మనస్సునూ, హృదయాన్నీ ఆకట్టుకునేందుకు బ్రోషూర్లను ఉపయోగించండి
1 మనస్సునూ హృదయాన్నీ ఆకట్టుకునేలా బైబిలు సత్యాన్ని సమర్పించాలి. యేసు తన శ్రోతలకు సత్యాన్ని వివరించినప్పుడు, వాళ్ళకు ఆసక్తివుండే, వాళ్ళను కదిలించే అంశాలను ఆయన ఎన్నుకున్నాడు. (లూకా 24:17, 27, 32, 45) పరిచర్యలో మన సాఫల్యం అనేది మన శ్రోతల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించడానికి మనం చేసే కృషిపై ఎంతగానో ఆధారపడి ఉంటుంది.
2 మనం పరిచర్యలో కలిసేవారి మనస్సునూ హృదయాన్నీ చేరుకునేందుకు బ్రోషూర్లు ఫలకరమైన ఉపకరణాలుగా ఉండగలవు. ఆగస్ట్‌లో చూపించబడే ఒక్కో బ్రోషూర్‌లోని సమాచారానికి ఎవరు ప్రతిస్పందించవచ్చనే విషయం గురించి ముందుగా ఆలోచించండి:
—దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? బాధలులేని భవిష్యత్తును గురించిన సాంత్వనపరచే ఈ సమాచారాన్ని ఆర్థిక ఒత్తిళ్ళతో బాధపడుతున్న ప్రజలు లేదా విషాద ఘటన బాధితులు గుణగ్రహిస్తారు.
—జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు? తమ భవిష్యత్తును గురించి గంభీరంగా ఆలోచిస్తున్న యౌవనస్థులు ఈ బ్రోషూర్‌లో కనుగొనబడే బైబిలు ఆధార జవాబుల నుండి ప్రయోజనం పొందుతారు.
—భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము! ఇందులోని అనేక చిత్రాలూ, అలాగే ఉటంకించబడిన బైబిలు పాఠ్యభాగాలూ పిల్లలూ, సరిగ్గా చదవడం రానివారూ దేవుని సంకల్పాలను గ్రహించేందుకు సహాయపడతాయి.
—పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము. ప్రభుత్వంతో ఏదో విధమైన సంబంధంగల వారు, దేవుని రాజ్యం మానవుల క్లిష్టమైన సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే దానిని గూర్చిన ఈ సందేశానికి ప్రతిస్పందించవచ్చు.
—మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. . . తమ ప్రియమైన వ్యక్తి మరణం వల్ల దుఃఖితులైన కుటుంబాలకు ఇవ్వడానికి ఈ బ్రోషూర్ ప్రతులను తమ దగ్గర ఉంచుకోవడానికి అంత్యక్రియల నిర్వాహకులు ఇష్టపడతారు. శ్మశానం దగ్గర సాక్ష్యమిచ్చే ప్రచారకులు దుఃఖితులకు సాంత్వననిచ్చేందుకు ఈ బ్రోషూర్‌ను ఉపయోగిస్తారు. సమాధి దగ్గర ప్రార్థిస్తున్న ఏడుగురు సభ్యులుగల ఒక కుటుంబాన్ని ఇద్దరు సహోదరీలు సమీపించారు. బ్రోషూర్ నుండి సాంత్వనపర్చే సందేశాన్ని తెలియజేయడం ద్వారా, ఆ తల్లితో ఆ మరుసటిరోజే బైబిలు పఠనం ప్రారంభమైంది!
—త్రిత్వమును మీరు నమ్మవలయునా? మతనిష్ఠగల వ్యక్తి క్రైస్తవ మత సామ్రాజ్యపు ప్రాథమిక సిద్ధాంతంలోని తప్పులను బట్టబయలుచేసే రుజువుల్లో కనబడే సత్యానికి ప్రతిస్పందించవచ్చు.
3 ప్రతి బ్రోషూర్నూ బాగా ఆకళింపుచేసుకోండి, దానిని ఎంత చక్కగా మీ ప్రదేశంలో ఉపయోగించవచ్చో నిర్ణయించుకోండి. సలహా ఇవ్వబడిన అందింపుల కోసం, జూలై 1998 సంచిక మన రాజ్య పరిచర్య వెనుక పేజీని చూడండి. ప్రజల మనస్సులనూ, హృదయాలనూ చేరేందుకు మీరు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించునుగాక.—మార్కు 6:34.