బైబిలు పఠనంలో పూర్తి భాగం వహించేందుకు కుటుంబసభ్యులు ఎలా సహకరిస్తారంటే
1 సత్యము కుటుంబ జీవితానికి నిజమైన అర్థాన్ని సంకల్పాన్ని జతచేస్తుంది. కానీ యెహోవాను సేవించడంలో సాఫల్యం పొందడం దానంతటదే వచ్చేది కాదు. ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించేందుకు సమయము, గట్టి ప్రయత్నము అవసరం. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కుటుంబ సభ్యులు సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. మూడు భాగాల పరంపరలోని ఈ మొదటి శీర్షిక మంచి పఠన అలవాట్లు పెంపొందించుకోవడంలో కుటుంబాలు ఎలా సహకరించుకోగలవనే దానిపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
2 ప్రతి దినం బైబిలును పఠించడం ద్వారా: “జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును” అని సామెతలు 24:5 చెబుతోంది. క్రమంగా దేవుని వాక్యాన్ని పఠించడం వల్ల కలిగే జ్ఞానం ఒక వ్యక్తి తన ఆధ్యాత్మికతపై సాతాను చేసే దాడిని ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇస్తుంది. (కీర్త. 1:1, 2) మీరు ప్రతిదినం బైబిలును కుటుంబ సమేతంగా కలిసి పఠిస్తారా? సంవత్సరంలో ప్రతి వారం కోసం “చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక” దైవపరిపాలనా పరిచర్య పాఠశాలపట్టికలో ఉంది. దాన్ని అనుసరించేందుకు కుటుంబ సమయంలో కనీసం పది నిమిషాలకన్నా ఎక్కువ అవసరమవ్వదు. బైబిలును చదివేందుకు అలాగే లేఖనములను పరిశీలించుట అనే పుస్తకం నుండి ఆ రోజు కొరకైన దినవచనాన్ని పరిశీలించేందుకు అల్పాహారం తీసుకొనే సమయంలో అయినా, సాయంత్రం భోజనం చేసిన తర్వాత అయినా, లేదా నిద్రపోయే ముందు అయినా ఏదో ఒక అనుకూల సమయాన్ని ఎన్నుకోండి. దీనిని మీ కుటుంబపు దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకోండి.
3 ప్రతి వారం కలిసి పఠించడం ద్వారా: ప్రతి వారం కుటుంబాల్లో కుటుంబ బైబిలు పఠనం ఉన్నతాంశంగా ఉండాలి. ఆ పఠనంలో ప్రతి ఒక్కరూ ఆతురతతో భాగం వహించడం ద్వారా దానికి పూర్తి మద్దతునివ్వాలి. కుటుంబ యజమాని పఠించవలసిన విషయాన్ని ఏరోజున, ఏసమయాన, ఎంతసేపు పఠించాలన్నదాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబ అవసరతలను పరిశీలించాలనుకుంటాడు. వారపు పట్టికలో కుటుంబ పఠనానికి మొదటిస్థానమివ్వండి. తక్కువ ప్రాముఖ్యత గల విషయాలు కుటుంబపఠనానికి ఆటంకం కలిగించేందుకు అనుమతించకండి.—ఫిలి. 1: 9-11.
4 ఒక తండ్రి తన ఇంటికి తరచూ వచ్చే వ్యాపార సంబంధమైన ఫోన్లను కుటుంబపఠనం సమయంలో డిస్కనెక్ట్ చేసేవాడు. ఒకవేళ ఆ సమయంలో క్లయింట్లు ఎవరైనా ఇంటికి వస్తే వారిని పఠనానికి ఆహ్వానించేవాడు, లేదా అది పూర్తయ్యేంతవరకు వేచివుండమని చెప్పేవాడు. కుటుంబ పఠనానికి ఏదీ ఆటంకం కలిగించకూడదని ఆ తండ్రి దృఢ నిర్ణయం తీసుకున్నాడు. అది పిల్లలపై చెరగని ముద్ర వేసింది. అతని వ్యాపారం విషయానికొస్తే అది కూడా చక్కగా వర్ధిల్లింది.
5 ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కుటుంబ సభ్యులందరూ సహకరించినప్పుడు ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా! కుటుంబ బైబిలు పఠనంలో పూర్తి భాగం వహించేందుకు మన ప్రయత్నాల్లో స్థిరంగా ఉన్నట్లయితే అది యెహోవా ఆశీర్వాదాలను తెస్తుంది.—కీర్త. 1:3.