యెహోవా యథార్థతకు, క్షమాగుణానికి ఉన్న విలువను గుర్తించండి
“ప్రభువా [“యెహోవా,” NW], నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు. నీకు మొఱ్ఱపెట్టు వారందరియెడల కృపాతిశయము గలవాడవు.”—కీర్త. 86:5.
1, 2. (ఎ) యథార్థత, క్షమాగుణం ఉన్న స్నేహితుల్ని మనమెందుకు అభిమానిస్తాం? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
మీరు ఎవరిని నిజమైన నేస్తం అంటారు? “నేనైతే, అన్ని వేళలా అండగా ఉంటూ పొరపాటు చేసినప్పుడు క్షమించే వ్యక్తినే నిజమైన నేస్తం అంటాను” అని యాష్లీ అనే క్రైస్తవ సహోదరి అంది. యథార్థత, క్షమాగుణం ఉన్న స్నేహితుల్ని మనమందరం అభిమానిస్తాం. వాళ్లు మనకు ధైర్యాన్ని ఇస్తారు, మనల్ని ప్రేమిస్తున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారు.—సామె. 17:17.
2 యథార్థతను, క్షమాగుణాన్ని చూపించే విషయంలో యెహోవాకు సాటిరాగల స్నేహితుడు ఎవరుంటారు! అది కీర్తనకర్త పలికిన ఈ మాటలకు సరిగ్గా సరిపోతుంది: “ప్రభువా [“యెహోవా,” NW], నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు. నీకు మొఱ్ఱపెట్టు వారందరియెడల కృపాతిశయము [లేదా, ‘యథార్థ ప్రేమ’] గలవాడవు.” (కీర్త. 86:5) యథార్థతను, క్షమాగుణాన్ని చూపించడం అంటే ఏమిటి? ఆ చక్కని లక్షణాల్ని యెహోవా ఎలా చూపిస్తాడు? వాటిని ఆయన చూపించినట్లు మనం ఎలా చూపించవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకుంటే, ప్రియ స్నేహితుడైన యెహోవా పట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది. అంతేకాక, ఇతరులతో మనకున్న స్నేహాలు కూడా బలపడతాయి.—1 యోహా. 4:7, 8.
యెహోవా యథార్థవంతుడు
3. యథార్థంగా ఉండడం అంటే ఏమిటి?
3 భక్తి, విశ్వసనీయత, సడలని విధేయతల సమాహారమే యథార్థత. యథార్థవంతుడైన స్నేహితునికి చంచల మనస్తత్వం ఉండదు. కానీ, క్లిష్ట పరిస్థితుల్లో సహితం ప్రేమగా ఓ వ్యక్తికి (లేదా, ఏదైనా ఓ విషయానికి) హత్తుకొని ఉండే స్వభావం ఉంటుంది. నిశ్చయంగా యెహోవా మాత్రమే అత్యుత్తమ స్థాయిలో ‘యథార్థవంతుడు.’—ప్రక. 16:5, NW.
4, 5. (ఎ) యెహోవా యథార్థతను ఎలా చూపిస్తాడు? (బి) దేవుడు యథార్థతతో చేసిన పనుల గురించి ఆలోచించడం వల్ల మనమెలా బలాన్ని పొందవచ్చు?
4 యథార్థతను యెహోవా ఎలా చూపిస్తాడు? ఆయన తన నమ్మకమైన ఆరాధకులను ఎన్నడూ ఎడబాయడు. అలాంటి ఆరాధకుడైన దావీదు రాజు, యెహోవా యథార్థత గురించి రాశాడు. (2 సమూయేలు 22:26 చదవండి.) దావీదు కష్టాలు అనుభవిస్తున్న కాలంలో యెహోవా యథార్థంగా ఆయనను నడిపించాడు, కాపాడాడు, విడిపించాడు. (2 సమూ. 22:1) యెహోవా తన యథార్థతను మాటల్లోనే కాక చేతల్లో కూడా చూపిస్తాడని దావీదుకు తెలుసు. ఇంతకీ యెహోవా దావీదు పట్ల ఎందుకు యథార్థంగా ఉన్నాడు? ఎందుకంటే, దావీదు కూడా ‘యథార్థవంతుడే.’ తన ఆరాధకుల యథార్థతను యెహోవా ఎంతో అమూల్యంగా ఎంచుతాడు, దానికి ప్రతిఫలంగా వాళ్లపట్ల ఆయన కూడా యథార్థంగా ఉంటాడు.—సామె. 2:6-8.
5 యెహోవా యథార్థతతో చేసిన పనుల గురించి ఆలోచించడం వల్ల మనం బలాన్ని పొందవచ్చు. రీడ్ అనే ఓ నమ్మకమైన సహోదరుడు ఇలా అన్నాడు: “కష్టకాలాల్లో దావీదుతో యెహోవా ఎలా వ్యవహరించాడో చదివినప్పుడు నాకు ఎంతో ఊరట కలుగుతుంది. యెహోవా దావీదును అన్నివేళలా కాపాడాడు. సౌలు నుండి పారిపోతూ అరణ్యాల్లో, గుహల్లో తలదాచుకుంటున్నప్పుడు కూడా కాపాడాడు. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది! నేను యెహోవాపట్ల యథార్థంగా ఉన్నంతకాలం, పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత నిరాశాజనకంగా ఉన్నా ఆయన నాకు అండగా ఉంటాడు.” నిశ్చయంగా మీకూ అలాగే అనిపిస్తుండవచ్చు.—రోమా. 8:38, 39.
6. యెహోవా ఇంకా ఏయే విధాలుగా యథార్థత చూపిస్తాడు? దానివల్ల ఆయన ఆరాధకులు ఎలా ప్రయోజనం పొందుతారు?
6 యెహోవా ఇంకా ఏయే విధాలుగా యథార్థత చూపిస్తాడు? ఆయన తన ప్రమాణాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే” అని యెహోవా మనకు అభయమిస్తున్నాడు. (యెష. 46:4) తప్పొప్పుల విషయంలో, మార్పులేని తన ప్రమాణాల ఆధారంగానే యెహోవా ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకుంటాడు. (మలా. 3:6) అంతేకాక, తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా యెహోవా తన యథార్థతను చూపిస్తాడు. (యెష. 55:11) యెహోవా చూపించే యథార్థత వల్ల తన నమ్మకమైన ఆరాధకులందరూ ప్రయోజనం పొందుతారు. ఎలా? తన ప్రమాణాల ప్రకారం జీవించడానికి మనం శాయశక్తులా కృషి చేస్తే, మనల్ని ఆశీర్వదిస్తానని చేసిన వాగ్దానాన్ని యెహోవా నిలబెట్టుకుంటాడని మనం నమ్మవచ్చు.—యెష. 48:17, 18.
యెహోవాలా యథార్థత చూపించండి
7. మనం యెహోవాలా యథార్థత చూపించే ఓ మార్గం ఏమిటి?
7 మనం యెహోవా చూపించినట్లు యథార్థతను ఎలా చూపించవచ్చు? క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడం అందుకు ఓ మార్గం. (సామె. 3:27) ఉదాహరణకు ఆరోగ్య సమస్యల వల్ల, కుటుంబ వ్యతిరేకత వల్ల లేదా వ్యక్తిగత వైఫల్యాల వల్ల నిరుత్సాహంలో ఉన్న తోటి విశ్వాసి ఎవరైనా మీకు తెలుసా? “ఆదరణయైన మధుర వచనములతో” ప్రోత్సహించడానికి చొరవ తీసుకోగలరేమో ఆలోచించండి. (జెక. 1:13)a అలా చేస్తే, మనం ‘సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండే’ యథార్థమైన ప్రాణ స్నేహితులమని నిరూపించుకుంటాం.—సామె. 18:24.
8. జీవిత భాగస్వామి పట్ల ఎలా యథార్థంగా ఉండవచ్చు? ఇంకా ఏయే విధాలుగా యథార్థత చూపించవచ్చు?
8 మన ప్రియమైన వాళ్లకు నమ్మకంగా ఉండడం ద్వారా కూడా మనం యెహోవాలా యథార్థతను చూపించవచ్చు. ఉదాహరణకు మీకు పెళ్లయి ఉంటే, మీ భాగస్వామికి నమ్మకంగా ఉండాలని మీకు తెలుసు. (సామె. 5:15-18) కాబట్టి, వ్యభిచారానికి నడిపించే తొలి తప్పటడుగును కూడా మీరు వేయరు. (మత్త. 5:28) అంతేకాక ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, పుకార్లు వ్యాప్తి చేయకుండా, అలాగే వాటిని వినకుండా ఉండడం ద్వారా మనం మన తోటి విశ్వాసుల పట్ల యథార్థంగా ఉండవచ్చు.—సామె. 12:18.
9, 10. (ఎ) మనం ముఖ్యంగా ఎవరి పట్ల యథార్థంగా ఉండాలి? (బి) యెహోవా ఆజ్ఞలకు లోబడడం అన్నివేళలా ఎందుకంత తేలిక కాదు?
9 అన్నిటికన్నా ముఖ్యంగా మనం యెహోవాపట్ల యథార్థంగా ఉండాలి. ఎలా? యెహోవా ప్రేమించే వాటిని ప్రేమిస్తూ, ఆయన ద్వేషించే వాటిని ద్వేషిస్తూ, అన్ని విషయాల్లో ఆయనలా ఆలోచించడానికి ప్రయత్నిస్తూ, ఆ ఆలోచనకు తగినట్లు ప్రవర్తించడం ద్వారా మనమలా ఉండవచ్చు. (కీర్తన 97:10 చదవండి.) మనం ఎంత ఎక్కువగా యెహోవాలా ఆలోచించడానికి ప్రయత్నిస్తే, అంతెక్కువగా ఆయన ఆజ్ఞలకు లోబడడానికి మొగ్గుచూపుతాం.—కీర్త. 119:104.
10 యెహోవా ఆజ్ఞలకు లోబడడం అన్నివేళలా అంత తేలిక కాదని మనకు తెలుసు. మన యథార్థతను కాపాడుకోవడానికి మనం కష్టపడాల్సి రావచ్చు. ఉదాహరణకు, కొంతమంది క్రైస్తవులకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా, యెహోవా ఆరాధకుల్లో తగిన జోడీ దొరక్కపోతుండవచ్చు. (1 కొరిం. 7:39) ఓ అవివాహిత సహోదరికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో, అవిశ్వాసులైన సహోద్యోగులు ఎవరో ఒక అబ్బాయిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అప్పటికే ఆ సహోదరి ఒంటరితనంతో సతమతమౌతుండవచ్చు. అయినా, యెహోవా పట్ల యథార్థంగా ఉండాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తుంది. యథార్థత చూపిస్తున్న అలాంటి ఆదర్శప్రాయులను మనం అభినందించమా? క్లిష్ట పరిస్థితుల్లో కూడా నమ్మకంగా కొనసాగే వాళ్లకు యెహోవా తప్పక ప్రతిఫలమిస్తాడు.—హెబ్రీ. 11:6.
“సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.”—సామె. 18:24 (7వ పేరా చూడండి)
‘ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.’—ఎఫె. 4:32, NW (16వ పేరా చూడండి)
యెహోవా క్షమాగుణం గలవాడు
11. క్షమించడం అంటే ఏమిటి?
11 యెహోవాకున్న అత్యంత ఆకర్షణీయమైన లక్షణాల్లో క్షమాగుణం ఒకటి. ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇంతకీ క్షమించడం అంటే ఏమిటి? మనల్ని నొప్పించిన వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపించినప్పుడు అతణ్ణి/ఆమెను మన్నించడమే క్షమించడం. అలాగని క్షమించడం అంటే, అవతలి వ్యక్తి చేసిన తప్పును చూసీచూడనట్లు వదిలేయడమో లేదా దాన్ని పట్టించుకోకపోవడమో కాదు. కానీ, కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవాలి. నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించేవాళ్లను యెహోవా ‘క్షమించడానికి సిద్ధంగా’ ఉంటాడని లేఖనాలు బోధిస్తున్నాయి.—కీర్త. 86:5.
12. (ఎ) యెహోవా క్షమాగుణాన్ని ఎలా చూపిస్తాడు? (బి) పాపాలు ‘తుడిచివేయబడతాయి’ అంటే అర్థమేమిటి?
12 యెహోవా క్షమాగుణాన్ని ఎలా చూపిస్తాడు? యెహోవా ఎవరినైనా క్షమిస్తే, వాళ్లను “బహుగా క్షమించును.” ఆయన పూర్తిగా క్షమిస్తాడు, శాశ్వతంగా క్షమిస్తాడు. (యెష. 55:7) ఇంతకీ యెహోవా ఓ వ్యక్తిని పూర్తిగా క్షమిస్తాడని మనకెలా తెలుసు? అపొస్తలుల కార్యములు 3:19, 20లో ఉన్న అభయాన్ని గమనించండి. (చదవండి.) అపొస్తలుడైన పేతురు తన శ్రోతల్ని “మారుమనస్సునొంది తిరుగుడి” అని అర్థించాడు. ఓ పాపి నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించినప్పుడు తాను చేసిన తప్పు విషయంలో తీవ్రంగా బాధపడతాడు. దాన్ని మళ్లీ చేయకూడదనే కృతనిశ్చయాన్ని కూడా చూపిస్తాడు. (2 కొరిం. 7:10, 11) అంతేకాక, ఆ పాపి తన తప్పుడు ప్రవర్తనను విడిచిపెట్టి, దేవునికి నచ్చే పనులు చేసేలా “మారుమనస్సు” పొందుతాడు. పేతురు ప్రసంగాన్ని విన్న శ్రోతలు అలాంటి నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తే వచ్చే ఫలితం ఏమిటి? ‘వాళ్ల పాపాలు తుడిచివేయబడతాయి’ అని పేతురు అన్నాడు. “తుడిచివేయబడు” అనే పదం “చెరిపివేయు, రూపుమాపు” అని అర్థమిచ్చే గ్రీకు పదం నుండి వచ్చింది. కాబట్టి, యెహోవా ఎవరినైనా క్షమిస్తే, వాళ్ల వ్యక్తిత్వమనే పలక మీద నుండి పాపపు మరకను తుడిచేస్తాడు. వాళ్లను పూర్తిగా క్షమిస్తాడు.—హెబ్రీ. 10:22; 1 యోహా. 1:7.
13. “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అనే మాట మనకు ఏ భరోసా ఇస్తుంది?
13 యెహోవా ఓ పాపాన్ని ఒకసారి క్షమించాడంటే అది శాశ్వతంగా క్షమించినట్లేనని మనకెలా తెలుసు? విమోచన క్రయధన బలిపై విశ్వాసాన్ని చూపించే వాళ్ల పాపాలకు నిజమైన క్షమాపణ దొరికే అవకాశాన్ని కల్పించేలా, దేవుడు అభిషిక్తులతో చేసిన కొత్త నిబంధన గురించి యిర్మీయా చెప్పిన ప్రవచనాన్ని గమనించండి. (యిర్మీయా 31:34 చదవండి.) “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని యెహోవా అన్నాడు. అలా, తాను ఒకసారి మన పాపాల్ని క్షమించాడంటే, వాటిని బట్టి భవిష్యత్తులో ఎన్నడూ మనల్ని శిక్షించననే అభయాన్ని యెహోవా మనకిస్తున్నాడు. యెహోవా మనల్ని మళ్లీ మళ్లీ నిందించడానికి లేదా శిక్షించడానికి మన పాపాల్ని అదేపనిగా పైకి తోడడు. కానీ, మనల్ని క్షమించి వాటిని శాశ్వతంగా మర్చిపోతాడు.—రోమా. 4:7, 8.
14. యెహోవా క్షమాగుణం గురించి ధ్యానించడం వల్ల మనం ఎలా ఓదార్పు పొందవచ్చు? ఓ అనుభవం చెప్పండి.
14 యెహోవా క్షమాగుణం గురించి ధ్యానించడం వల్ల మనం ఓదార్పు పొందవచ్చు. ఓ అనుభవాన్ని చూద్దాం. ఇలేన్ అనే సహోదరిని ఎన్నో ఏళ్ల క్రితం సంఘం నుండి బహిష్కరించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెను సంఘంలోకి తిరిగి చేర్చుకున్నారు. ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “యెహోవా నన్ను క్షమించాడనే నమ్మకం నాకు కుదిరిందని నాలో నేను అనుకునేదాన్ని, అదే ఇతరులకు కూడా చెప్పేదాన్ని. అయినా, ఆయన నాకు దూరంగా ఉన్నాడనీ లేదా నాకన్నా ఇతరులు ఆయనకు ఎక్కువ సన్నిహితంగా ఉన్నారనీ, వాళ్లకు ఆయనతో మంచి సంబంధం ఉందనీ నాకు అనిపించేది.” అయితే, బైబిల్లో యెహోవా క్షమాగుణాన్ని వర్ణించే కొన్ని పదచిత్రాలను చదివి, ధ్యానించడం వల్ల ఇలేన్ ఓదార్పు పొందింది. ఆమె ఇంకా ఇలా అంది: “దానివల్ల, యెహోవా నామీద చూపిస్తున్న ప్రేమాప్యాయతలను మునుపెన్నటికన్నా ఎక్కువగా రుచి చూశాను.” ఆమెకు ప్రత్యేకంగా ఈ విషయం బాగా నచ్చింది: “యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు, ఆ పాపపు మరకలు జీవితాంతం అలాగే ఉండిపోతాయని మనం బాధపడనక్కర్లేదు.”b ఇలేన్ ఇంకా ఇలా చెప్పుకొచ్చింది: “యెహోవా పూర్తిగా క్షమించగలడనే నమ్మకం నేను చూపించలేదని నాకు అర్థమైంది. అంతేకాక, నా జీవితమంతా ఆ పాపపు భారాన్ని మోయాల్సిందేనని నేను పొరబడినట్లు గ్రహించాను. ఆ భావాలను తీసేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని నాకు తెలుసు. అయినా యెహోవాకు మరింత సన్నిహితం కాగలనని నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది. పైగా, ఓ పెద్ద భారం తొలగిపోయినట్లుగా ఉంది.” ఎంతటి ప్రేమగల, క్షమాగుణం గల దేవుణ్ణి మనం సేవిస్తున్నామో కదా!—కీర్త. 103:9.
యెహోవాలా క్షమాగుణం చూపించండి
15. క్షమాగుణాన్ని యెహోవా చూపించినట్లు మనమెలా చూపించవచ్చు?
15 నిజమైన పశ్చాత్తాపం చూపించినప్పుడల్లా ఇతరుల్ని క్షమించడం ద్వారా మనం యెహోవాలా క్షమాగుణం చూపించవచ్చు. (లూకా 17:3, 4 చదవండి.) యెహోవా మనల్ని క్షమించాడంటే, మన పాపాల్ని మళ్లీ పైకి తోడకుండా వాటిని మర్చిపోతాడని గుర్తుచేసుకోండి. అలాగే మనం కూడా ఇతరుల్ని ఒకసారి క్షమించామంటే, వాళ్ల తప్పులను మళ్లీ ఎన్నడూ పైకి తోడకుండా వాటిని మర్చిపోగలం.
16. (ఎ) క్షమించడం అంటే తప్పును చూసీచూడనట్లు వదిలేయడమని లేదా అన్యాయాన్ని సహించడమని అర్థమా? వివరించండి. (బి) దేవుడు మనల్ని క్షమించాలంటే మనమేమి చేయాలి?
16 క్షమించడం అంటే తప్పును చూసీచూడనట్లు వదిలేయడమో లేదా అన్యాయాన్ని సహించడమో కాదు. కానీ కోపాన్ని మనసులో నుండి తీసేసుకోవాలి. అయితే, ముఖ్యంగా యెహోవా మనల్ని క్షమించాలంటే మనం కూడా ఆయనలాగే ఇతరులను క్షమించాలి. (మత్త. 6:14, 15) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా మనం “మంటివారమని” జ్ఞాపకం ఉంచుకొని మనల్ని అర్థంచేసుకుంటాడు. (కీర్త. 103:14) కాబట్టి, సహానుభూతితో ఇతరుల పొరపాట్లను సహిస్తూ, వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తే బావుంటుంది కదా?—ఎఫె. 4:32; కొలొ. 3:13.
ఇతరుల్ని క్షమించడం కోసం మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం (17వ పేరా చూడండి)
17. తోటి విశ్వాసులెవరైనా మనల్ని నొప్పించినప్పుడు, వాళ్లను క్షమించడానికి మనకేది సహాయం చేస్తుంది?
17 క్షమించడం అన్నివేళలా అంత సులభమేమీ కాదు. మొదటి శతాబ్దంలోని కొందరు అభిషిక్తులకు కూడా తమ మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించుకోవడానికి కష్టమై ఉంటుంది. (ఫిలి. 4:2) తోటి విశ్వాసులెవరైనా మనల్ని నొప్పించినప్పుడు, వాళ్లను క్షమించడానికి మనకేది సహాయం చేస్తుంది? యోబు ఏమి చేశాడో చూడండి. కపట స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఆయన మీద నిరాధారమైన అభియోగాలు మోపినప్పుడు యోబు ఎంతో నొచ్చుకున్నాడు. (యోబు 10:1; 19:2) చివరకు యెహోవా వాళ్లను గద్దించాడు. యోబు దగ్గరికి వెళ్లి, తమ పాపాలకు బలి అర్పించమని దేవుడు వాళ్లకు చెప్పాడు. (యోబు 42:7-9) అయితే, యోబును కూడా ఓ పని చేయమని దేవుడు చెప్పాడు. ఏంటది? వాళ్ల తరఫున ప్రార్థన చేయమని యెహోవా యోబుకు చెప్పాడు. యోబు అలాగే చేశాడు, ఆయన చూపించిన క్షమాగుణాన్ని బట్టి యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. (యోబు 42:10, 12, 16, 17 చదవండి.) అందులో మనకు ఏ పాఠం ఉంది? మనల్ని నొప్పించిన వాళ్ల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, మన కోపం చల్లారవచ్చు.
యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తిస్తూ ఉండండి
18, 19. యెహోవా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పట్ల మనకున్న అభిమానాన్ని మనమెలా పెంచుకుంటూ ఉండవచ్చు?
18 యెహోవా ప్రేమగల వ్యక్తిత్వంలోని వేర్వేరు అంశాలను పరిశీలించడం మనకు ఉత్తేజాన్నిచ్చింది. యెహోవాకున్న స్నేహశీలత, నిష్పక్షపాతం, ఔదార్యం, అర్థంచేసుకునే మనస్తత్వం, యథార్థత, క్షమాగుణం గురించి మనం చూశాం. అయినా, మనం యెహోవా లక్షణాల గురించి తెలుసుకుంది రవ్వంతే. యెహోవా గురించి నేర్చుకునే ఆనందం మనకు నిరంతరం ఉంటుంది. (ప్రసం. 3:11) “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము” అని రాసిన అపొస్తలుడైన పౌలుతో మనం ఏకీభవిస్తాం. మనం ఇప్పటివరకు పరిశీలించిన ప్రేమ విషయంలో, మరితర ఆరు లక్షణాల విషయంలో కూడా మన మాట అదేనని వేరే చెప్పాలా?—రోమా. 11:33.
19 యెహోవా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పట్ల మనకున్న అభిమానాన్ని పెంచుకుంటూ ఉందాం. ఆయన లక్షణాల గురించి తెలుసుకొని, వాటి గురించి ధ్యానించి, మన జీవితంలో వాటిని చూపించడం ద్వారా మనమలా చేయవచ్చు. (ఎఫె. 5:1) అలా చేస్తుండగా, ఇలా పాడిన కీర్తనకర్తతో మనం మరింత సంతోషంగా గొంతు కలుపుతాం: “నాకైతే దేవుని పొందు [“దేవునికి దగ్గరవ్వడం,” NW] ధన్యకరము.”—కీర్త. 73:28.
a ఈ విషయంలో సహాయకరమైన సలహాల కోసం, కావలికోట జనవరి 15, 1995 సంచికలోని “మీరు ఎవరినైనా ఇటీవలనే ప్రోత్సహించారా?” అనే ఆర్టికల్ని, అలాగే కావలికోట ఏప్రిల్ 1, 1995 సంచికలోని “ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పుట—ఎట్లు?” అనే ఆర్టికల్ని చూడండి.