గ్రీకు తత్వజ్ఞానం—అది క్రైస్తవత్వాన్ని సుసంపన్నం చేసిందా?
“క్రైస్తవత్వం అన్య సంస్కృతులైన గ్రీకు రోమా సంస్కృతులకు వ్యతిరేకమైనదే అయినప్పటికీ, వాస్తవానికి వాటి తత్వజ్ఞానాన్ని ఎంతగానో తనలో ఇముడ్చుకుంది.”—ది ఎన్సైక్లోపీడియా అమెరికానా.
“క్రైస్తవ” తలంపుపై నిశ్చితమైన ప్రభావం చూపించిన వారిలో “పరిశుద్ధ” అగస్టీన్, నిర్వివాదమైన స్థానాన్ని కల్గివున్నాడు. ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, అగస్టీన్ “మనస్సు, నూతన నిబంధన మతం గ్రీకు తత్వానికి చెందిన ప్లేటోనిక్ సాంప్రదాయంతో పూర్తిగా సమ్మిళితమైపోయిన మూస; మధ్యయుగాలనాటి రోమన్ క్యాథలిక్ మతానికి చెందిన, పునరుజ్జీవ ప్రొటస్టెంట్ మతానికి చెందిన క్రైస్తవమత సామ్రాజ్యాలకు ఆ సమ్మేళనపు ఉత్పాదన అందజేయబడిన మాధ్యమం కూడా అదే [అగస్టీన్ మనస్సే].”
అగస్టీన్ వారసత్వం చాలాకాలంపాటు నిలబడింది. గ్రీకు తత్వశాస్త్రం క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఎంత మేరకు ప్రభావితం చేసిందనేదాని గురించి మాట్లాడుతూ, డాగ్లస్ టి. హోల్డెన్ ఇలా పేర్కొన్నాడు: “క్రైస్తవ వేదాంతం గ్రీకు తత్వశాస్త్రంతో ఎంతగా సమ్మిళితమైందంటే, అది తొమ్మిదిపాళ్లు గ్రీకు తలంపునూ ఒక పాలు క్రైస్తవ తలంపునూ కలిసివున్న వ్యక్తులను ఉత్పన్నం చేసింది.”
అలాంటి తత్వసంబంధిత ప్రభావం క్రైస్తవత్వాన్ని దాన్ని శైశవదశలో అధికం చేసిందనీ, దాని బోధను సుసంపన్నం చేసిందనీ, దాన్ని మరింత ఒప్పింపజేసేదిగా చేసిందనీ కొంతమంది పండితులు గట్టిగా నమ్ముతున్నారు. విషయం అలాగే ఉందా? గ్రీకు తత్వజ్ఞానం ఎలా ప్రభావం చూపించింది, ఎప్పుడు ప్రభావం చూపించింది? వాస్తవానికి, అది క్రైస్తవత్వాన్ని సుసంపన్నం చేసిందా లేక కలుషితం చేసిందా?
నాలుగు విలక్షణమైన పదసముదాయాలను పరిశీలించడం ద్వారా సా.శ.పూ. మూడవ శతాబ్దం నుండి సా.శ. ఐదవ శతాబ్దం వరకు జరిగిన అనేక అభివృద్ధులను గురించిన జాడను పట్టుకోవడం జ్ఞానవికాసాన్ని కల్గిస్తుంది: (1) “గ్రీకు తత్వం మిళితమైన యూదా మతం,” (2) “క్రైస్తవత్వం మిళితమైన గ్రీకు తత్వం,” (3) “గ్రీకు తత్వం మిళితమైన క్రైస్తవత్వం,” (4) “క్రైస్తవ తత్వ శాస్త్రం.”
