కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 6/1 పేజీలు 23-27
  • సాటిలేని ఆనందం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సాటిలేని ఆనందం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నా తొలి రోజులు
  • రెండవ ప్రపంచ యుద్ధం​—పరీక్షా కాలం
  • పూర్తికాల సేవలోకి
  • ప్రకటనా పనిలోని సమస్యలు, ఆధిక్యతలు
  • బాధాకరమైన వీడ్కోలు
  • నేను బైబిలు సత్యాన్ని రుమేనియాలో నేర్చుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నా జీవితాన్ని మార్చివేసిన చిన్న లిఖిత సందేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 6/1 పేజీలు 23-27

జీవిత కథ

సాటిలేని ఆనందం!

రజినాల్డ్‌ వాల్‌వర్క్‌ చెప్పినది

“యెహోవాకు పూర్తికాల మిషనరీ సేవచేయడంలో మేము అనుభవించిన ఆనందానికి ఈ లోకంలో ఉన్నదేదీ సాటిరాదు!” ఇలా వ్రాసివున్న చిన్న కాగితం, 1994వ సంవత్సరం మే నెలలో నా భార్య చనిపోయిన తర్వాత ఆమె పుస్తకాల మధ్య నాకు దొరికింది.

ఐరీన్‌ వ్రాసిన ఆ మాటల గురించి నేను ఆలోచించినప్పుడు, మేమిద్దరం మిషనరీలుగా పెరూలో గడిపిన 37 సంతోషభరితమైన, సంతృప్తికరమైన సంవత్సరాలు నాకు గుర్తొచ్చాయి. 1942 డిసెంబరులో మా వివాహం జరిగినప్పటి నుండి మేమిద్దరం అమూల్యమైన క్రైస్తవ సహచర్యాన్ని అనుభవించాము, నా కథ ప్రారంభించడానికి అదే సరైన సంఘటన.

ఐరీన్‌, ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో ఒక యెహోవాసాక్షిగా పెరిగింది. వాళ్ళు మొత్తం ముగ్గురమ్మాయిలు, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె తల్లి విన్టన్‌ ఫ్రేసర్‌ను పెళ్ళి చేసుకుంది, వారికి జన్మించిన అబ్బాయి పేరు సిడ్ని. రెండవ ప్రపంచ యుద్ధానికి కొంచెం ముందు వాళ్ళ కుటుంబం నార్త్‌ వేల్స్‌లోని బాంగర్‌కు వెళ్ళిపోయారు, అక్కడ ఐరీన్‌ 1939లో బాప్తిస్మం తీసుకుంది. అంతకుముందు సంవత్సరమే సిడ్ని బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వేల్స్‌ ఉత్తర తీరం వెంబడి బాంగర్‌ నుండి కార్నార్వెన్‌ వరకూ అలాగే ఆంగ్లెసే ద్వీపంలో కూడా పయినీర్లుగా, అంటే పూర్తికాల సువార్తికులుగా ప్రకటనా పనిచేశారు.

ఆ సమయంలో నేను, లివర్‌పూల్‌కు ఆగ్నేయంలో దాదాపు 20 కిలోమీటర్ల దూరానవున్న రన్‌కార్న్‌ సంఘంలో ప్రస్తుతం మనం సంఘ పైవిచారణకర్త అని పిలిచే వ్యక్తిగా సేవచేస్తున్నాను. ఐరీన్‌ రన్‌కార్న్‌లో నివసిస్తున్న వివాహితురాలైన తన అక్క వెరా దగ్గర కొన్ని రోజులు గడపాలని నిర్ణయించుకొని, ఒక ప్రాంతీయ సమావేశంలో నన్ను కలిసి తాను రన్‌కార్న్‌లో ప్రకటనా పని చేయడానికి కొంత సేవాక్షేత్రం లభిస్తుందా అని అడిగింది. ఐరీన్‌ మాతోపాటు ఉన్న రెండు వారాలు మేము చక్కగా కలిసిమెలిసి ఉన్నాము, ఆ తర్వాత నేను ఆమెను బాంగర్‌లో చాలాసార్లు కలిశాను. ఒక వారాంతంలో నేను ఐరీన్‌తో తనను వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నందుకు నేను చాలా సంతోషించాను!

ఆదివారం నేను ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే మా వివాహానికి ప్రణాళికలు వేయడం ప్రారంభించాను, కానీ మంగళవారం నాకు ఒక టెలిగ్రామ్‌ వచ్చింది. ఆ టెలిగ్రామ్‌లో ఇలా ఉంది: “ఈ టెలిగ్రామ్‌ మిమ్మల్ని బాధపెడుతుంది, నన్ను క్షమించండి. నేను మన వివాహాన్ని రద్దు చేస్తున్నాను. మీకు త్వరలోనే ఉత్తరం అందుతుంది.” నేను నిర్ఘాంతపోయాను. సమస్య ఏమైయుంటుంది?

మరుసటి రోజు నాకు ఐరీన్‌ ఉత్తరం అందింది. తను హిల్డా పడ్గెట్‌తో పయినీరు సేవ చేయడానికి యార్క్‌షైర్‌లోని హార్స్‌ఫోర్త్‌కు వెళ్తున్నానని ఆమె నాకు చెప్పింది.a అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయమని కోరితే తను అలా చేస్తానని 12 నెలల క్రితం అంగీకరించానని ఆమె నాకు వివరించింది. ఆమె ఇంకా ఇలా వ్రాసింది: “ఇది నేను యెహోవాకు చేసిన ప్రమాణంలాంటిది, మీరు నాకు పరిచయమవకముందే నేను ఆయనకు ఇలా ప్రమాణం చేశాను కాబట్టి నేను దాన్ని నెరవేర్చాలని భావిస్తున్నాను.” నాకు బాధగా ఉన్నా నేను ఆమె యథార్థతకు ఎంతో ముగ్దుడనయ్యాను, సమాధానంగా నేనామెకు ఇలా టెలిగ్రాఫ్‌ చేశాను: “మీరు వెళ్ళండి. నేను మీ కోసం వేచివుంటాను.”

ఐరీన్‌ యార్క్‌షైర్‌లో ఉన్నప్పుడు, యుద్ధ ప్రయత్నాలకు మనస్సాక్షినిబట్టి మద్దతునివ్వడానికి నిరాకరించినందుకు ఆమెకు మూడు నెలలు జైలు శిక్ష విధించబడింది. అయితే 18 నెలల తర్వాత, డిసెంబరు 1942లో మేము పెళ్ళి చేసుకున్నాము.

నా తొలి రోజులు

1919లో మా అమ్మ స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ పుస్తకాలను కొన్నది.b అమ్మ ఆ పుస్తకాలను కొన్నప్పుడు మా నాన్న వ్యాఖ్యానించినట్లే అప్పటివరకూ ఆమె ఒక్క పుస్తకాన్ని కూడా చదవలేదు, కానీ అమ్మ ఆ పుస్తకాలను తన బైబిలుతోపాటు జాగ్రత్తగా అధ్యయనం చేయాలని తీర్మానించుకుంది. ఆమె అలా అధ్యయనం చేసి 1920లో బాప్తిస్మం తీసుకుంది.

మా నాన్న ఎక్కువగా ఆక్షేపించే వ్యక్తి కాదు కాబట్టి అమ్మ చేయాలనుకునే పనులకు ఆయన అడ్డుచెప్పేవాడు కాదు. తమ నలుగురు పిల్లలను అంటే మా ఇద్దరు అక్కలు, గ్వెన్‌, ఐవీలను; మా అన్న అలేక్‌ని అలాగే నన్ను సత్య మార్గంలో పెంచేందుకు ఆయన అనుమతించాడు. లివర్‌పూల్‌కు చెందిన స్టాన్లీ రాజర్స్‌, నమ్మకస్థులైన ఇతర సాక్షులు రన్‌కార్న్‌లో బైబిలు ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చేవారు, అక్కడ ఒక కొత్త సంఘం స్థాపించబడింది. ఆ సంఘంతోపాటు మా కుటుంబం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందింది.

గ్వెన్‌, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు సంబంధించిన చర్చ్‌ సంస్కారపాఠాలు నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్ళేది కానీ మా అమ్మతోపాటు బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు ఆమె ఆ క్లాసులకు వెళ్ళడం మానేసింది. ఆమె క్లాసులకు ఎందుకు హాజరవడం లేదో కనుక్కోవడానికి మతాధికారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనపై ప్రశ్నల వర్షం కురిసింది, ఆయన వాటికి జవాబివ్వడానికి సిద్ధపడి రాలేదు. గ్వెన్‌ ఆయనను పరలోక ప్రార్థన భావం వివరించమని అడిగి, చివరకు తానే దాన్ని ఆయనకు వివరించింది! ఆమె 1 కొరింథీయులు 10:21వ వచనాన్ని ప్రస్తావించి తాను ‘రెండు బల్లలమీద ఉన్నదానిలో పాలుపొందనని’ స్పష్టంగా చెప్పింది. ఆ మతాధికారి వెళ్ళిపోతూ తాను గ్వెన్‌ కోసం ప్రార్థిస్తానని, ఆమె ప్రశ్నలకు సమాధానమివ్వడానికి తిరిగి వస్తానని చెప్పాడు, కానీ ఆయన మళ్ళీ రాలేదు. బాప్తిస్మం తీసుకున్న కొద్ది కాలానికే గ్వెన్‌ పూర్తికాల సువార్తికురాలయ్యింది.

మా సంఘంలో యౌవనులపట్ల చూపించబడిన అవధానం ఎంతో మాదిరికరంగా ఉండేది. నాకు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు మా సంఘాన్ని సందర్శించిన పెద్ద ఇచ్చిన ప్రసంగాన్ని నేను వినడం నాకు ఇంకా గుర్తుంది. ఆ తర్వాత ఆయన నాతో మాట్లాడడానికి వచ్చారు. నేను అబ్రాహాము గురించి, ఆయన తన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి ఎలా ప్రయత్నించాడనే విషయం గురించి చదువుతున్నానని ఆయనతో చెప్పాను. “వేదిక చివరకు వెళ్ళి నిలబడి నాకు దాని గురించి వివరించు” అని ఆయన అన్నాడు. అక్కడ నిలబడి నా మొదటి “బహిరంగ ప్రసంగం” ఇవ్వడానికి నేను పులకరించిపోయాను!

నేను 1931లో 15 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను, ఆ సంవత్సరంలో మా అమ్మ చనిపోయింది, నేను స్కూలుకు వెళ్ళడం మానేసి అప్రెంటీస్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేయడం ప్రారంభించాను. 1936లో, రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలను బహిరంగంగా వినిపించేవారు, ఈ పనిలో పాల్గొనమని ఒక వృద్ధ సహోదరి నన్ను, మా అన్నను ప్రోత్సహించింది. కాబట్టి నేను అలేక్‌ ఒక సైకిల్‌ కొని, రికార్డులు వినిపించడానికి ఉపయోగించే ట్రాన్స్‌క్రిప్షన్‌ మెషీన్‌ను మోయడానికి సైకిల్‌కు ఒక చిన్న సైడ్‌కార్‌ను తయారుచేయించడానికి లివర్‌పూల్‌కు వెళ్ళాము. సైడ్‌కార్‌ వెనుకభాగంలో రెండున్నర మీటర్ల ఎత్తున టెలిస్కోపిక్‌ ట్యూబ్‌పైన ఒక లౌడ్‌ స్పీకర్‌ బిగించబడింది. దాన్ని తయారుచేసిన మెకానిక్‌ తాను ఇంతకుముందెన్నడూ అలాంటిది తయారుచేయలేదని మాతో అన్నాడు, కానీ అది బాగానే పనిచేసింది! ఆ సహోదరి ఇచ్చిన ప్రోత్సాహానికీ మాకు ఇవ్వబడిన ఆధిక్యతలకూ కృతజ్ఞతతో మేము మా క్షేత్రంలో ఎంతో ఉత్సాహంతో సేవచేశాము.

రెండవ ప్రపంచ యుద్ధం​—పరీక్షా కాలం

యుద్ధం మొదలవుతుందనే సూచనలు రోజురోజుకీ ఎక్కువవుతున్న సమయంలో నేను, స్టాన్లీ రాజర్స్‌, 1938 సెప్టెంబరు 11వ తేదీన లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఇవ్వబడే “వాస్తవాలను ఎదుర్కోండి” అనే బహిరంగ ప్రసంగం గురించి ప్రచారం చేశాము. చిన్న పుస్తకం రూపంలో ప్రచురించబడిన ఆ ప్రసంగాన్ని, ఆ తర్వాతి సంవత్సరం ప్రచురించబడిన ఫాసిజమా స్వాతంత్ర్యమా (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని పంచిపెట్టడంలో నేను భాగం వహించాను. ఆ చిన్న పుస్తకాలు రెండూ హిట్లర్‌కు చెందిన జర్మనీ నియంతృత్వ లక్ష్యాలను స్పష్టంగా బయల్పరచాయి. ఆ సమయానికల్లా నేను, నా బహిరంగ పరిచర్య విషయంలో రన్‌కార్న్‌లో మంచి పేరు సంపాదించుకున్నాను, ఆ కారణంగా అందరూ నన్ను గౌరవించేవారు. నిజానికి నేను దైవపరిపాలనా కార్యకాపాల్లో ఎప్పుడూ ముందుండడమనేది ఆ తర్వాతి కాలంలో నాకు సహాయపడింది.

నేను పనిచేసే కంపెనీకి, నగర శివార్లలో నిర్మించబడిన ఒక క్రొత్త కర్మాగారంలోని యంత్రాలకు విద్యుత్‌శక్తి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసే కాంట్రాక్ట్‌ లభించింది. ఆ క్రొత్త కర్మాగారం యుద్ధ సామగ్రి తయారుచేయడానికి నిర్మించబడిందని తెలుసుకున్న తర్వాత, నేను అక్కడ పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను. నా యజమానులకు అది నచ్చకపోయినా, ఫోర్‌మ్యాన్‌ నా తరఫున మాట్లాడడం వల్ల నాకు వేరే ఉద్యోగం ఇవ్వబడింది. ఆయన ఆంటీ యెహోవాసాక్షి అని నాకు ఆ తర్వాత తెలిసింది.

“రెజ్‌ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా బైబిలు పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ నిర్ణయమే తీసుకుంటావని మేమందరము అనుకున్నాము” అని నా తోటి ఉద్యోగి నాతో అన్నప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. అయితే నా తోటి ఉద్యోగస్థుల్లో చాలామంది నన్ను ఇబ్బందుల పాలుచేయాలనుకున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది.

మనస్సాక్షి కారణంగా అభ్యంతరం చెప్పే వ్యక్తిగా నన్ను నేను రిజిస్టర్‌ చేసుకోవడానికి నేను పెట్టుకున్న దరఖాస్తును 1940, జూన్‌లో లివర్‌పూల్‌లోని న్యాయస్థానం అంగీకరించింది. అయితే నేను నా ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగాలనే షరతుపై నా దరఖాస్తు అంగీకరించబడింది. నేను నా క్రైస్తవ పరిచర్యను కొనసాగించడానికి అది సహాయపడింది.

పూర్తికాల సేవలోకి

యుద్ధం ముగుస్తున్న సమయంలో, నేను నా ఉద్యోగాన్ని వదిలి ఐరీన్‌తోపాటు పూర్తికాల సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. 1946లో నేను ఐదు మీటర్ల ట్రెయిలర్‌ను నిర్మించాను, అదే మా గృహంగా మారింది. ఆ తర్వాతి సంవత్సరం మేము గ్లౌసెస్టర్‌షైర్‌లోని ఆల్వెస్టన్‌ అనే గ్రామంలో సేవచేయడానికి నియమించబడ్డాము. తర్వాత మేము ప్రాచీన పట్టణమైన సైరెన్‌సెస్టర్‌లో, బాత్‌ నగరంలో పయినీరు సేవచేశాము. 1951లో దక్షిణ వేల్స్‌లోని సంఘాలను ప్రయాణ పైవిచారణకర్తగా సందర్శించడానికి నేను ఆహ్వానించబడ్డాను, కానీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు కూడా గడవకముందే మేము మిషనరీలుగా శిక్షణ పొందడానికి వాచ్‌టవర్‌ బైబిలు స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు వెళ్ళాము.

గిలియడ్‌ స్కూలు 21వ తరగతి న్యూయార్క్‌ ఉత్తరభాగంలో ఉన్న సౌత్‌ లాన్సింగ్‌లో నిర్వహించబడింది, 1953లో న్యూయార్క్‌ నగరంలో జరిగిన ‘నూతన లోక సమాజం’ అనే సమావేశంలో మేము పట్టభద్రులమయ్యాము. మా గ్రాడ్యుయేషన్‌ రోజు వరకూ మేము ఎక్కడ నియమించబడతామో నాకు, ఐరీన్‌కు తెలియదు. మేము పెరూకు నియమించబడ్డామని తెలుసుకొని ఎంతో పులకరించిపోయాము. ఎందుకు? ఐరీన్‌ తమ్ముడు సిడ్ని ఫ్రేసర్‌, ఆయన భార్య మార్గరేట్‌ గిలియడ్‌ స్కూలు 19వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్‌ పొందిన తర్వాత పెరూలోని లిమా బ్రాంచి కార్యాలయంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలంగా సేవచేస్తున్నారు!

మేము మా వీసాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొంతకాలం బ్రూక్లిన్‌ బేతేలులో సేవచేశాము, తర్వాత అక్కడనుండి లిమాకు వెళ్ళాము. మేము సేవచేసిన పది మిషనరీ నియామకాల్లో మొదటిది లిమాకు పశ్చిమ దిశలో ఉన్న కాల్లో, అది పెరూలోని ప్రధాన నౌకాశ్రయం. మేము కొంత స్పానిష్‌ భాషను నేర్చుకున్నప్పటికీ అప్పటికింకా నాకు గానీ ఐరీన్‌కు గానీ ఆ భాషలో సంభాషించడం రాలేదు. మేము మా పనిని ఎలా చేయాలి?

ప్రకటనా పనిలోని సమస్యలు, ఆధిక్యతలు

ఒక తల్లి తన బిడ్డకు భాష నేర్పించదు గాని తల్లి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డే స్వయంగా భాష నేర్చుకుంటుంది అని మాకు గిలియడ్‌ స్కూల్‌లో చెప్పబడింది. కాబట్టి మాకు ఇవ్వబడిన ఉపదేశమేమిటంటే: “వెంటనే ప్రకటించడం ప్రారంభించి, ప్రజల దగ్గర భాష నేర్చుకోండి. వారు మీకు సహాయం చేస్తారు.” ఒకవైపున నేను ఈ క్రొత్త భాషను అర్థం చేసుకొని ఆ సమస్యతో వ్యవహరించడానికి కృషి చేస్తుంటే, మేము అక్కడకు వెళ్ళి రెండు వారాలు కూడా గడవకముందే కాల్లో సంఘానికి నేను సంఘ అధ్యక్షునిగా నియమించినప్పుడు నేను ఎలా భావించివుంటానో ఊహించుకోండి! నేను సిడ్ని ఫ్రేసర్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా గిలియడ్‌లో ఇవ్వబడిన సలహానే ఇచ్చాడు​—⁠సంఘంతో, మీ క్షేత్రంలోని ప్రజలతో సహవసించండి. ఈ సలహాను పాటించాలని నేను తీర్మానించుకున్నాను.

ఒక శనివారం ఉదయం, తన షాపులో పనిచేసుకుంటున్న ఒక వడ్రంగిని కలిశాను. “నేను నా పని చేసుకోవాలి, కానీ మీరు దయచేసి కూర్చొని నాతో మాట్లాడండి” అని ఆయన అన్నాడు. నేను ఒక షరతుపై అతనితో మాట్లాడతానని చెప్పాను: “నా భాషలో తప్పులు దొర్లితే, మీరు వాటిని సరిదిద్దాలి. నేనేమీ అభ్యంతరపడను.” ఆయన నవ్వి సరేనన్నాడు. నేను ఆయన్ను వారానికి రెండుసార్లు సందర్శించేవాడిని, నాకు ముందుగా చెప్పబడినట్లే క్రొత్త భాష నేర్చుకోవడానికి ఇదే సరైన పద్ధతని నేను గ్రహించాను.

మా రెండవ మిషనరీ నియామకమైన ఐకాలో కూడా నేను అనుకోకుండా మరో వడ్రంగిని కలిశాను, నేను కాల్లోలో అనుసరించిన పద్ధతి గురించి ఆయనకు వివరించాను. ఆయన కూడా అదే విధంగా నాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు, నా స్పానిష్‌ బాగానే మెరుగుపడింది కాకపోతే నేను అనర్గళంగా మాట్లాడడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఈ వ్యక్తి ఎప్పుడూ చాలా పనిరద్దీలో ఉండేవాడు, నేను లేఖనాలను చదివి వాటి అర్థాన్ని ఆయనకు వివరించడం ద్వారా బైబిలు అధ్యయనం నిర్వహించేవాడిని. ఒక వారం నేను ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన లిమాలో మరో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయాడని ఆయన యజమాని నాకు చెప్పాడు. కొంతకాలం తర్వాత నేను, ఐరీన్‌ లిమాలో ఒక సమావేశానికి హాజరైనప్పుడు నేను ఆ వ్యక్తిని మళ్ళీ కలిశాను. ఆయన తన అధ్యయనాన్ని కొనసాగించడానికి స్థానిక సాక్షులను కలుసుకున్నాడని, ఆయనా ఆయన కుటుంబం యెహోవాకు సమర్పించుకున్న సేవకులయ్యారని తెలుసుకొని నేను ఎంతో సంతోషించాను!

ఒక సంఘంలో, ఒక యౌవన జంట చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండానే బాప్తిస్మం తీసుకున్నారని మాకు తెలిసింది. ఆ విషయానికి సంబంధించిన లేఖనాధారిత సూత్రాలను మేము వారితో చర్చించినప్పుడు వారు బాప్తిస్మం పొందిన సాక్షులుగా అర్హులవడానికి తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. కాబట్టి వారి వివాహాన్ని రిజిస్టర్‌ చేయించడానికి వారిని టౌన్‌ హాల్‌కు తీసుకువెళ్ళే ఏర్పాటు చేశాను. కానీ అప్పుడు ఒక సమస్య తలెత్తింది, వారికి నలుగురు పిల్లలున్నారు కానీ ఆ పిల్లలు కూడా రిజిస్టర్‌ చేయబడలేదు, చట్టబద్ధంగా వారు రిజిస్టర్‌ చేయబడాలి. మేయర్‌ వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటాడో అని మేము భయపడ్డాము. కానీ ఆ మేయర్‌ ఇలా చెప్పాడు: “మీ స్నేహితులు, మంచివారైన యెహోవాసాక్షులు మీ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేయించడానికి ఏర్పాటు చేశారు కాబట్టి నేను మీ పిల్లలకు జారీచేయవలసిన కోర్టు ఆర్డర్‌లను జారీచేయకుండా వారిని ఉచితంగా రిజిస్టర్‌ చేస్తున్నాను.” మేము ఎంతో సంతోషించాము ఎందుకంటే వారిది పేద కుటుంబమవడం వల్ల వారికి ఒకవేళ జరిమానా విధించబడితే అది చాలా భారంగా ఉండేది.

బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం నుండి అల్బర్ట్‌ డి. ష్రోడర్‌ మమ్మల్ని సందర్శించి, లిమాలోని మరో ప్రాంతంలో కొత్త మిషనరీ గృహం స్థాపించమని సలహా ఇచ్చారు. అమెరికా నుండి వచ్చిన ఇద్దరు సహోదరీలు ఫ్రాన్సిస్‌ గుడ్‌, ఎలిజబెత్‌ గుడ్‌, కెనడా నుండి వచ్చిన ఒక వివాహిత జంటతోపాటు నేను, ఐరీన్‌ సాన్‌ బోర్జా అనే జిల్లాకు వెళ్ళాము. రెండు, మూడు సంవత్సరాల్లోగా మేము వృద్ధి చెందుతున్న మరో సంఘాన్ని స్థాపించాము.

