ఒక చారిత్రక సందర్శనం ఒక ద్వీపాన్ని ఆనందింపజేసింది
కరీబియన్ సముద్రంలోని ఒక అందమైన ద్వీపమైన క్యూబా మునుపెన్నడూ అనుభవించనంతటి ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన కాలాన్ని ఇటీవల అనుభవించింది. ఈ వెస్ట్ ఇండీస్ దేశంలో నివసిస్తున్న యెహోవాసాక్షులకు 1998 చివరి భాగం ఎంతోకాలంగా ఎదురు చూసిన ఆశీర్వాదాలను పట్టుకు వచ్చింది. 30 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులు ఈ దేశాన్ని మొదటిసారిగా సందర్శించారు. వాళ్ళతోపాటు మరో మరో 15 మంది ప్రతినిధులు వచ్చారు. ఆ సందర్శకులు ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఇటలీ, గ్రేట్ బ్రిటన్, న్యూజీలాండ్, ప్యూర్టోరికో, బెల్జియమ్ల నుండి వచ్చారు.
ఇక్కడి 82,258 రాజ్య ప్రచారకులకూ, 1998 వసంతకాలంలో ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించడంలో వాళ్ళతో చేరిన 87,890 మందికీ ఇది ఒక చారిత్రాత్మక సంఘటనే.
లోయిడ్ బ్యారీ, జాన్ బార్, గెరిట్ లోష్ 1998, డిసెంబర్ 1 నుండి 7 వరకు హవానాలోని బేతేల్ హోమ్‌ను సందర్శించి, క్యూబాలో జరిగిన “దైవిక జీవిత మార్గము” జిల్లా సమావేశాల్లోని కొన్నింటికి హాజరయ్యారు. ప్రయాణ పెద్దలను కలవగలిగినందుకు, క్యూబా ప్రభుత్వాధికారులతో మంచి పరిచయమేర్పరచుకోగలిగినందుకూ వాళ్ళు చాలా సంతోషించారు.
“దైవపరిపాలన క్రింద ఉన్న మా జీవితంలో నాకూ, నా శ్రీమతికీ చెప్పుకోదగ్గ విషయమిది. క్యూబాలోని మన ప్రియతమ సహోదర సహోదరీలు సత్యం విషయమై ఎంతో ఉత్సాహంతో ఉన్నారు! నేను అక్కడినుండి వచ్చేటప్పుడు మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం నిజంగా ప్రశస్తమైనదన్న అనుభూతి కలిగింది నాకు!” అని సహోదరుడు జాన్ బార్ అన్నారు. “అక్కడ మన సహోదరుల పరిస్థితిని గురించి మెరుగైన అవగాహనను ఏర్పరచుకోవడానికి నాకు ఈ ప్రాముఖ్యమైన వారం సహాయపడింది” అని లోయిడ్ బ్యారీ జత చేస్తున్నారు.
గత ఐదు సంవత్సరాల్లో, క్యూబాలోని యెహోవాసాక్షులకు ఆరాధన స్వాతంత్ర్యం అనుమతించబడుతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగాలని క్యూబా ప్రభుత్వాధికారులు ఆశిస్తున్నారని నమ్మేలా చేస్తున్నాయి వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు.
1994 సెప్టెంబర్‌లో, హవానాలోని బేతేల్ గృహంలో ముద్రణా పని స్థిరపరచబడింది. మునుపటిలా, యెహోవాసాక్షులు బహిరంగంగా కలుసుకోగల్గుతున్నారు, ఇంటింటా సాక్ష్యమివ్వగల్గుతున్నారు. తర్వాత, 1998లో, అధికారులు, పరిపాలక సభ సభ్యులైన ముగ్గురితో సహా యెహోవాసాక్షుల అంతర్జాతీయ ప్రతినిధులైన 18 మందిని క్యూబాను సందర్శించేందుకు అనుమతించారు.
సంతోషభరితమైన పునఃకలయిక
ఈ ప్రతినిధులు హవానాలోని హోసే మార్టీ విమానాశ్రయాన్ని చేరుకున్నప్పుడు, వాళ్ళను ప్రభుత్వాధికారుల ప్రతినిధుల గుంపూ, బేతేల్ హోమ్ నుండి వచ్చిన ఒక గుంపూ ఆతిధ్యపూర్వకంగా స్వీకరించడానికి వచ్చాయి. బేతేల్ నుండి వచ్చిన సహోదరులలో ఒకరు, 1961లో పరిపాలకు సభ సభ్యుడు ఒకరు—మిల్టన్ హెన్షేల్—క్యూబాను చివరిసారిగా సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాన్ని గుర్తుచేసుకున్న ఆ సహోదరుడికి అప్పుడు 12 సంవత్సరాలు; ఆయన ఇప్పుడు ప్రయాణ పైవిచారణకర్త.
ఈ ప్రతినిధులు ఈ బేతేలు హోమ్‌కు చేరుకున్నప్పుడు, ఈ సందర్భం కోసమే ఒక సహోదరుడు పెంచిన గ్లాడియోల, గులాబీ, మల్లె, పసుపు ఎరుపు వర్ణాల్లోని డెయ్సీ పువ్వులతో చేసిన పుష్పగుచ్ఛాలతో స్వాగతమిచ్చారు. బేతేల్ కుటుంబం ఈ ప్రతినిధులకు స్వాగతమిస్తుండగా అందరి కంటా నీళ్ళు తిరిగాయి. తర్వాత, వాళ్ళు భోజనం చేశారు. క్యూబన్ రోస్టెడ్ పోర్క్, అన్నం, బీన్స్, సాలడ్, మోకో (వెల్లుల్లిపాయలూ, ఒలివ్ ఆయిల్‌తో చేసిన సాస్)తో యూకా ఆకులు, తాజా పండ్లు వాళ్ళు చేసిన భోజనం. భోజనం తర్వాత పరిపాలక సభ సభ్యులు ఒక్కొక్కరు బేతేల్ సేవ అనే నిక్షేపంపై నిర్మాణాత్మక ప్రసంగాలనిచ్చారు. సహోదరుడు లోష్ అక్కడి సహోదరులతో స్పానిష్ భాషలో మాట్లాడుతుండగా ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యానాలు కదిలించేవిగా ఉన్నాయి.ఈ బేతేలు కుటుంబంలో 48 మంది క్రమ స్వచ్ఛంద సేవకులూ, 18 మంది తాత్కాలిక హెల్పర్లూ ఉన్నారు.
క్యూబాలోని సహోదరుల కోసం పుస్తకాలు బైబిళ్ళూ ఇటలీలో ముద్రించబడుతున్నప్పటికీ, కావలికోట, తేజరిల్లు! పత్రికల సంపుటుల బ్లాక్ అండ్ వైట్ ప్రతులను ఈ దేశంలోనే మిమియోగ్రాఫ్ మెషీన్లతో ఉత్పత్తి చేయవలసి ఉంది. అవసరమైన పత్రికలను అన్నింటినీ ఉత్పత్తి చేసేందుకు ఇరుకుగా ఉండే క్వార్టర్లలో ఎన్నో గంటలపాటు, పనులను చేత్తోనే మళ్ళీ మళ్ళీ చేయవలసి ఉంది. ఆ స్వచ్ఛంద సేవకులు చాలా ప్రత్యేకమైన విధంలో యెహోవాకు సేవ చేయడంలో ఉన్న తమ నిక్షేపాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు.—2 కొరింథీయులు 4:7.
సమావేశంలోని చెప్పుకోవలసిన విషయాలు
మూడు వేర్వేరు స్థలాల్లో—హవానా, కామాగూయే, హోల్గూయైన్లలో—జరగనున్న జిల్లా సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన 18 మంది ప్రతినిధులు మూడు గుంపులుగా విభజించబడ్డారు. ఒక్కో స్థలంలో జరుగుతున్న సమావేశానికి ఆ మూడు రోజుల్లోని ప్రతిరోజూ హాజరయ్యేందుకు సహోదర సహోదరీలు, అనేక మంది పెద్దలూ, పయినీర్లతో సహా ఒక పెద్ద గుంపే ఆహ్వానించబడింది. ఈ సమావేశం ఒక ప్రత్యేక సందర్భంగా ఉండబోతుందని స్థానిక సాక్షులకు చెప్పినప్పటికీ, పరిపాలక సభ సభ్యులు వస్తున్నారన్న విషయం వాళ్ళకు తెలియదు. వాళ్ళు, శుక్రవారం ఉదయం, ఈ ప్రియతమ సహోదరులూ, వారి భార్యామణులూ అద్దెకు తీసుకున్న బస్సుల నుండి దిగడం చూసి ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో ఊహించండి!
అధికారుల అనుమతితో సహోదరులు నిర్మించిన ఓపన్ ఎయర్ ఫెసిలిటీస్లలో సమావేశాలు జరిగాయి. హవానా సమావేశం జరిగిన స్థలంలో ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న రాళ్ళలో ఒకదానిపై, “కీర్తన 133:1” అని చెక్కబడి ఉంది. అది, “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అని ఆ వాక్యంలో ఉన్న మాటలను సహోదరులకు గుర్తు చేసింది. ఆ సమావేశంలో, ఆ ప్రాంతంలో, మంచి, ఆహ్లాదకరమైన క్రైస్తవ సహవాసాన్ని నిశ్చయంగా అనుభవించారు.
ప్రసంగాలను చాలా అమోఘంగా ఇచ్చినందుకూ, ఇంటర్వ్యూలను జరిపినందుకూ సమావేశానికి హాజరైనవాళ్ళు చాలా మెచ్చుకున్నారు. దానియేలు 3వ అధ్యాయంలో, ప్రాచీన బబులోను నేపథ్యంగా ఉన్న బైబిలు కథ ఆధారమైన నాటక సమర్పణ చూసి వాళ్ళు ఎంతో ముగ్ధులయ్యారు. “అందరూ చాలా చక్కగా నటించారు, శబ్ద కూర్పు కూడా ఎంత చక్కగా జరిగిందంటే, సౌండ్ ముందే రికార్డ్ చేసినట్లు అనిపించనే అనిపించదు. దుష్టుడైన బబులోనీయుడు నిజంగా దుష్టుడులాగే కనిపించాడు, ఆ ముగ్గురు హెబ్రీయులు స్థిరంగా, దృఢనిశ్చయంతో ఉన్నట్లు కనిపించారు” అని ఒక సహోదరి వ్యాఖ్యానం చేసింది.
సమావేశాన్ని చూడడానికి వచ్చిన ఆఫీస్ ఆఫ్ రిలిజియస్ అఫైర్స్ ప్రతినిధులూ ప్రభుత్వాధికారులు సహోదరులను వాళ్ళ సంస్థీకరణను గురించీ, సత్ప్రవర్తన గురించీ మెచ్చుకున్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు క్యూబా అధికారులు చూపించిన అమోఘమైన ఆతిథ్యానికి సహోదరుడు బ్యారీ తన హృదయపూర్వక కృతజ్ఞతాభావాన్ని తెలిపారు. ఇవ్వబడిన ప్రసంగాల విషయమైన తమ మెప్పుదలను, అధికారులు తమ సమావేశాలకు అనుమతించినందుకు తమకు గల మెప్పుదలను తెలియజేస్తూ సహోదరులు చేసిన కరతాళ ధ్వనులు కాసేపు వరకూ అలాగే కొనసాగాయి. “ఇది మేము ఎదురు చూసిన దానికన్నా చాలా ఎక్కువ—చిన్న తరహా అంతర్జాతీయ సమావేశమిది! ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది తన వాగ్దానాలను నిజం చేయగల యెహోవా యొక్క గొప్ప శక్తికి రుజువునిచ్చింది” అని ఒక క్రైస్తవ కుటుంబం అంది.
ఈ సమావేశాలు ఇతరులు యెహోవాసాక్షులను దగ్గరిగా తెలుసుకునే అవకాశాలను కూడా ఇచ్చాయి. బస్ డ్రైవర్లలో ఒకరు శనివారం సమావేశానికి హాజరయ్యాడు, మళ్ళీ ఆదివారం కూడా హాజరయ్యాడు. యెహోవాసాక్షులను గురించి ఎన్నో విషయాలను తను విన్నాడు, కానీ నిజానికి వాళ్ళు మంచివాళ్ళని, శాంతంగా ఉండే ప్రజలని ఇప్పుడు తను తెలుసుకున్నాడని ఆయన చెప్పాడు.
“మేమెన్నడూ మర్చిపోకూడని విషయాలు”
క్యూబాలోని ప్రజలు తమ ఆప్యాయతతో, స్నేహశీలంతో ఆ ప్రతినిధులను ముగ్ధులను చేశారు. క్యూబా దేశస్థులు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు సూత్రానుసారులు, దయగలవాళ్ళు. “ఒకటి కన్నా ఎక్కువ సందర్భాల్లో పూర్తిగా అపరిచితులైన వ్యక్తులు తాముగా వచ్చి మాకు సహాయం చేశారు” అని ఒక ప్రతినిధి అన్నారు.
ఆ ప్రతినిధులు క్యూబాలోని తోటి సాక్షులు కనబరచిన విశ్వాసాన్నీ సంతోషాన్నీ ప్రేమనూ చూసి చాలా ముగ్ధులయ్యారు. ఎన్నో అవరోధాలున్నప్పటికీ వాళ్ళు యెహోవాను తమ బలమైన దుర్గంగా చేసుకున్నారు. (కీర్తన 91:2) “క్యూబాలో నా ఈ మొదటి సందర్శనంలో అనేక విషయాలు, ఆ దేశపు అందం, మేము కలిసిన ప్రజల ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం, అన్నింటికన్నా ముఖ్యంగా, మన ప్రియతమ సహోదర సహోదరీల ఆనందాతిరేకమూ నాకు ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి. మన రాజ్య గీతాలను ఇంత హృదయపూర్వకంగా ఆలపించడాన్ని గానీ, ఆధ్యాత్మిక విషయాలు తమ హృదయాలను స్పృశించినప్పుడు కరతాళధ్వనులు అంతసేపు చేయడం గానీ నా జీవితంలో మునుపెన్నడూ వినలేదు! ఇవన్నీ కూడా మేమెన్నడూ మర్చిపోకూడని విషయాలు. మేము వాటిని ఎల్లప్పుడూ ఇష్టంగా గుర్తుచేసుకుంటాం” అని జాన్ బార్ అన్నారు.
“ద్వీపములన్నియు సంతోషించునుగాక” అని కీర్తన 97:1 చెబుతుంది. దేవుడ్ని ఆరాధించే స్వాతంత్ర్యం అధికం కావడం వల్లా, అంతర్జాతీయ ప్రతినిధుల ఈ చారిత్రాత్మక సందర్శనం వల్లా క్యూబాలో ఉన్న యెహోవాసాక్షులు నిజంగా ఎంతో ఆనందించారు.
[8వ పేజీలోని చిత్రాలు]
క్యూబాలో జరిగిన “దైవిక జీవిత మార్గము” ప్రత్యేక జిల్లా సమావేశాలకు అనేక కుటుంబాలు హాజరయ్యాయి
[8వ పేజీలోని చిత్రాలు]
హవానాలోని బేతేల్ హోమ్ 1994లో పునరారంభించబడింది
[8వ పేజీలోని చిత్రాలు]
పరిపాలక సభ సభ్యులు ప్రభుత్వాధికారులకు బైబిళ్ళను కానుకగా ఆటోగ్రాఫ్ చేసి ఇస్తున్నారు