చేసుకోవడానికి, హోటల్ రూములు బుక్ చేసుకోవడానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఇదే తగిన సమయం. మూడు రోజులూ హాజరవ్వడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని నిశ్చయత కలిగివుండవచ్చు.—సామె. 10:22.
4 ప్రోత్సాహం కోసం ఎదురుచూడండి: ఎప్పుడైనా మీరు జిల్లా సమావేశం అయిపోయాక వెళ్ళిపోతూ “దీనంతటి మంచి సమావేశానికి నేనెప్పుడూ హాజరవ్వలేదు” అనుకున్నారా? మీరెందుకలా భావించి ఉంటారు? ఎందుకంటే అపరిపూర్ణ మానవులముగా మనం క్రమంగా ఎంతో అలసిపోయి, ఆధ్యాత్మిక ప్రోత్సాహం కోసం పరితపించేపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. (యెష. 40:30) ఒక సహోదరి ఇలా అన్నది: “ఈ విధానం నేను చాలా అలసిపోయేలా చేస్తుంది, సమావేశాలు ఆధ్యాత్మిక విషయాలపై మళ్ళీ నా దృష్టిని కేంద్రీకరించుకోవడానికి నాకు సహాయం చేసి, అవసరమైన ఆధ్యాత్మిక బలాన్ని అవి నాకిస్తాయి. నాకెప్పుడైతే ప్రోత్సాహం అవసరమో అప్పుడే లభించినట్లుగా అనిపిస్తుంది.” బహుశా మీకు కూడా అలాంటి భావాలే ఉండవచ్చు.
5 మనం ప్రసంగాలు, ఇంటర్వ్యూల ద్వారానే గాక మన సమావేశాల్లోని ఆధ్యాత్మికంగా బలపర్చే ఇతర అంశాల ద్వారా కూడా అవసరమైన ప్రోత్సాహాన్ని పొందుతాము. ఒక సహోదరుడు ఇలా వ్యాఖ్యానించాడు: “నేను నిజంగా ఆనందించేది బైబిలు సూత్రాల స్పష్టమైన, ఆచరణాత్మకమైన అన్వయింపునే. గతంలో జరిగిన మంచి ఉదాహరణల నుండీ చెడ్డ ఉదాహరణల నుండీ మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించడంలో నాటకాలు నిజంగా ఎంతో అమూల్యమైనవి. క్రొత్త ప్రచురణల కోసం నేనెల్లప్పుడూ ఎదురు చూస్తాను, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలాసేపటి వరకూ నేను వాటి నుండి ఆనందాన్ని పొందుతాను.”
6 ఈ “అపాయకరమైన కాలముల”లో సమావేశాలు యెహోవా చేసిన ప్రాముఖ్యమైన ఏర్పాటు. (2 తిమో. 3:1) అవి మనం, “మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి” అనే ప్రేరేపిత ఉపదేశాన్ని లక్ష్యపెట్టడానికి మనకు సహాయం చేస్తాయి. (1 కొరిం. 16:13) కాబట్టి, మనం ప్రతి కార్యక్రమానికి హాజరవ్వడానికి నిశ్చయించుకుని “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే మన జిల్లా సమావేశం వద్ద పరస్పర ప్రోత్సాహాన్ని ఎంతగానో పొందుదాము!
[3వ పేజీలోని బాక్సు]
మూడు రోజులూ హాజరవ్వడానికి పథకం వేసుకోండి
◼ ఉద్యోగంలో సెలవు కోసం అడగండి.
◼ సమావేశ నగరంలో వసతి కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి.
◼ సమావేశానికి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోండి.