అంతం సమీపిస్తుండగా సాక్ష్యమిచ్చే పనిని ఎక్కువగా చేయడం
1 కోతకాలం సంతోషకరమైన సమయం. అది కష్టపడి పనిచేయవలసిన సమయం కూడా. పంట సమకూర్చుకోవడానికి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. పనివాళ్ళు పనిలో సోమరులై ఉండకూడదు.
2 అలంకారికంగా మాట్లాడుతూ, యేసు “యుగసమాప్తి”ని కోతకాలంతో పోల్చాడు. (మత్త. 13:39) “లోకమందంతట” సాక్ష్యం ఇవ్వడానికి తక్కువ సమయమే మిగిలివున్న ఈ యుగసమాప్తి చివరిగడియలలో మనం జీవిస్తున్నాం. (మత్త. 24:14) అంతం అంతకంతకూ సమీపిస్తుండగా, మన వంతుగా ఆ పరిచర్యను మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? యేసు ఇలా వివరించాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.”—మత్త. 9:37, 38; రోమా. 12:11, క్యాథలిక్ అనువాదము.
3 అత్యవసర భావంతో చేయండి: తన గొప్ప ప్రకటనా పనిని ప్రారంభించినప్పుడు, తనకు నియమించబడిన దానిని నెరవేర్చడానికి ఆయనకున్నది మూడున్నర సంవత్సరాలు మాత్రమే. “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని” చెబుతూ ఆయన అత్యవసర భావంతో ప్రకటించాడు.—లూకా 4:43.
4 యేసు, తన శిష్యుల్లో అదే విధమైన అత్యవసర భావాన్ని నాటాడు. (మార్కు 13:32-37) అందుకే వారు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొ. 5: 42) వాళ్ల జీవితాల్లో తక్కువ ప్రాముఖ్యతగల కార్యకలాపాలకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. సంఖ్యాపరంగా చూస్తే వారు కొద్దిమందే ఉన్నా, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్తను ప్రకటించే విషయంలో వారు సఫలీకృతులయ్యారు.—కొలొ. 1:23.
5 “అయతే అన్నిటి అంతము సమీప[ము]” అవుతుండగా అదే విధమైన అత్యవసర భావాన్ని పెంపొందించుకోవడానికి మనకు మరిన్ని కారణాలు ఉన్నాయి. (1 పేతు. 4:7) ఈ విధానాంతానికి యెహోవా ఒక నిర్ణీత దినాన్ని, నిర్ణీత గడియను ఏర్పాటు చేశాడు. (మత్త. 24:36) ఇక మిగిలి ఉన్న ఈ కాలంలోనే ప్రకటనా పని ముగించబడుతుంది. అందుకే మనం సువార్తతో అనేక మంది ప్రజలను చేరుకోవడానికి మన ప్రయత్నాలను విస్తృతపర్చుకోవడంలో కొనసాగాలి.
6 అంతం సమీపించేకొలది సాక్ష్యం ఇచ్చే పనిలో మన వంతును మరింత ఎక్కువ చేయడం ద్వారా యేసు యెహోవాతో చెప్పినట్లు, ‘చేయుటకు నీవు మాకిచ్చిన పనిని మేము సంపూర్ణముగా నెరవేర్చాం’ అని చెప్పే సంతృప్తి మనకు ఉంటుంది.—యోహా. 17:4.