ప్రభావవంతమైన వీధి సాక్ష్యమివ్వడంద్వారా ఆసక్తిగల వారిని కనుగొనుట
1 యేసు తన శిష్యులకు రాజ్య సువార్తను వినటానికి యోగ్యులెవ్వరో వారికోసం వెదకమని ఉపదేశించాడు. (మత్త. 10:11) అయినప్పటికిని, ఈరోజు చాలా ప్రాంతాలలో, ప్రజలను వారి గృహాలవద్ద కలుసుకోవడం రానురాను కష్టతరమవుతుంది. కాబట్టి, కలుసుకోలేక పోయిన యోగ్యులను చేరటానికి ఏమి చేయవచ్చు?
2 ఇంటింటి సువార్త పనిలో కలుసుకోలేని యోగ్యులను కనుగొనటానికి వీధిసాక్ష్యం ఒక ప్రభావవంతమైన మార్గం కాగలదు. బస్టాప్లలోను, అనుమతి లభించని అపార్ట్మెంటు భవంతుల దగ్గర, పబ్లిక్ పార్కులలోను, ప్రజలు వారి అనుదిన వ్యవహారాల్లో బయటకు వెళ్లే స్థలాలందు మనం వీధి సాక్ష్యం చేయవచ్చు.
3 వీధి సాక్ష్యాన్ని గూర్చి ప్రస్తావించినప్పుడు, కొందరు భయపడుతుండవచ్చు. వాళ్లు పిరికితనం వలననో లేదా రాజ్యవర్తమానంపట్ల అయిష్టత చూపే ప్రజలద్వారానో తిరస్కరింపబడతామని అనుకొనడం వలన తాము ఈ పనిలో భాగం వహించటానికి సంకోచిస్తారు. ఇలాంటి మనస్తాపనలు సాధారణంగా ఆధారంలేనివి. యింటింటి పరిచర్యకన్న యిది ఏమీ కష్టం కాదని ఈ పనిలో అనుభవంగల వారు చెబుతున్నారు. నిజానికి, చాలామంది ప్రజలు వీధిలో సాధారణంగా వేర్వేరు కారణాల నిమిత్తమై సమీపించటానికి యిష్టపడతారు. కొందరైతే తమ యింటివద్దకు వెళ్లి, సంభాషించిన దానికన్న ఎక్కువగా వినటానికి లేదా సంభాషించటానికి యిష్టపడతారని వారు కనుగొన్నారు. కాబట్టి మనం ‘ధైర్యము తెచ్చుకొన్న’ట్లైతే, మనం ఎదురుచూడని మంచి ఫలితాలను చూడగలము.—1 థెస్స 2:2.
4 వీధి సాక్ష్యాన్ని ఎలా ఎక్కువ ప్రభావవంతంగా చేయవచ్చు? దానికి మంచి సిద్ధపాటు ప్రాముఖ్యం. పత్రికలను ముందుగానే చదవండి, మీరు కలిసే ప్రజలతో ఆసక్తిగా మాట్లాడటానికి ఒకటి లేదా రెండు మాట్లాడదగిన అంశాలను ఎన్నుకొనండి. మీ అందింపు 30 సెకన్లులో ఉండటం మంచిది. ఇతరులతో వ్యక్తిగత పరిచయం కలిగియుండటం మన గమ్యం గనుక, ఎక్కువమంది ప్రజలు నడిచే దారిలో ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. మరొక ప్రచారకుడు దగ్గరలో నిలబడి ఉండుట మంచిదే అయిననూ సర్వసాధారణంగా వేరుగా పనిచేయటం శ్రేష్టం. ప్రచారకులు దగ్గరగా నిలబడి వారి సమయాన్ని వారిద్దరే మాట్లాడుకోవడంలో గడిపే అవకాశంవుంది గనుక, రాజ్య వర్తమానాన్ని వినే యోగ్యతగల వారిపై శ్రద్ధను నిలపటం కష్టమౌతుంది.
5 ఒక ప్రదేశంలో నిలబడి పత్రికలను ఊరకే చూపడంకన్న, స్వతహాగా ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడటమే ఫలవంతంగా ఉంటుంది. కనుదృష్టితో పరిచయ మేర్పర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు సంభాషణను ఆరంభించటానికి ప్రయత్నిస్తుండగా ఆప్యాయతగా, స్నేహపూర్వకంగా, నేరుగా మాట్లాడండి. కొంతమంది విషయంలోనయితే, ఆ వ్యక్తితో కలిసి మాట్లాడుతూ కొన్ని అడుగులు వేస్తూ, మీరు వారితో నడవాలి. అతడు ప్రతిస్పందిస్తే, పత్రికలను అందజేయవచ్చు. పత్రికలను నిరాకరిస్తే, మీరు ఒక కరపత్రాన్ని అందజేయవచ్చు.
6 సాధారణంగా ఒక ప్రశ్న లేదా వ్యాఖ్యానముతోకూడిన క్లుప్త అందింపును సిద్ధపర్చుకొనటం మంచిది. తద్వారా అది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తగిన విధంగా ప్రతిస్పందిస్తే, ఆ వ్యక్తి పేరు, చిరునామా, ఒకవేళ ఆయన టెలిఫోను నెంబరు తీసుకొనటానికి ప్రయత్నిస్తే, అతని ఆసక్తిని పెంచగలరు. మీరిలా చెప్పవచ్చు: “మీరు యింకా తెలుసుకొనటానికి యిష్టపడితే, నేను మీ గృహాన్ని దర్శించటానికి లేదా మరొక సాక్షిద్వారా దానిని ఏర్పాటుచేయడానికి ఆనందిస్తాను.”
7 ఒక సంఘ పెద్ద వీధి సాక్ష్యంలో పాల్గొనుచుండగా ఒక స్త్రీని కలిసి, ఆమెకు ఎన్నడును తన యింటివద్ద సాక్షులతో మాట్లాడే అవకాశము రాలేదని తెలిసికొన్నాడు. ఆమె ఒక పుస్తకాన్ని అంగీకరించి, తన యింటివద్ద తన అనుకూల సమయంలో ఒక సహోదరి దర్శించటానికి ఒప్పుకొంది. మనం వీధి సాక్ష్యాన్ని ఫలవంతముగా చేస్తే, మరియెక్కువ మంది యోగ్యులను మనం కనుగొని, వారికి సహాయపడగలము.—అపొ. 17:17.