రాజ్య ప్రకటన ప్రాణాలను రక్షించేందుకు సహాయపడుతుంది!
1 అది ప్రస్తుతం లోకంలో జరుగుతున్న అతిప్రాముఖ్యమైన పని. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, వేలాది దేవదూతలు ఈ పని మీద తమ అవధానాన్ని కేంద్రీకరించారు. ఆ పని ఏమిటి, అది ఎందుకు అత్యావశ్యకమైనది? అది రాజ్యం గురించి ప్రకటించే పని, ఆ పని ప్రాణాలను రక్షించేందుకు సహాయపడుతుంది!—రోమా. 1:16; 10:13, 14.
2 మన చుట్టూ ఉన్న లోకాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే, అది ఇతరులకు మరింత సహాయకరంగా ఉంటుందని కొందరు భావించవచ్చు. చాలామంది శాంతిని తీసుకురావాలని, వ్యాధులను నయం చేయాలని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని ప్రయత్నించడంలో పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. కానీ నిజానికి, ప్రజలకు ఎక్కువగా సహాయపడేది ఏమిటి?
3 అతి శ్రేష్ఠమైన పని: కేవలం రాజ్య సందేశం మాత్రమే జీవిత సంకల్పాన్ని, మానవుల బాధలకు గల కారణాన్ని, భవిష్యత్తు గురించి నమ్మదగిన ఏకైక నిరీక్షణను తెలియజేస్తుంది. ప్రజలు దేవుని స్నేహితులై తద్వారా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము”ను పొందేలా సువార్త సహాయం చేస్తుంది. (ఫిలి. 4:7) కేవలం రాజ్య సందేశం మాత్రమే ఇప్పటి జీవిత సమస్యలతో విజయవంతంగా పోరాడేందుకు సహాయపడే ఆచరణాత్మకమైన నడిపింపును ఇస్తుంది, భవిష్యత్తులో దుష్ట లోకం నాశనం చేయబడినప్పుడు ఎలా కాపాడబడవచ్చో కూడా అది తెలియజేస్తుంది. (1 యోహా. 2:17) అది, రాజ్యాన్ని ప్రకటించడానికి మనం చేసే కృషి అంతటికీ తగిన ఫలితం కాదా?
4 ఉదాహరణకు: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆనకట్టవల్ల అపాయంలోవున్న ఒక గ్రామంలోని నిద్రిస్తున్న ప్రజలకు సహాయం చేయడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటి? అంతకంతకు బలహీనమవుతున్న ఆనకట్ట వెనకనుంచి నీళ్ళను ఎత్తిపోయడమా? గ్రామం నాశనమైపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రామాన్ని అందంగా కట్టడమా? కాదు! గ్రామస్థులను నిద్రలేపి, రానున్న విపత్తు గురించి వారిని హెచ్చరించి, తప్పించుకోవడానికి వారికి సహాయం చేయడం ఆవశ్యకం! నేడు ఆధ్యాత్మికంగా నిద్రిస్తున్నవారు చాలా ప్రమాదకరస్థితిలో ఉన్నారు. (లూకా 21:34-36) ఈ విధానం త్వరలో గతించిపోతుంది కనుక, మనకు సాధ్యమైనంత మందికి అత్యవసర భావంతో ప్రకటించడానికి మనం తీవ్రంగా కృషి చేద్దాం!—2 తిమో. 4:2; 2 పేతు. 3:11, 12.
5 ఈ పనిలో కొనసాగండి: ఇంకా ఎక్కువమంది యథార్థవంతులైన ప్రజలను వారి ఇళ్ళల్లోనూ వీధుల్లోనూ టెలిఫోన్ ద్వారా మరియు అనియతంగానూ కలిసి వారితో సువార్త పంచుకోవడానికి మార్గాల కోసం వెదకుదాము. యెహోవా మనకు అప్పజెప్పిన పని, మనం చేయగలిగిన పనులన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైన పని. మనము దాన్ని ఉత్సాహవంతంగా నెరవేరిస్తే, ‘మనలను, మన బోధ వినువారిని రక్షించుకొంటాము.’—1 తిమో. 4:16.