యెహోవా గొఱ్ఱెలపట్ల శ్రద్ధ వహించడానికి ‘మనుష్యులలో ఈవులు’
“ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు [“మనుష్యులలో,” NW] ఈవులను అనుగ్రహించె[ను].”—ఎఫెసీయులు 4:8.
1. తన సంఘంలోని పెద్దల గురించి ఒక క్రైస్తవ సహోదరి ఏమని వ్యక్తం చేసింది?
“మీరు మామీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు చాలా థాంక్స్. మీ చిరునవ్వు, మీ ఆప్యాయత, మాపట్ల మీకున్న చింత నిజంగా యథార్థమైనవి. మేము చెప్పేది వినడానికీ, మాలో నూతనోత్తేజాన్ని నింపే బైబిలు వచనాలను మాతో పంచుకోవడానికీ మీరెప్పుడూ సుముఖంగా ఉంటారు. నేను మీ విలువను ఎన్నడూ తక్కువ చేయకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను.” ఒక క్రైస్తవ సహోదరి తన సంఘంలోని పెద్దలకు ఆ విధంగా వ్రాసింది. శ్రద్ధవహించే క్రైస్తవ కాపరులు చూపించే ప్రేమ ఆమె హృదయాన్ని స్పృశించిందన్నది స్పష్టంగా కనబడుతుంది.—1 పేతురు 5:2, 3.
2, 3. (ఎ) యెషయా 32:1, 2 ప్రకారం వాత్సల్యపూరితమైన పెద్దలు యెహోవా గొఱ్ఱెలపట్ల ఎలా శ్రద్ధవహించగలరు? (బి) ఒక పెద్ద ఎప్పుడు ఒక ఈవిగా పరిగణించబడగలడు?
2 పెద్దలు, తన గొఱ్ఱెలను చూసుకునేలా యెహోవా చేసిన ఒక ఏర్పాటు. (లూకా 12:32; యోహాను 10:16) తన గొఱ్ఱెలంటే యెహోవాకు ఎంతో ప్రేమ—నిజంగా ఎంత ప్రేమంటే, ఆయన వారిని అమూల్యమైన యేసు రక్తంతో కొనుక్కున్నాడు. అందుకనే, పెద్దలు తన మందతో వాత్సల్యపూరితంగా వ్యవహరించినప్పుడు యెహోవా సంతోషిస్తాడనడంలో ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు. (అపొస్తలుల కార్యములు 20:28, 29) ఈ పెద్దలు, లేదా “అధికారుల”ను గూర్చిన ప్రవచనాత్మక వర్ణనను గమనించండి: “[వారు] మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:1, 2) అవును, తన గొఱ్ఱెలను కాపాడి, సేదదీర్చి, ఆదరణనివ్వడం వారి బాధ్యత. మందను కనికరంతో కాస్తున్న పెద్దలు, తమ నుండి దేవుడు ఆశిస్తున్నదానికి తగ్గట్టుగా జీవించడానికి కృషిచేస్తున్నారన్నమాట.
3 అటువంటి పెద్దల్ని బైబిలు “మనుష్యులలో ఈవుల”ని పిలుస్తుంది. (ఎఫెసీయులు 4:8, NW) ఈవి లేక కానుక అన్న పదం వినగానే, దాన్ని పొందేవారి అవసరమైనదేదైనా తీర్చడానికో లేదా వారిని సంతోషపర్చడానికో ఇచ్చే వస్తువు మీ మనస్సులోకి వస్తుంది. కావల్సిన సహాయాన్నిచ్చేలా, మంద ఆనందానికి దోహదపడేలా ఒక పెద్ద తన సామర్థ్యాలను ఉపయోగించినప్పుడు ఆయనను ఒక ఈవిగా పరిగణించవచ్చు. ఆయన ఆ విధంగా ఎలా చేయగలడు? ఎఫెసీయులు 4:7-16లోని పౌలు మాటల్లో ఉన్న జవాబు తన గొఱ్ఱెలపట్ల యెహోవాకున్న ప్రేమపూర్వకమైన చింతను స్పష్టంగా చూపిస్తుంది.
‘మనుష్యులలో ఈవులు’—ఎక్కడినుండి?
4. కీర్తన 68:18 నెరవేర్పులో యెహోవా ఏ భావంలో ‘ఆరోహణమయ్యాడు,’ ‘మనుష్యుల రూపంలోని కానుకలు’ ఎవరు?
4 పౌలు ‘మనుష్యులలో ఈవులు’ అన్న మాటను ఉపయోగించినప్పుడు, ఆయన రాజైన దావీదు వ్రాసిన కీర్తనను ఉదహరించాడు. దావీదు యెహోవాను గురించి ఇలా అన్నాడు: “నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యులచేత నీవు కానుకలు [“మనుష్యుల రూపంలో ఈవులను,” NW] తీసికొని యున్నావు.” (కీర్తన 68:18) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో కొన్ని సంవత్సరాలున్న తర్వాత, యెహోవా అలంకార భావంలో సీయోను పర్వతం మీదికి ‘ఆరోహణమై,’ దావీదు రాజుగా యెరూషలేమును ఇశ్రాయేలు రాజ్యానికి రాజధానిగా చేశాడు. కానీ ఈ ‘మనుష్యుల రూపంలోని ఈవులు’ ఎవరు? వీరు, దేశాన్ని జయించినప్పుడు చెరగా పట్టబడినవారే. ఈ బందీలలో కొందరు అటుతర్వాత మందసమువద్ద జరిగే పనిలో లేవీయులకు సహాయం చేయడానికి ఉపయోగపడ్డారు.—ఎజ్రా 8:20.
5. (ఎ) కీర్తన 68:18కి క్రైస్తవ సంఘంలో ఒక నెరవేర్పు ఉందని పౌలు ఎలా సూచిస్తున్నాడు? (బి) యేసు ఏ విధంగా ‘ఆరోహణమయ్యాడు’?
5 కీర్తనల గ్రంథకర్త వ్రాసిన మాటలకు మరిగొప్ప నెరవేర్పు క్రైస్తవ సంఘంలో ఉంటుందని పౌలు ఎఫెసీయులకు వ్రాసిన ఉత్తరంలో సూచిస్తున్నాడు. కీర్తన 68:18ను సొంత మాటల్లో వ్రాస్తూ ఇలా అంటున్నాడు: “అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము [“ఈవి,” NW] యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా [“బందీలను,” NW] పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను [“మనుష్యులలో ఈవులను,” NW] అనుగ్రహించెనని చెప్పబడియున్నది.” (ఎఫెసీయులు 4:7, 8) పౌలు ఇక్కడ ఆ కీర్తనను దేవుని ప్రతినిధియైన క్రీస్తుకు అన్వయిస్తున్నాడు. యేసు తన విశ్వసనీయమైన జీవిత విధానం ద్వారా ‘లోకాన్ని జయించాడు.’ (యోహాను 16:33) దేవుడు ఆయన్ను మృతులలో నుండి పునరుత్థానం చేసినందున, ఆయన మరణంపైనా, సాతానుపైనా కూడా విజయం సాధించాడు. (అపొస్తలుల కార్యములు 2:24; హెబ్రీయులు 2:14) సా.శ. 33లో పునరుత్థానుడైన యేసు “ఆకాశమండలము లన్నిటికంటె మరిపైకి”—పరలోకంలోని ఇతర ప్రాణులన్నింటికంటె మరిపైకి ఆరోహణమయ్యాడు. (ఎఫెసీయులు 4:9, 10; ఫిలిప్పీయులు 2:9-11) విజేతగా, యేసు శత్రువు నుండి ‘బందీలను పట్టుకొనిపోయాడు?’ అదెలా?
6. ఆరోహణమైన యేసు సా.శ. 33 పెంతెకొస్తు మొదలుకొని సాతాను గృహాన్ని ఎలా దోచుకుంటున్నాడు, ‘బందీలను’ ఆయన ఏమి చేస్తున్నాడు?
6 యేసు భూమ్మీద ఉన్నప్పుడు దయ్యాల వశంలో ఉన్నవారిని విడిపించడం ద్వారా సాతానుపైన తనకున్న శక్తిని ప్రదర్శించాడు. ఇదెలా ఉందంటే యేసు, సాతాను గృహంపైకి దాడిచేసి, వాణ్ని బంధించి, వాడిని దోచుకున్నట్లుంది. (మత్తయి 12:22-29) ఒక్కసారి పునరుత్థానుడైన ‘పరలోకంలోనూ భూమిమీదా సర్వాధికారం’ పొందిన తర్వాత, యేసు ఇంకెంతగా కొల్లగొట్టి ఉండివుండవచ్చో ఊహించండి! (మత్తయి 28:18) దేవుని ప్రతినిధిగా పరలోకానికి ఆరోహణమైన యేసు, ‘బందీలను పట్టుకొనిపోవడం ద్వారా’—పాప, మరణాలకు దీర్ఘకాలం నుండీ దాసులుగా మ్రగ్గిపోతూ, సాతాను నియంత్రణలో ఉన్న పురుషులను పట్టుకొనిపోవడం ద్వారా సా.శ. 33 పెంతెకొస్తు మొదలుకొని సాతాను గృహాన్ని దోచుకుంటున్నాడు. ఈ ‘బందీలు’ “దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,” ఇష్టపూర్వకంగా ‘క్రీస్తు దాసులయ్యారు.’ (ఎఫెసీయులు 6:6) చెప్పాలంటే, యేసు వారిని సాతాను నియంత్రణలోనుండి తప్పించి, ‘మనుష్యులలో ఈవులుగా’ యెహోవా పక్షాన సంఘానికి ఇచ్చాడు. సాతాను గుప్పిట్లో నుండి వాళ్లు లాక్కొనబడినప్పుడు నిస్సహాయంతో వాడికి కల్గిన ఉక్రోషాన్ని ఊహించండి!
7. (ఎ) ‘మనుష్యులలో ఈవులు’ సంఘాల్లో ఏ స్థానాల్లో సేవచేస్తున్నారు? (బి) పెద్దగా సేవచేసే ప్రతి పురుషునికి యెహోవా ఏ అవకాశాన్ని ఇచ్చాడు?
7 అటువంటి ‘మనుష్యులలో ఈవులను’ నేడు మనం సంఘాల్లో చూస్తున్నామా? తప్పకుండా! భూవ్యాప్తంగా 87,000కుపైగా ఉన్న దేవుని ప్రజల సంఘాల్లో ‘సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను’ కష్టపడి పనిచేస్తూ, వాళ్లు పెద్దలుగా సేవ చేస్తుండడాన్ని మనం చూస్తాము. (ఎఫెసీయులు 4:13) వారు మందపట్ల చెడుగా వ్యవహరించడం కన్నా సాతానుకు కావల్సిందేమీ లేదు. కానీ దేవుడు క్రీస్తు ద్వారా వారిని సంఘానికి ఇచ్చింది అందుకోసం కాదు. బదులుగా, యెహోవా వారిని సంఘ సంక్షేమం నిమిత్తం అనుగ్రహించాడు, తమకు అప్పజెప్పబడిన గొఱ్ఱెల విషయంలో ఆయనకు వాళ్లు లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. (హెబ్రీయులు 13:17) మీరు ఒక సంఘ పెద్దగా సేవ చేస్తున్నట్లైతే, మీ సహోదరులకు మీరు నిజంగా ఒక ఈవి అనీ, ఒక ఆశీర్వాదం అనీ రుజువు చేసుకోగల అద్భుతమైన అవకాశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. నాలుగు ప్రాముఖ్యమైన బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మీరు అలా రుజువు చేసుకోగలరు.
‘సరిదిద్దవలసిన’ అవసరం ఏర్పడినప్పుడు
8. అప్పుడప్పుడు మనమందరం ఏ విధాలుగా సరిదిద్దబడాల్సిన అవసరం ఉంది?
8 మొట్టమొదటిగా, ‘పరిశుద్ధులను సరిదిద్దడానికి’ ‘మనుష్యులలో ఈవులు’ అందజేయబడ్డారని పౌలు అంటున్నాడు. (ఎఫెసీయులు 4:12, NW) ‘సరిదిద్దడము’ అని అనువదించబడిన గ్రీకు నామవాచకం, దేన్నైనా “సరిగా చక్కదిద్దడము”ను సూచిస్తుంది. అపరిపూర్ణ మానవులుగా మనమందరం ఎప్పటికప్పుడు సరిదిద్దబడవల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలు, మన వైఖరులు, లేదా మన ప్రవర్తన దేవుని ఆలోచనలకు, ఆయన చిత్తానికి అనుగుణ్యంగా “సరిగా చక్కదిద్దబడవల్సిన” అవసరం ఉంది. అవసరమైన మార్పులను చేసుకోవడానికి మనకు సహాయపడటానికి యెహోవా ప్రేమపూర్వకంగా ‘మనుష్యులలో ఈవులను’ అందజేశాడు. వారు ఆ సహాయాన్ని ఎలా అందిస్తారు?
9. తప్పు చేసిన గొఱ్ఱెను ఒక పెద్ద ఎలా సరిదిద్దగలడు?
9 కొన్నిసార్లు, ‘తాను గ్రహించకముందే ఏదైనా తప్పటడుగు వేసిన’ ఒక గొఱ్ఱెకు సహాయం చేయమని ఒక పెద్దను నియమించవచ్చు. ఆ పెద్ద ఎలా సహాయం చేయగలడు? “సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను” అని గలతీయులు 6:1 అంటుంది. అందువలన, ఒక పెద్ద సలహాను ఇస్తున్నప్పుడు కటువైన మాటల్ని ఉపయోగిస్తూ తప్పుచేసిన వ్యక్తిని తిట్టడు. ఆయనిచ్చే సలహా ప్రోత్సాహాన్నివ్వాలి, దాన్ని పొందే వ్యక్తిని “భయపెట్ట”కూడదు. (2 కొరింథీయులు 10:9; పోల్చండి యోబు 33:7.) తప్పు చేసిన వ్యక్తి అప్పటికే ఎంతో సిగ్గుపడుతుండవచ్చు, కాబట్టి ప్రేమగల కాపరి ఆతని స్ఫూర్తిని నలిపివేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. సలహాగాని, లేదా స్థిరమైన గద్దింపుగాని స్పష్టంగా ప్రేమతో పురికొల్పబడినప్పుడు, ప్రేమపూర్వకంగా ఇవ్వబడినప్పుడు, అవి తప్పుచేసిన వ్యక్తి ఆలోచనా విధానాన్నీ లేదా ప్రవర్తననూ సరిదిద్దవచ్చు, తద్వారా ఆయన్ను పూర్వస్థితికి తీసుకురావచ్చు.—2 తిమోతి 4:2.
10. ఇతరులను సరిదిద్దడంలో ఏమి ఇమిడివుంది?
10 మనల్ని సరిదిద్దే ఉద్దేశంతో ‘మనష్యులలో ఈవులను’ యెహోవా అందిస్తున్నప్పుడు, పెద్దలు ఆధ్యాత్మికంగా సుఖము కలుగజేసేవారుగానూ, తన ప్రజలు అనుకరించడానికి యోగ్యులుగానూ ఉండాలన్నదే యెహోవా ఉద్దేశం. (1 కొరింథీయులు 16:17, 18; ఫిలిప్పీయులు 3:17) ఇతరులను సరిదిద్దడంలో, తప్పు మార్గంలో వెళ్తున్నవారిని తిరిగి సరైన మార్గంలో పెట్టడం మాత్రమేగాక సరైన మార్గాన్ని అంటిపెట్టుకునేలా విశ్వాసులకు సహాయం చేయడం కూడా ఇమిడివుంది.a హృదయాల్ని కృంగిపోయేలా చేస్తున్న అనేకమైన సమస్యలతో బాధపడుతున్న చాలామందికి, సరియైన మార్గాన్ని అంటిపెట్టుకునేందుకు నేడు ప్రోత్సాహం అవసరం. కొందరి ఆలోచనా విధానం దేవుని ఆలోచనా విధానానికి అనుగుణ్యంగా ఉండేలా సరిచేయడానికి ప్రేమపూర్వకమైన సహాయం అవసరం. ఉదాహరణకు, కొందరు విశ్వసనీయులైన క్రైస్తవులు, అసమర్థులమన్న అయోగ్యులమన్న తీవ్రమైన భావాలతో పోరాడుతుంటారు. “ధైర్యము చెడిన” అటువంటివారు యెహోవా తమను ఇక ప్రేమించడనీ, దేవుణ్ని సేవించాలని తాము పూర్ణ మనస్సుతో చేసే ప్రయత్నాలేవీ ఆయనకు అంగీకారం కాదనీ భావిస్తుండవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:14) ఈ విధమైన ఆలోచన, తన ఆరాధకులను గురించి దేవుడు నిజంగా భావిస్తున్న దానికి అనుగుణంగా లేదు.
11. అయోగ్యులమన్న భావాలతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి పెద్దలు ఏమి చేయగలరు?
11 పెద్దలారా, మీరు అటువంటివారికి ఎలా సహాయం చేయగలరు? యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరిపట్ల శ్రద్ధవహిస్తాడన్న లేఖనాధార రుజువును దయచేసి వారితో పంచుకోండి. ఆ బైబిలు వచనాలు వారికి కూడా వ్యక్తిగతంగా వర్తిస్తాయని హామీనివ్వండి. (లూకా 12:6, 7, 24) తనకు సేవచేసేలా యెహోవా వారిని ‘ఆకర్షించాడనీ,’ కాబట్టి ఆయన వారిలో తప్పకుండా విలువను కనుగొంటున్నాడనీ గ్రహించడానికి వారికి సహాయం చేయండి. (యోహాను 6:44) అటువంటి భావాలు ఉన్నది వీరికి మాత్రమే కాదు, యెహోవాకు విశ్వసనీయులుగా ఉన్న అనేకమంది సేవకులకు కూడా అలాంటి భావాలే ఉన్నాయని హామీనివ్వండి. ప్రవక్తయైన ఏలీయా ఒకసారి ఎంత తీవ్రమైన క్రుంగుదలకు లోనయ్యాడంటే తను చనిపోవాలని కోరుకున్నాడు. (1 రాజులు 19:1-4) మొదటి శతాబ్దంలోని కొందరు అభిషిక్త క్రైస్తవులు తమ సొంత హృదయాలే “దోషారోపణ” చేస్తున్నట్లు భావించారు. (1 యోహాను 3:19, 20) బైబిలు కాలాల్లోని విశ్వసనీయులకు ‘మనవంటి స్వభావాలే’ ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా ఓదార్పును పొందవచ్చు. (యాకోబు 5:17) మీరు క్రుంగినవారితో కావలికోట, తేజరిల్లు!ల్లోని ప్రోత్సాహకరమైన శీర్షికలను చర్చించవచ్చు కూడాను. అటువంటి భావాలుగల వారిలో తిరిగి నమ్మకాన్ని నింపడానికి మీరు ప్రేమతో చేసే ప్రయత్నాలను, మిమ్మల్ని ‘మనుష్యులలో ఈవులనుగా’ ఇచ్చిన దేవుడు గమనించకుండాపోడు.—హెబ్రీయులు 6:10.
మందకు ‘క్షేమాభివృద్ధి కలుగజేయడం’
12. ‘క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టుట’ అన్న మాట దేన్ని సూచిస్తుంది, మందకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి కీలకమైనది ఏమిటి?
12 రెండవదిగా, ‘క్రీస్తు యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి కలుగజేయడానికి’ ‘మనుష్యులలో ఈవులు’ ఇవ్వబడ్డారు. (ఎఫెసీయులు 4:13, NW) పౌలు ఇక్కడ అలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. “క్షేమాభివృద్ధి” అని అనువదించబడిన మూల గ్రీకు పదం, నిర్మాణాన్ని మనస్సుకు తెస్తుంది, ‘క్రీస్తు యొక్క శరీరం’ అన్న మాట ప్రజలను—అభిషిక్త క్రైస్తవ సంఘంలోని సభ్యులను సూచిస్తుంది. (1 కొరింథీయులు 12:27; ఎఫెసీయులు 5:23, 29, 30) తమ సహోదరులు ఆధ్యాత్మికంగా బలంగా ఎదగడానికి పెద్దలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మందను ‘పడద్రోయుట కాక వారిని కట్టుటయే’ వారి లక్ష్యం. (2 కొరింథీయులు 10:8) మందకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి కీలకం ప్రేమే, ఎందుకంటే “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.”—1 కొరింథీయులు 8:1.
13. తదనుభూతి కలిగివుండడం అంటే ఏమిటి, పెద్దలు తదనుభూతిని చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?
13 ప్రేమలో ఒక కోణం పెద్దలు తమ మందకు క్షేమాభివృద్ధిని కలుగజేయడానికి సహాయపడుతుంది—ఆ కోణమే తదానుభూతి. తదానుభూతిని చూపించడం అంటే, ఇతరుల విషయంలో తాము బాధననుభవించడం—వారి తలంపులూ భావాలూ గుర్తించడం, వారి పరిమితులను పరిగణలోనికి తీసుకోవడం అని అర్థం. (1 పేతురు 3:8) పెద్దలకు తదనుభూతి ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? అన్నింటికన్నా గొప్ప కారణం ఏమిటంటే ‘మనుష్యులలో ఈవులు’ ఇచ్చే యెహోవాయే తదనుభూతిగల దేవుడు. తన సేవకులు బాధల్లో ఉన్నప్పుడు లేదా దుఃఖాల్ని అనుభవిస్తున్నప్పుడు ఆయన వారి విషయంలో బాధననుభవిస్తాడు. (నిర్గమకాండము 3:7; యెషయా 63:9) ఆయన వారి పరిమితులను పరిగణలోనికి తీసుకుంటాడు. (కీర్తన 103:14) మరైతే పెద్దలు తదనుభూతిని ఎలా చూపించగలరు?
14. పెద్దలు ఇతరులపట్ల తదనుభూతిని ఎలా చూపించగలరు?
14 నిరుత్సాహానికి లోనైన వారెవరైనా తమ దగ్గరికి వచ్చినప్పుడు వారి భావాల్ని గుర్తిస్తూ వారు చెప్పేది పెద్దలు వింటారు. పెద్దలు తమ సహోదరుల నేపథ్యాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిస్థితులనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మాత్రమే, పెద్దలు క్షేమాభివృద్ధికరమైన లేఖనాధార సహాయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి గొఱ్ఱెలకు సులభంగా ఉంటుంది, ఎందుకంటే అది తమను నిజంగా అర్థం చేసుకుని తమపట్ల శ్రద్ధ చూపించే కాపరుల నుండి వస్తుంది కాబట్టి. (సామెతలు 16:23) ఇతరుల పరిమితులనూ, వాటి మూలంగా కలిగే భావాలనూ పరిగణలోనికి తీసుకోవడానికి కూడా తదనుభూతి పెద్దలను కదిలిస్తుంది. ఉదాహరణకు, వృద్ధాప్యం మూలంగానో లేదా అనారోగ్యం మూలంగానో తాము దేవుని సేవలో ఎక్కువగా చేయలేకపోతున్నందున తమ మనస్సాక్షినిబట్టి తాము అపరాధులమని కొంతమంది క్రైస్తవులు భావించవచ్చు. మరో వైపున కొంతమందికైతే తమ పరిచర్యను మరింత మెరుగుపర్చుకోవడానికి ప్రోత్సాహం అవసరం కావచ్చు. (హెబ్రీయులు 5:12; 6:1) ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగజేసే “యింపైన మాటలు” చెప్పడానికి పెద్దలను తదనుభూతి కదిలించాలి. (ప్రసంగి 12:10) యెహోవా గొఱ్ఱెలు క్షేమాభివృద్ధిని పొంది, పురికొల్పబడినప్పుడు తాము దేవునికి చేయగల్గినంత సేవ చేయడానికి ఆయనపట్ల వారికిగల ప్రేమ వారిని కదిలిస్తుంది!
ఐక్యతను పెంపొందించే పురుషులు
15. ‘విశ్వాసవిషయములో ఏకత్వము’ అన్న మాట దేన్ని సూచిస్తుంది?
15 మూడవదిగా, మనమంతా “విశ్వాసవిషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వము” పొందడానికి ‘మనుష్యులలో ఈవులు’ అందజేయబడ్డారు. (ఎఫెసీయులు 4:12) ‘విశ్వాసవిషయములో ఏకత్వము’ అన్న మాట ఐక్యతను సూచిస్తుంది, కేవలం నమ్మకాల ఐక్యతను మాత్రమే కాక, విశ్వాసుల ఐక్యతను కూడా అది సూచిస్తుంది. అది, దేవుడు తన ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ‘మనుష్యులలో ఈవులను’ మనకు అనుగ్రహించడానికి గల మరో కారణమైవుంది. వారు దీన్ని ఎలా చేస్తారు?
16. పెద్దలు తమలో తాము ఐక్యతగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
16 మొదట వారు తమలో తాము ఐక్యతను కాపాడుకోవాలి. ఒకవేళ కాపరుల మధ్యనే అనైక్యతవుంటే గొఱ్ఱెలు నిర్లక్ష్యానికి గురికావచ్చు. అప్రధానమైన విషయాలపై గంటలతరబడి సాగించే మీటింగ్ల మూలంగా, చర్చల మూలంగా కాపరిపనికి వెచ్చించే అమూల్యమైన సమయం హరించివేయబడవచ్చు. (1 తిమోతి 2:8) పెద్దలు తాము చర్చించే ప్రతి విషయంపైనా యాంత్రికంగా అంగీకారానికి వచ్చేయకపోవచ్చు, ఎందుకంటే ఎంతో వైవిధ్యమైన వ్యక్తిత్వాలున్న పురుషులు వారు. ఐక్యత అంటే అర్థం, వారిలో అభిప్రాయ భేదాలు ఉండవనికాదు, లేదా ఆ అభిప్రాయాలను కల్లాకపటాలు లేకుండా చేసే చర్చలో ఒక సంతుల్యమైన విధానంలో వ్యక్తం చేయకూడదనీ కాదు. ముందే ఏ అభిప్రాయాన్నీ ఏర్పర్చుకోకుండా, ఒకరు చెప్పేది మరొకరు మర్యాదగా వినడంద్వారా పెద్దలు తమ ఐక్యతను కాపాడుతారు. అంతేగాక, ఎటువంటి బైబిలు సూత్రాలూ ఉల్లంఘించబడనంత వరకు ప్రతి ఒక్కరు పెద్దల సభ చేసిన అంతిమ నిర్ణయానికి లోబడడానికీ దానికి మద్దతునివ్వడానికీ సుముఖంగా ఉండాలి. ఈ విధమైన లోబడే స్ఫూర్తి తాము, ‘సమాధానకరమైనది, మృదువైనది’ అయిన “పైనుండి వచ్చు జ్ఞానము”చేత నడిపించబడుతున్నామని చూపిస్తుంది.—యాకోబు 3:17, 18.
17. సంఘంలోని ఐక్యతను నిలుపడానికి పెద్దలు ఎలా సహాయం చేయగలరు?
17 పెద్దలు సంఘంలో ఐక్యతను ప్రోత్సహించేందుకు కూడా సంసిద్ధంగా ఉంటారు. సంఘంలో విభజించే ప్రభావాలు—ఉదాహరణకు, బాధను కల్గించే విధంగా ఇతరులను గూర్చి మాట్లాడుకోవడం, ఇతరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించే వైఖరి, లేదా కలహమాడే స్ఫూర్తి వంటి ప్రభావాలు—శాంతిని చెదరగొట్టే ప్రమాదం కల్గిస్తున్నప్పుడు వారు వెంటనే సహాయపడే సలహాను ఇస్తారు. (ఫిలిప్పీయులు 2:2, 3) ఉదాహరణకు పెద్దలకు, మరీ విపరీతంగా విమర్శలను గుప్పించే, లేదా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పరులజోలికి పోయే అలవాటున్న వ్యక్తుల గురించి తెలియరావచ్చు. (1 తిమోతి 5:13; 1 పేతురు 4:15) దేవుడు మనకు బోధించిన మార్గానికి అటువంటి పద్ధతులు విరుద్ధమైనవనీ, ప్రతి ఒక్కరు ‘తన బరువు తానే భరించుకోవాలి’ అనీ అటువంటివారు గుర్తించేలా సహాయం చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తారు. (గలతీయులు 6:5, 7; 1 థెస్సలొనీకయులు 4:9-12) పెద్దలు లేఖనాలను ఉపయోగిస్తూ, అనేక విషయాలను యెహోవా మన వ్యక్తిగత మనస్సాక్షికే విడిచిపెడతాడనీ, అటువంటి విషయాల్లో ఎవరూ ఇతరులకు తీర్పు తీర్చకూడదనీ వారు వివరిస్తారు. (మత్తయి 7:1, 2; యాకోబు 4:10-12) ఐక్యతతో కలిసి సేవచేయడానికిగాను సంఘంలో నమ్మకము, గౌరవములతో కూడిన వాతావరణం ఉండాలి. అవసరమైనప్పుడు లేఖనాధార సలహాను ఇవ్వడం ద్వారా ‘మనుష్యులలో ఈవులు,’ మన శాంతినీ ఐక్యతనూ నిలుపుకోవడానికి మనకు సహాయం చేస్తారు.—రోమీయులు 14:19.
మందను కాపాడటం
18, 19. (ఎ) ‘మనుష్యులలో ఈవులు’ మనల్ని ఎవరినుండి కాపాడతారు? (బి) గొఱ్ఱెల్ని ఏ ఇతర ప్రమాదాల నుండి కాపాడాల్సిన అవసరం ఉంది, గొఱ్ఱెల్ని కాపాడటానికి పెద్దలు ఎలా చర్య తీసుకుంటారు?
18 నాలుగవదిగా, “మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశము” యొక్క ప్రభావానికి లోనుకావడం నుండి మనల్ని కాపాడడానికి యెహోవా ‘మనుష్యులలో ఈవులను’ అందజేస్తాడు. (ఎఫెసీయులు 4:14) ‘మాయోపాయములు’ అని అనువదించబడిన మూలపదానికి “పాచికల దగ్గర మోసం చేయడం,” లేదా “పాచికల్ని తారుమారు చేయడంలో నైపుణ్యం” అన్న అర్థం ఉందని చెబుతారు. మతభ్రష్టులు ఎంత కుయుక్తితో పనిచేస్తారో ఇది మనకు జ్ఞప్తికి తీసుకురావడం లేదా? చాతుర్యంతో కూడిన వాదనలు చేస్తూ, నిజ క్రైస్తవులు తమ విశ్వాసం నుండి తొలగిపోయేలా ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగా వారు లేఖనాలను తారుమారు చేస్తారు. అటువంటి “క్రూరమైన తోడేళ్ల” విషయంలో పెద్దలు జాగరూకులై ఉండాలి!—అపొస్తలుల కార్యములు 20:29, 30.
19 యెహోవా గొఱ్ఱెల్ని ఇతర ప్రమాదాల నుండి కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రాచీనకాలంలోని గొఱ్ఱెలకాపరి అయిన దావీదు తన తండ్రి మందలను క్రూరమైన జంతువుల నుండి నిర్భీతితో కాపాడాడు. (1 సమూయేలు 17:34-36) యెహోవా గొఱ్ఱెలతో, ప్రాముఖ్యంగా మరింత బలహీనులతో తప్పుగా వ్యవహరించే లేదా వారిని అణచివేసే వారెవరినుండైనా కాపాడటానికి నేడు కూడా మందపట్ల చింతగల క్రైస్తవ కాపరులు ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భాలు ఏర్పడవచ్చు. ఇష్టపూర్వకంగా పాపంచేస్తూ, దుష్టత్వాన్ని వ్యాప్తిచేయడానికై మాయోపాయములు, మోసాలు, కుయుక్తులు ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నవారిని సంఘం నుండి తీసివేయడంలో పెద్దలు వేగిరంగా పనిచేస్తారు.b—1 కొరింథీయులు 5:9-13; పోల్చండి కీర్తన 101:7.
20. ‘మనుష్యులలో ఈవుల’ సంరక్షణలో మనం ఎందుకు భద్రతా భావాన్ని అనుభవించగలం?
20 మనం ‘మనుష్యులలో ఈవుల’ నిమిత్తం ఎంత కృతజ్ఞులము! ప్రేమతో కూడిన వారి శ్రద్ధలో మనం భద్రతా భావాన్ని అనుభవించగలము, ఎందుకంటే వారు మనల్ని వాత్సల్యంతో సరిదిద్దుతారు, ప్రేమతో క్షేమాభివృద్ధి కలుగజేస్తారు, మన ఐక్యతను ఎల్లప్పుడు నిలుపుతారు, ధైర్యంతో మనల్ని కాపాడుతారు. కానీ ‘మనుష్యులలో ఈవులు’ సంఘంలోని తమ పాత్రలను ఎలా దృష్టించాలి? అంతేగాక, వారిపట్ల మనకు మెప్పుదల ఉందని మనం ఎలా చూపగలము? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
a “సరిదిద్దడం” అని అనువదించబడిన ఇదే క్రియాపదం గ్రీకు సెప్టాజింట్ వర్షన్లో కీర్తన 17[16]:5లో ఉపయోగించబడింది, అక్కడ విశ్వసనీయుడైన దావీదు తన నడకలు యెహోవా మార్గంలో స్థిరపడి ఉండాలని ప్రార్థించాడు.
b ఉదాహరణకు, నవంబరు 15, 1979 (ఆంగ్లం) కావలికోట సంచికలో 31-2 పేజీల్లోని “పాఠకుల ప్రశ్నలు,” మరియు జనవరి 1, 1997 సంచికలో 26-9 పేజీల్లోని “చెడ్డదానిని అసహ్యించుకుందాము” అనే శీర్షికలను చూడండి.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
◻ ‘మనుష్యులలో ఈవులు’ ఎవరు, దేవుడు వారిని క్రీస్తు ద్వారా సంఘానికి ఎందుకు ఇచ్చాడు?
◻ మందను సరిదిద్దే తమ బాధ్యతను పెద్దలు ఎలా నెరవేరుస్తారు?
◻ తమ తోటి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి పెద్దలు ఏమి చేయగలరు?
◻ పెద్దలు సంఘ ఐక్యతను ఎలా కాపాడగలరు?
[10వ పేజీలోని చిత్రం]
క్రుంగినవారిని ప్రోత్సహించడానికి తదనుభూతి పెద్దలకు సహాయం చేస్తుంది
[10వ పేజీలోని చిత్రం]
పెద్దలలో ఐక్యత సంఘ ఐక్యతకు దారితీస్తుంది