కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 7/15 పేజీలు 4-8
  • బైబిలు ప్రవచనాన్ని మీరెందుకు నమ్మవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ప్రవచనాన్ని మీరెందుకు నమ్మవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విభిన్నతలు
  • మీరు బైబిలు ప్రవచనాన్ని నమ్ముతారా?
  • నమ్మదగ్గ భవిష్యవాణుల అన్వేషణలో
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • భవిష్యత్తును కనిపెట్టడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • బైబిలు ప్రవచనాల నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రవచన గ్రంథం
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 7/15 పేజీలు 4-8

బైబిలు ప్రవచనాన్ని మీరెందుకు నమ్మవచ్చు?

వాయవ్య గ్రీస్‌లోని ఇపైరస్‌కు రాజైన ఫిర్రస్‌ రోమా సామ్రాజ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతూ ఉన్నాడు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో కొంచెం తెలుసుకోవాలన్న విపరీతమైన కోరికతో ఆయన డెల్ఫైలోని పుణ్యక్షేత్రాన్ని సంప్రదిద్దామని వెళ్లాడు. ఆయన పొందిన జవాబును మాత్రం ఈ రెండు విధాలుగా అర్థంచేసుకోవచ్చు: (1) “ఏకుస్‌ కుమారుడా, నీవు రోమన్‌లను జయించగలవు. నీవు వెళ్తావు, నీవు తిరిగి వస్తావు, యుద్ధంలో నీవు ఎన్నడూ నాశనంకావు.” (2) “ఏకుస్‌ కుమారుడా, రోమన్‌లు నిన్ను జయించగలరని నేను చెప్తున్నాను. నీవు వెళ్తావు, ఎన్నడూ తిరిగిరావు, నీవు యుద్ధంలోనే నశిస్తావు.” ఆయన ఆ జోస్యాన్ని మొదటి రీతిగా అర్థంచేసుకోవాలని ఎంపికచేసుకున్నాడు, అందుకని రోమ్‌పైకి యుద్ధానికి వెళ్లాడు. ఫిర్రస్‌ ఘోర పరాజయాన్ని చవిచూశాడు.

అటువంటి సంఘటనలు ప్రాచీన జోస్యాలు అస్పష్టమైనవిగా తికమకపెట్టేవిగా పేరుపొందేందుకు కారణమయ్యాయి. కానీ బైబిలు ప్రవచనాల సంగతేమిటి? బైబిలులోని ప్రవచనాలు జోస్యాలకన్నా గొప్పవేమీ కావని కొందరు సంశయవాదులు వాదిస్తారు. బైబిలు భవిష్యవాణులు కేవలం భవిష్య సంఘటనలను గురించి చాలా తెలివిగల, గ్రహణశక్తిగల వారిచే, సాధారణంగా యాజకవర్గంవారిచే వివేచనాపూర్వకంగా చెప్పబడినవి మాత్రమేననీ ఈ విమర్శకులు తలుస్తారు. అనుభవం ద్వారా లేదా ప్రముఖులతో తమకున్న సంబంధాల ద్వారా వీరు కొన్ని పరిస్థితుల సహజ పరిణామాలను ముందే గ్రహించారని చెప్పబడుతుంది. అనేక బైబిలు ప్రవచనాల్లోని కొన్ని లక్షణాలను జోస్యాల్లోని లక్షణాలతో పోల్చడం ద్వారా మనం సరియైన ముగింపులకు రావడానికి మరింత యోగ్యమైన స్థితిలో ఉంటాము.

విభిన్నతలు

జోస్యాల గుర్తింపు చిహ్నం వాటి అస్పష్టతే. ఉదాహరణకు డెల్ఫైలో చెప్పబడే జవాబులు అస్పష్టమైన శబ్దాల్లో ఉచ్చరించబడేవి. ఇందుమూలంగా పూజారులు వాటి భావాన్ని చెప్పి, పూర్తి వ్యతిరేక భావం కూడా రాగల వచనాల్ని సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. ఇందుకు ఒక ఉత్తమమైన ఉదాహరణ లిడియా రాజైన క్రోయిసస్‌కు ఇవ్వబడిన జవాబు. ఆయన పుణ్యక్షేత్రాన్ని సంప్రదించినప్పుడు ఆయనకు, “క్రోయిసస్‌ హేలిస్‌ నదిని దాటినట్లైతే ఆయన ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్నే నాశనం చేస్తాడు” అని చెప్పబడింది. నిజానికి, నాశనమైన ‘శక్తివంతమైన సామ్రాజ్యం’ ఆయన సొంత సామ్రాజ్యమే! క్రోయిసస్‌ కప్పదొకియపై దండెత్తడానికి హేలిస్‌ నదిని దాటినప్పుడు ఆయన పారసీకుడైన కోరెషు చేతిలో ఓటమిని చవిచూశాడు.

అన్యుల జోస్యాలకు పూర్తి భిన్నంగా బైబిలు ప్రవచనాలు వాటి ఖచ్చితత్వానికీ స్పష్టతకూ పేరుగాంచాయి. ఒక ఉదాహరణ, బబులోను పడిపోవడం గురించినది, ఇది బైబిలు పుస్తకమైన యెషయాలో నమోదు చేయబడింది. ఈ సంఘటన జరగడానికి దాదాపు 200 సంవత్సరాలు పూర్వమే, బబులోనును మాదీయపారసీక సామ్రాజ్యం కూలద్రోసే విషయాన్ని గురించి ప్రవక్తయైన యెషయా వివరణాత్మకమైన, ఖచ్చితమైన రీతిలో ప్రవచించాడు. ఈ ప్రవచనం, విజయునికి కోరేషు అనే పేరు ఉంటుందనీ, రక్షణ వ్యవస్థ అయిన కందకంలాంటి నదిని ఎండిపోజేయడం, తెరిచివున్న ద్వారాల గుండా కోటలాంటి నగరంలోనికి ప్రవేశించడం వంటి వ్యూహాలనూ వెల్లడిచేసింది. ఇదంతా ఖచ్చితంగా నెరవేరింది. (యెషయా 44:27-45:2) బబులోను చివరికి పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుందని కూడా ఖచ్చితమైన రీతిలో ప్రవచించబడింది.—యెషయా 13:17-22.

ప్రవక్తయైన యోనా ప్రకటించిన ఈ క్రింది హెచ్చరికలో ఉన్న స్పష్టతను కూడా గమనించండి: “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగు[ను].” (యోనా 3:4) ఇక్కడ ఎటువంటి అస్పష్టత లేదు! సందేశం ఎంత నిక్కచ్చిగా సూటిగా ఉందంటే నీనెవె పట్టణపువారు వెంటనే “దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” వారి పశ్చాత్తాపానికి ఫలితంగా యెహోవా ఆ సమయంలో నీనెవెవారి మీదికి నాశనాన్ని తీసుకురాలేదు.—యోనా 3:5-10.

జోస్యాలు రాజకీయ లబ్దికోసం ఉపయోగించబడ్డాయి. తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, కార్యకలాపాలను కొనసాగించడానికి పరిపాలకులూ, సైనికాధికారులూ తరచు తమకు నచ్చిన జోస్యాల్ని పేర్కొన్నారు, తద్వారా అటువంటి వాటికి “దైవిక ముసుగు” తొడిగారు. అయితే దేవుని ప్రవచనాత్మక సందేశాలు వ్యక్తిగత అభిప్రాయాలకు లొంగకుండా ప్రకటించబడ్డాయి.

ఉదాహరణకు: యెహోవా ప్రవక్త అయిన నాతాను తప్పుచేసిన రాజైన దావీదును గద్దించడానికి వెనుకాడలేదు. (2 సమూయేలు 12:1-12) పది గోత్రాల రాజ్యమైన ఇశ్రాయేలుపై రాజ్యం చేస్తున్న రెండవ యరొబాము పరిపాలనలో, తిరుగుబాటుదారుడైన ఆ రాజు ఆయన మద్దతుదారుల భ్రష్టత్వాన్ని బట్టీ, దేవుణ్ణి అవమానపర్చే వారి ప్రవర్తనను బట్టీ ప్రవక్తలైన హోషేయ ఆమోసులు వారి గురించి ఖండితమైన విమర్శలను చేశారు. (హోషేయ 5:1-7; ఆమోసు 2:6-8) ప్రవక్తయైన ఆమోసు నోట యెహోవా ఈ రాజుకు విన్పించిన హెచ్చరిక ప్రాముఖ్యంగా ఘాటుగా ఉంది: “నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.” (ఆమోసు 7:9) యరొబాము గృహం సమూలంగా నాశనం అయ్యింది.—1 రాజులు 15:25-30; 2 దినవృత్తాంతములు 13:20.

జోస్యాలు అధికశాతం ధనం చెల్లిస్తేనే చెప్పబడేవి. ఎక్కువ ధనం ముట్టజెప్పిన వ్యక్తికి తాను కోరుకున్న విధంగా జోస్యం లభిస్తుంది. డెల్ఫైలోని పుణ్యక్షేత్రాన్ని సంప్రదించినవారు ఎందుకూ పనికిరాని సమాచారాన్ని పొందడానికి పెద్ద మొత్తంలోనే ధనం చెల్లించేవారు, తద్వారా వారు అపొల్లో దేవాలయ ఖజానాను ఇతర కట్టడాల ఖజానాలను నింపారు. దానికి విరుద్ధంగా బైబిలులో ఇవ్వబడిన ప్రవచనాలు హెచ్చరికలు ఉచితంగా ఇవ్వబడేవి, ఏదేమైనప్పటికీ, వాటిలో ఎటువంటి పక్షపాతమూ ఉండేదికాదు. అవి నిర్దేశించబడిన వ్యక్తి యొక్క స్థానంతో లేక ధనసంపదలతో నిమిత్తం లేకుండా ఇది వాస్తవమైవుంది, ఎందుకంటే నిజ ప్రవక్తకు లంచం ఇవ్వజూపడం సాధ్యంకాదు. ప్రవక్తా, న్యాయాధిపతీ అయిన సమూయేలు నిజాయితీగా ఇలా అడగగలిగాడు: “న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా?”—1 సమూయేలు 12:3.

జోస్యాలు కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో మాత్రమే చెప్పబడేవి గనుక వాటిని పొందడానికి ఎవరైనా సరే ఎంతో శ్రమపడి అక్కడికి ప్రయాణించాల్సి వచ్చేది. సగటు మనిషికి ఆ ప్రాంతాల్లో చాలామటుకు చేరుకోవడానికి దుస్సాధ్యంగా ఉండేవి, ఎందుకంటే అవి ఇపైరస్‌లోని టోమారస్‌ పర్వతంమీద ఉన్న డడోనా, పర్వతశ్రేణులతో కూడిన మధ్య గ్రీసులో ఉన్న డెల్ఫై వంటి ప్రాంతాల్లో ఉండేవి. సాధారణంగా కేవలం ధనవంతులు శక్తిమంతులు మాత్రమే అటువంటి పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్లను సంప్రదించగలిగేవారు. అంతేకాక, “దేవుళ్ళ చిత్తము” సంవత్సరంలోని కొన్ని దినాల్లో మాత్రమే వెల్లడి చేయబడేది. దీనికి పూర్తి విరుద్ధంగా, యెహోవా దేవుడు తన ప్రవచనాత్మక సందేశకులను తిన్నగా ప్రజలవద్దకే—వారు వినాల్సిన అవసరం ఉన్న ప్రవచనాలను వినిపించడానికి వారిదగ్గరికే పంపాడు. ఉదాహరణకు, యూదులు బబులోనులోని చెరలో ఉన్న కాలంలో దేవుడు కనీసం ముగ్గురు ప్రవక్తలను తన ప్రజల మధ్య సేవచేయడానికి పంపించాడు—యెరూషలేములో యిర్మీయా, చెరలో ఉన్నవారికి యెహెజ్కేలు, బబులోను సామ్రాజ్య రాజధానిలో దానియేలు.—యిర్మీయా 1:1, 2; యెహెజ్కేలు 1:1; దానియేలు 2:48.

జోస్యాలు సాధారణంగా రహస్యంగా ఇవ్వబడేవి, ఇందుమూలంగా వీటిని పొందినవ్యక్తి తనకు సొంతగా ప్రయోజనం కలిగేవిధంగా వాటికి భావం చెప్పే అవకాశం ఉంది. దానికి విరుద్ధంగా, బైబిలు ప్రవచనాలు తరచూ బహిరంగంగా ఇవ్వబడేవి, తద్వారా ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ విని అందులోని భావాలన్నింటినీ అర్థం చేసుకోగలిగేవారు. ప్రవక్తయైన యిర్మీయా అనేకసార్లు యెరూషలేములో బహిరంగంగా మాట్లాడాడు, తన సందేశమంటే ఆ నగరంలోని నాయకులకూ అందులోని ప్రజలకూ ఇష్టంలేదని తెలిసినా కూడా ఆయనలా చేశాడు.—యిర్మీయా 7:1, 2.

నేడు జోస్యాలు ప్రాచీన చరిత్రలో ఒక భాగంగా దృష్టించబడుతున్నాయి. నేటి అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్న ప్రజలు వాటి నుండి ఏ ఆచరణయోగ్యమైన ప్రయోజనాన్నీ పొందలేరు. అటువంటి జోస్యాలు మన కాలం గురించీ లేదా మన భవిష్యత్తు గురించీ మాట్లాడటం లేదు. ఈ విషయంలో గమనార్హమైన విభిన్నతతో బైబిలు ప్రవచనాలు, “సజీవమై బలముగలదై” ఉన్న “దేవుని వాక్యము”లో భాగమైవున్నాయి. (హెబ్రీయులు 4:12) ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనాలు, ప్రజలతో యెహోవా ఎలా వ్యవహరిస్తాడనే దానికి నమూనాగా ఉన్నాయి, ఆయన సంకల్పాల్ని గురించిన వ్యక్తిత్వాన్ని గురించిన కీలకమైన లక్షణాలను వెల్లడి చేస్తున్నాయి. దానికితోడు, ప్రాముఖ్యమైన బైబిలు ప్రవచనాలు సమీప భవిష్యత్తులో నెరవేరనైయున్నాయి. ముందున్న వాటిని గురించి వర్ణిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అయనను మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల [పరలోక మెస్సీయా రాజ్యం] కొరకును క్రొత్త భూమి [నీతియుక్తమైన మానవ సమాజం] కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

బైబిలు ప్రవచనాలను అబద్ధమతంలోని జోస్యాలతో పోలుస్తూ చేసిన ఈ క్లుప్త పరిశీలన, ద గ్రేట్‌ ఐడియాస్‌ అనే పుస్తకంలో వ్యక్తం చేయబడిన ముగింపుకే మీరూ చేరుకునేందుకు నడిపించవచ్చు: “మర్త్యులైన మానవులకుగల భవిష్యజ్ఞానము అనేదానికి సంబంధించినంత మట్టుకు హెబ్రీ ప్రవక్తలు విశిష్టమైనవారిగా కన్పిస్తున్నారు. అన్యుల్లోని మంత్రగాళ్లు, జ్యోతిష్కుల్లా కాకుండా, . . . వారు దైవిక రహస్యాలను భేదించడానికి ఎటువంటి కళలూ లేక ఉపకరణాలూ ఉపయోగించనవసరం లేదు. . . . అత్యధిక శాతం వారి ప్రవచనాత్మక సందేశాలు పూజారుల సందేశాలకు భిన్నంగా విస్పష్టంగా ఉన్నట్లు కన్పిస్తున్నాయి. కనీసం వాటిలోని ఉద్దేశం మరుగు చేయడం కాదు గానీ బయల్పర్చడమేనని అనిపిస్తుంది.”

మీరు బైబిలు ప్రవచనాన్ని నమ్ముతారా?

మీరు బైబిలు ప్రవచనాన్ని నమ్మవచ్చు. నిజానికి మీరు మీ జీవితాన్ని యెహోవా చుట్టూ, ఆయన ప్రవచనాత్మక వాక్యం చుట్టూ నిర్మించుకోవచ్చు. బైబిలు ప్రవచనం ఇప్పటికే నెరవేరిన భవిష్యవాణుల జీవంలేని రికార్డు కాదు. లేఖనాల్లోని అనేక ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి లేదా సమీప భవిష్యత్తులో వాస్తవరూపం దాల్చనైయున్నాయి. గతాన్ని పరిశీలనగా చూసి, మనం అవి కూడా నెరవేరతాయని పూర్తి నిశ్చయతతో ఉండగలము. అటువంటి ప్రవచనాలు మన కాలాలపై కేంద్రీకరించి ఉన్నాయి గనుక, మన స్వంత భవిష్యత్తు వాటిలో ఇమిడివుంది గనుక మనం వాటిని గంభీరంగా తీసుకోవడం మంచిది.

యెషయా 2:2, 3లో ఉన్న బైబిలు ప్రవచనాన్ని మీరు నిశ్చయంగా నమ్మవచ్చు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచ[బడును]. . . . జనములు గుంపులు గుంపులుగా వచ్చి . . . యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” నేడు లక్షలాదిమంది యెహోవా యొక్క ఉన్నతపర్చబడిన ఆరాధనను నిజంగానే స్వీకరిస్తున్నారు, ఆయన మార్గాల్లో నడవడం నేర్చుకుంటున్నారు. దేవుని మార్గాల విషయమై మరింతగా నేర్చుకునే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుని, ఆయన మార్గాల్లో నడిచేందుకుగాను ఆయన్ను గురించీ ఆయన సంకల్పాలను గురించీ కచ్చితమైన జ్ఞానాన్ని తీసుకుంటారా?—యోహాను 17:3.

మరో బైబిలు ప్రవచన నెరవేర్పు మన పక్షంగా అత్యవసరమైన చర్యను కోరుతుంది. సమీప భవిష్యత్తును గురించి కీర్తనల గ్రంథకర్త ప్రవచనాత్మకంగా ఇలా పాడాడు: “కీడు చేయువారు నిర్మూలమగుదురు. . . . ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు.” (కీర్తన 37:9, 10) దుష్టులపైకీ, అలాగే బైబిలు ప్రవచనాలను గురించి ధిక్కారంగా మాట్లాడేవారిపైకీ రానైయున్న నాశనాన్ని తప్పించుకోవడానికి ఏమి చేయవలసి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే కీర్తన ఇలా జవాబిస్తుంది: “యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:9) యెహోవా కొరకు కనిపెట్టుకోవడం అంటే ఆయన వాగ్దానాలపై సంపూర్ణ నమ్మకాన్ని ఉంచడం అనీ, మన జీవితాల్ని ఆయన ప్రమాణాలకు అనుగుణ్యంగా మార్చుకోవడం అనీ అర్థం.—సామెతలు 2:21, 22.

యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ఈ భూమిని స్వతంత్రించుకున్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? మళ్లీ, విధేయతగల మానవజాతి కోసం మహిమాన్వితమైన భవిష్యత్తు సిద్ధంగా ఉందని బైబిలు ప్రవచనాలు వెల్లడిస్తున్నాయి. ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులువేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును.” (యెషయా 35:5, 6) అపొస్తలుడైన యోహాను పూర్తి నమ్మకాన్నిచ్చే ఈ మాటల్ని వ్రాశాడు: “ఆయన [యెహోవా] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను]. . . . అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని . . . చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:4, 5.

బైబిలు నమ్మదగ్గ ప్రవచనాల పుస్తకమని యెహోవాసాక్షులకు తెలుసు. వారు అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉద్బోధతో పూర్తిగా ఏకీభవిస్తారు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” (2 పేతురు 1:19) భవిష్యత్తును గురించి బైబిలు ప్రవచనాల్లో ఇవ్వబడిన వైభవంతో కూడిన ఉత్తరాపేక్షలు మీ హృదయాల్ని ఉల్లాసపరుస్తాయని మా హృదయపూర్వకమైన ఆశ !

[6వ పేజీలోని చిత్రం]

డెల్ఫైలోని పుణ్యక్షేత్రం ప్రాచీన గ్రీసులోని అత్యంత వైభవోపేతమైనది.

[చిత్రాలు]

పూజారిణి ముక్కాలి పీఠంపై కూర్చుని తన జోస్యాలు చెప్పేది

మత్తును కలుగజేసే ధూపం పూజారిణికి పారవశ్యాన్ని కలుగజేసేది

ఆమె ఉచ్చరించిన శబ్దాలు అపొల్లో దేవుని నుండి వచ్చే ప్రకటనలని నమ్మబడేవి

[క్రెడిట్‌ లైను]

Tripod: From the book Dictionary of Greek and Roman Antiquities; Apollo: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[7వ పేజీలోని చిత్రం]

డెల్ఫై పుణ్యక్షేత్రంలో ఇవ్వబడిన భవిష్యవాణులు ఏమాత్రం నమ్మదగినవి కావు

[క్రెడిట్‌ లైను]

Delphi, Greece

[8వ పేజీలోని చిత్రం]

నూతన లోకాన్ని గురించిన బైబిలు ప్రవచనాల్లో మీరు పూర్తి నమ్మకాన్ని కలిగివుండవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి