ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకార్థముగా ఆచరించడం
1 యెహోవా మనకు అనేక వరాలను అనుగ్రహించాడు. ఆయన మంచితనము, కృపాబాహుళ్యముల మొత్తం కలిపి ‘చెప్ప శక్యము కాని ఆయన వరమని’ స్పష్టంగా వర్ణించబడ్డాయి. అవును, ‘దేవుడు కనుపరచిన కృప’ ఎంతో అద్భుతమైనది కాబట్టి, దాన్ని వర్ణించడానికి మన సామర్థ్యం సరిపోదు.—2 కొరి. 9:14, 15.
2 ఆయన మహాగొప్ప వరము: మానవ జాతి విమోచకునిగా యేసుక్రీస్తు, అన్ని ఈవులకన్నా మహాగొప్ప వరమై ఉన్నాడు. మానవాళిపట్ల తన గొప్ప ప్రేమను వ్యక్తపరుస్తూ, యెహోవా తన అద్వితీయ ప్రియ కుమారుని అనుగ్రహించాడు. (యోహా. 3:16) దేవుని నుండి వచ్చిన ఆయన ఉచిత కృపయైన అలాంటి ఆశీర్వాదం, ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణకు తగినదైవుంది. ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ, మహాగొప్ప బలి అయిన క్రీస్తు జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తూ, ప్రభురాత్రి భోజనాన్ని 1999 ఏప్రిల్ 1న, గురువారం సాయంకాలం గుర్తుచేసుకుంటారు.—1 కొరిం. 11:20, 23-26.
3 “మనమింకను పాపులమై యుండగానే” క్రీస్తు మన కోసం మరణించాడు, కాబట్టి ఆయన మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడం ద్వారా, అన్నింటి కన్నా అతి ప్రాముఖ్యమైన ఆ ఆచరణకు మనతోపాటు హాజరయ్యేలా ఇతరులను ఆహ్వానించడం ద్వారా మనం మన వ్యక్తిగత కృతజ్ఞతను చూపించగలం.—రోమా. 5:8.
4 అతి ప్రాముఖ్యమైన సంఘటన: క్రీస్తు మరణ దిన ఆచరణ, ఆయన దేవుని సర్వాధిపత్యాన్ని సంపూర్ణంగా సమర్థించాడన్న విషయాన్ని ఉన్నతపరుస్తోంది. యేసు బలి అర్పణయందు విశ్వాసముంచడం ద్వారా యెహోవా ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కల్గివుండగలమనీ, అలా రక్షణ సాధ్యమౌతుందన్న అభయాన్నీ మనకు అది గుర్తుచేస్తోంది. (అపొ. 4:12) నిజంగా ఇది, సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన!
5 మనతో పాటు ప్రభురాత్రి భోజన ఆచరణకు మన పొరుగు వారిని ఆహ్వానించడంలో వారి పట్ల మనకున్న ప్రేమ ప్రదర్శితమవుతుంది. విమోచన క్రయధనం యొక్క ఉన్నత విలువను గురించి తెలుసుకునే లక్షలాదిమంది ప్రజలకు దాని ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. (ఫిలి. 3:8) క్రీస్తు బలి అర్పణయందు విశ్వాసముంచువారు, నిత్యజీవం విషయంలో స్థిర నిరీక్షణను పొందగలరు.—యోహా. 17:3.
6 ఈ జ్ఞాపకార్థకాలం, సర్వోత్తమమైన దేవుని ఉచిత కృపపట్ల మెప్పుదలను చూపించేందుకు మనకు ప్రత్యేక అవకాశాలను దయ చేస్తోంది. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో ఆసక్తిగా పాల్గొనేందుకు ఇది చక్కని సమయం. యెహోవా దేవుని చెప్పశక్యముకాని ఉచిత వరాన్ని గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించే వారి కోసం, ఈ సంవత్సరంలో జరుపుకోబోయే ప్రభురాత్రి భోజన ఆచరణకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకొనే వారి కోసం గొప్ప ప్రయోజనాలు వేచి ఉన్నాయి!