మధ్యస్థ పర్వతప్రాంతాల్లో 3,000 మీటర్ల ఎత్తున ఉన్న వాన్‌క్యోలో సేవచేస్తూ మేము అక్కడ 80 మంది సభ్యులున్న సంఘంతో సహవసించాము. అక్కడ నేను ఆ దేశంలో నిర్మించబడుతున్న రెండవ రాజ్యమందిర నిర్మాణపనిలో సహాయం చేశాను. మేము కొన్న భూమి చట్టబద్ధమైన హక్కులను రుజువు చేసుకోవడానికి మేము మూడుసార్లు న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి నన్ను యెహోవాసాక్షుల చట్టసంబంధ విషయాలు చూసుకునే ప్రతినిధిగా నియమించారు. ఇలాంటి చర్యలు, ఆ తొలి సంవత్సరాల్లో అనేకమంది విశ్వసనీయులైన మిషనరీలు విస్తృతంగా శిష్యులను చేసినపని మనం ఇప్పుడు పెరూలో చూస్తున్న అభివృద్ధికి బలమైన పునాది వేశాయి, అక్కడ 1953లో 283 మంది సాక్షులు ఉంటే నేడు 83,000 కంటే ఎక్కువమంది ఉన్నారు.

బాధాకరమైన వీడ్కోలు

మేము నివసించిన మిషనరీ గృహాలన్నింటిలో తోటి మిషనరీల అద్భుతమైన సహవాసాన్ని అనుభవించాము, వివిధ మిషనరీ గృహాల్లో గృహ పైవిచారణకర్తగా సేవచేసే ఆధిక్యత నాకు లభించింది. ప్రతి సోమవారం ఉదయం, వారమంతటిలో మేము చేయవలసిన కార్యకలాపాల గురించి మాట్లాడుకోవడానికి, గృహ అవసరాలను చూసుకోవడానికి డ్యూటీలను నియమించడానికి మేమందరం కలుసుకునేవాళ్ళము. మేము చేయవలసిన ప్రధానమైన పని ప్రకటనా పని అని మాకందరికీ తెలుసు కాబట్టి ఆ లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకొని మేమందరం ఐకమత్యంతో పనిచేసేవాళ్ళం. మా మిషనరీ గృహాల్లో ఎన్నడూ గంభీరమైన వివాదాలు తలెత్తలేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.

లిమా పరిసర ప్రాంతాల్లోని మరో ప్రాంతమైన బ్రెన్యా మా ఆఖరి మిషనరీ నియామకం. అక్కడున్న ప్రేమపూర్వకమైన సంఘం 70 మంది సభ్యుల నుండి వేగంగా పెరిగి 100 కంటే ఎక్కువ మంది సభ్యులు తయారవడం వల్ల పాలొమీన్యాలో మరో సంఘం స్థాపించబడింది. ఆ సమయంలోనే ఐరీన్‌ అనారోగ్యానికి గురయ్యింది. తను చెప్పిన విషయాలను తనే అప్పుడప్పుడు గుర్తుచేసుకోలేకపోతుందని, కొన్నిసార్లు ఇంటికి ఎలా రావాలో గుర్తుంచుకోవడం ఆమెకు కష్టమవుతోందని నేను మొదట గమనించాను. ఆమెకు మంచి వైద్య చికిత్స లభించినప్పటికీ ఆమె పరిస్థితి క్రమేణా క్షీణించింది.

విచారకరంగా, 1990లో మేము ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్ళిపోవడానికి నేను ఏర్పాట్లు చేయవలసి వచ్చింది, అక్కడ మా అక్క ఐవీ మమ్మల్ని తన ఇంట్లో ఉండమని ఆహ్వానించింది. నాలుగు సంవత్సరాల తర్వాత ఐరీన్‌ తన 81వ ఏట చనిపోయింది. నా సొంత పట్టణంలో ఉన్న మూడు సంఘాల్లోని ఒక దానిలో నేను పెద్దగా సేవచేస్తూ నా పూర్తికాల పరిచర్యను కొనసాగిస్తున్నాను. అప్పుడప్పుడు నేను మాంచెస్టర్‌లోని స్పానిష్‌ భాషా గుంపును ప్రోత్సహించడానికి అక్కడికి వెళతాను.

నేను ఎన్నో సంవత్సరాల క్రితం నా ఫోనోగ్రాఫ్‌లో ఐదు నిమిషాల ప్రసంగాలను ప్లే చేసి గృహస్థులకు వినిపించినప్పుడు ప్రారంభమైన అనుభవం ఇటీవలే నన్ను ఎంతో ప్రోత్సహించింది. నేను ప్రసంగం వినిపిస్తున్నప్పుడు ఆ సందేశాన్ని వింటూ తన తల్లి వెనుక నిలబడిన ఒక స్కూలు అమ్మాయి నాకు స్పష్టంగా గుర్తుంది.

ఈ అమ్మాయి ఆ తర్వాత కెనడాకు వలసవెళ్ళింది. ఇప్పటికీ రన్‌కార్న్‌లోనే నివసిస్తున్న, యెహోవాసాక్షిగా మారిన ఒక స్నేహితురాలు ఆమెకు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఇద్దరు యెహోవాసాక్షులు తనను సందర్శించారని, వారు ఉపయోగించిన పదాలు అనుకోకుండా తనకు ఐదు నిమిషాల ప్రసంగాన్ని జ్ఞాపకం చేశాయని ఆ అమ్మాయి ఇటీవలే ఒక ఉత్తరంలో వ్రాసింది. సత్యాన్ని గుర్తించిన ఆ అమ్మాయి ఇప్పుడు యెహోవాకు సమర్పించుకొన్న సేవకురాలిగా మారింది, 60 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం తన తల్లి ఇంటిని సందర్శించిన యువకుడికి కృతజ్ఞతలు తెలియజేయమని ఆమె కోరింది. నిజమే, సత్యపు విత్తనాలు ఎలా నాటుకొని ఎలా పెరుగుతాయో మనకు తెలియదు.​—ప్రసంగి 11:6.

యెహోవాకు అమూల్యమైన సేవచేయడంలో గడిపిన నా జీవితాన్ని నేను ప్రగాఢమైన కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను 1931లో యెహోవాకు సమర్పించుకున్నప్పటి నుండి నేను యెహోవా ప్రజల సమావేశాల్లో ఒక్కదానికి కూడా హాజరవకుండా ఉండలేదు. నాకు, ఐరీన్‌కు పిల్లలు లేకపోయినప్పటికీ, ఆధ్యాత్మిక భావంలో నాకు 150 కంటే ఎక్కువ మంది కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు, వారందరూ మన పరలోక తండ్రి అయిన యెహోవాకు సేవచేస్తున్నారు. నా ప్రియమైన భార్య వ్యక్తం చేసినట్లుగా యెహోవాకు సేవచేయడంలో మా ప్రత్యేకాధిక్యతలు మాకు సాటిలేని ఆనందాన్నిచ్చాయి.

[అధస్సూచీలు]

a “మా తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించడం,” హిల్డా పడ్గెట్‌ జీవిత కథ, కావలికోట అక్టోబరు 1, 1995, 19-24 పేజీల్లో ప్రచురించబడింది.

b యెహోవాసాక్షులు ప్రచురించినవి.

[24వ పేజీలోని చిత్రం]

మా అమ్మ, 1900ల తొలి సంవత్సరాల్లో

[24, 25వ పేజీలోని చిత్రం]

ఎడమవైపు: ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో హిల్డా పడ్గెట్‌, నేను, ఐరీన్‌, జాయిసీ రౌలీ, 1940

పైన: మా ట్రెయిలర్‌ గృహం ఎదుట నేను, ఐరీన్‌

[27వ పేజీలోని చిత్రం]

వేల్స్‌లోని కార్డిఫ్‌లో ఒక బహిరంగ ప్రసంగం గురించి ప్రచారం చేస్తూ, 1952

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి