యెహోవా మనకు తన మార్గాన్ని చూపిస్తున్నందుకు సంతోషిస్తున్నాము
“దేవుని మార్గం పరిపూర్ణం. యెహోవా వాక్కు పవిత్రమైంది.”—2 సమూయేలు 22:31, పరిశుద్ధ బైబిల్.
1, 2. (ఎ) దేని విషయంలో మానవులందరూ ఒక ప్రాథమిక అవసరాన్ని కలిగివున్నారు? (బి) మనం ఎవరి మాదిరిని అనుకరించడం ఉత్తమం?
నడిపింపు విషయంలో మానవులందరూ ఒక ప్రాథమిక అవసరాన్ని కలిగివున్నారు. నిజానికి, జీవితంలో నడిపించడానికి మనకు సహాయం అవసరం. యెహోవా మనకు తగినంత మేథస్సునూ, తప్పొప్పుల్ని వివేచించగల మనస్సాక్షినీ ఇచ్చాడన్నది నిజమే. కానీ మన మనస్సాక్షి ఒక నమ్మదగిన మార్గనిర్దేశనంగా ఉండాలంటే అది శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది. (హెబ్రీయులు 5:14) అంతేకాదు, మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మన మనస్సుకు సరైన సమాచారం—అలాగే ఆ సమాచార విలువను నిర్ధారించడానికి శిక్షణ అవసరం. (సామెతలు 2:1-5) అప్పుడు కూడా, జీవితపు అనిశ్చయతల మూలంగా మన నిర్ణయాలు మనం తీసుకున్నట్లుగా జరగకపోవచ్చు. (ప్రసంగి 9:11) మనకుగా మనం భవిష్యత్తు ఏమి తీసుకువస్తుందో తెలుసుకునే నమ్మదగిన మార్గం అంటూ ఏదీ లేదు.
2 ఈ కారణాల మూలంగా, అనేకమైన ఇతర కారణాల మూలంగా ప్రవక్త అయిన యిర్మీయా ఇలా వ్రాశాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదని నాకు బాగుగా తెలుసు. నడుస్తున్న మనుష్యునికి తన అడుగులను నిర్దేశించుకోవడం కూడా ఆయన వశంలో లేదు.” (యిర్మీయా 10:23, NW) భూమ్మీద జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి అయిన యేసుక్రీస్తు నడిపింపును స్వీకరించాడు. ఆయనిలా అన్నాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.” (యోహాను 5:19) కాబట్టి, యేసును అనుకరిస్తూ మన అడుగులను నిర్దేశించుకోవడానికి యెహోవా వైపు చూడడం ఎంత జ్ఞానయుక్తం! రాజైన దావీదు ఇలా పాడాడు: “దేవుని మార్గం పరిపూర్ణం. యెహోవా వాక్కు పవిత్రమైంది. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలు లాంటివాడు.” (2 సమూయేలు 22:31, పరిశుద్ధ బైబిల్) మనం సొంత జ్ఞానానుసారంగా కాక, యెహోవా మార్గంలో నడవాలని కోరుకుంటే, అప్పుడు మనకు పరిపూర్ణమైన మార్గనిర్దేశనం ఉంటుంది. దేవుని మార్గాన్ని తృణీకరించడం నాశనానికి దారితీస్తుంది.
మార్గాన్ని యెహోవా చూపిస్తున్నాడు
3. ఆదాము హవ్వలను యెహోవా ఎలా నడిపించాడు, వారి ముందు ఏ ఉత్తరాపేక్షలను ఉంచాడు?
3 ఆదాము హవ్వల విషయాన్ని పరిశీలించండి. వారు పాపరహితులుగా ఉన్నప్పటికీ వారికి నడిపింపు అవసరం ఉంది. సుందరమైన ఏదెను వనంలో ఏమి చేయాలో నిర్ణయించుకునేలా సమస్తాన్ని యెహోవా ఆదాముకే విడిచిపెట్టలేదు. బదులుగా, దేవుడు ఆయన చేయడానికి పని ఇచ్చాడు. మొదటిగా, ఆదాము జంతువులకు పేర్లు పెట్టాల్సివుంది. తర్వాత, యెహోవా ఆదాము హవ్వలకు దీర్ఘకాలిక లక్ష్యాలను ఇచ్చాడు. వారు భూమిని లోపరచుకొని, దాన్ని తమ సంతానంతో నింపి, భూమిపైనున్న జంతుజాలంపై శ్రద్ధవహించాలి. (ఆదికాండము 1:28) ఇది చాలా బృహత్తర కార్యం, జంతుసృష్టితో సామరస్యంగా జీవించే పరిపూర్ణ మానవజాతితో నిండివున్న ఒక ప్రపంచవ్యాప్త పరదైసే దాని తుది ఫలితం. ఎంత మహత్తరమైన ఉత్తరాపేక్షో కదా! అంతేకాదు, ఆదాము హవ్వలు విశ్వసనీయంగా యెహోవా మార్గంలో నడుస్తుండగా వారు ఆయనతో సంభాషణను జరిపేవారు. (పోల్చండి ఆదికాండము 3:8.) సృష్టికర్తతో ఎల్లప్పుడు, వ్యక్తిగత సంబంధాన్ని కల్గివుండడం, ఎంత అద్భుతమైన ఆధిక్యత!
4. ఆదాము హవ్వలు తమలో నమ్మకము, యథార్థతలు కొరవడ్డాయని తమకుగా తాము ఎలా బయల్పర్చుకున్నారు, ఏ వినాశకరమైన ఫలితాలతో?
4 ఏదెనులో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని తినవద్దని యెహోవా మొదటి మానవజతకు ఒక నిషేధాన్నిచ్చాడు. వారు తమ విధేయతను అంటే, యెహోవా మార్గంలో నడవాలన్న తమ కోరికను ప్రదర్శించుకోవడానికి ఇది వారికి ఒక గొప్ప అవకాశాన్నిచ్చింది. (ఆదికాండము 2:17) అయితే, ఎంతోకాలం గడవకుండానే ఆ విధేయత పరీక్షకు గురైంది. సాతాను మోసకరమైన మాటలతో సమీపించినప్పుడు ఆదాము హవ్వలు విధేయులుగా ఉండాలనుకుంటే వారు యెహోవాపట్ల యథార్థతను చూపించాల్సిన, ఆయన వాగ్దానాల్లో నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది. విచారకరంగా, వాళ్ళలో యథార్థత, నమ్మకం కొరవడ్డాయి. సాతాను హవ్వకు స్వాతంత్ర్యాన్నిస్తానని చెప్పినప్పుడు, యెహోవా అబద్ధమాడుతున్నాడని నిందారోపణ చేసినప్పుడు ఆమె మోసగించబడి దేవునికి అవిధేయురాలైంది. ఆదాము ఆమెను అనుసరించి, పాపం చేశాడు. (ఆదికాండము 3:1-6; 1 తిమోతి 2:14) దాని ఫలితంగా విపరీతమైన నష్టం వాటిల్లింది. యెహోవా మార్గంలో నడవడం, వారు ఆయన చిత్తాన్ని పురోభివృద్ధికరంగా నెరవేరుస్తుండగా దినదిన ప్రవర్థమానమయ్యే ఆనందాన్ని ఇచ్చివుండేది. దానికి బదులుగా, మృత్యువు వారిని కబళించివేసేంత వరకు వారి జీవితాలు నిరాశానిస్పృహలతోను, బాధలతోను నిండిపోయాయి.—ఆదికాండము 3:16-19; 5:1-5.
5. యెహోవా దీర్ఘకాలిక సంకల్పం ఏమిటి, విశ్వసనీయులైన మానవులు దాని నెరవేర్పును చూడడానికి ఆయన ఎలా సహాయం చేస్తాడు?
5 అయినప్పటికీ ఈ భూమి ఒకనాటికి పరిపూర్ణులైన, పాపరహితమైన మానవులకు పరదైసువంటి గృహంగా ఉండాలన్న తన సంకల్పాన్ని యెహోవా మార్చుకోలేదు. (కీర్తన 37:11, 29) తన మార్గంలో నడిచేవారికీ, ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తామన్న నిరీక్షణ ఉన్నవారికీ పరిపూర్ణమైన నడిపింపును ఇవ్వడంలో యెహోవా ఎన్నడూ విఫలంకాలేదు. మనలో వినేందుకు చెవులుగల వారికోసం యెహోవా స్వరం మన వెనకాలే ఇలా చెబుతోంది: “ఇదే త్రోవ, దీనిలో నడువుడి.”—యెషయా 30:21.
యెహోవా మార్గంలో కొందరు నడిచారు
6. తొలికాలాల్లోని ఏ ఇద్దరు పురుషులు యెహోవా మార్గంలో నడిచారు, ఏ ఫలితాలతో?
6 బైబిలు వృత్తాంతం ప్రకారం ఆదాము హవ్వల సంతానంలో కేవలం కొద్దిమంది మాత్రమే యెహోవా మార్గంలో నడిచారు. వీరిలో హేబెలు మొదటివాడు. ఆయన అకాల మరణాన్ని పొందినప్పటికీ, యెహోవా అనుగ్రహం ఆయనపై ఉండగానే మరణించాడు. ఆ విధంగా దేవుని యుక్తకాలంలో “నీతిమంతులకు . . . పునరుత్థానము” జరిగినప్పుడు పునరుత్థానమయ్యే కచ్చితమైన ఉత్తరాపేక్ష ఆయనకు ఉంది. (అపొస్తలుల కార్యములు 24:15) ఆయన ఈ భూమిపట్లా, మానవజాతిపట్లా యెహోవాకు ఉన్న గొప్ప సంకల్పం చివరికి నెరవేరడాన్ని చూస్తాడు. (హెబ్రీయులు 11:4) యెహోవా మార్గంలో నడిచిన మరో వ్యక్తి హనోకు. ఈ విధానపు చివరి అంతం గురించిన ఆయన ప్రవచనం యూదా పుస్తకంలో భద్రపర్చబడింది. (యూదా 14, 15) హనోకు కూడా తాను జీవించే సాధ్యతగలిగినన్ని సంవత్సరాలు జీవించలేకపోయాడు. (ఆదికాండము 5:21-24) అయినప్పటికీ, ఆయన “దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను.” (హెబ్రీయులు 11:5) ఆయన చనిపోయినప్పుడు హేబెలులా, పునరుత్థానం పొందుతానన్న నిశ్చయమైన నిరీక్షణతో, యెహోవా సంకల్పాలు నెరవేరడాన్ని చూసేవారిలో ఉంటానన్న నిరీక్షణతో చనిపోయాడు.
7. నోవహు ఆయన కుటుంబమూ యెహోవాకు తమ యథార్థతనూ ఆయనపై తమ నమ్మకాన్నీ ఎలా చూపించారు?
7 జలప్రళయానికి ముందున్న లోకం అంతకంతకూ చెడిపోయినప్పుడు, యెహోవాకు విధేయత చూపడమనేది యథార్థతకు ఒక పరీక్షగా మారిపోయింది. ఆ లోకం ముగింపుకొస్తుండగా ఒకే ఒక్క చిన్న గుంపు యెహోవా మార్గంలో నడుస్తున్నట్లు కనబడింది. నోవహు ఆయన కుటుంబమూ దేవుని మాట విని ఆయన చెప్పినదానిపై నమ్మకం ఉంచారు. వారు తమ ముందు ఉంచిన నియామకాలను విశ్వసనీయంగా నెరవేర్చి, ఆ దినాల్లోని లోకపు దుష్ట అభ్యాసాల్లో కూరుకుపోవడానికి విరుద్ధంగా పోరాడారు. (ఆదికాండము 6:5-7, 13-16; హెబ్రీయులు 11:7; 2 పేతురు 2:5) వారు యథార్థతతో నమ్మకంగా విధేయతను కనపర్చినందుకు మనం కృతజ్ఞులమై ఉంటాము. వాటి మూలంగానే వారు జలప్రళయాన్ని తప్పించుకుని మన పూర్వికులయ్యారు.—ఆదికాండము 6:22; 1 పేతురు 3:20.
8. ఇశ్రాయేలు జనాంగానికి దేవుని మార్గమందు నడవడంలో ఏమి ఇమిడివుంది?
