క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
1 జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే మన పుస్తక పఠనం, యేసుక్రీస్తు యెడల మన మెప్పుదలను వృద్ధిచేసింది. తగినట్లుగానే, ఫిబ్రవరిలో ఆరంభమయ్యే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం, ఆయనను అనుసరించడం అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోవడానికి సహకరించే “మన గొప్ప మాదిరికర్తను సన్నిహితంగా అనుకరించండి” అనే అంశాన్ని వివరిస్తుంది.
2 వయస్సుతోను, సత్యంలో మనం ఎంతకాలమున్నామను దానితోను సంబంధంలేకుండా, సమావేశానికి హాజరయ్యే వారంతా మరెక్కువగా క్రీస్తునుపోలి నడచుకోవడానికి ప్రోత్సహింపబడతారు. కార్యక్రమంలోని ఒక భాగం ప్రాముఖ్యంగా యౌవనులకు సలహాలిచ్చేదైయుంటుంది. చదువు, వినోదము, ఐశ్వర్యాసక్తికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి అది వారిని సంసిద్ధులను చేస్తుంది. లోక ప్రభావాన్ని ఎలా ఎదుర్కొనాలో, ఒకడు క్రీస్తును ఎలా పోలి నడుచుకోవాలో ఉన్నతపరచే ప్రసంగాలు, అనుభవాలు, ప్రదర్శనలు అందులో ఉంటాయి.—1 పేతు. 2:21.
3 క్రొత్తగా సమర్పించుకున్నవారు బాప్తిస్మం తీసుకోవడంద్వారా తాము క్రీస్తు అనుచరులమని బహిరంగంగా ప్రకటించే అవకాశాన్ని పొందుతారు. బాప్తిస్మ కార్యక్రమానికి ముందు ఆ అంశంమీద ఉత్తేజకరమగు లేఖనచర్చ ఉంటుంది. ప్రత్యేక సమావేశ దినాన బాప్తిస్మం పొందాలని కోరుకునేవారు తమ కోరికను తమ సంఘాధ్యక్షునికి తగినంత వ్యవధి ఉండగానే తెలియజేయాలి, తద్వారా ఆయన బాప్తిస్మం తీసుకునే వారి కొరకు నిర్దేశింపబడిన ప్రశ్నలను చూసే సంఘపెద్దలను ఏర్పాటుచేయడానికి తగినంత సమయం ఉంటుంది.
4 అతిథిగా వచ్చిన ప్రసంగీకుడు “మన గొప్ప మాదిరికర్తను అనుకరించుట—మనల్ని దేనికి నడిపిస్తుంది?” అనే ముఖ్య ప్రసంగాన్నిస్తాడు. ప్రోత్సాహకరమైన, విశ్వాసాన్ని బలపర్చే ఈ కార్యక్రమానికి ఆసక్తిగలవారందరినీ నిశ్చయంగా ఆహ్వానించండి. మన గొప్ప మాదిరికర్తయగు యేసుక్రీస్తును అనుసరించుటకంటే గొప్పదైన, ఎక్కువ ఆశీర్వాదకరమైన జీవన విధానం మరి ఏదియు ఉండజాలదు.—మత్త. 19:27-29.