“గ్రీకు తత్వం మిళితమైన యూదా మతం”
మొదటి, “గ్రీకు తత్వం మిళితమైన యూదా మతం” నిజంగా ఒక పరస్పర విరుద్దాల పుట్ట. సత్య దేవుడైన యెహోవా స్థాపించిన హెబ్రీయుల అసలు మతం, అబద్ధమత తలంపులతో కలుషితం చేయబడకూడదు. (ద్వితీయోపదేశకాండము 12:32; సామెతలు 30:5, 6) అయితే, మొట్టమొదటి నుంచీ దాని ఆరాధన స్వచ్ఛత, దాని చుట్టూవున్న ఐగుప్తు, కనాను, బబులోను మూలాల నుండి వచ్చే ప్రభావాల వంటి అబద్ధ మతాచారాల ఆలోచనా విధానాల మూలంగా కలుషితమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కుంది. విచారకరమైన విషయమేమిటంటే, ఇశ్రాయేలు తన సత్యారాధన పూర్తిగా కలుషితమవ్వడానికి అనుమతించింది.—న్యాయాధిపతులు 2:11-13.
శతాబ్దాల తర్వాత, సా.శ.పూ. నాల్గవ శతాబ్దంలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆధ్వర్యంలో ప్రాచీన పాలస్తీనా ప్రాంతం గ్రీకు సామ్రాజ్యంలో భాగమైనప్పుడు, ఈ భ్రష్టత్వం అధఃపాతాళానికి చేరుకుని, చాలా కాలంపాటు నిలిచే, హరింపజేసే వారసత్వాన్ని మిగిల్చింది. అలెగ్జాండర్ యూదులను తన సేనలో చేర్చుకున్నాడు. యూదులకూ, వారి క్రొత్త పాలకునికీ మధ్యనున్న సంబంధాలు యూదా మత ఆలోచనా విధానాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. యూదా విద్యా విధానంలోకి గ్రీకు తత్వ తలంపు చొచ్చుకుపోయింది. ప్రధాన యాజకుడైన జేసన్ సా.శ.పూ. 175లో హోమర్ అధ్యయనాన్ని పెంపొందింపజేయడానికి యెరూషలేములో గ్రీకు అకాడమీని స్థాపించినట్లు పేరుపొందాడు.
ఆసక్తికరంగా, ఒక సమరయుడు సా.శ.పూ. రెండవ శతాబ్దం చివరి అర్ధభాగంలో తన రచనల్లో, బైబిలు చరిత్రను గ్రీకుతత్వ సంబంధిత చారిత్రక వ్రాతలుగా అందజేయడానికి ప్రయత్నించాడు. యూదితు, తోబీతు వంటి సందేహాస్పదమైన ప్రామాణికతగల యూదా పుస్తకాలు వాస్తవంగా గ్రీకు ప్రణయ సంబంధిత పురాణ గాథలను పరోక్షంగా సూచిస్తున్నాయి. గ్రీకు తలంపును యూదా మతంతోను, బైబిలుతోను సమన్వయపర్చడానికి ప్రయత్నించిన అనేకమంది యూదా తత్వవేత్తలు ఉనికిలోకి వచ్చారు.
దీనికి ఎక్కువగా బాధ్యుడు కాగల వ్యక్తి ఫిలో, ఈయన సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన యూదుడు. ఈయన ప్లేటో (సా.శ.పూ. నాలుగవ శతాబ్దం), పైథాగరస్, స్టోయిస్ల సిద్ధాంతాలను అనధికారికంగా ఉపయోగించుకున్నాడు. యూదులు ఫిలో తలంపులకు గాఢంగా ప్రభావితమయ్యారు. గ్రీకు తలంపు యూదా సంస్కృతిలోకి ఇలా మేధాసంబంధంగా ప్రవేశపెట్టబడటాన్ని సమీకరిస్తూ, యూదా రచయితైన మాక్స్ డిమాంట్ ఇలా చెప్తున్నాడు: “ప్లేటో తలంపుతోనూ అరిస్టోటిల్ తర్కంతోనూ, ఎక్లూడియన్ విజ్ఞానశాస్త్రంతోనూ సుసంపన్నమైన యూదా పండితులు తోరాను క్రొత్త పరికరాలతో సమీపించారు. . . . వాళ్లు యూదా ప్రకటనకు గ్రీకు తర్కాన్ని జతచేయడం మొదలెట్టారు.”
కొంతకాలానికి, రోమన్లు గ్రీకు సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని యెరూషలేమును కైవసం చేసుకున్నారు. ఇది మరింత విశేషమైన మార్పులకు మార్గాన్ని తెరిచింది. సా.శ. మూడవ శతాబ్దానికల్లా, ప్లేటో తలంపులను వృద్ధిచేసి సంయోజనం చేయడానికి ప్రయాసపడిన ఆలోచనకర్తల తత్వశాస్త్ర సంబంధమైన, మత సంబంధమైన సిద్ధాంతాలు తమదైన నిర్దిష్ట రూపాన్ని తీసుకున్నాయి, నేడు అవి ఉమ్మడిగా నియోప్లాటోనిసమ్ అని పిలువబడుతున్నాయి. ఈ వర్గం అబద్ధ క్రైస్తవత్వంపై ప్రగాఢమైన ప్రభావాన్ని కల్గివుంది.
“క్రైస్తవత్వం మిళితమైన గ్రీకు తత్వం”
మన సామాన్య శకంలోని మొదటి ఐదు శతాబ్దాల్లో, కొంతమంది మేధావులు గ్రీకు తత్వశాస్త్రానికి, బయల్పర్చబడిన బైబిలు సత్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నించారు. ఎ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటి అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “క్రీస్తు పూర్వపు దశాబ్దాల్లోని గ్రీకులు దేవుని గూర్చిన జ్ఞానం కోసం సాహసోపేతంగానే అయినా గ్రుడ్డిగా పోరాడుతూ, సూచనార్థకంగా చెప్పాలంటే యేసును శూన్యంలో నుండి ఆవిష్కృతం చేయడానికి, తమ అయోగ్యమైన అన్య తలంపులతో క్రైస్తవత్వాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు క్రైస్తవ సైద్ధాంతీకులు చూపించాలనుకున్నారు.”
అలాంటి క్రైస్తవ వ్యతిరేక ఆలోచనకర్తలకు అగ్రగామి అయిన ప్లోటినస్ (సా.శ. 205-270), ప్రాముఖ్యంగా ప్లేటో తలంపుల సిద్ధాంతంపై ఆధారపడిన విధానాన్ని వృద్ధి చేశాడు. శరీరం నుండి ఆత్మ వేరైవుంటుందనే తలంపును ప్లోటినస్ ప్రవేశపెట్టాడు. ప్రొఫెసరైన ఇ. డబ్ల్యూ. హాప్కిన్స్ ప్లోటినస్ గురించి ఇలా చెప్పాడు: “ఆయన వేదాంతం . . . క్రైస్తవ అభిప్రాయ నాయకులపై చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపించింది.”
“గ్రీకు తత్వం మిళితమైన క్రైస్తవత్వం,” “క్రైస్తవ తత్వశాస్త్రం”
సా.శ. రెండవ శతాబ్దం మొదలుకొని, “క్రైస్తవ” ఆలోచనకర్తలు అన్యులైన మేధావులను చేరుకోవడానికి తీవ్రమైన కృషి చేశారు. “అపవిత్రమైన వట్టి మాటల” గురించి, “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదముల” గురించి అపొస్తలుడైన పౌలు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, అలాంటి బోధకులు తమ చుట్టూ ఉన్న గ్రీకు సంబంధిత సంస్కృతి నుండి తత్వశాస్త్ర సంబంధమైన విషయాలను తమ బోధలతో సమ్మిళితం చేశారు. (1 తిమోతి 6:20) ఫిలో ఉదాహరణ, బైబిలును ప్లేటోనిక్ తలంపులతో సమన్వయపర్చడం సాధ్యమని సూచించినట్లు అనిపిస్తుంది.—2 పేతురు 1:16, పోల్చండి.
అయితే నిజంగా బలైనది బైబిలు సంబంధిత సత్యమే. “క్రైస్తవ” బోధకులు, క్రైస్తవత్వం గ్రీకు-రోమన్ మానవతావాదంతో పొందిక కల్గివుందని చూపించడానికి ప్రయత్నించారు. అలెగ్సాండ్రియాకు చెందిన క్లెమెంట్, ఒరిగెన్ (సా.శ. రెండు, మూడు శతాబ్దాలు), “క్రైస్తవ తత్వశాస్త్రం” అని పిలువబడినదానికి నియోప్లేటోనిసమ్ను పునాదిగా చేశారు. మిలన్కు చెందిన బిషప్ అయిన ఆంబ్రోస్ (సా.శ. 339-397) “క్రైస్తవ, అన్య గ్రీకు పండితుల క్రొత్త తలంపులతో—ప్రాముఖ్యంగా అన్య నియోప్లేటోనిస్ట్ అయిన ప్లోటినస్ రచనలను జీర్ణింపచేసుకున్నాడు.” ఆయన విద్యావంతులైన రోమన్లకు ప్రామాణిక క్రైస్తవత్వాన్ని అందజేయడానికి ప్రయత్నించాడు. అగస్టీన్ ఆయన ఉదాహరణను అనుసరించాడు.
ఒక శతాబ్దం తర్వాత, బహుశ సిరియా సన్యాసి అయిన, ఏథెన్సులోని సర్వోన్నత న్యాయస్థానం సభ్యుడైన డయోనీస్యస్ (స్యూడో-డయోనీస్యస్ అని కూడా పిలువబడిన), నియోప్లేటోనిక్ తత్వశాస్త్రాన్ని “క్రైస్తవ” తత్వశాస్త్రంతో మిళితం చేయడానికి ప్రయత్నించాడు. ఒక ఎన్సైక్లోపీడియా చెప్తున్నదాని ప్రకారం, ఆయన “రచనలు మధ్యయుగాలకు చెందిన క్రైస్తవ సిద్ధాంత మరియు ఆధ్యాత్మికత యొక్క పెద్ద భాగంలోకి నియోప్లేటోనిక్ దృక్పథాన్ని ప్రవేశపెట్టడానికి మార్గాన్ని తెరిచాయి . . . ఆ తలంపులు ఈనాటికీ మతసంబంధంగా, భక్తిసంబంధంగా జరుగుతున్న దానిని ప్రభావితం చేస్తున్నాయి.” “మనుష్యుల పారంపర్యాచారమును . . . అనుసరిం[చే] మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము” గురించి అపొస్తలుడైన పౌలు చేసిన హెచ్చరికను ఎంత ఘోరంగా పరిహసించడం!—కొలొస్సయులు 2:8.
కలుషిత కారకాలు
“క్రైస్తవ ప్లేటోనిస్ట్లు దైవిక ప్రకటనకు ప్రాధాన్యతనిచ్చి, లేఖన బోధలనూ, చర్చి సాంప్రదాయాన్నీ అర్థం చేసుకోవడానికీ, సమర్థించడానికీ, ప్లేటో తత్వశాస్త్రాన్ని అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన పరికరంగా పరిగణించారు.”
మానవునిలో అమర్త్యమైనదేదో ఉందని ప్లేటో ఒప్పించబడ్డాడు. విశేషంగా, “క్రైస్తవ” వేదాంతంలోకి ప్రవేశించిన ప్రముఖమైన అబద్ధ బోధల్లో ఒకటి అమర్త్యమైన ఆత్మను గురించినది. క్రైస్తవత్వం ప్రజలకు మరింత ఆమోదయోగ్యమైనదిగా ఉండేలా చేస్తుందన్న విషయంపై ఆధారపడి ఆ బోధను అంగీకరించడం ఎంతమాత్రం సమర్థనీయమైన విషయం కాదు. గ్రీకు సంస్కృతికి ఆయువుపట్టు అయిన ఏథెన్సులో ప్రకటించేటప్పుడు అపొస్తలుడైన పౌలు, మానవునిలో అమర్త్యమైనదేదో ఉందన్న ప్లేటో సిద్ధాంతాన్ని బోధించలేదు. బదులుగా, ఆయన చెప్తున్నదాన్ని అంగీకరించడం అనేకమంది గ్రీకు శ్రోతలకు కష్టమే అయినప్పటికీ, ఆయన పునరుత్థానాన్ని గూర్చిన క్రైస్తవ సిద్ధాంతాన్ని ప్రకటించాడు.—అపొస్తలుల కార్యములు 17:22-32.
గ్రీకు తత్వజ్ఞానానికి విరుద్ధంగా, మరణానంతరం మానవుని నిజ స్థితిని గురించి లేఖనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” (ప్రసంగి 9:5) మానవునిలో అమర్త్యమైనదేదో ఉందన్న తలంపును బైబిలు బోధించడంలేదు. బైబిలు చెప్పే సరళమైన సత్యమేమిటంటే, మరణమందు మానవుడు ఉనికిలో లేకుండా పోతాడు.
మరో మోసకరమైన బోధ మానవ పూర్వపు యేసు స్థానాన్ని గూర్చినది, అంటే యేసు తన తండ్రితో సమానుడన్న తలంపును గూర్చినది. ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ సెంచురీస్ అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “త్రిత్వ సిద్ధాంతం . . . యూదా మరియు క్రైస్తవ లేఖనాలకు పూర్తిగా అపరిచితమైన మూలం నుండి ఆరంభమైంది.” ఆ మూలమేమిటి? ఈ సిద్ధాంతం “ప్లేటో అభిప్రాయాలను అనుకరించే ఫాదర్ల చేతుల్లో వృద్ధియై, క్రైస్తవత్వానికి అంటుకట్టబడింది.”
నిజానికి సమయం గడుస్తుండగా, చర్చి ఫాదర్లు నియోప్లేటోనిసమ్చే ఎక్కువగా ప్రభావితమయ్యారు, త్రిత్వ సిద్ధాంతకులు ప్రయోజనం పొందారు. మూడవ శతాబ్దానికి చెందిన నియోప్లేటోనిక్ తత్వశాస్త్రం సమాధానపర్చబడలేనిదాన్ని సమాధానపర్చేందుకు అంటే, మూడు భాగాల దేవుడు ఒకే దేవునిలా కనబడేలా చేసేందుకు వారికి సహాయపడినట్లు అనిపిస్తుంది. తత్వశాస్త్ర సంబంధ తర్కం ద్వారా, ముగ్గురు వ్యక్తులు తమ తమ వ్యక్తిత్వాలను అలాగే కలిగి ఉండి, ఒకే దేవుడు కాగలరని వాళ్లు ఆరోపించారు!
అయితే, యెహోవా మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవుడని, యేసుక్రీస్తు ఆయనకంటే తక్కువవాడనీ సృష్టించబడిన కుమారుడనీ, పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి అనీ బైబిలు సత్యం స్పష్టంగా చూపిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 6:4; యెషయా 45:5; అపొస్తలుల కార్యములు 2:4; కొలొస్సయులు 1:15; ప్రకటన 3:14) త్రిత్వ సిద్ధాంతం అద్వితీయ సత్య దేవుడ్ని అగౌరవపర్చి, ప్రజలు తాము గ్రహించలేని దేవుని నుండి దూరమైపోయేలా చేసి వారిని అయోమయంలో పడవేస్తుంది.
క్రైస్తవ ఆలోచనపై పడిన నియోప్లేటోనిక్ ప్రభావానికి బలైన మరొకటి, లేఖనాధారిత వెయ్యేండ్ల పరిపాలనా నిరీక్షణ. (ప్రకటన 20:4-6) ఒరిగెన్ “వెయ్యేండ్ల విశ్వాసుల”ను ఖండించడానికి పేరుపొందాడు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించిన ఈ బైబిలు ఆధారిత సిద్ధాంతాన్ని ఆయన ఎందుకంతగా వ్యతిరేకించాడు? ద క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా సమాధానమిస్తుంది: “ఆయన సిద్ధాంతాలు ఆధారపడివున్న నియోప్లేటోనిసమ్ దృష్ట్యా . . . [ఒరిగెన్] వెయ్యేండ్ల విశ్వాసుల పక్షం వహించలేకపోయాడు.”
సత్యం
పైన పేర్కొన్న అభివృద్ధులలో వేటికీ సత్యంతో ఏవిధమైన సంబంధమూ లేదు. బైబిల్లో కనుగొనబడే క్రైస్తవ బోధల పూర్తి సముదాయమే ఈ సత్యం. (2 కొరింథీయులు 4:2; తీతు 1:1, 14; 2 యోహాను 1-4) సత్యానికి బైబిలే ఏకైక మూలం.—యోహాను 17:17; 2 తిమోతి 3:16.
అయితే, యెహోవాకూ, సత్యానికీ, మానవజాతికీ, నిత్యజీవానికీ శత్రువు అంటే, ‘నరహంతకుడు,’ “అబద్ధమునకు జనకుడు” అయిన అపవాదియగు సాతాను, ఆ సత్యాన్ని కలుషితం చేయడానికి అనేకానేక మోసకరమైన మార్గాలను ఉపయోగించాడు. (యోహాను 8:44; పోల్చండి, 2 కొరింథీయులు 11:3.) క్రైస్తవ బోధల సారాన్నీ, నైజాన్నీ మార్చాలనే ప్రయత్నంలో, అతడు ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన పరికరాలు అన్య గ్రీకు తత్వవేత్తల బోధలు. నిజానికి అవి అతని స్వంత ఆలోచనా విధానానికి ప్రతిబింబాలే.
క్రైస్తవ బోధను, గ్రీకు తత్వంతో ఇలా అసహజంగా మిళితం చేయడమనేది, బైబిలు సత్యాన్ని పలుచనచేసి దానికున్న శక్తిని తగ్గించి, దీనులూ, యథార్థవంతులూ, బోధించదగినవారూ అయిన సత్యాన్వేషకులను ఆకట్టుకునేందుకు చేసిన ఒక ప్రయత్నమే. (1 కొరింథీయులు 3:1, 2, 19, 20) అది సత్యానికీ, అబద్ధానికీ మధ్యనున్న గీతను అస్పష్టం చేస్తూ, సుస్పష్టమైన బైబిలు సిద్ధాంత స్వచ్ఛతను కూడా కలుషితం చేస్తుంది.
నేడు, సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు నడిపింపు క్రింద, నిజ క్రైస్తవ బోధ పునఃస్థాపించబడింది. అంతేగాక, యథార్థవంతులైన సత్యాన్వేషకులు నిజ క్రైస్తవ సంఘాన్ని దాని ఫలాల ద్వారా ఎంతో సులభంగా గుర్తించగలరు. (మత్తయి 7:16, 20) అలాంటి వారు కలుషితంకాని సత్య జలాలను కనుగొనడానికీ, మన తండ్రియైన యెహోవా అనుగ్రహిస్తున్న నిత్యజీవ వారసత్వాన్ని గట్టిగా పట్టుకునేందుకు దోహదపడటానికీ, సహాయం చేయటం విషయంలో యెహోవాసాక్షులు సుముఖంగా, ఉత్సుకంగా ఉన్నారు.—యోహాను 4:14; 1 తిమోతి 6:19.
[11వ పేజీలోని చిత్రం]
అగస్టీన్
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Greek text: From the book Ancient Greek Writers: Plato’s Phaedo, 1957, Ioannis N. Zacharopoulos, Athens; Plato: Musei Capitolini, Roma