8 కాలక్రమేణా, యెహోవా విశ్వసనీయుడైన యాకోబు వంశస్థులతో ఒక నిబంధన చేశాడు, దానితో వారు ఆయన ప్రత్యేక జనాంగమయ్యారు. (నిర్గమకాండము 19:5, 6) తన నిబంధన ప్రజలకు, యెహోవా లిఖిత ధర్మశాస్త్రం ద్వారా, యాజకత్వం ద్వారా, తను ఎల్లప్పుడూ పంపుతూ వచ్చిన ప్రవక్తల నిర్దేశనం ద్వారా నడిపింపును అందించాడు. కానీ ఆ నడిపింపును అనుసరించాలా వద్దా అన్నది ఇశ్రాయేలీయుల పని. యెహోవా తన ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పించాడు: “చూడుడి, నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును.”—ద్వితీయోపదేశకాండము 11:26-28.
కొందరు యెహోవా మార్గాన్ని ఎందుకు విసర్జించారు
9, 10. ఏ పరిస్థితి మూలంగా, ఇశ్రాయేలీయులు యెహోవామీద నమ్మకం ఉంచాల్సివచ్చింది, ఆయనపట్ల యథార్థతను పెంపొందించుకోవాల్సి వచ్చింది?
9 ఆదాము హవ్వలకు అవసరమైనట్లుగానే ఇశ్రాయేలీయులు, విధేయులుగా ఉండాలనుకుంటే వాళ్లు యెహోవామీద నమ్మకం ఉంచాల్సివుంది, ఆయనపట్ల యథార్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలీయులది ఒక చిన్న జనాంగం, వారి చుట్టూ ఉన్నవి జగడాలమారి దేశాలు. నైరృతి దిశలో ఐగుప్తు, ఐతియోపియాలున్నాయి. ఈశాన్య దిశలో సిరియా, అష్షూరు దేశాలున్నాయి. ఇశ్రాయేలీయులకు ఆనుకునే ఫిలిష్తీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు ఉన్నారు. ఏదో ఒక సమయంలో అవన్నీ ఇశ్రాయేలీయులకు శత్రు దేశాలని రుజువు చేసుకున్నాయి. విగ్రహ దేవుళ్ళ ఆరాధన, జ్యోతిషశాస్త్రం, కొన్ని సందర్భాల్లో నీచాతినీచమైన లైంగిక ఆచారాలు, పిల్లల్ని క్రూరంగా బలి ఇవ్వడమూ వంటి వాటిచే సూచించబడ్డ అబద్ధ మతాన్ని అవన్నీ అభ్యసించేవి. ఇశ్రాయేలీయులకు ఇరుగు పొరుగున ఉన్న జనాంగాలు సంతాన సమృద్ధిని, పుష్కలమైన పంటలను, యుద్ధాల్లో విజయాన్ని తమ దేవుళ్లు ఇస్తారని ఎదురుచూసేవారు.
10 ఇశ్రాయేలు జనాంగం మాత్రమే ఒకే ఒక్క దేవుడ్ని—యెహోవాను ఆరాధించింది. వారు తన నియమాలకు విధేయత చూపిస్తే ఆయన వారిని పెద్ద కుటుంబాలతో, సమృద్ధియైన పంటలతో, తమ శత్రువులనుండి కాపుదలతో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. (ద్వితీయోపదేశకాండము 28:1-14) విచారకరంగా, ఇశ్రాయేలులోని చాలామంది ఇలా చేయడంలో విఫలమైపోయారు. యెహోవా మార్గంలో నడిచినవారు చాలామంది తమ యథార్థత మూలంగా బాధల్ని అనుభవించారు. కొందరైతే యాతనలను, తిరస్కారాల్ని, కొరడాదెబ్బల్ని, ఖైదును అనుభవించారు; రాళ్లతో కొట్టబడ్డారు, తోటి ఇశ్రాయేలీయుల చేతిలో హత్యకు కూడా గురయ్యారు. (అపొస్తలుల కార్యములు 7:51, 52; హెబ్రీయులు 11:35-38) విశ్వసనీయులకు అది ఎంతటి పరీక్షో కదా! అయితే, యెహోవా మార్గం నుండి అంతమంది ఎందుకు వైదొలగిపోయారు? ఇశ్రాయేలు చరిత్రలోని రెండు ఉదాహరణలు, వారి తప్పుడు ఆలోచనా విధానాన్ని చూడడానికి మనకు సహాయం చేస్తాయి.
ఆహాజు చెడ్డ ఉదాహరణ
11, 12. (ఎ) సిరియా దేశం నుండి ప్రమాదం ఎదురైనప్పుడు ఆహాజు ఏమి చేయడానికి నిరాకరించాడు? (బి) భద్రతకోసం ఆహాజు ఏ రెండు వైపులకు తిరిగాడు?
11 ఆహాజు దక్షిణ రాజ్యమైన యూదాను సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో పరిపాలించాడు. ఆయన పరిపాలనలో శాంతి కరువైంది. ఒకసారి ఆయనకు విరుద్ధంగా సిరియా దేశమూ, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేశమూ కూడబలుక్కుని యుద్ధానికి వచ్చాయి, అప్పుడు ‘ఆయన హృదయమును ఆయన జనుల హృదయమును కదిలెను.’ (యెషయా 7:1, 2) అయితే, యెహోవా తాను మద్దతునిస్తాననీ, తనను శోధించమనీ చెప్పినప్పుడు ఆహాజు ఖండితంగా నిరాకరించాడు! (యెషయా 7:10-12) దాని ఫలితంగా, యూదా రాజ్యం యుద్ధంలో ఓడిపోయి ఎంతోమందిని కోల్పోయింది.—2 దినవృత్తాంతములు 28:1-8.
12 ఆహాజు యెహోవాను శోధించడానికైతే నిరాకరించాడు గానీ, ఆయనకు అష్షూరు రాజు నుండి మాత్రం సహాయం కావల్సివచ్చింది. అయినప్పటికీ, యూదా రాజ్యం తన శత్రువుల చేతిలో ఓటమిని చవిచూస్తూనే వచ్చింది. అష్షూరు కూడా ఆహాజుకు విరుద్ధంగా తిరిగి ఆయనకు ‘బాధను’ కలుగజేసినప్పుడు, ఈ రాజు “సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను.”—2 దినవృత్తాంతములు 28:20, 23.
13. సిరియా దేవుళ్ళవైపు తిరగడం ద్వారా ఆహాజు ఏమి చూపించాడు?
13 అటు తర్వాత కొంతకాలానికి యెహోవా ఇశ్రాయేలుకు ఇలా చెప్పాడు: “నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:17, 18) ఆహాజు సిరియా దేవుళ్ళవైపు తిరిగి, తాను ‘నడవవలసిన త్రోవనుండి’ ఎంతగా వైదొలగిపోయాడో చూపించాడు. చుట్టుప్రక్కల జనాంగాల ఆలోచనా విధానం మూలంగా ఆయన పూర్తిగా మోసపోయాడు, భద్రతకోసం యెహోవావైపు కాక వారి అబద్ధ మూలాలవైపు తిరిగాడు.
14. ఆహాజు అబద్ధ దేవుళ్ళవైపు తిరిగినప్పుడు ఆయన ఎందుకు క్షమార్హుడు కాడు?
14 సిరియా దేవుళ్ళతోపాటు అన్య జనాంగాల దేవుళ్ళందరూ “వ్యర్థమైన దేవుళ్ళు” అని ఎంతోకాలంగా రుజువవుతూనే వచ్చింది. (యెషయా 2:8, NW) మునుపు, దావీదు రాజు పరిపాలనలో సిరియన్లు దావీదు సేవకులైనప్పుడు సిరియా దేవుళ్ళపై యెహోవా ఆధిపత్యం స్పష్టంగా కనబడింది. (1 దినవృత్తాంతములు 18:5, 6) యెహోవాయే “పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు” గనుక నిజమైన భద్రతను ఆయన మాత్రమే ఇవ్వగలడు. (ద్వితీయోపదేశకాండము 10:17) అయితే ఆహాజు యెహోవాను విసర్జించాడు, భద్రత కోసం అన్య జనాంగాల దేవుళ్ళవైపు తిరిగాడు. ఇది యూదాకు ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చింది.—2 దినవృత్తాంతములు 28:24, 25.
యిర్మీయాతోపాటు ఐగుప్తులో ఉన్న యూదులు
15. యిర్మీయా కాలంలో ఐగుప్తులోని యూదులు ఏ విధంగా పాపం చేశారు?
15 అత్యంత ఘోరమైన రీతిలో తన ప్రజలు యథార్థతా రాహిత్యాన్ని చూపించడం కారణంగా, బబులోనీయులు సా.శ.పూ. 607లో యెరూషలేమునూ దానిలోని దేవాలయాన్నీ నాశనం చేసేందుకు యెహోవా అనుమతించాడు. ఆ జనాంగంలోని చాలామంది బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. అయితే కొందరు అక్కడే విడిచిపెట్టబడ్డారు, వారిలో ప్రవక్త అయిన యిర్మీయా కూడా ఉన్నాడు. అధిపతి అయిన గెదల్యా హత్యచేయబడినప్పుడు ఈ సమూహం ఐగుప్తుకు పారిపోయింది, వీరు యిర్మీయాను తమతోపాటు తీసుకుపోయారు. (2 రాజులు 25:22-26; యిర్మీయా 43:5-7) అక్కడ వారు అబద్ధ దేవతలకు బలులు అర్పించసాగారు. ఇందుకు ఈ అవిశ్వసనీయులైన యూదులతో యిర్మీయా తీవ్రంగా తర్కించాడు, కానీ వారు తమ మూర్ఖత్వాన్ని వదులుకోలేదు. వారు యెహోవావైపు తిరగడానికి నిరాకరించి, తాము “ఆకాశరాణికి” ధూపము వేస్తూనే ఉంటామని మొండివాదనను చేశారు. ఎందుకు? ఎందుకంటే, వాళ్లూ వాళ్ల పితరులూ ‘యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినదదే. ఆలాగు చేసినప్పుడు వారికి ఆహారము సమృద్ధిగా దొరికింది, వారు క్షేమముగానే ఉన్నారు, ఏ కీడును వారికి కలుగలేదు.’ (యిర్మీయా 44:16, 17) ఆ యూదులు ఇలా కూడా మూర్ఖంగా వాదించారు: “మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము.”—యిర్మీయా 44:18.
16. ఐగుప్తులోని యూదుల తర్కనా విధానం పూర్తిగా ఎందుకు తప్పైవుంది?
16 జ్ఞాపకశక్తి ఇష్టమైనవాటినే ఎంతబాగా జ్ఞాపకం ఉంచుకుంటుందో కదా! కానీ వాస్తవాలేమిటి? యెహోవా వారికిచ్చిన దేశంలో యూదులు అబద్ధ దేవుళ్ళకు నిజంగానే బలులు అర్పించారు. కొన్నిసార్లు ఆహాజు కాలంలో జరిగినట్లుగా వారు ఆ విధమైన భ్రష్టత్వం మూలాన బాధలను అనుభవించారు కూడా. అయితే, యెహోవా తన నిబంధన ప్రజలతో దీర్ఘశాంతంతో వ్యవహరించాడు. (నిర్గమకాండము 34:6; కీర్తన 86:15) పశ్చాత్తాపం పొందేలా వారిని పురికొల్పడానికి ఆయన తన ప్రవక్తలను పంపించాడు. కొన్నిసార్లు, రాజు విశ్వసనీయుడుగా ఉన్నప్పుడు యెహోవా ఆ రాజును ఆశీర్వదించాడు. ప్రజల్లో అత్యధికులు అవిశ్వసనీయులుగా ఉన్నప్పటికీ ఆ ఆశీర్వాదం మూలంగా ప్రజలు ప్రయోజనం పొందారు. (2 దినవృత్తాంతములు 20:29-33; 27:1-6) తమ స్వదేశంలో తాము అనుభవించిన సమృద్ధియంతా తమ అబద్ధ దేవుళ్ళ నుండి వచ్చినదేనని చెప్పుకుంటూ, ఐగుప్తులో ఉన్న ఆ యూదులు ఎంత తప్పుగా తలంచారు!
17. యూదా తన దేశాన్నీ, దేవాలయాన్నీ ఎందుకు కోల్పోయింది?
17 సా.శ.పూ. 607లో యూదాలోని ప్రజలను యెహోవా ఇలా పురికొల్పాడు: “నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.” (యిర్మీయా 7:23) యూదులు తమ దేవాలయాన్నీ, తమ దేశాన్నీ కోల్పోవడానికి కచ్చితంగా కారణం, ‘యెహోవా వారికి ఆజ్ఞాపించిన మార్గంలో నడవకపోవడమే.’ అటువంటి ఘోరమైన పొరపాటు మనం చేయకుండా ఉండడానికి జాగ్రత్తవహిద్దాము.
తన మార్గంలో నడిచేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు
18. యెహోవా మార్గంలో నడిచేవారు ఏమి చేయాలి?
18 గతంలో వలెనే నేడు కూడా, దేవుని మార్గంలో నడవడానికి యథార్థత—ఆయన్ను మాత్రమే సేవించాలన్న కృత నిశ్చయం అవసరం. ఆ మార్గంలో నడవడానికి నమ్మకం—యెహోవా వాగ్దానాలు నమ్మదగినవి, అవి తప్పకుండా నెరవేరుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం అవసరం. యెహోవా మార్గంలో నడవడానికి విధేయత—ఆయన నియమాలను ఏమాత్రం తప్పిపోకుండా అనుసరించడమూ, ఆయన ఉన్నతమైన ప్రమాణాలను అంటిపెట్టుకోవడమూ అవసరం. “యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు.”—కీర్తన 11:7.
19. నేడు చాలామంది ఏ దేవుళ్ళను ఆరాధిస్తున్నారు, ఏ ఫలితాలతో?
19 ఆహాజు భద్రతకోసం సిరియా దేవుళ్ళవైపు తిరిగాడు. ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులు ప్రాచీన మధ్యప్రాచ్యంలో విస్తృతంగా ఆరాధించబడిన దేవతయైన “ఆకాశరాణి” తమకు వస్తుసంపదలను తెస్తుందని నమ్మకముంచారు. నేడు అనేక దేవతలు అక్షరార్థమైన విగ్రహాలుకావు. యేసు, యెహోవాకు బదులుగా “సిరికి” దాసులుగా ఉండటం విషయమై హెచ్చరించాడు. (మత్తయి 6:24) అపొస్తలుడైన పౌలు “విగ్రహారాధనయైన లోభత్వమును” గురించి మాట్లాడాడు. (కొలొస్సయులు 3:5, అథస్సూచి.) ఆయన కొందరి గురించి మాట్లాడుతూ, “వారి కడుపే వారి దేవుడు” అని కూడా అన్నాడు. (ఫిలిప్పీయులు 3:19) అవును, నేడు ఆరాధించబడుతున్న దేవుళ్ళలో డబ్బు వస్తుసంపదలు ప్రధానమైన దేవుళ్ళుగా ఉన్నాయి. నిజానికి, అత్యధికులు “అస్థిరమైన ధనమునందు నమ్మిక”యుంచుతున్నారు, వీరిలో మతంతో సంబంధాలు గలవారు కూడా ఉన్నారు. (1 తిమోతి 6:17) చాలామంది ఈ దేవుళ్ళకు సేవచేయడానికి ఎంతో కష్టపడతారు, కొందరు ఫలితాల్ని కూడా పొందుతారు—గొప్ప ఇండ్లలో నివసిస్తారు, విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఖరీదైన భోజనాలు చేస్తారు. అయితే, అందరూ అంతటి సమృద్ధిని అనుభవించరు. అంతేగాక అలాంటి వాటిని అనుభవించేవారు కూడా, ఇవి మాత్రమే సంతృప్తినియ్యవని చివరికి తెలుసుకుంటారు. అవి అనిశ్చయమైనవి, తాత్కాలికమైనవి, ఆధ్యాత్మిక అవసరాలను అవి తృప్తిపర్చవు.—మత్తయి 5:3.
20. మనం ఎటువంటి సమతుల్యతను కాపాడుకోవల్సిన అవసరం ఉంది?
20 నిజమే, మనం ఈ విధానపు అంత్య దినాల్లో జీవిస్తుండగా ఆచరణాత్మకంగా ఉండాల్సిందే. మన కుటుంబాలను వస్తుపరంగా పోషించుకోవడానికి మనం సహేతుకమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కానీ దేవుడ్ని సేవించడంపైన కన్నా మన జీవన ప్రమాణాన్ని పెంచుకోవడంపైనా, డబ్బు వెనకాల పడటంపైనా, లేదా అటువంటి మరితర విషయాలపైనా ఎక్కువ అవధానాన్నుంచినట్లైతే మనం ఏదో రకమైన విగ్రహారాధనలో పడిపోయినట్లే, మనం ఇక ఎంతమాత్రం యెహోవా మార్గంలో నడుస్తున్నట్లు కాదు. (1 తిమోతి 6:9, 10) అయితే, మనం ఆరోగ్య, ఆర్థిక, లేదా మరితరమైన సమస్యల్లో చిక్కుకుపోయినట్లైతే అప్పుడేమిటి? ఐగుప్తులోని ఆ యూదులు తమ సమస్యలకు దేవుడ్ని సేవించడమే కారణం అని నిందవేసినట్లు మనం వేయకూడదు. బదులుగా, మనం యెహోవాను శోధించుదాము, అలా చేయడంలో ఆహాజు విఫలమయ్యాడు. యథార్థతతో మనం నడిపింపుకోసం యెహోవావైపు తిరుగుదాము. నమ్మకంగా ఆయన నడిపింపును అన్వయిస్తూ, ప్రతి విధమైన పరిస్థితినీ ఎదుర్కోవడానికి కావల్సిన బలంకోసమూ జ్ఞానంకోసమూ ప్రార్థిద్దాము. అప్పుడు, మనం యెహోవా ఆశీర్వాదం కోసం పూర్తి నమ్మకంతో ఎదురుచూడవచ్చు.
21. యెహోవా మార్గంలో నడిచేవారికి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?
21 ఇశ్రాయేలు చరిత్రలో యెహోవా తన మార్గంలో నడిచినవారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. దావీదు రాజు ఇలా కీర్తించాడు: “యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము.” (కీర్తన 5:8) యెహోవా ఆయనకు, అటుతర్వాత ఆహాజును పీడించిన చుట్టుప్రక్కల జనాంగాలపై సైనిక విజయాలను ఇచ్చాడు. సొలొమోను పరిపాలనలో, అటుతర్వాత ఐగుప్తులోని యూదులు వాంఛించిన శాంతి ధనసంపదలతో ఇశ్రాయేలు ఆశీర్వదించబడింది. ఆహాజు కుమారుడైన హిజ్కియాకు యెహోవా బలోపేతమైన అష్షూరుపై విజయాన్ని కూడా ఇచ్చాడు. (యెషయా 59:1) అవును, “పాపుల మార్గమున” నిలువక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించే తన యథార్థవంతులను కాపాడకపోవడానికి యెహోవా హస్తము కురుచకాలేదు. (కీర్తన 1:1, 2) నేడు కూడా అదే వాస్తవం. అయితే నేడు మనం యెహోవా మార్గంలో నడుస్తున్నామని ఎలా నిశ్చయతను కల్గివుండగలము? ఇది తర్వాత శీర్షికలో చర్చించబడుతుంది.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
◻ యెహోవా మార్గంలో మనం నడవాలంటే ఏ లక్షణాలు కీలకమైనవి?
◻ ఆహాజు ఆలోచనా విధానం ఎందుకు తప్పు?
◻ ఐగుప్తులో ఉన్న యూదుల తర్కనా విధానంలో ఉన్న పొరపాటు ఏమిటి?
◻ యెహోవా మార్గంలో నడవాలన్న మన కృత నిశ్చయాన్ని ఎలా బలపర్చుకోగలం?
[13వ పేజీలోని చిత్రం]
ఆహాజు రక్షణకోసం యెహోవావైపు కాక సిరియా దేవుళ్ళవైపు తిరిగాడు