క్రొత్త ప్రత్యేక సమావేశదిన కార్యక్రమము
ప్రత్యేక సమావేశ దినాల ఏర్పాటు 1987లో ఆరంభమైంది. ఈ ఒక్క దిన సమావేశాలు, హాజరయ్యే యెహోవాసాక్షులకూ, ఆసక్తివున్న వ్యక్తులకూ క్షేమాభివృద్ధిని కల్గించేవని రుజువయ్యాయి. 1999 జనవరి నుండి క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం అందించబడుతోంది. తొమ్మిది ప్రసంగాలూ, అనేకమైన ఇంటర్వ్యూలూ, అనుభవాలు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైనవిగా ఉంటాయని మీరు కనుగొంటారు.
“యెహోవా బల్ల ఎడల మెప్పుదలను చూపించండి” అనేది క్రొత్త కార్యక్రమం యొక్క అంశం. (యెష. 65:1; 1 కొరిం. 10:21) యెహోవాకు మనం చెల్లించే ఆరాధన మన జీవితాల్లో ప్రథమ స్థానాన్ని వహించాలనే మన తీర్మానాన్ని అది బలపరుస్తుంది. (కీర్త. 27:4) కూటాలకు హాజరవ్వడం విషయంలో “మన హృదయాభిష్టాల్ని పరిశోధించడం” అనే అంశంపై ప్రయాణ పైవిచారణకర్త ప్రసంగిస్తాడు. “యెహోవా బల్లపై భుజించడం ద్వారా ఆధ్యాతికతను కాపాడుకోవడం” ఎలాగో అతిథి ప్రసంగీకుడు మనకు చూపిస్తాడు. దేవుని సేవ చేయడంలో దృఢత్వాన్ని కాపాడుకునేలా యెహోవా సంస్థలోని యువతకు ఆచరణీయమైన ప్రోత్సాహం ఇవ్వబడుతుంది కూడా. అతిథి ప్రసంగీకుడు ఇచ్చే “ధైర్యంగా సాక్ష్యమిచ్చేందుకు ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉండడం” అనే ప్రధాన ప్రసంగం, సంఘం ద్వారా చేయబడిన ఏర్పాట్లు రాజ్యాన్ని గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చేందుకు మనల్ని ఎలా సంసిద్ధుల్ని చేస్తాయో చూపిస్తుంది. ఈ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందాలని ఎవరు మాత్రం కోరుకోరు?
బాప్తిస్మం పొందాలని అనుకునే క్రొత్తగా సమర్పించుకొన్న వ్యక్తులు సాధ్యమైనంత త్వరలో సంఘ పైవిచారణకర్తకు తెలియజేయాలి. ప్రత్యేక సమావేశ దిన ఏర్పాటు పన్నెండవ సంవత్సరంలోనికి మనం అడుగిడుతుండగా, ఆ సమావేశానికి హాజరయ్యే ప్రతిఒక్కరూ తమ ముందున్న పని నిమిత్తం ఆధ్యాత్మికంగా ఉత్తేజితులవుతారనే నమ్మకం మాకుంది.