దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో జీవించడం
“దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. . . . ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే ఇంక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.—యెషయా 46:9, 10.
1, 2. భూ వ్యవహారాల్లో దేవుని జోక్యాన్ని గురించిన కొన్ని భిన్నాభిప్రాయాలు ఏవి?
మనుష్యుల వ్యవహారాల్లో దేవునికి ఎంత జోక్యం ఉంది? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం ఆయనకు ఏమాత్రం జోక్యం లేదు. అంటే, సృష్టి పనిని ముగించిన తర్వాత దేవుడు మానవుల పక్షంగా ఏమైనా చర్య తీసుకోవడానికి ఇష్టపడటం లేదు, లేక అందుకు ఆయనకు శక్తిలేదు. ఈ ఉద్దేశం ప్రకారం దేవుడు, తన కుమారుణ్ని క్రొత్త సైకిలు మీద కూర్చోబెట్టి, పల్లంగా ఉన్న రోడ్డుమీద ఆ సైకిలు సాగిపోవడానికి నెమ్మదిగా ముందుకు తోసిన ఒక తండ్రిని పోలి ఉన్నాడు. అటుతర్వాత, ఆ తండ్రి తన దారిన తను వెళ్లిపోతాడు. పిల్లవాడు మాత్రం ఏకాకి అయిపోయాడు; క్రింద పడనూవచ్చు, పడకపోవనూవచ్చు. ఏమి జరిగినా పరిణామాలు మాత్రం తండ్రి చేతుల్లో లేవు.
2 మరో దృక్కోణం ప్రకారం, దేవుడు మన జీవితాల్లోని ప్రతి అంశాన్నీ క్రియాశీలంగా నిర్దేశిస్తున్నాడు, ఆయన తన సృష్టికార్యంలోని ప్రతి సంఘటనలోనూ జోక్యం చేసుకుంటున్నాడు. అయితే ఇది వాస్తవమైతే, దేవుడు లోకంలోని మంచి సంగతులనే జరిగించడం లేదు కానీ మానవజాతిని పట్టిపీడిస్తున్న నేరమూ దుర్ఘటనలను కూడా జరిగిస్తున్నాడని కొందరు ఒక ముగింపుకు వస్తారు. దేవుని వ్యవహారాలను గూర్చిన వాస్తవాల్ని తెలుసుకోవడం మనం ఆయన నుండి ఏమి ఆశించవచ్చో తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు అలా చేయడం, ఆయన చేసిన వాగ్దానాల ఖచ్చితమైన నెరవేర్పు విషయమై మనకున్న విశ్వాసాన్ని కూడా దృఢపరుస్తుంది.—హెబ్రీయులు 11:1.
3. (ఎ) యెహోవా సంకల్పంగల దేవుడని మనకు ఎలా తెలుసు? (బి) యెహోవా తన సంకల్పాన్ని ‘నిర్ణయిస్తున్నట్లూ,’ ‘రూపిస్తున్నట్లూ’ ఎందుకు చెప్పబడింది?
3 మానవుల వ్యవహారాల్లో దేవుడు జోక్యం చేసుకోవటమన్న విషయంలో యెహోవా సంకల్పంగల దేవుడు అన్న వాస్తవం ప్రధానమైనది. ఇది ఆయన నామంలోనే అంతర్నిహితమై ఉంది. “యెహోవా” అంటే “తానే కర్త అవుతాడు” అని అర్థం. పురోభివృద్ధికరంగా చర్యలు తీసుకుంటూ యెహోవా తనను తాను, తను చేసిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేర్చేవానిగా చేసుకుంటాడు. అందుకనే, భవిష్య సంఘటనల గురించిన లేదా చర్యలను గురించిన తన సంకల్పాన్ని యెహోవా ‘నిర్ణయిస్తున్నట్లూ,’ లేదా రూపిస్తున్నట్లూ చెప్పబడింది. (2 రాజులు 19:25; యెషయా 46:11) ఈ పదాలు హెబ్రీ పదమైన యాట్సార్ నుండి వచ్చాయి, ఇది “కుమ్మరి” అని అర్థం వచ్చే పదానికి సంబంధించిన హెబ్రీ పదం. (యిర్మీయా 18:4) నైపుణ్యంగల కుమ్మరి జిగటమంటి ముద్దను ఒక సుందరమైన పాత్రగా రూపించగల్గినట్లే యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి విషయాల్ని రూపించగలడు, లేదా నడిపించగలడు.—ఎఫెసీయులు 1:11.
4. దేవుడు భూమిని మానవ ఆవాసం నిమిత్తం ఎలా సిద్ధపర్చాడు?
4 ఉదాహరణగా చూస్తే, ఈ పుడమి పరిపూర్ణులైన, విధేయులైన మానవులు నివసించే అత్యంత రమ్యమైన స్థలంగా, సుందరమైన ప్రాంతంగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. (యెషయా 45:18) తొలి స్త్రీపురుషులను సృష్టించడానికి ఎంతో కాలం పూర్వమే యెహోవా వారికోసం ప్రేమపూర్వకంగా ఎంతో సిద్ధపాటును చేశాడు. ఆదికాండములోని ఆరంభ అధ్యాయాలు యెహోవా పగటినీ రాత్రినీ, భూమినీ సముద్రాన్నీ ఎలా ఏర్పర్చాడో వర్ణిస్తున్నాయి. తర్వాత ఆయన వృక్షాల్నీ జంతుజాలాన్నీ సృష్టించాడు. భూమిని ఈ విధంగా మానవ ఆవాసం నిమిత్తం సిద్ధం చేయడానికి అనేక వేల సంవత్సరాలు పట్టాయి. సిద్ధపర్చే ఈ కార్యం జయప్రదంగా ముగించబడింది. తొలి పురుషుడు, తొలి స్త్రీ—తమ జీవితాల్ని ఆనందంగా గడిపేలా సమస్తమూ సమకూర్చివున్న ఆహ్లాదకరమైన ఆ పరదైసు వనమైన ఏదెనులో తమ జీవితాల్ని ప్రారంభించారు. (ఆదికాండము 1:31) ఆ విధంగా యెహోవా ఉదాత్తమైన తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు తన హస్తకృత్యాల్ని పురోభివృద్ధికరంగా రూపిస్తూ, భూవ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం కలిగివున్నాడు. మానవ కుటుంబం ఈ భూమ్మీద విస్తరించడం ఆయన జోక్యాన్ని ఏమైనా మార్చిందా?
మానవులతో తన వ్యవహారాలను యెహోవా పరిమితం చేశాడు
5, 6. మానవులతో తన వ్యవహారాలను దేవుడు ఎందుకు పరిమితం చేసుకున్నాడు?
5 మానవ కార్యకలాపాల్లో ప్రతి చిన్న అంశాన్నీ నిర్దేశించే, అదుపుచేసే శక్తి యెహోవాకు ఉన్నా ఆయన అలా చేయడు. ఇందుకు కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే, దేవుడు మానవుల్ని తన స్వరూపంలో సృష్టించాడు, వారికి స్వేచ్ఛాచిత్తం ఉంది, వారు స్వేచ్ఛగల నైతిక ప్రాణులు. తన ఆదేశాల్ని నెరవేర్చమని యెహోవా మనల్ని బలవంతపెట్టడు; మనము కీలుబొమ్మలమూ కాము. (ద్వితీయోపదేశకాండము 30:19, 20; యెహోషువ 24:15) మన చర్యలకు మనం ఆయనకు లెక్క ఒప్పజెప్పాల్సి ఉన్నా, మన జీవితాల్ని ఎలా నడిపించుకోవాలనుకుంటామో నిర్ణయించుకోవడానికి దేవుడు ప్రేమతో మనకు చెప్పుకోదగినంత మొత్తంలో స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు.—రోమీయులు 14:11, 12; హెబ్రీయులు 4:13.
6 సంభవించే ప్రతి సంఘటననీ దేవుడు ఎందుకు నిర్దేశించడన్న దానికి మరో కారణం, ఏదెనులో సాతాను లేవనెత్తిన వివాదాంశానికి సంబంధించినది. సాతాను దేవుని సర్వాధిపత్యాన్ని సవాలు చేశాడు. ఆయన హవ్వకు స్వాతంత్ర్యాన్ని పొందే అవకాశంగా కన్పించేదాన్ని ఇవ్వజూపాడు—దీన్ని మొదట ఆమె, అటుతర్వాత ఆమె భర్త అయిన ఆదాము స్వీకరించారు. (ఆదికాండము 3:1-6) దీనికి ప్రతిస్పందనగా, సాతాను చేసిన సవాలు న్యాయమైనదో కాదో రుజువు చేయడానికి మానవులు కొంత కాలంపాటు తమను తాము పరిపాలించుకునేందుకు దేవుడు అనుమతించాడు. ఈ కారణాన్నిబట్టి, నేడు మానవులు చేసే దుష్టకార్యాలకు దేవుణ్ని నిందించలేము. తిరుగుబాటుదారులైన వారిని గురించి మోషే ఇలా వ్రాశాడు: “వారు తమ్ము చెరుపుకొనిరి; [దేవుని] పుత్రులుకారు; వారు కళంకులు.”—ద్వితీయోపదేశకాండము 32:5.
7. భూమిపట్ల, మానవజాతిపట్ల యెహోవా సంకల్పమేమిటి?
7 అయితే స్వేచ్ఛా ఎంపికనూ, స్వతంత్ర పరిపాలనతో ప్రయోగాలు చేయడాన్నీ అనుమతించినప్పటికీ, యెహోవా భూవ్యవహారాలకు సంబంధించి ఏమాత్రం జోక్యంలేని విధానాన్ని అనుసరించడంలేదు. ఆయనలా చేసివుంటే ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే నిరీక్షణ మనకు ఏమాత్రం ఉండేది కాదు. ఆదాము హవ్వలు దేవుని సర్వాధిపత్యానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినప్పటికీ భూమిపట్ల, మానవజాతిపట్ల తనకు ఉన్న ప్రేమపూర్వకమైన సంకల్పాన్ని యెహోవా మార్చలేదు. ఆయన ఏమాత్రం వైఫల్యం లేకుండా, భూమిని పరిపూర్ణులైన, విధేయులైన, ఆనందప్రదమైన ప్రజలతో నింపి ఒక పరదైసుగా మారుస్తాడు. (లూకా 23:42, 43) ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న బైబిలు రికార్డు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి యెహోవా పురోభివృద్ధికరంగా ఏలా పనిచేస్తున్నాడో వర్ణిస్తుంది.
తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు చర్య గైకొంటున్నాడు
8. ఇశ్రాయేలీయులను వాగ్దత్త దేశానికి తీసుకురావడంలో ఏమి ఇమిడివుంది?
8 తన సంకల్పాన్ని సాధిస్తానని దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో తాను వ్యవహరించిన విధానాల్లో ప్రదర్శించాడు. ఉదాహరణకు, తాను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త దేశంలోనికి తీసుకువస్తానని యెహోవా మోషేకు హామీనిచ్చాడు. (నిర్గమకాండము 3:8) ఇదొక అసాధారణమైన ప్రకటన, పూర్తి హామీనిచ్చే ప్రకటన. ఇందుకు, తమ సహవాసులతో కలుపుకుని దాదాపు ముప్ఫై లక్షలుగా ఉన్న ఇశ్రాయేలీయులను, వారి నిర్గమనాన్ని పూర్ణశక్తితో వ్యతిరేకించిన ఒక బలమైన దేశం నుండి విడిపించడం ఆవశ్యకం. (నిర్గమకాండము 3:19) యెహోవా వారిని తీసుకురానైవున్న ప్రదేశం, వారి ఆగమనాన్ని పూర్తిబలంతో అడ్డుకునే శక్తివంతమైన జనాంగాలతో నిండివుంది. (ద్వితీయోపదేశకాండము 7:1) ఈ మధ్యలో ఇశ్రాయేలీయులకు ఆహారపానీయాలు అవసరమయ్యే అరణ్యప్రాంతం ఉంది. ఈ పరిస్థితి యెహోవా తన అత్యధికమైన శక్తినీ దేవత్వాన్నీ ప్రదర్శించడానికి ఆయనకు ఒక అవకాశాన్నిచ్చింది.—లేవీయకాండము 25:38.
9, 10. (ఎ) దేవుని వాగ్దానాలు నమ్మదగ్గవని యెహోషువ ఎందుకు సాక్ష్యం ఇవ్వగలిగాడు? (బి) తన విశ్వాసులకు ఫలాన్నిచ్చే విషయంలో దేవునికున్న సామర్థ్యంపై మనం నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యం?
9 దేవుడు ఒకదాని తర్వాత ఒకటిగా పరాక్రమ క్రియలను చేసి ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటికి నడిపించాడు. మొదటిగా, ఆయన ఐగుప్తు దేశం మీదికి పది వినాశనకరమైన తెగుళ్లను తెప్పించాడు. తర్వాత, ఆయన ఇశ్రాయేలీయులు తప్పించుకునేలా ఎఱ్ఱసముద్రాన్ని రెండు పాయలుగా చేసి, వారిని వెంటాడుతున్న ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేశాడు. (కీర్తన 78:12, 13, 43-51) దాని తర్వాత, ఆయన ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు వారిని పోషించాడు, వారికి తినడానికి మన్నా ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళిచ్చాడు, చివరికి వారి వస్త్రాలు పాతగిలకుండా వారి కాళ్లు వాయకుండా చూసుకున్నాడు. (ద్వితీయోపదేశకాండము 8:3, 4) ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించిన తర్వాత యెహోవా వారి శత్రువులపై విజయాన్ని సాధించేలా వారిని నడిపించాడు. యెహోవా వాగ్దానాల్లో దృఢమైన విశ్వాసాన్ని ఉంచిన యెహోషువ వీటన్నింటికీ ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. అందుకనే ఆయన తన కాలంలోని వృద్ధులకు పూర్తి నమ్మకంతో ఈ విధంగా చెప్పగలిగాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.
10 ఆ కాలంలోని యెహోషువ వలెనే నేడు క్రైస్తవులు, తనను సేవించే వారి పక్షాన చర్యతీసుకోవడానికి దేవుడు సుముఖంగా ఉన్నాడనీ అందుకు ఆయనకు శక్తివుందనీ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ దృఢమైన నమ్మకం మన విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగము. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.”—హెబ్రీయులు 11:6.
దేవుడు భవిష్యత్తును ముందే గ్రహిస్తాడు
11. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడాన్ని సాధ్యంచేసే కారకాలు ఏవి?
11 ఇంత వరకూ మనం, దేవుడు స్వేచ్ఛాచిత్తాన్నీ, స్వతంత్ర మానవ పరిపాలననూ అనుమతించినప్పటికీ, తన సంకల్పాన్ని సాధించడానికి ఆయనకు శక్తీ సుముఖతా ఉన్నాయని చూశాము. అయితే, దేవుని వాగ్దానాల ఖచ్చితమైన నెరవేర్పుకు దోహదపడే మరో కారకం కూడా ఉంది. యెహోవా భవిష్యత్తును ముందే గ్రహించగలడు. (యెషయా 42:9) తన ప్రవక్త ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” (యెషయా 46:9, 10) అనుభవజ్ఞుడైన ఒక వ్యవసాయదారునికి ఎప్పుడు ఎక్కడ విత్తనాలు నాటాలో తెలుసు, కానీ భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయన్న విషయంలో ఇంకా అనిశ్చయత ఉంటుంది. అయితే, “సకల యుగములలో రాజైయు[న్న]” దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు ఎక్కడ చర్య తీసుకోవాలో ముందే ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఆయనవద్ద ఖచ్చితమైన జ్ఞానం ఉంది.—1 తిమోతి 1:17.
12. నోవహు కాలంలో యెహోవా ఏ విధంగా భవిష్యజ్ఞానాన్ని ఉపయోగించాడు?
12 దేవుడు నోవహు కాలంలో ఎలా భవిష్యజ్ఞానాన్ని ఉపయోగించాడో పరిశీలించండి. భూమ్యంతటా వ్యాపించి ఉన్న దుష్టత్వం మూలంగా దేవుడు అవిధేయులైన మానవజాతిని అంతం చేయాలని నిర్ణయించాడు. తాను ఎప్పుడు అలా చేయాలనేదానికి సమయాన్ని కూడా నిర్ణయించాడు, అది అప్పటి నుండి 120 సంవత్సరాల తర్వాత రానైయుంది. (ఆదికాండము 6:3) ఆ నిర్దిష్టమైన కాలపరిమితిని నిర్ణయించడంలో యెహోవా దుష్టుల నాశనాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోలేదు, అది ఆయన ఎన్నడైనా చేయగలడు. యెహోవా కాల పట్టికలో నీతిమంతుల సంరక్షణకు కూడా ఏర్పాట్లు చేర్చబడ్డాయి. (పోల్చండి ఆదికాండము 5:29.) ఇలా చేయడానికి నడిపే పనిని ఎప్పుడు నియమించాలో తన అపారమైన జ్ఞానం మూలంగా దేవునికి ముందే తెలుసు. ఆయన నోవహుకు సరిపడినన్ని వివరణలతో కూడిన సమాచారాన్నిచ్చాడు. నోవహు “తన యింటివారి రక్షణకొరకు” ఒక ఓడను నిర్మించాల్సివుంది, దుష్టులు భౌగోళిక జలప్రళయంలో నాశనం కానైయున్నారు.—హెబ్రీయులు 11:7; ఆదికాండము 6:13, 14, 18, 19.
ఒక భారీ నిర్మాణ కార్యక్రమం
13, 14. ఓడ నిర్మాణం ఎందుకు సవాలుతో కూడిన నియామకం?
13 నోవహు వైపునుండి ఈ నియామకాన్ని దృష్టించండి. నోవహు దైవభయంగల వ్యక్తి గనుక దైవభయం లేనివారిని యెహోవా నాశనం చేయగలడని ఆయనకు తెలుసు. అయితే, అది జరగడానికి ముందు చేయాల్సిన పని ఉంది—అది విశ్వాసం అవసరమయ్యే పని. ఓడ నిర్మాణం అనేది ఒక భారీ నిర్మాణ కార్యక్రమం. దేవుడు దాని కొలతలను నిర్దేశించాడు. ఆ ఓడ నేటి క్రీడారంగ మైదానం కన్నా పొడవుగా, ఐదంతస్తుల మేడ అంత ఎత్తుగా ఉండనైయుంది. (ఆదికాండము 6:15) నిర్మాణకులు అనుభవరహితులు, సంఖ్య చూస్తే కొద్దిమందే. నేడు అందుబాటులో ఉన్న అత్యంతాధునిక పనిముట్లు, ఉపకరణాలు వారివద్ద లేవు. అంతేకాక, యెహోవావలె భవిష్యత్తును ముందే తెలుసుకునే సామర్థ్యం నోవహుకు లేదు గనుక, సంవత్సరాలు గడుస్తుండగా నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే లేదా నిరోధించే ఏ పరిస్థితులు తలెత్తుతాయన్నది తెలుసుకునే అవకాశం ఆయనకు లేదు. నోవహు మనస్సులో బహుశ అనేక ప్రశ్నలు ఉదయించి ఉండవచ్చు. నిర్మాణ సామగ్రిని ఎలా సమకూర్చాలి? జంతువుల్ని ఎలా దగ్గర చేర్చాలి? ఎటువంటి ఆహారం అవసరం అవుతుంది, ఎంత మొత్తంలో? ముందే చెప్పబడిన జలప్రళయం సరిగ్గా ఎప్పుడు రానైవుంది?
14 వీటన్నిటితోపాటు సామాజిక పరిస్థితుల్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. దుష్టత్వం పెచ్చుపెరిగిపోయింది. దుష్టులైన దేవదూతలకూ స్త్రీలకూ పుట్టిన సంకరజాతి సంతానమైన శూరులైన నెఫీలులు భూమిని హింసాకాండతో నింపేశారు. (ఆదికాండము 6:1-4, 13) అంతేగాక, ఓడ నిర్మాణం అనేది ఏదో రహస్యంగా కొనసాగించగల పని కాదు. నోవహు ఏమి చేస్తున్నాడని ప్రజలు ప్రశ్నించివుంటారు, నోవహు వారికి జవాబిచ్చివుంటాడు. (2 పేతురు 2:5) వారు దానికి అంగీకరించివుంటారా? ఎంతమాత్రం లేదు! అంతకు కొన్ని సంవత్సరాల మునుపు, విశ్వసనీయుడైన హనోకు దుష్టుల నాశనాన్ని ప్రకటించాడు. ఆయన సందేశం ప్రజలకు ఎంత చేదుగా ఉన్నదంటే, దేవుడు ఆయన్ని “తీసికొనిపోయెను,” లేక ఆయన జీవితకాలాన్ని తక్కువ చేశాడు, ఇది స్పష్టంగా ఆయన తన శత్రువుల చేతిలో హతమయ్యే పరిస్థితిని నివారించడానికే అయివుంటుంది. (ఆదికాండము 5:24; హెబ్రీయులు 11:5; యూదా 14, 15) నోవహు కూడా అదే విధంగా ప్రజలకు చేదుగా ధ్వనించే సందేశాన్ని ప్రకటించడమేగాక ఓడను కూడా నిర్మించాల్సివుంది. ఓడ నిర్మాణం జరుగుతుండగా, దుష్టులైన సమకాలీనులు ఉన్నప్పటికీ నోవహు విశ్వాస్యతకు అదొక శక్తివంతమైన రుజువుగా ఉండనైయుంది !
15. తాను తన నియామకాన్ని పూర్తిచేయగలనని నోవహుకు నమ్మకం ఎందుకు ఉంది?
15 తన పనికి సర్వోన్నత దేవుని మద్దతూ ఆశీర్వాదమూ ఉన్నాయని నోవహుకు తెలుసు. ఈ పనిని తనకు నియమించింది యెహోవాయే కాదూ? నోవహూ ఆయన కుటుంబమూ పూర్తైన ఓడలోనికి ప్రవేశిస్తారనీ భౌగోళిక జలప్రళయం నుండి తప్పించబడతారనీ యెహోవా నోవహుకు హామీనిచ్చాడు. దేవుడు దాని ఖచ్చితత్వాన్ని ఒక గంభీరమైన ఒప్పందంతో నొక్కితెల్పాడు. (ఆదికాండము 6:18, 19) బహుశ, ఈ నియామకాన్ని తనకు ఇవ్వడానికి ముందే యెహోవా అందులో ఇమిడివున్న విషయాలన్నింటినీ ఊహించి, జాగ్రత్తగా అంచనా వేశాడని నోవహు గుర్తించివుంటాడు. దానికితోడు, అవసరమైనప్పుడు జోక్యం చేసుకుని తనకు సహాయం చేసే శక్తి యెహోవాకు ఉన్నదని నోవహుకు తెలుసు. అందుకని నోవహుకున్న విశ్వాసం ఆయన చర్య గైకొనేలా నడిపించింది. ఆయన వంశస్థుడైన అబ్రాహాములా నోవహు “[దేవుడు] వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.”—రోమీయులు 4:21.
16. ఓడ నిర్మాణం ముందుకు సాగుతుండగా, నోవహు విశ్వాసం ఎలా దృఢమైంది?
16 సంవత్సరాలు గడిచి ఓడకు ఒక రూపం ఏర్పడుతుండగా నోవహు విశ్వాసం దృఢమైంది. నిర్మాణ సంబంధమైన, లెక్కల సంబంధమైన సమస్యలు పరిష్కరించబడ్డాయి. పరీక్షలు అధిగమించబడ్డాయి. ఎటువంటి వ్యతిరేకతా పనిని ఆపలేకపోయింది. నోవహు కుటుంబము యెహోవా మద్దతునూ సంరక్షణనూ అనుభవించింది. నోవహు ముందుకు సాగిపోతుండగా, ‘ఆయన విశ్వాసానికి కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించింది.’ (యాకోబు 1:2-4) చివరికి, ఓడ పూర్తైంది, జలప్రళయం వచ్చింది, నోవహూ ఆయన కుటుంబమూ జలప్రళయాన్ని తప్పించుకున్నారు. అటుతరువాతి కాలంలో జీవించిన యెహోషువ అనుభవించినట్లే, నోవహు దేవుని వాగ్దానాల నెరవేర్పును అనుభవించాడు. నోవహు విశ్వాసానికి ఫలము దక్కింది.
యెహోవా పనికి మద్దతునిస్తున్నాడు
17. ఏయే విధాలుగా మన కాలం నోవహు కాలానికి పోలివుంది?
17 మన కాలం నోవహు కాలానికి పోలివుంటుందని యేసు ముందే చెప్పాడు. దుష్టుల్ని నాశనం చేయాలని దేవుడు మళ్లీ నిర్ణయించాడు, ఇందుకు ఒక సమయాన్ని కూడా నిర్ణయించాడు. (మత్తయి 24:36-39) నీతిమంతుల్ని సంరక్షించడానికి ఆయన సిద్ధపాట్లు కూడా చేశాడు. నోవహు ఓడను నిర్మించాల్సిరాగా, నేడు దేవుని సేవకులు యెహోవా సంకల్పాలను ప్రకటించాల్సివుంది, ఆయన వాక్యాన్ని బోధించాల్సివుంది, శిష్యుల్ని చేయాల్సివుంది.—మత్తయి 28:19.
18, 19. సువార్త ప్రకటన పనికి యెహోవా మద్దతు ఉన్నదని మనకు ఎలా తెలుసు?
18 మద్దతునివ్వడానికీ, పోషించడానికీ యెహోవా నోవహుతో ఉండకపోయుంటే ఓడ నిర్మాణం జరిగివుండేది కాదు. (పోల్చండి కీర్తన 127:1.) అదే విధంగా, యెహోవా మద్దతు లేకుండా నిజ క్రైస్తవత్వం ఇంతవరకు నిలిచివుండేది కాదు, ఇక వర్ధిల్లడం సంగతి చెప్పనక్కరలేదు. ఈ విషయాన్ని మొదటి శతాబ్దంలో, ఘనత పొందిన పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలీయేలు గుర్తించాడు. యూదుల మహాసభ అపొస్తలులను సంహరించాలని ఉద్దేశించినప్పుడు ఆయన ఆ న్యాయసభను ఇలా హెచ్చరించాడు: “ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”—అపొస్తలుల కార్యములు 5:38, 39.
19 మొదటి శతాబ్దంలోనూ నేడూ చేయబడుతున్న ప్రకటనా పని విజయవంతం కావడం ఈ కార్యము మనుష్యులవలన కలిగినది కాదుగానీ దేవుని వలననే కలిగినదని నిరూపించింది. తర్వాతి శీర్షిక, ఈ కార్యము ఇంత విస్తారమైన పరిధిలో ఇంత విజయవంతం కావడానికి దోహదపడిన కొన్ని ఉత్తేజకరమైన పరిస్థితులనూ అభివృద్ధులనూ చర్చిస్తుంది.
నిస్పృహకు గురికాకండి!
20. మనం సువార్తను ప్రకటిస్తుండగా మనకు ఎవరు మద్దతునిస్తున్నారు?
20 మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నా, విషయాలన్నీ యెహోవా స్వాధీనంలో ఉన్నాయని పూర్తి నిశ్చయతతో ఉండగలము. ఈ దుష్ట విధానాంతానికి దేవుడు నిర్ణయించిన సమయం రావడానికి ముందు సువార్త ప్రకటనా పనిని ముగించడానికి కృషిచేస్తున్న తన ప్రజలకు మద్దతునిస్తూ ఆయన వారిని సంరక్షిస్తున్నాడు. (2 తిమోతి 3:1; మత్తయి 24:14) మనం తనతో ‘జతపనివారముగా’ ఉండటానికి యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (1 కొరింథీయులు 3:9) ఈ పనిలో యేసుక్రీస్తు మనతోపాటు ఉన్నాడనీ, మనం దేవదూతల మద్దతుపైనా నిర్దేశంపైనా ఆధారపడవచ్చనీ మనకు హామీ కూడా ఇవ్వబడింది.—మత్తయి 28:20; ప్రకటన 14:6.
21. ఏ కృతనిశ్చయాన్ని మనం ఎన్నడూ విడనాడకూడదు?
21 నోవహూ ఆయన కుటుంబమూ యెహోవా వాగ్దానాల్లో విశ్వాసం ఉంచారు గనుక వారు జలప్రళయం నుండి సజీవంగా రక్షించబడ్డారు. నేడు అటువంటి విశ్వాసాన్ని కలిగివుండేవారు రాబోయే “మహాశ్రమల” నుండి రక్షించబడతారు. (ప్రకటన 7:14) మనం నిజంగా ఉత్తేజకరమైన కాలాల్లో జీవిస్తున్నాము. మున్ముందు ఉత్కంఠ భరితమైన సంఘటనలు జరుగనైయున్నాయి! త్వరలోనే, దేవుడు నీతి నివసించే మహిమాన్వితమైన క్రొత్త ఆకాశాన్నీ క్రొత్త భూమినీ తీసుకురావడానికి చర్యగైకొంటాడు. (2 పేతురు 3:13) దేవుడు ఏమి చెప్పినా, దాన్ని నెరవేర్చే సామర్థ్యం ఆయనకు ఉందన్న మీ కృతనిశ్చయాన్ని విడనాడకండి, ఎన్నడూ.—రోమీయులు 4:21.
గుర్తు తెచ్చుకోవల్సిన విషయాలు
◻ యెహోవా మానవ కార్యకలాపాల్లో ప్రతి చిన్న అంశాన్నీ ఎందుకు అదుపు చేయడు?
◻ తన సంకల్పాన్ని సాధించడంలో యెహోవాకున్న సామర్థ్యం ఇశ్రాయేలుతో తాను వ్యవహరించిన విధానంలో ఎలా అవగతమైంది?
◻ యెహోవాకున్న భవిష్యత్తును చూడగల సామర్థ్యం నోవహు కాలంలో ఎలా ప్రదర్శితమైంది?
◻ దేవుని వాగ్దానాల్లో మనం ఏ నమ్మకాన్ని కలిగివుండగలము?