యెషయా ప్రవచనాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడండి!
1 “యెహోవా, సాతాను లోకాన్ని తీర్పు తీర్చాల్సిన రోజును దాటి ఒక్కరోజు కూడా ఉనికిలో ఉండనీయడు అని విశ్వసనీయులైన ఆరాధకులు గట్టి నమ్మకంతో ఉండవచ్చు.” ఎంత ప్రోత్సాహకరమైన మాటలవి! అవి ఎక్కడినుండి తీసుకోబడ్డాయి? యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు I నుండి తీసుకోబడ్డాయి. అలాంటి ధైర్యాన్నిచ్చే ముగింపుకు రావడానికి మనకు యెషయా ప్రవచనమేమైనా దోహదపడుతుందా? అవును! ఆ బైబిలు పుస్తకంలో, రక్షణ అనే అంశం బలంగానూ, స్పష్టంగానూ నొక్కిచెప్పబడింది. (యెష. 25:9) అందుకే దేవుని వాక్యంలోని ఆ భాగాన్ని సంఘ పుస్తక అధ్యయనంలో అధ్యయనం చేయడం మనకు గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. అధ్యయనాన్ని ఆనందించడానికి ప్రతి వారం మనం అక్కడుంటామా? మనమెందుకు ఉండాలి?
2 యెషయా 30:20, NWలో యెహోవా “గొప్ప బోధకుడు” అని పిలువబడ్డాడు. యెహోవా తన వాక్యం ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” అందజేస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు శ్రద్ధగా వినాలి. (మత్త. 24:45; యెష. 48:17, 18) యెషయా ప్రవచనం I విషయంలోనూ అది నిజమే. దాన్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు అత్యధిక ప్రయోజనాన్ని ఎలా పొందగలరు?
3 పాల్గొనడానికి సిద్ధపడండి: పుస్తక అధ్యయనానికి సిద్ధపడడానికి సరిపడే సమయాన్ని ప్రతి వారం పక్కకు పెట్టండి. నియమిత భాగంలోని ప్రతిపేరాను చదవండి. అందులోని ప్రతీ ప్రశ్న గురించి ఆలోచించండి. జవాబులను మీ పుస్తకంలో గుర్తులు పెట్టుకోండి. యెషయా నుండి ఉదహరించిన లేఖనాలు ముద్దక్షరాల్లో ముద్రించబడ్డాయి. వాటిని శ్రద్ధగా చదవండి. సూచించబడిన ఇతర లేఖనాలు, చర్చించే అంశానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో పరిశీలించండి. మీరు నేర్చుకొంటున్న విషయాలను ధ్యానించండి. ఆ తర్వాత మీరు సిద్ధపడుతుండగా వచ్చిన ఫలితాలను మీ పుస్తక అధ్యయన గ్రూపుతో పంచుకోండి.
4 బైబిలును బాగా ఉపయోగించడానికీ, అధ్యయనం చేసిన అంశంలోని ఆచరణాత్మకమైన విలువను గ్రహించడానికీ పుస్తక అధ్యయనాన్ని నిర్వహించే సహోదరుడు హాజరయిన వారందరికీ సహాయపడాలి. మీరు మొదట వ్యాఖ్యానించే వారయితే, క్లుప్తంగా, సూటిగా జవాబు చెప్పండి. ఒకవేళ అప్పటికే ఎవరైనా అలాంటి జవాబిస్తే చర్చలో భాగముగా ఆ అంశాన్ని మీరు విశదీకరించవచ్చు. బహుశా, కీలకమైన ఒక లేఖనం అధ్యయనం చేస్తున్న ఆ ముఖ్యాంశాన్ని ఎలా సమర్థిస్తుందో చూపించవచ్చు. మీ సొంత మాటల్లో వ్యాఖ్యానించడానికి ప్రయత్నించండి, చర్చలో పాల్గొనడం ద్వారా కలిగే ఆహ్లాదాన్ని అనుభవించండి.
5 యెషయా పుస్తకంలోని అమూల్యమైన సందేశాన్ని అత్యాకాంక్షతో మనం కలిసి పరిశీలిద్దాం. యెహోవా రక్షణ అనే సంతోషకరమైన నిరీక్షణతో ప్రతిరోజు జీవించడానికి అది మనకు ప్రోత్సాహాన్నిస్తుంది!—యెష. 30:18.