ప్రకటించడానికి సంకోచించకండి!
1 ఇంటింటికీ ప్రకటించడానికి మనం సిద్ధమవుతున్నప్పుడు, మనమెదుర్కొనే అత్యంత సవాలుదాయకమైన ఆటంకం ఒక్కోసారి మనకు మనమే కావచ్చు. నాకు తగిన యోగ్యతలు లేవు అనే భావాలు, మనం ‘మనుష్యులందరికి’ సత్యాన్ని ప్రకటించడానికి సంకోచించేలా చేయవచ్చు. (1 తిమో. 2:4) కానీ మనం సువార్తను ప్రకటించడానికి సంకోచించకూడదు. ఎందుకు సంకోచించకూడదు?
2 అది యెహోవా సందేశం: యెహోవా తన మాటలను బైబిలు రూపంలో అందించాడు. మనము ఆ సందేశాన్ని ఇతరులకు చేరవేసినప్పుడు, మనము మన తలంపులు కాకుండా ఆయన తలంపులనే తెలియజేస్తున్నాం. (రోమా. 10:13-15) రాజ్య సందేశాన్ని తిరస్కరించిన వ్యక్తులు, నిజానికి యెహోవాను తిరస్కరిస్తున్నారు. అయినా మనం నిరుత్సాహపడం. లోక పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకొనే వారి హృదయాల్లో, ఆధ్యాత్మికావసరాల పట్ల ఆసక్తి ఉన్నవారి హృదయాల్లో ఆ సందేశం సానుకూలమైన ప్రతిస్పందనను కలిగిస్తుందని మనకు పూర్తి నమ్మకం ఉంది.—యెహె. 9:4; మత్త. 5:3, 6.
3 యెహోవా ప్రజలను ఆకర్షిస్తాడు: మనం చెప్పేది వినడానికి గతంలో నిరాకరించిన ఒక వ్యక్తి, పరిస్థితులు మారడం వల్ల, హృదయం మెత్తబడడం వల్ల బహుశా ఇప్పుడు వినడానికి సుముఖంగా ఉంటుండవచ్చు. యెహోవా ఇప్పుడు ఆ వ్యక్తిపై తన ఉదారతను చూపించి ‘ఆకర్షించవచ్చు.’ (యోహా. 6:44, 65) అలా ఎప్పుడైతే జరుగుతుందో, యెహోవా చేత ఉపయోగించబడడానికీ, అలాంటి వారిని కనుగొనడానికి దేవదూతల నడిపింపును పొందడానికీ మనం సిద్ధంగా ఉండాలి.—ప్రక. 14:6.
4 దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ఇస్తాడు: పరిశుద్ధాత్మ మనం ‘ప్రభువును [“యెహోవాను,” NW] ఆనుకొని ధైర్యముగా మాటలాడేలా’ చేస్తుంది. (అపొ. 14:1-3) మన పరిచర్యకు అంతటి శక్తివంతమైన మద్దతు ఉందని గుర్తుంచుకొంటే, మన పొరుగువారితో, తోటి పనివారితో, తోటి విద్యార్థులతో, బంధువులతో లేక విద్యావేత్తలతో లేక ధనవంతులతో సత్యం గురించి మాట్లాడడానికి మనం సంకోచించము.
5 మనమెలా చేయాలో యేసు నేర్పించాడు: యేసు ఆలోచింపజేసే ప్రశ్నలను, సందర్భోచితమైన దృష్టాంతాలను, లేఖనాధార తర్కాలను ఉపయోగించాడు. ఆయన సత్యాన్ని తన హృదయంనుండి సరళంగా, ఆకట్టుకొనే విధంగా వివరించి చెప్పాడు. ఆ విధానాలు నేడు కూడా ఆచరించడానికి శ్రేష్ఠమైనవే. (1 కొరిం. 4:17) మనం ప్రకటించే పరిస్థితులు మారవచ్చు, కానీ బలమైన రాజ్య సువార్త మాత్రం మారదు.
6 విశిష్టమైన మరియు ప్రాముఖ్యమైన విధంగా ప్రజలకు సహాయం చేయడానికి యెహోవా చేత మనం ఉపయోగించబడడం మనకు లభించిన గొప్ప ఆధిక్యత. కాబట్టి మనం ప్రకటించడానికి సంకోచించకుండా ఉందాం! మనం ధైర్యంగా ఉండి ఇతరులకు సువార్త ప్రకటించగలిగేలా “అనుకూలమైన సమయము దేవుడు దయచేయ[డానికి]” అనుమతించుదముగాక.—కొలొ. 4:2-6.