నిరీక్షణచే లంగరు వేయబడి, ప్రేమచే పురికొల్పబడాలి
“విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.”—1 కొరింథీయులు 13:13.
1. అపొస్తలుడైన పౌలు మనకు ఏ హెచ్చరికను ఇస్తున్నాడు?
ఓడ ఎలాగైతే బద్దలైపోగలదో మన విశ్వాసం కూడా అలాగే బద్దలైపోగలదని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ‘విశ్వాసమునూ మంచి మనస్సాక్షినీ కలిగివుండటం’ గురించి మాట్లాడుతూ, “అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమైన ఓడ బద్దలై పోయన వారివలె చెడియున్నారు” అని ఆయన చెబుతున్నాడు. (1 తిమోతి 1:18, 19) సా.శ. మొదటి శతాబ్దంలో సముద్రయానం చేసే ఓడలు కలపతో చేయబడేవి. అవి సముద్రయానానికి తగినవా కావా అన్నది ఆ కలప నాణ్యతపైనా, నైపుణ్యవంతమైన ఓడనిర్మాణంపైనా ఆధారపడివుండేది.
2. మన విశ్వాసపు ఓడ దృఢంగా ఎందుకు నిర్మించబడాలి, ఇందుకు మనం ఏమి చేయాల్సిన అవసరం ఉంది?
2 మన విశ్వాసపు ఓడ అని పిలువబడగలది మానవజాతి అనే అల్లకల్లోల సముద్రజలాలపై తేలుతూ ఉండాలి. (యెషయా 57:20; ప్రకటన 17:15) కాబట్టి అది చక్కగా నిర్మించబడివుండాలి, ఇది మనపైనే ఆధారపడివుంటుంది. యూదా మరియు రోమా ప్రాంతాల్లోని “సముద్రములు” తొలి క్రైస్తవులకు మరీ కష్టాలు కలుగజేస్తున్నప్పుడు, యూదా ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20, 21) యూదా ‘పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ [“విశ్వాసము,” NW]’ గురించి కూడా మాట్లాడాడు కాబట్టి, పైన ఉన్న “విశ్వసించు అతిపరిశుద్ధమైన[ది]” అనే వ్యక్తీకరణ రక్షణ సువార్తతోపాటు క్రైస్తవ బోధల పూర్తి సముదాయాన్ని సూచిస్తుండవచ్చు. (యూదా 3) ఆ విశ్వాసానికి క్రీస్తు పునాది. మనం నిజమైన క్రైస్తవ విశ్వాసానికి హత్తుకుని ఉండాలంటే బలమైన విశ్వాసం అవసరం.
“మతతెగల భయం” తుపానును తాళుకోవడం
3. కొందరు “మతతెగల భయం”ను ఎలా ఉపయోగించుకుంటున్నారు?
3 ఇటీవలి సంవత్సరాల్లో గూఢమైన మతతెగలు ఇమిడివున్న సామూహిక ఆత్మహత్యలు, హత్యలు, ఉగ్రవాదుల దాడులు వంటి అనేక భయంకరమైన సంఘటనలు జరిగాయి. అందుకనే అనేకమంది వ్యక్తులు, చివరికి నిజాయితీగల రాజకీయ నాయకులు కూడా అమాయక ప్రజలను ప్రాముఖ్యంగా చిన్నపిల్లలను అలాంటి ప్రమాదకరమైన మతతెగల నుండి కాపాడటం విషయమై కలతచెందడం అర్థం చేసుకోదగినదే. ఈ భయంకరమైన నేరాల వెనుక నిస్సందేహంగా ఉన్న “ఈ యుగ సంబంధమైన దేవత” ఆ విధంగా, మతతెగల భయం అని కొందరు పిలిచే వాతావరణాన్ని సృష్టించాడు, దీన్ని యెహోవా ప్రజలకు విరుద్ధంగా ఉపయోగించుకుంటున్నాడు కూడా. (2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:12) కొంతమంది ఈ పరిస్థితిని మన పనికి విరుద్ధంగా వ్యతిరేకతను రేకెత్తించడానికి ఉపయోగించుకున్నారు. కొన్ని దేశాల్లో వారు ప్రజల్ని “ప్రమాదకరమైన మతతెగల” నుండి కాపాడటమే తమ లక్ష్యమని పైకిచెబుతూ ప్రచార ఉద్యమాల్ని లేవదీశారు, కానీ ఈ మతతెగల్లో యెహోవాసాక్షులు కూడా ఉన్నారని తప్పుగా పేర్కొంటూ వారు అన్యాపదేశంగా మనపై నిందవేశారు. ఇది యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఇంటింటి సాక్ష్యపు పనిని కష్టతరం చేసింది, అంతేకాదు మనతో బైబిలును పఠిస్తున్న కొంతమంది తమ పఠనాన్ని ఆపేసేందుకు కూడా ఇది దారితీసింది. తత్ఫలితంగా, ఇది మన సహోదరుల్లో కొందరిపైన ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపించింది.
4. వ్యతిరేకత మనల్ని ఎందుకు నిరుత్సాహపర్చకూడదు?
4 అయితే, మనల్ని నిరుత్సాహపర్చడానికి బదులు, వ్యతిరేకత అనేది మనం నిజమైన క్రైస్తవత్వాన్ని ఆచరిస్తున్నామన్న మన దృఢ విశ్వాసాన్ని మరింత బలపర్చాలి. (మత్తయి 5:11, 12) తొలి క్రైస్తవులు కలహాల్ని రేపుతున్న మతతెగ అని నిందించబడ్డారు, వారిని గురించి “అంతట ఆక్షేపణ” చేయబడింది. (అపొస్తలుల కార్యములు 24:5; 28:22) కానీ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాస్తూ తన తోటి విశ్వాసులను స్థిమితపర్చాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొకవింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.” (1 పేతురు 4:12, 13) అదే విధంగా, మొదటి శతాబ్దపు పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:2-4) ప్రచండ వేగంతో వీచే తుపాను గాలులు ఓడ పాటవాన్ని పరీక్షించినట్లే, వ్యతిరేకతా తుపానులు మన విశ్వాసపు ఓడలో బలహీనతలేమైనా ఉంటే బహిర్గతం చేస్తాయి.
శ్రమలు ఓర్పును ఉత్పత్తిచేస్తాయి
5. మన విశ్వాసం శ్రమల్లో స్థిరంగా ఉండేలా మనం ఎలా నిశ్చయతను కలిగివుండగలము?
5 క్రైస్తవులు శ్రమల తుపానులను తాళుకున్న తర్వాతే తమ ఓర్పును గురించీ, తమ విశ్వాసపు స్థిరత్వం గురించీ నిశ్చయతను కలిగివుండగలరు. మనం ‘సంపూర్ణులుగాను, అనూనాంగులుగాను, ఏ విషయములోనైనా’ చివరికి బలమైన విశ్వాసము విషయంలోనైనా ‘కొదువలేనట్లైతే’ మాత్రమే, తుపాను ఉన్న సముద్రజలాల్లో మన ఓర్పు ‘తన క్రియను కొనసాగిస్తుంది.’ పౌలు ఇలా వ్రాశాడు: “శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును . . . మిగుల ఓర్పుగలవారమై, . . . దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే [“సిఫారసు చేసికొనుచున్నాము,” NW] మెప్పించుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 6:4-8.
6. మనం “శ్రమలయందు” ఎందుకు ‘అతిశయపడాలి,’ ఇది మన నిరీక్షణను ఎలా బలపరుస్తుంది?
6 మనం కొన్నిసార్లు అనుభవించే ప్రచండ వేగంతో వీచే శ్రమల తుపాను గాలుల్ని, మన విశ్వాసపు ఓడ దృఢంగాను స్థిరంగాను ఉందని రుజువు చేసుకోవడానికి వచ్చే అవకాశాలుగా దృష్టించాలి. రోములోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను [“ఆమోద స్థితిని,” NW], పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.” (రోమీయులు 5:3-5) శ్రమల్లో స్థిరంగా ఉండటం మనకు యెహోవా ఆమోదాన్ని తీసుకువస్తుంది. ఇది మన నిరీక్షణను బలపరుస్తుంది.
కొందరి విషయంలో ఎందుకు ఓడబద్దలౌతుంది
7. (ఎ) పౌలు మాటలు తెలియజేస్తున్నట్లుగా కొందరు ఆధ్యాత్మిక భావంలో ఓడ బద్దలయ్యేలా ఎలా చేసుకున్నారు? (బి) కొందరు సత్యం నుండి ఎలా వైదొలగిపోయారు?
7 పౌలు ‘ఓడ బద్దలయ్యే’ ప్రమాదం గురించి హెచ్చరించినప్పుడు ఆయన మనస్సులో, తమ మంచి మనస్సాక్షిని “త్రోసివేసి,” విశ్వాసాన్ని కోల్పోయిన కొందరు వ్యక్తులు ఉన్నారు. (1 తిమోతి 1:19) వారిలో సత్యంనుండి వైదొలగి, దూషణకరంగా మాట్లాడుతూ మతభ్రష్టత్వంలో పడిపోయిన హుమనైయును, అలెక్సంద్రును ఉన్నారు. (1 తిమోతి 1:20; 2 తిమోతి 2:17, 18) నేడు, సత్యం నుండి వైదొలగే మతభ్రష్టులు “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసు[ణ్ణి]” మౌఖికంగా కొడుతూ తద్వారా, ఆధ్యాత్మికంగా తమకు పాలుపోసిన చేతినే కాటువేస్తున్నారు. కొందరు ‘దుష్టుడైన దాసుని’ పోలి, “నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని” మూర్ఖంగా చెబుతున్నారు. (మత్తయి 24:44-49; 2 తిమోతి 4:14, 15) వాళ్లు ఈ దుష్ట విధానాంతం దగ్గరలోనే ఉందన్న వాస్తవాన్ని తిరస్కరిస్తారు, యెహోవా ప్రజల్లో అత్యవసర భావాన్ని కాపాడుతున్నందుకు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్న దాసుని తరగతిని విమర్శిస్తారు. (యెషయా 1:3) అటువంటి మతభ్రష్టులు ‘కొందరి విశ్వాసాన్ని చెరపడంలో,’ చివరికి ఆధ్యాత్మిక భావంలో ఓడబద్దలయ్యేలా చేయడంలో కూడా సఫలులౌతారు.—2 తిమోతి 2:17, 18.
8. కొందరు తమ విశ్వాసపు ఓడ బద్దలయ్యేలా లేదా ముంచేసుకునేలా చేసుకునేందుకు ఏది కారణమయ్యింది?
8 ఇతర సమర్పిత క్రైస్తవులు తమ మనస్సాక్షిని త్రోసివేసి, ఈ లోకపు విశృంఖలమైన వినోద కార్యకలాపాల్లోను లైంగిక అనైతికతలోను మునిగిపోవడం ద్వారా తమ విశ్వాసపు ఓడ బద్దలయ్యేలా చేసుకున్నారు. (2 పేతురు 2:20-22) ఇంకొందరు తమ దృక్పథం ప్రకారం ఆశ్రయాస్పదమైన నూతన లోక విధానం ఎక్కడా కనుచూపుమేరలో కానరావడం లేదు గనుక తమ విశ్వాసపు ఓడను తామే ముంచేసుకుంటారు. కొన్ని ప్రవచనాల నెరవేర్పు గురించి కాలనిర్ణయాలను చేయలేక, తమ మనస్సుల నుండి ‘ప్రభువు దినాన్ని’ దూరంచేసుకుని వారు సత్యారాధనను విడనాడుతారు. (2 పేతురు 3:10-13; 1 పేతురు 1:9) వారు తాము త్వరలోనే మళ్లీ ఈ ప్రస్తుత విధానం యొక్క అంధకారమయమైన కల్లోల జలాల్లో ఉన్నట్లు గ్రహిస్తారు. (యెషయా 17:12, 13; 57:20) క్రైస్తవ సంఘంతో సహవసించడం మానివేసిన కొందరు అది సత్యమైన మతాన్ని ఆచరిస్తుందని ఇప్పటికీ నమ్ముతారు. అయితే, యెహోవా దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకం కోసం వేచివుండటానికి అవసరమయ్యే ఓపిక, సహనం స్పష్టంగా వారిలో కొరవడ్డాయి. వారి విషయంలో పరదైసులోని జీవితం వారు కోరుకున్నంత త్వరగా రాలేదు.
9. కొందరు సమర్పిత క్రైస్తవులు ఏమి చేస్తున్నారు, ఈ వాస్తవాలు మనం ఏమి పరిశీలించడానికి నడిపించాలి?
9 ప్రపంచంలోని కొన్ని భాగాల్లోని కొందరు సమర్పిత క్రైస్తవులు తమ విశ్వాసపు ఓడ తెరచాపలను కాస్త దించేసినట్లు కన్పిస్తుంది. ఓడ ఇంకా తేలుతూనే ఉంది, కానీ పూర్ణ విశ్వాసంతో ముందుకు ఉరికే బదులు, వారు నింపాదిగా సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. “త్వరలోనే వస్తోంది పరదైసు!” అనే నిరీక్షణ ద్వారా ఆకర్షితులైన కొందరు, దానిలోకి ప్రవేశాన్ని పొందడానికి ఏమాత్రం ప్రయత్నలోపం కన్పించనీయలేదు—ప్రకటనా పనిలో అత్యుత్సాహం చూపడమూ, అన్ని కూటాల్లోను, అసెంబ్లీల్లోను, సమావేశాల్లోను క్రమంగా హాజరు కావడమూ చేశారు. ఇప్పుడు, తాము నిరీక్షించినవి వాస్తవరూపాలు దాల్చే సమయం తాము ఊహించిన దానికన్నా సుదూర భవిష్యత్తులో ఉందని తలుస్తూ వారు అంతగా కృషి చేయడానికి సుముఖత కల్గిలేరు. ఇది తగ్గిన ప్రకటనా పనిలోనూ, కూటాలకు క్రమంగా హాజరు కాకపోవడంలోనూ, అసెంబ్లీల్లోని కార్యక్రమంలో కొన్ని భాగాల్ని తప్పిపోవడానికి సుముఖత చూపడంలోనూ స్పష్టమౌతుంది. ఇతరులు వినోదానికీ, సౌకర్యవంతమైన జీవితాన్నిచ్చే వస్తుసంపదల్ని సంపాదించడానికీ మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ వాస్తవాలు, యెహోవాకు మనం చేసుకున్న సమర్పణకు అనురూపంగా మన జీవితాల్లో మనల్ని నడిపించే శక్తి ఏమైవుండాలనేది పరిశీలించుకోవడానికి నడిపిస్తాయి. ఆయన సేవలో మన ఉత్సాహం “త్వరలోనే వస్తోంది పరదైసు!” అనే నిరీక్షణపై ఆధారపడివుండాలా?
లంగరుకు పోల్చబడిన నిరీక్షణ
10, 11. పౌలు మన నిరీక్షణను దేనితో పోల్చాడు, ఈ పోలిక ఎందుకు యుక్తమైనది?
10 అబ్రాహాము ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని యెహోవా వాగ్దానం చేశాడని పౌలు ఎత్తిచూపించాడు. తర్వాత అపొస్తలుడు ఇలా వివరించాడు: “దేవుడు . . . తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి [ఆయన వాక్యము, ఆయన ప్రమాణము], మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెను[న్నది].” (హెబ్రీయులు 6:17-19; ఆదికాండము 22:16-18) అభిషిక్త క్రైస్తవుల ముందుంచబడిన నిరీక్షణ పరలోకంలో అమర్త్యమైన జీవితం. నేడు, యెహోవా సేవకుల్లో అత్యధికులు పరదైసు భూమిపైన నిత్యజీవితమనే అద్భుతమైన నిరీక్షణను కలిగివున్నారు. (లూకా 23:43) అటువంటి నిరీక్షణ లేకుండా, ఎవరూ విశ్వాసం కలిగివుండలేరు.
11 లంగరు అనేది ఒక శక్తివంతమైన భద్రతా ఉపకరణం, ఓడ కొట్టుకొనిపోకుండా దాన్ని ఒకేచోట ఉంచడానికి అది ఉండాల్సిందే. లంగరు లేకుండా ఏ నావికుడూ నౌకాశ్రయాన్ని విడిచే సాహసం చేయడు. పౌలు ప్రయాణిస్తున్న ఓడ అనేకసార్లు బద్దలయ్యింది గనుక, సముద్రప్రయాణికుల ప్రాణాలు తరచు ఓడకు ఉన్న లంగరులపై ఆధారపడివున్నట్లు ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. (అపొస్తలుల కార్యములు 27:29, 39, 40; 2 కొరింథీయులు 11:25) ఓడ కెప్టెను ఓడను తనకు ఇష్టం వచ్చినట్లు తిప్పడాన్ని సాధ్యం చేసే ఇంజన్లు మొదటి శతాబ్దంలోని ఓడలకు ఉండేవి కావు. తెడ్లతో నడిచే యుద్ధనావలు మినహాయించి, అప్పటి ఓడలు కదలిక కోసం ప్రాథమికంగా గాలిమీదే ఆధారపడేవి. ఒకవేళ ఓడ బండలమీదికి వెళ్లి కొట్టుకునే ప్రమాదం ఉన్నప్పుడు ఓడ కెప్టెన్‌కి ఉన్న ఒకే ఒక్క శరణ్యం తుపాను నిమ్మళించేంత వరకు, సముద్ర అడుగు భాగంలో లంగరు తన పట్టును కోల్పోదని నమ్ముతూ, లంగరుని దించడమే. అందునే పౌలు క్రైస్తవుని నిరీక్షణ “నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలె” ఉన్నట్లు పోల్చాడు. (హెబ్రీయులు 6:19) వ్యతిరేకతా తుపానులు మనల్ని ఆవరించినప్పుడు లేదా మరితర శ్రమల్ని అనుభవిస్తున్నప్పుడు అద్భుతమైన మన నిరీక్షణ ఒక లంగరువలె సజీవ ప్రాణులుగా మనల్ని స్థిరపరుస్తుంది, తద్వారా మన విశ్వాసపు ఓడ సందేహాలు అనే మెట్టలపైకీ, లేదా మతభ్రష్టత్వం అనే వినాశకరమైన బండలమీదికీ కొట్టుకుపోకుండా ఉంటుంది.—హెబ్రీయులు 2:1; యూదా 8-13.
12. మనం యెహోవాను విడిచిపోవడాన్ని ఎలా నివారించగలము?
12 పౌలు హెబ్రీ క్రైస్తవుల్ని ఇలా హెచ్చరించాడు: “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.” (హెబ్రీయులు 3:12) గ్రీకు గ్రంథపాఠంలో “విడిచిపోవునట్టి” అనే దానికి అక్షరార్థంగా “దూరంగా నిలువడం” అనీ అంటే మతభ్రష్టులైపోవడమనీ అర్థం. కానీ మనం అలా ఓడ సమూలంగా బద్దలు కావడాన్ని నివారించవచ్చు. విశ్వాసము, నిరీక్షణ అతి భయంకరమైన పరీక్షా తుపానుల సమయంలో కూడా మనం యెహోవాను హత్తుకుని ఉండటాన్ని సాధ్యపరుస్తాయి. (ద్వితీయోపదేశకాండము 4:4; 30:19, 20) మన విశ్వాసం మతభ్రష్ట బోధలనే గాలుల మూలంగా అలలచేత కొట్టుకొనిపోయే ఓడలా ఉండదు. (ఎఫెసీయులు 4:13, 14) అంతేగాక నిరీక్షణ మన లంగరుగా యెహోవా సేవకులముగా మనం జీవిత తుపానులను తాళుకోగలుగుతాము.
ప్రేమ, పరిశుద్ధాత్మలచే పురికొల్పు
13, 14. (ఎ) మనకు మన విశ్వాసపు లంగరు మాత్రమే ఎందుకు సరిపోదు? (బి) యెహోవాకు పవిత్ర సేవను చేసేందుకు నడిపించే శక్తి ఏదైవుండాలి, ఎందుకు?
13 యెహోవాను సేవించడానికి ఏకైక ప్రేరకం పరదైసు భూమిపై నివసించడమనేదే అయితే, క్రైస్తవుడు నూతన లోక విధానం వైపుకి అభివృద్ధి సాధించలేడు. నిరీక్షణనే తన లంగరును తన జీవితానికి స్థిరత్వాన్నిచ్చే కారణంగా ఉంచుకుంటూ ఆయన దానికీ తన విశ్వాసానికీ ప్రేమ యొక్క పురికొల్పునిచ్చే శక్తిని జోడించాలి. పౌలు ఇలా వ్రాసినప్పుడు ఈ వాస్తవాన్ని మరింతగా నొక్కిచెప్పాడు: “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యూ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.”—1 కొరింథీయులు 13:13.
14 పవిత్ర సేవచేసేందుకు మనల్ని పురికొల్పే శక్తి, యెహోవా మనపట్ల చూపించిన అపారమైన ప్రేమకు ప్రతిస్పందనగా మనలో ఆయనపట్ల ఉన్న హృదయపూర్వకమైన ప్రేమయై ఉండాలి. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” (1 యోహాను 4:8, 9, 19) యెహోవాపట్ల కృతజ్ఞతా భావంతో, మనం వ్యక్తిగతంగా రక్షణపొందాలన్నది మన ప్రాథమిక చింతయై ఉండకూడదు కానీ, ఆయన పవిత్ర నామం పరిశుద్ధపరచబడటమూ, నీతియుక్తమైన ఆయన విశ్వసర్వాధిపత్యంపైనున్న నింద తప్పని నిరూపించబడటమూ మన ప్రాథమిక చింతయైవుండాలి.
15. యెహోవాపట్ల మనకుగల ప్రేమ ఆయన విశ్వసర్వాధిపత్యంతో ఎలా సంబంధం కల్గివుంది?
15 కేవలం పరదైసును ప్రేమించడం మూలంగా కాదుగానీ మనం తనను ప్రేమించడం మూలంగా ఆయన్ను సేవించాలని యెహోవా కోరుతున్నాడు. లేఖనాలపై అంతర్దృష్టిa (ఆంగ్లం) అనే బైబిలు ఎన్సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “యెహోవా తన విశ్వసర్వాధిపత్యం, దానికి తన సృష్టిప్రాణులు మద్దతునివ్వడము ప్రాథమికంగా ప్రేమపై ఆధారపడివుందన్న వాస్తవం విషయమై గర్విస్తాడు. తనలో ఉన్న చక్కని లక్షణాల కారణంగా తన విశ్వసర్వాధిపత్యాన్ని ప్రేమించేవారిని మాత్రమే, ఆ సర్వాధిపత్యము నీతియుక్తమైనది అన్న కారణంగా దాన్ని ప్రేమించేవారిని మాత్రమే ఆయన కోరుకుంటాడు. వేరే ఏ ఇతర సర్వాధిపత్యం కన్నా ఆయన విశ్వసర్వాధిపత్యాన్నే ఇష్టపడేవారిని ఆయన కోరుకుంటాడు. (1 కొరిం 2:9) వారు స్వతంత్రులు కావడానికి ప్రయత్నించే బదులుగా ఆయన సర్వాధిపత్యం క్రింద సేవచేయాలని కోరుకుంటారు. వారు ఆయన గూర్చిన జ్ఞానాన్ని పొందడం మూలంగా, ఆయన ప్రేమ, ఆయన న్యాయము, ఆయన బుద్ధిని గూర్చిన జ్ఞానాన్ని పొందడం మూలంగా, తమలో ఉన్న ఆ లక్షణాల పరిమాణం కన్నా అవి ఆయనలో ఎంతో మించివున్నాయన్న కారణంగా అలా కోరుకుంటారు. (కీర్త 84:10, 11)”—సంపుటి 2, పేజీ 275.
16. మన జీవితాల్లో యేసుపట్ల ప్రేమ ఎలా పురికొల్పునిచ్చే శక్తియై ఉంది?
16 క్రైస్తవులముగా మనం, యేసు మనపట్ల చూపిన ప్రేమకు ప్రతిస్పందనగా ఆయనపట్ల కూడా ప్రేమను చూపిస్తాము. పౌలు ఇలా తర్కించాడు: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయంచు కొనుచున్నాము.” (2 కొరింథీయులు 5:14, 15) క్రీస్తు అనే పునాదిపైనే మన ఆధ్యాత్మిక జీవితాలూ, మన విశ్వాసమూ, మన నిరీక్షణా నిర్మించబడ్డాయి. క్రీస్తు యేసు పట్ల మనకున్న ప్రేమ మన నిరీక్షణకు మద్దతునిస్తుంది, అది మన విశ్వాసాన్ని—ప్రాముఖ్యంగా తుపానుల్లాంటి పరీక్షల కాలంలో—స్థిరపరుస్తుంది.—1 కొరింథీయులు 3:11; కొలొస్సయులు 1:23; 2:6, 7.
17. యెహోవా మనకు ఇచ్చే అద్భుతమైన శక్తి ఏమిటి, దాని ప్రాముఖ్యత అపొస్తలుల కార్యములు 1:8లోను ఎఫెసీయులు 3:16లోను ఎలా చూపించబడింది?
17 దేవునిపట్ల ఆయన కుమారునిపట్ల మనకున్న ప్రేమ క్రైస్తవులుగా మన జీవితాల్లో పురికొల్పునిచ్చే అసలైన శక్తిగా ఉండగా, మనల్ని పురికొల్పే, మనకు శక్తినిచ్చే ఆయన సేవలో ముందుకు వెళ్లేందుకు బలాన్నిచ్చే మరోదాన్ని కూడా యెహోవా ఇస్తున్నాడు. అది ఆయన చురుకైన శక్తి, లేదా పరిశుద్ధాత్మ. “ఆత్మ” అని అనువదించబడిన హెబ్రీ గ్రీకు పదాలు ప్రాథమికంగా గాలిని, విసురుగా వీస్తున్న గాలిని సూచిస్తాయి. పౌలు ప్రయాణించిన ఓడల్లాంటివి తమ గమ్యానికి చేరుకోవడానికి గాలి యొక్క అదృశ్య శక్తి మీదే ఆధారపడేవి. అదేవిధంగా, మన విశ్వాసపు ఓడ యెహోవా సేవలో ముందుకు సాగిపోవాలంటే మనకు ప్రేమా, దేవుని అదృశ్య చురుకైన శక్తి యొక్క చర్యా అవసరం.—అపొస్తలుల కార్యములు 1:8; ఎఫెసీయులు 3:16.
మన గమ్యంవైపుకి సాగిపోదాం!
18. మన విశ్వాసానికి భవిష్యత్తులో రాగల ఏ పరీక్షలనైనా సహించడానికి ఏమి సహాయం చేస్తుంది?
18 మనం నూతన లోక విధానాన్ని చేరుకునే లోపల, మన విశ్వాసమూ మన ప్రేమా తీవ్రమైన పరీక్షలకు గురికావచ్చు. కానీ యెహోవా మనకు “నిశ్చలమును, స్థిరమునై” ఉన్న ఒక లంగరును ఇచ్చాడు, అదే అద్భుతమైన మన నిరీక్షణ. (హెబ్రీయులు 6:19; రోమీయులు 15:4, 13) వ్యతిరేకత లేక మరితర శ్రమలు మనపై దాడిచేసినప్పుడు మనం మన నిరీక్షణ ద్వారా భద్రంగా లంగరు వేయబడివున్నట్లైతే మనం వాటిని సహించవచ్చు. ఒక తుపాను నిమ్మళించిన తర్వాత మరోటి ప్రారంభం కావడానికి ముందే మనం మన నిరీక్షణను దృఢపర్చుకుని మన విశ్వాసాన్ని బలపర్చుకొందామని నిర్ణయించుకుని ఉందాము.
19. మన విశ్వాసపు ఓడ ముందుకు సాగిపోయేలా, దేవుని నూతన లోక ఆశ్రయస్థానానికి చేరుకునేలా మనం ఏమి చేయగలము?
19 “ఆత్మకు లంగరు” గురించి ప్రస్తావించక ముందు పౌలు ఇలా అన్నాడు: “మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:11, 12) యెహోవాపట్ల ఆయన కుమారునిపట్ల ప్రేమచే పురికొల్పబడి, పరిశుద్ధాత్మచే శక్తినిపొంది మనం దేవుని వాగ్దత్త నూతన లోకమనే ఆశ్రయస్థానానికి చేరేంతవరకు మన విశ్వాసపు ఓడను ముందుకు సాగనిద్దాము.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
పునస్సమీక్ష ద్వారా
◻ మన విశ్వాసాన్ని గురించి పౌలు మనకు ఏ హెచ్చరికను ఇస్తున్నాడు?
◻ కొందరి ఓడ ఆధ్యాత్మిక భావంలో ఎలా బద్దలయ్యింది, ఇతరులు ఎలా మందకొడిగా తయారౌతున్నారు?
◻ మన విశ్వాసానికి ఏ దైవిక లక్షణాలను జోడించవలసిన అవసరం ఉంది?
◻ దేవుని వాగ్దత్త నూతన లోక ఆశ్రయస్థానాన్ని చేరుకోవడానికి మనకు ఏది సహాయపడుతుంది?
[16వ పేజీలోని చిత్రం]
మన విశ్వాసపు ఓడ జీవితపు తుపానులను తాళుకోవాలంటే దృఢంగా నిర్మించబడివుండాలి
[17వ పేజీలోని చిత్రం]
మన విశ్వాసం బద్దలుకాగలదు
[18వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులముగా మన జీవితాలకు నిరీక్షణ ఒక లంగరు