వ్యక్తిగత పఠనం—శ్రద్ధ చూపించవలసిన విషయం
1 ఏ విషయాలకు మనం ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరముంది? మనం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి, దాన్ని కాపాడుకోడానికి మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అలాంటి సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో వ్యక్తిగత పఠనం గొప్ప పాత్రను నిర్వహిస్తుంది. నేడు, మనలో అందరికీ, ధ్యానంలోను, వ్యక్తిగత పఠనంలోను ఎక్కువ సమయం గడపడానికి పరిస్థితులు అనుమతించడం లేదు. అయితే, మనం క్రమంగా దేవుని వాక్యాన్ని చదవనట్లయితే, మనం లోకాత్మను, దాని శారీరక కోరికలను ఎదిరించే శక్తి లేనంతగా బలహీనులమౌతాము.
2 వాక్యమును అపేక్షించుడి: మనం మొదట దేవుని ఉద్దేశాలను గూర్చి నేర్చుకున్నప్పుడు మరింత జ్ఞానాన్ని సంపాదించేందుకు మనం ఆతురత చూపించేవారము. అయితే, కాలం గడిచే సరికి, ఆత్మీయ ఆహారము కొరకైన ఆకలి తగ్గిపోయి ఉండవచ్చు. ఆత్మీయ ఆహారము కొరకు ‘అపేక్షించవలసిన’ అవసరముండవచ్చు. (1 పేతు. 2:2) అలాంటి అపేక్షను మనమెలా పెంపొందించుకోగలం?
3 ఆహ్లాదకరమైన జ్ఞాపకాలనుబట్టి, ఇష్టమైన ఆహారపు ఘమఘమ వాసన ఆకలిని కలిగిస్తుంది. కొంత సమయం మాత్రమే చేసే వ్యక్తిగత పఠనం కూడా అదేవిధంగా మనలో ఆత్మీయ ప్రభావం చూపగలదు. ఆత్మీయంగా రుచికరమైన కొన్ని ముద్దలు లోతైన సత్యాల కొరకైన ఆకలిని పెంచుతాయి. నేర్చుకోవడంతో వచ్చే సంతృప్తి యెహోవా వాక్యాన్ని మరి ఎక్కువగా పరిశోధించడానికి మనల్ని ప్రోత్సహించవచ్చు.
4 మీకు ప్రయోజనకరమైన దినచర్యను పెంపొందించుకోండి: కొందరు అప్పుడప్పుడు కొంత సమయం పఠించడానికి ఇష్టపడుతుండగా, మరి కొందరు ఒక సాయంకాల సమయమంతా వ్యక్తిగత పఠనానికి కేటాయించుకుంటారు. మీరు ఉదయ కాలమున ఎక్కువ ఏకాగ్రతను నిలపగలరని అనుకుంటే, మీరు ఉదయకాల అల్పాహారానికి ముందు కొంత చదవడానికి నిర్ణయించుకోవచ్చు. మీరు సాయంకాలం ఎక్కువ ఏకాగ్రత నిలపగలిగేటట్లయితే, పండుకోకముందు పఠించాలని మీరు నిర్ణయించుకోవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, ముఖ్యమైన సంగతేమంటే, క్రమంగాను, మీ అవసరాలకు తగిన మీ పట్టికను అనుసరించేవారిగాను ఉండాలి.
5 మనం వ్యక్తిగతంగా ఎక్కువ పఠించడానికి ప్రోత్సహించబడినప్పుడు, ఇప్పటికే ఖాళీలేని పట్టిక మనకుందని తెలపడానికి వేగిరపడతాము. అయినప్పటికీ, మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామని నిర్థారించే విషయంలో మనమందరమూ సత్యసంధులమై ఉండవలసిన అవసరముంది. ప్రతిరోజు దూరదర్శిని కార్యక్రమాలను చూడడంలోనే అనేక గంటలు గడుస్తున్నాయా? మన వ్యక్తిగత అభిరుచులను త్యాగం చేయడానికి మనం యిష్టపడుతున్నామా? మనం మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామని నిజంగా పరిశీలించడం, దైనందిన సమయాన్ని వ్యక్తిగత పఠనంలో మరింత ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూపుతుంది.—ఎఫె. 5:15, 16.
6 దేవుని వాక్య పఠనానికి అవిభక్తమైన అవధానాన్నివ్వవలసి ఉంది. ఆ సమయంలోనే మరో పని చేయడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనాలు తగ్గుతాయి. భుజించేటప్పుడు, రేడియో వినేటప్పుడు, దూరదర్శినిని తిలకించేటప్పుడు, మనం పఠించడానికి యిష్టపడుతున్నట్లయితే, నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నదానిలో మనం పూర్తిగా లీనంకాలేము. (1 తిమో. 4:15) కాబట్టి పరధ్యానాలను వదిలి పెట్టవలసిన అవసరముంది.—పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), పుటలు 33-4 చూడండి.
7 ప్రతిదినం బైబిలు ఉపదేశాన్ని పఠించడం, దాన్ని అన్వయించడం ముఖ్యం, ఎందుకంటే, ఆ విధంగానే మనం యెహోవా నుండి నడిపింపును పొందుతాము. ముద్రించిన పుటలోని సత్యాన్ని పొందాలని, దానిని మీ హృదయంలోనికి తీసుకోవాలని లక్ష్యముంచుకోండి. చదవడానికి, పునఃసమీక్షించడానికి, ఆత్మీయ విషయాలను ధ్యానించడానికి లభించే అవకాశం ఎంత చిన్నదైనా ఫర్వాలేదు, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి.—ద్వితీ. 6:6-8; కొలొ. 1:9-12.