కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/1 పేజీలు 8-13
  • అబద్ధ దేవుళ్లకు వ్యతిరేకంగా సాక్షులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అబద్ధ దేవుళ్లకు వ్యతిరేకంగా సాక్షులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యానికి అబ్రాహాము సాక్ష్యం
  • ఓ సాక్షుల జనాంగము
  • దేవుళ్ల పరిశీలన
  • ‘మీరు నాకు సాక్షులు’!
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
  • దైవిక సర్వాధిపత్యానికి క్రైస్తవ సాక్షులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • సత్య దేవుడు విడుదల గురించి ప్రవచిస్తాడు
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
  • ‘మీరు నాకు సాక్షులు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/1 పేజీలు 8-13

అబద్ధ దేవుళ్లకు వ్యతిరేకంగా సాక్షులు

“మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు.”—యెషయా 43:10

1. సత్యదేవుడు ఎవరు మరియు నేడు ఆరాధించబడే అనేకమంది దేవుళ్లకంటే ఆయన ఏ విషయాల్లో అత్యున్నతుడు?

సత్య దేవుడు ఎవరు? నేడు, ఈ అతి ప్రాముఖ్యమైన వివాదాంశం మానవజాతియంతటి ముందు ఉంది. మానవులు అనేకమంది దేవుళ్లను ఆరాధించినప్పటికీ, ఒకవ్యక్తి మాత్రమే మనకు జీవాన్నిచ్చి ఆనందమయమైన భవిష్యత్తును అందించగలడు. “మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము” అని ఒకరిని గూర్చి మాత్రమే చెప్పగలం. (అపొస్తలుల కార్యములు 17:28) వాస్తవానికి, ఆరాధించబడగలిగే హక్కు, ఒక్క దేవునికి మాత్రమే ఉంది. ప్రకటన గ్రంథంలోని పరలోక బృందగానం చెబుతున్నట్లుగా, ‘ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.’—ప్రకటన 4:11.

2, 3. (ఎ) ఆరాధించబడే యెహోవా హక్కును సాతాను ఎలా అబద్ధం చెప్పడంతో సవాలు చేశాడు? (బి) హవ్వ పాపం చేయడంవల్ల, హవ్వకూ ఆమె పిల్లలకు ఏ ఫలితం లభించింది మరియు సాతానుకు ఏ ఫలితం లభించింది?

2 ఏదెను తోటలో, ఆరాధించబడే యెహోవా హక్కును సాతాను అబద్ధం చెప్పడంతో సవాలు చేశాడు. యెహోవా నియమానికి ఎదురుతిరిగి, యెహోవా తినవద్దని చెప్పిన వృక్షఫలాన్ని తినినట్లైతే హవ్వ దేవునిలా అవుతుందని ఓ సర్పాన్ని ఉపయోగించుకుంటూ అతడు చెప్పాడు. అతని మాటలు ఇలా ఉన్నాయి: ‘ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.’ (ఆదికాండము 3:5) హవ్వ ఆ సర్పాన్ని విశ్వసించి, తినవద్దని చెప్పిన ఫలాన్ని తినింది.

3 సాతాను అబద్ధమాడాడన్నది నిజమే. (యోహాను 8:44) హవ్వ పాపము చేసినప్పుడు ఆమె ఒకేఒక విధంలో “దేవతలవలె” ఎలా అయ్యిందంటే, ఏది సరైనది ఏది తప్పు అని యెహోవా నిర్ణయించాల్సిన విషయాన్ని తానే నిర్ణయించింది. మరి సాతాను అబద్ధానికి విరుద్ధంగా చివరికి ఆమె మరణించింది. కనుక హవ్వ పాపంనుండి నిజంగా ప్రయోజనం పొందింది సాతాను మాత్రమే. వాస్తవానికి, హవ్వ పాపంచేసేలా సాతాను ప్రేరేపించడంలోని అప్రకటిత లక్ష్యం తాను దేవుడవ్వాలన్నదే. హవ్వ పాపం చేసినప్పుడు, ఆమె అతని మానవ అనుచరురాలైంది, మరి ఆ వెంటనే ఆదాము కూడా ఆమెతో చేరాడు. వారి పిల్లల్లో అనేకులు “పాపములో” జన్మించడమే కాకుండ, సాతాను ప్రభావానికి కూడా గురయ్యారు, మరి కొంత కాలానికి సత్య దేవుని నుండి వైదొలగిన ఒక లోకమంతా ఉనికిలోకి వచ్చింది.—ఆదికాండము 6:5; కీర్తన 51:5.

4. (ఎ) ఈ లోక సంబంధమైన దేవుడు ఎవరు? (బి) దేని విషయంలో ఇప్పుడు అత్యవసరత ఉంది?

4 ఆ లోకం జలప్రళయంలో నాశనం చేయబడింది. (2 పేతురు 3:6) జలప్రళయం తర్వాత యెహోవా నుండి వైదొలగిన రెండవ లోకం వృద్ధి చెందింది, మరి అది ఇప్పటికీ ఉనికిలో ఉంది. దాన్ని గూర్చి బైబిలు ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టునియందున్నది.” (1 యోహాను 5:19) ఈ లోకం, యెహోవా సూత్రాల ఉద్దేశానికి ప్రాముఖ్యతకు విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా సాతాను ప్రయత్నాలకు సహకరిస్తోంది. అతడు దానికి దేవుడు. (2 కొరింథీయులు 4:4) అయినప్పటికీ, వాస్తవానికి అతడు శక్తివిహీనుడైన దేవుడు. అతడు ప్రజలను సంతోషపర్చలేడు లేక వారికి జీవాన్నివ్వలేడు. యెహోవా మాత్రమే దాన్ని చేయగలడు. కనుక, అర్థవంతమైన మరియు శ్రేష్ఠమైన జీవితం కావాలని కోరుకుంటున్నవారు, మొదట యెహోవా సత్య దేవుడని నేర్చుకోవాలి, ఆ తర్వాత ఆయన చిత్తాన్ని చేయడం నేర్చుకోవాలి. (కీర్తన 37:18, 27, 28; ప్రసంగి 12:13) అందుచేత, విశ్వాసంగల స్త్రీపురుషులు యెహోవాను గూర్చిన సత్యానికి సాక్ష్యమివ్వవలసిన లేక ప్రకటించవలసిన అత్యవసరత ఉంది.

5. ఏ “సాక్షి సమూహము”ను గూర్చి పౌలు ప్రస్తావించాడు? ఆయన వ్రాసిన కొందరి పేర్లను పేర్కొనండి.

5 మొదటి నుండి కూడా, అలాంటి విశ్వసనీయమైన వ్యక్తులు ప్రపంచ తెరపై కనిపిస్తూనే ఉన్నారు. హెబ్రీయులు 11వ అధ్యాయంలో వాళ్లను గూర్చి అపొస్తలుడైన పౌలు ఓ పెద్ద చిట్టాను వ్రాసి, వాళ్లను “గొప్ప సాక్షి సమూహము” అని పిలుస్తున్నాడు. (హెబ్రీయులు 12:1) ఆదాము హవ్వల రెండవ కుమారుడైన హేబెలు, పౌలు వ్రాసిన చిట్టాలో ప్రథముడు. జలప్రళయం రాకముందున్న కాలంలోని హనోకు నోవహులను కూడా ఆయన ప్రస్తావించాడు. (హెబ్రీయులు 11:4, 5, 7) వారిలో ముఖ్యుడు యూదా వంశపు పితరుడైన అబ్రాహాము. ‘దేవుని స్నేహితుడు’ అని పిలువబడిన అబ్రాహాము “నమ్మకమైన సత్యసాక్షి”యగు యేసుకు పితరుడయ్యాడు.—యాకోబు 2:23; ప్రకటన 3:14.

సత్యానికి అబ్రాహాము సాక్ష్యం

6, 7. అబ్రాహాము జీవితమూ మరియు ఆయన క్రియలు, యెహోవాయే సత్య దేవుడనేందుకు ఒక సాక్ష్యముగా ఎలా ఉన్నాయి?

6 అబ్రాహాము ఓ సాక్షిగా ఎలా పనిచేశాడు? యెహోవాయందు ఆయనకుగల దృఢమైన విశ్వాసం మరియు యథార్థమైన విధేయతవల్లనే. ఊరు పట్టణాన్ని విడిచిపెట్టమని మరియు తన శేషజీవితాన్ని ఎక్కడో దూరప్రాంతంలో గడపాలని ఆజ్ఞాపించబడినప్పుడు, అబ్రాహాము అందుకు లోబడ్డాడు. (ఆదికాండము 15:7; అపొస్తలుల కార్యములు 7:2-4) తరచూ, సంచార జాతివారు తమ సంచారక జీవితాన్ని విడిచిపెట్టి, అతి భద్రమైన పట్టణ జీవితాన్ని ఎన్నుకుంటారు కనుక, గుడారాల్లో జీవించడానికి అబ్రాహాము పట్టణాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు, యెహోవా దేవుని మీద తనకు గల అపారమైన విశ్వాసానికి ఆయన బలమైన రుజువునిచ్చాడు. ఆయన విధేయత చూసేవారికి ఓ సాక్ష్యంగా నిలిచింది. అబ్రాహాము విశ్వాసానికి యెహోవా ఆయనను మెండుగా ఆశీర్వదించాడు. గుడారాల్లో నివసిస్తున్నప్పటికీ, అబ్రాహాము వస్తుపరంగా వర్ధిల్లాడు. లోతు ఆయన కుటుంబం బంధీలుగా తీసుకువెళ్లబడినప్పుడు, వారిని వెంబడించడంలో యెహోవా అబ్రాహాముకు విజయాన్ని అనుగ్రహించాడు, తద్వారా ఆయన వారిని కాపాడగలిగాడు. అబ్రాహాము భార్య వృద్ధాప్యంలో ఒక కుమారున్ని కనింది, అలా అబ్రాహాము ఒక సంతతికి తండ్రి అవుతాడన్న యెహోవా వాగ్దానం నిజమని తేలింది. అబ్రాహాము ద్వారా, యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చే సజీవ దేవుడని ప్రజలు గ్రహించారు.—ఆదికాండము 12:1-3; 14:14-16; 21:1-7.

7 అబ్రాహాము లోతును కాపాడి తిరిగి వస్తుండగా షాలేము (తర్వాత, యెరూషలేము అని పిలువబడిన) రాజైన మెల్కీసెదెకు ఆయనను కలిశాడు. అతడు అబ్రాహామును, ‘సర్వోన్నతుడైన దేవుని . . . అబ్రాము ఆశీర్వదించబడునుగాక’ అని ఆహ్వానించాడు. సొదొమ రాజు కూడా ఆయనను కలిసి ఆయనకు బహుమతులను ఇవ్వాలనుకుంటాడు. అందుకు అబ్రాహాము నిరాకరించాడు. ఎందుకు? ఆయనకు ఆశీర్వాదాలు ఎక్కడనుండి వచ్చాయన్న విషయంలో ఏ అనుమానమూ ఉండకూడదని ఆయన అనుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.” (ఆదికాండము 14:17-24) అబ్రాహాము ఎంత చక్కటి సాక్షిగా ఉన్నాడు!

ఓ సాక్షుల జనాంగము

8. మోషే యెహోవాయందు గొప్ప విశ్వాసాన్ని ఎలా కనపర్చాడు?

8 అబ్రాహాము సంతతివాడైన మోషే కూడా పౌలు వ్రాసిన చిట్టాలో కనిపిస్తాడు. మోషే ఐగుప్తు సంపదను విడిచిపెట్టి, పిదప ఇశ్రాయేలు సంతతిని స్వతంత్రులను చేసేందుకు గొప్ప ప్రపంచ ఆధిపత్య పరిపాలకున్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆయనకు అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? ఆయన విశ్వాసం నుండి. పౌలు ఇలా చెబుతున్నాడు: ‘అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడాయెను.’ (హెబ్రీయులు 11:27) ఐగుప్తీయుల దేవుళ్లను చూడవచ్చు, ముట్టుకోవచ్చు. నేడు కూడా, వారి విగ్రహాలు ప్రజలను ముగ్ధులను చేస్తాయి. అయితే మోషేకు మాత్రం యెహోవా అదృశ్యుడైనప్పటికీ ఆ అబద్ధ దేవతలందరికంటే ఎంతో వాస్తవమైనవాడు. యెహోవా ఉన్నాడన్న విషయంలోనూ ఆయన తన ఆరాధికులకు ప్రతిఫలమిస్తాడన్న విషయంలోనూ మోషేకు ఏ సందేహమూ లేదు. (హెబ్రీయులు 11:6) మోషే ఓ విశిష్టమైన సాక్షి అయ్యాడు.

9. ఇశ్రాయేలు జనాంగము యెహోవాను ఎలా సేవించాల్సి ఉంది?

9 ఇశ్రాయేలీయులను స్వతంత్రులనుగా చేసిన తర్వాత మరియు అబ్రాహాము నుండి యాకోబు ద్వారా కలిగిన వారసులకు, యెహోవాకు మధ్య మోషే నిబంధనా మధ్యవర్తి అయ్యాడు. దాని ఫలితంగా, ఇశ్రాయేలు జనాంగం యెహోవా స్వకీయ సంపాద్యమైంది. (నిర్గమకాండము 19:5, 6) మొట్టమొదటిసారిగా, ఓ జనాంగంగా సాక్ష్యం ఇవ్వబడవలసి ఉంది. సుమారు 800 సంవత్సరాల తర్వాత యెషయా ద్వారా యెహోవా చెప్పిన మాటలు, ఆ జనాంగపు ఆవిర్భావం నుండి తత్త్వతహః అన్వయించబడింది: “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు.” (యెషయా 43:10) ఈ నూతన లోకం యెహోవాసాక్షులుగా ఎలా పనిచేస్తుంది? వారి విశ్వాసమూ విధేయత ద్వారా మరియు వారి కొరకు యెహోవా తీసుకున్న చర్యలద్వారా.

10. ఇశ్రాయేలీయులకొరకు యెహోవా చేసిన శక్తివంతమైన పనులు ఏ విధంగా ఓ సాక్ష్యానిచ్చాయి, మరి దాని ఫలితాలేమిటి?

10 అది ప్రారంభమైన 40 సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలు వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకోబోతోంది. యెరికో పట్టణాన్ని గవేషించేందుకు వేగులవారు వెళ్లారు, మరి యెరికో పట్టణస్థురాలైన రాహాబు వారిని సంరక్షించింది. ఎందుకు? ఆమె ఇలా చెప్పింది: “మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.” (యెహోషువ 2:10, 11) యెహోవా చేసిన శక్తివంతమైన పనులను గూర్చిన నివేదిక, రాహాబు ఆమె కుటుంబమూ యెరికోను దాని అబద్ధ దేవుళ్లను విడిచి ఇశ్రాయేలులో యెహోవాను ఆరాధించేలా కదిలించింది. స్పష్టంగా, యెహోవా ఇశ్రాయేలు ద్వారా శక్తివంతమైన సాక్ష్యాన్నిచ్చాడు.—యెహోషువ 6:25.

11. సాక్ష్యమిచ్చే విషయంలో ఇశ్రాయేలీయులైన తలిదండ్రులందరికి ఏ బాధ్యత ఉంది?

11 ఇశ్రాయేలీయులు ఇంకా ఐగుప్తులో ఉన్నప్పుడు, యెహోవా మోషేను ఫరో దగ్గరకు పంపించి ఇలా అన్నాడు: ‘ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచితిని.’ (నిర్గమకాండము 10:1, 2) విధేయులైన ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి చెబుతారు. వారి పిల్లలు, వాటిని గూర్చి తమ పిల్లలకు చెబుతారు, అలా ఒక తరంనుండి మరో తరంవరకు జరుగుతుంది. ఆ విధంగా, యెహోవా చేసిన శక్తివంతమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోబడతాయి. అలాగే నేడు కూడా, తమ పిల్లలకు సాక్ష్యమిచ్చే బాధ్యత తలిదండ్రులపై ఉంది.—ద్వితీయోపదేశకాండము 6:4-7; సామెతలు 22:6.

12. సొలొమోను మరియు ఇశ్రాయేలుపై ఉండిన యెహోవా ఆశీర్వాదం ఎలా ఓ సాక్ష్యంగా పనిచేసింది?

12 ఇశ్రాయేలు నమ్మకంగా ఉన్నంతకాలం అది అనుభవించిన యెహోవా యొక్క గొప్ప ఆశీర్వాదం, చుట్టు ప్రక్కలున్న దేశాలకు సాక్ష్యంగా నిలిచింది. యెహోవా వాగ్దాన ఆశీర్వాదాలను వివరించిన తర్వాత మోషే ఇలా చెప్పాడు: “భూ ప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.” (ద్వితీయోపదేశకాండము 28:10) సొలొమోను విశ్వాసమునుబట్టి ఆయనకు వివేకమూ సంపద ఇవ్వబడ్డాయి. ఆయన ఆధ్వర్యంలో జనాంగం వర్ధిల్లింది మరియు ఎంతో కాలం వరకు శాంతిని అనుభవించింది. ఆ కాలాన్ని గూర్చి మనం ఇలా చదువుతాం: “అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.” (1 రాజులు 4:25, 29, 30, 34) సొలొమోనును దర్శించిన వారిలో ప్రముఖురాలు షేబ దేశపు రాణి. ఆ జనాంగంపై దాని రాజుపై యెహోవా ఆశీర్వాదాన్ని స్వయంగా చూసిన తర్వాత ఆమె ఇలా చెప్పింది: “నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక.”—2 దినవృత్తాంతములు 9:8.

13. ఇశ్రాయేలు యొక్క అతి ప్రభావవంతమైన సాక్ష్యమేమై ఉండవచ్చు, మరి దానినుండి ఇప్పటికీ మనం ఎలా ప్రయోజనం పొందగలం?

13 బహుశ ఇశ్రాయేలీయులిచ్చిన అతి ప్రభావవంతమైన సాక్ష్యాన్నే అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. రోమాలోని క్రైస్తవ సంఘంతో శారీరక ఇశ్రాయేలీయులను గూర్చి చర్చిస్తున్నప్పుడు ఆయన ఇలా అన్నాడు: “దేవోక్తులు యూదుల పరము చేయబడెను.” (రోమీయులు 3:1, 2) మోషేతో మొదలుకొని, ఇశ్రాయేలుతో యెహోవా వ్యవహారాలనూ అలాగే ఆయన ఇచ్చిన సలహాను, ఆయన నియమాలను ఆయన ప్రవచనాలను వ్రాసేందుకు కొందరు నమ్మకమైన ఇశ్రాయేలీయులు ప్రేరేపించబడ్డారు. ఈ వ్రాతల ద్వారా ఆ ప్రాచీన శాస్త్రులు, ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడని, మరి ఆయన పేరు యెహోవా అని రాబోవు తరాలవారందరికీ అంటే నేటి మన తరానికి కూడా సాక్ష్యమిచ్చారు.—దానియేలు 12:9; 1 పేతురు 1:10-12.

14. యెహోవాకు సాక్ష్యమిచ్చిన కొందరెందుకు హింసను అనుభవిస్తారు?

14 విషాదకరంగా ఇశ్రాయేలు తరచూ విశ్వాసాన్ని కల్గివుండడంలో విఫలమైంది, మరి అప్పుడు యెహోవా తన స్వంత జనాంగానికి సాక్షులను పంపించాల్సి వచ్చింది. వీరిలో అనేకులు హింసించబడ్డారు. కొందరు “తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి” అని పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 11:36) నిజంగా నమ్మకమైన సాక్షులే! వారు అనుభవించే హింస తరచూ యెహోవా ఎన్నుకున్న జనాంగంలోని తమ తోటి విశ్వాసులనుండి రావడం ఎంత విషాదకరం! (మత్తయి 23:31, 37) వాస్తవానికి, ఆ జనాంగం యొక్క పాపం ఎంత గొప్పదైందంటే సా.శ.పూ 607లో యెరూషలేమును దాని ఆలయాన్ని నాశనం చేసి, జీవించివున్న ఇశ్రాయేలీయులను చెరసాలలోకి తీసుకువెళ్లేందుకు యెహోవా బబులోనీయులను రప్పించాడు. (యిర్మీయా 20:4; 21:10) యెహోవా నామానికి ఒక జనాంగంగా సాక్ష్యమివ్వడం అంతటితో అంతమైపోయిందా? లేదు.

దేవుళ్ల పరిశీలన

15. బబులోను చెరలోనున్నప్పుడు కూడా సాక్ష్యం ఎలా ఇవ్వబడింది?

15 బబులోను చెరసాలలో సహితం, యెహోవా దేవత్వాన్ని గూర్చి మరియు శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చేందుకు ఆ జనాంగంలోని నమ్మకమైన సభ్యులు వెనుకాడలేదు. ఉదాహరణకు, నెబుకద్నెజరు కలలకు దానియేలు ధైర్యంగా భావాన్ని చెప్పాడు, గోడమీది వ్రాతను బెల్షస్సరుకు వివరించాడు మరియు ప్రార్థన విషయంలో దర్యావేషు రాజు ఎదుట రాజీపడేందుకు నిరాకరించాడు. ముగ్గురు హెబ్రీయులు కూడా విగ్రహానికి సాగిలపడేందుకు నిరాకరించినప్పుడు నెబుకద్నెజరుకు అద్భుతమైన సాక్ష్యాన్నిచ్చారు.—దానియేలు 3:13-18; 5:13-29; 6:4-27.

16. ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి రావడాన్ని గూర్చి యెహోవా ఎలా ప్రవచించాడు మరియు దీని సంకల్పమేమిటి?

16 అయినప్పటికీ, ఇశ్రాయేలు దేశంలో మరలా జనాంగంగా సాక్ష్యం ఇవ్వాలని యెహోవా సంకల్పించాడు. బబులోనులో బంధీలైన యూదుల నడుమ ప్రవచించిన యెహెజ్కేలు, నాశనం చేయబడిన దేశం విషయంలో యెహోవా తీర్మానాన్ని గూర్చి ఇలా వ్రాశాడు: “మీ మీద మానవజాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింపజేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును.” (యెహెజ్కేలు 36:10) యెహోవా దీన్ని ఎందుకు చేసివుంటాడు? ప్రాముఖ్యంగా, ఆయన నామానికి సాక్ష్యంగా ఉండేందుకు చేసివుంటాడు. యెహెజ్కేలు ద్వారా ఆయన ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.”—యెహెజ్కేలు 36:22; యిర్మీయా 50:28.

17. యెషయా 43:10లోని మాటల సందర్భమేమిటి?

17 బబులోను చెరలోనుండి ఇశ్రాయేలీయులు తిరిగి రావడాన్ని గూర్చి ప్రవచించే సమయంలోనే, ఇశ్రాయేలు యెహోవాసాక్షులని, ఆయన సేవకులని చెబుతూ, యెషయా 43:10 నందలి మాటలను వ్రాసేందుకు యెషయా ప్రేరేపించబడ్డాడు. యెషయా 43, 44 నందు యెహోవా ఇశ్రాయేలుకు సృష్టికర్తగా, కలుగజేసినవానిగా (NW) నిర్మాణకునిగా, దేవునిగా, పరిశుద్ధునిగా, రక్షకునిగా, విమోచకునిగా మరియు రాజుగా వర్ణించబడ్డాడు. (యెషయా 43:3, 14, 15; 44:2) అలా ఆయనను మహిమపర్చడంలో ఆ జనాంగం అనేకమార్లు విఫలమైంది కనుక ఇశ్రాయేలు చెరపట్టబడేందుకు అనుమతించబడింది. అయినప్పటికీ, వారు ఇంకా ఆయన ప్రజలుగా ఉన్నారు. యెహోవా వారితో ఇలా చెప్పాడు: “నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.” (యెషయా 43:1) బబులోనులో ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది.

18. బబులోను నుండి ఇశ్రాయేలు విడుదల, యెహోవాయే సత్య దేవుడని ఎలా నిరూపించింది?

18 వాస్తవానికి యెహోవా, బబులోను నుండి ఇశ్రాయేలీయుల విడుదలను దేవుళ్లకు ఓ పరీక్షగా చేశాడు. జనాంగాల అబద్ధ దేవుళ్లకు తమ తమ సాక్షులను తీసుకురావాలని ఆయన సవాలుచేశాడు, మరి ఇశ్రాయేలును తన సాక్షియని పిలిచాడు. (యెషయా 43:9, 12) ఇశ్రాయేలును ఆయన విడిపించినప్పుడు బబులోను దేవుళ్లు దేవుళ్లే కాదని మరి తాను మాత్రమే సత్య దేవుడని నిరూపించాడు. (యెషయా 43:14, 15) ఈ సంఘటనకు సుమారు 200 సంవత్సరాలకు పూర్వం, యూదులను విడిపించే తన సేవకుడని పారసీక రాజైన కోరెషును పిలిచినప్పుడు తన దేవత్వానికి ఆయన మరో నిదర్శనాన్నిచ్చాడు. (యెషయా 44:28) ఇశ్రాయేలు విడిపించబడుతుంది. ఎందుకు? యెహోవా ఇలా వివరిస్తున్నాడు: “నేను నిర్మించిన జనులు [ఇశ్రాయేలీయులు] నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.” (యెషయా 43:21) ఇది సాక్ష్యమిచ్చేందుకు ఇంకా అవకాశాన్నిచ్చింది.

19. యెరూషలేమునకు తిరిగి రమ్మని కోరెషు ఆహ్వానం ద్వారా మరియు అలా తిరిగి రావడం తర్వాత నమ్మకమైన యూదుల క్రియల ద్వారా ఏ సాక్ష్యమివ్వబడింది?

19 సమయం వచ్చినప్పుడు, ప్రవచించబడినట్లుగానే పారసీకుడైన కోరెషు, బబులోనును జయించాడు. కోరెషు అన్యుడైనప్పటికీ, బబులోనులోని యూదులకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసినప్పుడు, యెహోవా దేవత్వాన్ని ఇలా ప్రకటించాడు: “మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.” (ఎజ్రా 1:3) అనేకమంది యూదులు దానికి ప్రతిస్పందించారు. వారు వాగ్దాన దేశానికి తిరుగు ప్రయాణం చేసి, పురాతన ఆలయ ప్రాంగణంలో ఓ బలిపీఠాన్ని కట్టారు. నిరుత్సాహం మరియు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, చివరికి వారు తమ ఆలయాన్ని మరియు యెరూషలేము పట్టణాన్ని నిర్మించుకోగలిగారు. “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా [ఆయన] ఆత్మచేతనే . . . జరుగునని” యెహోవా తానుగా చెప్పినట్లు ఇదంతా జరిగింది. (జెకర్యా 4:6) ఈ సాఫల్యాలు, యెహోవాయే సత్య దేవుడనేందుకు మరింత రుజువునిచ్చాయి.

20. ఇశ్రాయేలీయులకు బలహీనతలున్నప్పటికీ, ప్రాచీనలోకంలో వారు యెహోవా నామానికి సాక్ష్యమివ్వడాన్ని గూర్చి ఏమి చెప్పవచ్చు?

20 ఆ విధంగా, ఇశ్రాయేలు అపరిపూర్ణమైనదైనప్పటికీ లేక కొన్నిసార్లు వ్యతిరేకించే ప్రజలున్నదైనప్పటికీ యెహోవా ఆ జనాంగాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. క్రీస్తుకు పూర్వమున్న లోకంలో ఆ జనాంగం, దాని ఆలయం మరియు యాజకత్వంతో సత్యారాధనకు ప్రపంచ కేంద్రంగా నిలిచింది. ఇశ్రాయేలీయుల సంబంధంగా యెహోవా క్రియలను గూర్చి హెబ్రీ లేఖనాల్లో చదివినవారికెవరికైనా, సత్య దేవుడు ఒక్కడే మరి ఆయన నామం యెహోవా అన్న విషయంలో ఏ సందేహమూ ఉండదు. (ద్వితీయోపదేశకాండము 6:4; జెకర్యా 14:9) అయినప్పటికీ, యెహోవా నామానికి ఇంకా గొప్ప సాక్ష్యం ఇవ్వాల్సివుంది, మరి దాన్ని గూర్చి మనం తర్వాత శీర్షికలో చర్చిస్తాము.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ యెహోవాయే సత్య దేవుడనేందుకు అబ్రాహాము ఎలా సాక్ష్యాన్నిచ్చాడు?

◻ నమ్మకమైన సాక్షిగా ఉండేందుకు మోషే యొక్క ఏ విశేషమైన లక్షణం ఆయనకు సహాయపడింది?

◻ ఇశ్రాయేలుకు యెహోవాను గూర్చి జనాంగంగా ఏ విధాల్లో ఒక సాక్ష్యమిచ్చింది?

◻ బబులోనునుండి ఇశ్రాయేలు విడుదల, యెహోవా మాత్రమే సత్య దేవుడని ఎలా ప్రదర్శిస్తోంది?

[10వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము తన విశ్వాసమూ విధేయతల ద్వారా, యెహోవా దైవత్వానికి అద్భుతమైన సాక్ష్యాన్నిచ్చాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి