ధూపం వేయడానికి సత్యారాధనలో స్థానముందా?
“దేవుళ్ళకు పరిమళాలంటే ఎంతో ఇష్టం.” అది ప్రాచీన ఐగుప్తీయులు చెప్పుకునే సాధారణ సామెత. ధూపం వేయడం వారి ఆరాధనలో ముఖ్యమైన భాగంగా ఉండేది. దేవుళ్ళు తమకు సమీపంగా ఉన్నారనే నమ్మకంతో ఐగుప్తీయులు ప్రతీరోజు తమ ఆలయాల్లో, గృహాల్లోని పూజాపీఠాల వద్ద, వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ధూపం వేసేవారు. ఇతర దేశాల్లో కూడా అలాంటి ఆచారాలు ఉండేవి.
ధూపద్రవ్యము దేనితో తయారుచేయబడుతుంది? అది సువాసనగల చెట్ల జిగుర్లతో అంటే సాంబ్రాణి, గుగ్గిలం లాంటి జిగుర్లతో తయారుచేయబడుతుంది. ఆ జిగుర్లు మెత్తగా పొడి చేయబడిన తర్వాత దాన్ని పరిమళ పదార్థాలు, చెట్ల బెరడు, పూలు వంటివాటితో కలిపి నిర్దిష్టమైన ఉపయోగాల కోసం ప్రత్యేకమైన పరిమళాలు తయారుచేయబడతాయి.
ధూపద్రవ్యాలు ప్రాచీన కాలాల్లో ఎంతో కోరదగినవిగా, ఎంతో విలువైనవిగా ఉండేవి. అందుకే, వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు వ్యాపారంలో ప్రముఖమైన వస్తువులుగా మారాయి. వర్తక మార్గాల్లో ప్రయాణించే వ్యాపారుల గుంపులు ఈ పదార్థాలను దూరదేశాల నుండి తీసుకువచ్చేవి. యాకోబు చిన్న కుమారుడైన యోసేపు, ‘ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో గిలాదునుండి వస్తున్న’ ఇష్మాయేలీయులైన వర్తకులకు అమ్మబడ్డాడని మీకు గుర్తుండవచ్చు. (ఆదికాండము 37:25) ధూపద్రవ్యాల గిరాకీ ఎంతగా పెరిగిపోయిందంటే సాంబ్రాణి వ్యాపారం జరిగే వర్తక మార్గం ఆసియాకు యూరప్‌కు మధ్య ప్రయాణ మార్గాలు ఏర్పడడానికి దారితీసింది, ఈ మార్గాన్ని ధూపద్రవ్యాల వర్తకులు ప్రారంభించారనడంలో సందేహం లేదు.
నేడు అనేక మతాల్లో లాంఛనాల్లో, ఆచారాల్లో ధూపద్రవ్యాలు ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి. అంతేకాక కేవలం ధూపద్రవ్యాల ఆహ్లాదకరమైన పరిమళాన్ని ఆనందించడానికి తమ ఇళ్ళలో ధూపం వేయడానికి ఇష్టపడే ప్రజల సంఖ్య అధికమవుతోంది. ధూపం వేయడాన్ని క్రైస్తవులు ఎలా దృష్టించాలి? దాన్ని ఆరాధనలో ఉపయోగించడం దేవునికి అంగీకారయోగ్యమైనదేనా? ఈ విషయంలో మనకు బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.
“యెహోవాకు ప్రతిష్ఠితమైనది”
ప్రాచీన ఇశ్రాయేలీయుల్లో గుడారం వద్ద యాజకులు నిర్వర్తించే విధుల్లో ధూపం వేయడం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండేది. మాక్‌క్లింటాక్ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా నివేదిస్తోంది: “నిజానికి ధూపం వేయడం ఒక ఆరాధనా క్రియని, పవిత్రమైన అర్పణ అని హెబ్రీయులు ఎంత ప్రగాఢంగా విశ్వసించేవారంటే వారు ధూపద్రవ్యాలను దానికి తప్ప మరిదేనికీ ఉపయోగించినట్లు మనం ఎక్కడా చదవము.”
ఆలయగుడారము వద్ద ధూపం వేయడానికి నాలుగు రకాల పదార్థాలను కలిపి ధూపద్రవ్యముగా తయారుచేయమని యెహోవా దేవుడు సూచించాడు: “నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసికొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను.” (నిర్గమకాండము 30:34-36) యూదుల్లోని రబ్బీలు ఆలయంలో ఉపయోగించడానికి ఆ తర్వాత ఆ ధూపద్రవ్యములో వేరే పదార్థాలు కూడా కలిపారని విద్వాంసులు సూచిస్తున్నారు.
గుడారము దగ్గర వేయబడే ధూపం పవిత్రమైనది, అది ప్రత్యేకించి దేవుని ఆరాధనలో మాత్రమే ఉపయోగించబడేది. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.” (నిర్గమకాండము 30:37, 38) ధూపం వేయడానికి ప్రతిష్ఠించబడిన బలిపీఠంపై యాజకులు రోజుకు రెండుసార్లు ధూపం వేసేవారు. (2 దినవృత్తాంతములు 13:11) ప్రాయశ్చిత్త దినమున, ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో ధూపం వేసేవాడు—లేవీయకాండము 16:12, 13.
అయితే దేవుడు అన్ని ధూపార్పణలనూ అంగీకరించేవాడు కాదు. యాజకులు కాని వారు తాము యాజకులమన్నట్లు అహంకారంతో ధూపం వేసినప్పుడు ఆయన వారిని శిక్షించాడు. (సంఖ్యాకాండము 16:16-18, 35-40; 2 దినవృత్తాంతములు 26:16-20) యూదా జనాంగం ఒకవైపున అబద్ధపు ఆరాధనలో భాగం వహిస్తూ తమ చేతులను రక్తంతో నింపుకుంటూనే మరోవైపున యెహోవాకు ధూపార్పణలు చేసినప్పుడు అవి యెహోవాకు అభ్యంతరకరంగా ఉండేవి. వారి వేషధారణ కారణంగా యెహోవా ఇలా ప్రకటించాడు: “అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము.” (యెషయా 1:13, 15) యెహోవా సూచించినట్లు ఆరాధించడంలో ఇశ్రాయేలీయులు ఎంత నిర్లక్ష్యంగా తయారయ్యారంటే వారు ఆలయాన్ని మూసివేసి ఇతర బలిపీఠాలపై ధూపం వేయడం ప్రారంభించారు. (2 దినవృత్తాంతములు 28:24, 25) ఆ తర్వాత పవిత్రమైన ధూపద్రవ్యము అబద్ధ దేవుళ్ళ భ్రష్టమైన ఆరాధనలో కూడా ఉపయోగించబడింది. ఇలాంటి ఆచారాలు యెహోవాకు తిరుగుబాటుకరంగా ఉండేవి.—యెహెజ్కేలు 16:2, 17, 18.
ధూపద్రవ్యాలు, తొలి క్రైస్తవులు
యేసు సా.శ. 33వ సంవత్సరంలో క్రొత్త నిబంధన ప్రారంభించినప్పుడు, పవిత్రమైన ధూపార్పణ చేయాలని యాజకులకివ్వబడిన ఆజ్ఞతోపాటు ధర్మశాస్త్ర నిబంధన కూడా ముగిసిపోయింది. (కొలొస్సయులు 2:13) తొలి క్రైస్తవులు మతపరమైన కార్యకలాపాల్లో ధూపం వేసేవారని తెలియజేసే నివేదికలు లేవు. ఈ విషయం గురించి మాక్‌క్లింటాక్ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “[తొలి క్రైస్తవులు] ధూపద్రవ్యాలను ఉపయోగించలేదనడంలో సందేహం లేదు. నిజానికి వాటిని ఉపయోగించడం అన్యమతానికి సంబంధించినది . . . ఒక భక్తుడు చిటికెడు ధూపద్రవ్యమును అన్యమత బలిపీఠం మీద వేస్తే అది ఆరాధనా క్రియగానే పరిగణించబడేది.”
తొలి క్రైస్తవులు రోమా చక్రవర్తి “దైవత్వమును” అంగీకరించేందుకు ధూపం వేయడానికి కూడా నిరాకరించేవారు, అలా చేయడం వల్ల వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయినా కూడా వారు నిరాకరించేవారు. (లూకా 4:8; 1 కొరింథీయులు 10:14, 20) ఆ రోజుల్లో ధూపద్రవ్యములు విగ్రహారాధనలో ఉపయోగించబడడం వల్ల తొలి క్రైస్తవులు ధూపద్రవ్యముల వ్యాపారం కూడా చేయకపోవడం అర్థంచేసుకోదగినదే.
నేడు ధూపం వేయడం
నేడు ధూపద్రవ్యాలు ఎలా ఉపయోగించబడుతున్నాయి? క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన అనేక చర్చీల్లో లాంఛనాలు, ఆచారకర్మలు జరిగినప్పుడు ధూపం వేయబడుతుంది. ఆసియాలోని చాలా కుటుంబాలు ఆలయాల్లో లేదా తమ గృహాల్లోని పూజాపీఠాల ఎదుట తమ దేవుళ్ళను పూజించడానికి, చనిపోయినవారి క్షేమం కోసం ధూపం వేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో ధూపద్రవ్యాలు ధూపం వేయడానికి, స్వస్థపరచడానికి, శుద్ధి చేయడానికి, కాపుదలకు వేర్వేరు విధాలుగా ఉపయోగించబడతాయి.
ఇటీవలే ధూపద్రవ్యాలు మళ్ళీ ప్రఖ్యాతిగాంచాయి, ఏ మతానికీ చెందనివారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. కొంతమంది ధ్యానించేటప్పుడు ధూపం వేస్తారు. “మనస్సు చైతన్యపు అద్భుత స్థాయిలను” చేరుకోవడానికి, భౌతిక ప్రపంచానికి అతీతమైన “ప్రత్యేక శక్తులను సొంతం చేసుకోవడానికి” ధూపద్రవ్యాలను ఉపయోగించమని ఒక గైడ్‌బుక్ సలహా ఇస్తోంది. జీవిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునేందుకు “మానవాతీత ప్రాణులను” సంప్రదించడానికి ధూపం వేసే ఆచారాలను పాటించమని కూడా ఆ గైడ్‌బుక్ సలహా ఇస్తోంది. ఇలాంటి ఆచారాల్లో క్రైస్తవులు భాగం వహించవచ్చా?
అబద్ధ మత ఆచారాలను స్వచ్ఛమైన ఆరాధనతో ఐక్యం చేయడానికి ప్రయత్నించేవారిని యెహోవా సంపూర్ణంగా ఖండిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు యెషయా ప్రవచనాన్ని ఉల్లేఖించి, దాన్ని క్రైస్తవులకు అన్వయించి, అబద్ధ మతపు అపరిశుభ్రమైన ప్రభావం నుండి దూరంగా ఉండమని వారిని ప్రోత్సహించాడు. ఆయన ఇలా వ్రాశాడు: “మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. —మరియు నేను మిమ్మును చేర్చుకొందును.” (2 కొరింథీయులు 6:18; యెషయా 52:11) అబద్ధ మతానికి లేదా ఇంద్రజాలానికి సంబంధించిన దేనికైనా నిజ క్రైస్తవులు దూరంగా ఉండాలని తీర్మానించుకుంటారు.—యోహాను 4:24.
ధూపద్రవ్యాలు మతపరమైన లాంఛనాలకు, అభిచార సంబంధంగా ఉపయోగించబడతాయి అనే వాస్తవానికి అర్థం, అన్నిరకాల ధూపం వేయడం తప్పనా? లేదు. బహుశా ఒక వ్యక్తి కేవలం ఆహ్లాదకరమైన సువాసనను ఆనందించడానికి మాత్రమే తన ఇంట్లో ధూపం వేయడానికి ఇష్టపడవచ్చు. (సామెతలు 27:9) అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవుడు ధూపం వేయాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు నివసిస్తున్న ప్రాంతంలోని ప్రజలు ధూపద్రవ్యాలను ఉపయోగాన్ని అబద్ధ మతాచారాలకు సంబంధించినదిగా దృష్టిస్తారా? మీ ప్రాంతంలో ధూపద్రవ్యాలు తరచూ అభిచార సంబంధమైన ఆచారాలతో ముడిపెట్టబడతాయా? లేదా అవి సాధారణంగా మతంతో సంబంధం లేకుండా ఉపయోగించబడతాయా?
ఒక వ్యక్తి ధూపం వేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయం ఆయన మనస్సాక్షిని, ఇతరుల భావాలను రెండింటినీ పరిగణలోకి తీసుకొని చేయబడాలి. (1 కొరింథీయులు 10:29) అపొస్తలుడైన పౌలు రోమీయులకు చెప్పిన మాటలు ఈ విషయంలో అన్వయిస్తాయి. ఆయన ఇలా వ్రాశాడు: “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.”—రోమీయులు 14:19-21.
“ధూపమువలె” ఉన్న ప్రార్థనలు
ఇశ్రాయేలీయుల్లో ధూపం వేయడమనేది, దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థనలకు సరైన చిహ్నంగా ఉండేది. అందుకే కీర్తనకర్త దావీదు యెహోవాకు ఇలా పాడాడు: ‘నా ప్రార్థన ధూపమువలె నీ దృష్టికి అంగీకారమగును గాక.’—కీర్తన 141:2.
విశ్వసనీయులైన ఇశ్రాయేలీయులు ధూపం వేయడాన్ని కేవలం అర్థరహితమైన ఆచారంగా దృష్టించలేదు. యెహోవా సూచించిన విధంగా ధూపద్రవ్యాలను తయారుచేయడానికి, ధూపం వేయడానికి వారు ఎంతో జాగ్రత్త వహించేవారు. నేటి క్రైస్తవులు అక్షరార్థమైన ధూపద్రవ్యాలను ఉపయోగించరు కానీ మన పరలోక తండ్రిపట్ల లోతైన కృతజ్ఞతను, ప్రగాఢమైన గౌరవాన్ని ప్రతిబింబించే ప్రార్థనలను చేస్తారు. ఆలయంలోని యాజకులు అర్పించే సువాసనగల ధూపంవలే “యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము” అని దేవుని వాక్యం మనకు హామీ ఇస్తుంది.—సామెతలు 15:8.
[29వ పేజీలోని చిత్రం]
గుడారములో, ఆలయంలో వేయబడే ధూపం పవిత్రమైనది
[30వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ధ్యానించేటప్పుడు ధూపం వేయవచ్చా?