కలీజియంట్లు—బైబిలు అధ్యయనం వారిని భిన్నమైనవారిగా చేసింది
మీరు కలీజియంట్ల గురించి విన్నారా?
నెదర్లాండ్స్లో 17వ శతాబ్దంలోని ఈ చిన్న మత గుంపు అప్పట్లోని సుస్థాపితమైన చర్చీల నుండి చాలా భిన్నంగా ఉంది. అదెలా? వారి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడానికి రండి మనం గతంలోకి ప్రయాణిద్దాము.
యాకోబస్ ఆర్మినీయస్ (లేదా, యాకోప్ హార్మన్సన్) 1587లో ఆమ్స్టర్డామ్ నగరానికి చేరుకున్నాడు. ఆయనకున్న అర్హతల్నిబట్టి ఆయనకు ఉద్యోగం సంపాదించడం ఏమాత్రం కష్టం కాలేదు. ఆయన 21వ ఏడులో హాలెండ్లోని లైడెన్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడయ్యాడు. అటుతర్వాత ఆయన ప్రొటెస్టెంటు సంస్కరణకర్త అయిన జాన్ కల్విన్కు వారసుడైన టేయోడోర్ డ బేజె శిష్యరికంలో దైవశాస్త్రం అధ్యయనం చేస్తూ స్విట్జర్లాండ్లో ఆరు సంవత్సరాలపాటు గడిపాడు. ఆమ్స్టర్డామ్లోని ప్రొటెస్టెంట్లు 27 ఏండ్ల ఆర్మినీయస్ను తమ పాస్టర్లలో ఒకరిగా నియమించడానికి సంతోషించారనడంలో ఆశ్చర్యంలేదు మరి! అయితే కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది చర్చి సభ్యులు తాము చేసుకున్న ఎంపిక విషయమై పశ్చాత్తాపపడ్డారు. ఎందుకు?
పూర్వనిర్ధారిత సిద్ధాంతం గురించిన వివాదం
ఆర్మినీయస్ పుల్పిట్ మీదికి అడుగు పెట్టిన తర్వాత కొద్దికాలానికే ఆమ్స్టర్డామ్లోని ప్రొటెస్టెంట్లలో పూర్వనిర్ధారితవాదం అనే సిద్ధాంతం విషయమై గలిబిలి ఏర్పడింది. కల్విన్వాదానికి ఈ సిద్ధాంతం కేంద్రంగా ఉంది, కానీ దేవుడు కొంతమందికి రక్షణనూ ఇతరులకు నాశనాన్నీ ముందే నిర్ణయించి పెట్టాడనడం చాలా కఠోరమనీ అది అన్యాయమనీ కొంతమంది చర్చి సభ్యులు భావించారు. బేజె శిష్యుడిగా ఆర్మినీయస్ ఈ అసమ్మతివాదుల నోరు కట్టిస్తాడని కల్విన్వాదులు ఆశించారు. కానీ ఆర్మినీయస్ వారి ఆశలను అడియాసలు చేస్తూ అసమ్మతివాదుల పక్షం వహించాడు. ఈ వివాదం 1593కల్లా ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే ఆ నగరంలోని ప్రొటెస్టెంట్లు రెండు గుంపులుగా విడిపోయారు—ఆ సిద్ధాంతానికి మద్దతునిచ్చినవారు ఒకవైపు, దాన్ని తిరస్కరించిన మితవాదులు మరోవైపు.
కొద్ది సంవత్సరాల్లోనే, స్థానికంగా ఉన్న ఈ వివాదం దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెస్టెంట్లలో చీలికకు దారితీసింది. చివరికి 1618 నవంబరులో చరమాంకానికి రంగం సిద్ధమైంది. సైన్యం మద్దతు ఉండడంతో, జనవాక్యం తమకు అనుకూలంగా ఉండడంతో కల్విన్వాదులు అసమ్మతివాదుల్ని (అప్పట్లో రెమాన్స్ట్రెంట్లుa అని పిలువబడ్డారు) ప్రొటెస్టెంట్ సైనడ్ ఆఫ్ డోడ్రెక్ట్ అనే ఒక జాతీయ సమావేశానికి పిలువనంపించారు. సమావేశం ముగింపులో రెమాన్స్ట్రెంట్ పాస్టర్ల ముందు రెండు ఎంపికలు ఉంచబడ్డాయి: మళ్ళీ ఎన్నడూ మతప్రచారం చేయను అనే ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేయడము, లేదా దేశాన్ని విడిచిపెట్టిపోవడము. అత్యధికులు దేశాంతరవాసాన్నే ఎన్నుకొన్నారు. పట్టువీడని కల్విన్వాదులు రెమాన్స్ట్రెంట్ పాస్టర్లు ఖాళీచేసిన పుల్పిట్లను ఆక్రమించుకున్నారు. కల్విన్వాదం జయించింది—కనీసం ఆ సభ అలా ఆశించింది.
కలీజియంట్ల పుట్టుక, పెరుగుదల
మిగతా అన్ని ప్రాంతాల్లోలాగానే, లైడెన్ దగ్గరున్న వార్మోంట్ గ్రామంలోని రెమాన్స్ట్రెంట్ సంఘం తమ పాస్టరుని కోల్పోయింది. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే, అన్నిచోట్లలా కాక ఈ సంఘం సైనడ్ ఆమోదించిన వ్యక్తిని స్వీకరించలేదు. అంతేకాదు, ఒక రెమాన్స్ట్రెంట్ పాస్టరు సంఘాన్ని చూసుకుందామని 1620లో తన ప్రాణాల్ని లెక్కచేయకుండా తిరిగి వార్మోంట్కు వస్తే కొంతమంది సంఘసభ్యులు ఆయన్ను కూడా తిరస్కరించారు. ఈ సభ్యులు ఏ పాదిరి సహాయమూ లేకుండా తమ మత కూటాలను రహస్యంగా జరుపుకోనారంభించారు. అటుతర్వాత ఈ కూటాలు కాలేజీలు అనీ, వాటికి హాజరయ్యేవారు కలీజియంట్లు అనీ పిలువబడ్డారు.
కలీజియంట్లు కొన్ని సూత్రాలకు బద్ధులై ఏర్పడడంకాక పరిస్థితులవల్ల ఏర్పడినప్పటికీ ఆ పరిస్థితులు కొంతకాలానికి మారాయి. ఖైస్బర్ట్ వాన్ డర్ కోడె అనే సంఘ సభ్యుడు పాదిరీల పర్యవేక్షణ లేకుండా కూటాలు జరుపుకోవడం సుస్థాపితమైన చర్చీలకన్నా బైబిలు పద్ధతికీ తొలి క్రైస్తవుల పద్ధతికీ మరింత దగ్గరగా ఉందని వాదించాడు. ఆయన చెప్పినదాని ప్రకారం, పాదిరి వర్గం అనేది ఏదో ఒక వృత్తివిద్యను నేర్చుకోవడానికి ఇష్టపడని పురుషులకు ఉద్యోగాలు సృష్టించడానికి అపొస్తలులు మరణించిన తర్వాత కనిపెట్టబడింది.
1621లో వాన్ డర్ కోడెతోపాటు ఆయనలాంటి అభిప్రాయాలుగల సభ్యులు కలిసి తమ కూటాలను దగ్గర్లోని రైన్స్బర్క్ గ్రామానికి మార్చారు.b కొన్ని సంవత్సరాల తర్వాత మత హింస తగ్గి మత సహనం నెలకొన్నప్పుడు కలీజియంట్ల కూటాల ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. ఇది చరిత్రకారుడైన జిక్ఫ్రీట్ జిల్వర్బెర్క్ చెప్పినట్లుగా “వేరే జాతి పక్షుల్ని” కూడా ఆకర్షించింది. ఇందులో రెమాన్స్ట్రెంట్లు, మెన్నోనైట్లు, సొసీనియన్లు, చివరికి దైవశాస్త్ర పండితులు కూడా ఉన్నారు. కొందరైతే వ్యవసాయదారులు; ఇంకొందరు కవులు, ప్రచురణకర్తలు, వైద్యులు, వ్యాపారస్థులు. తత్త్వజ్ఞానియైన స్పినోజా (బెనెడిక్టూస్ డ స్పినోజా), విద్యాబోధకుడైన యోహాన్ ఆమోస్ కోమినీయస్ (లేదా, యాన్ కోమెన్స్కీ), ప్రఖ్యాత చిత్రకారుడైన రెమ్బ్రాంట్ వాన్ రైన్లు ఈ ఉద్యమంతో ఏకీభవించారు. ఈ భక్తిపరులు వెలిబుచ్చిన విభిన్నమైన తలంపులు కలీజియంట్ల నమ్మకాల అభివృద్ధిని ప్రభావితం చేశాయి.
1640వ సంవత్సరం తర్వాత శక్తివంతమైన ఈ గుంపు చాలా వేగంగా అభివృద్ధి చెందింది. రాటర్డామ్లో, ఆమ్స్టర్డామ్లో, ల్యూవర్డెన్లో, మరితర నగరాల్లో కాలేజీలు వెలిశాయి. 1650 నుండి 1700 సంవత్సరాల మధ్యకాలంలో “కలీజియంట్లు . . . 17వ శతాబ్దపు హాలెండ్లో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రభావవంతమైన మత శక్తుల్లో ఒకటిగా తయారయ్యారు” అని చరిత్ర ప్రొఫెసర్ అయిన ఆండ్రూ సి. ఫిక్స్ అంటున్నాడు.
కలీజియంట్ల నమ్మకాలు
తర్కము, సహనము, వాక్స్వాతంత్ర్యము కలీజియంట్ల ఉద్యమానికి గుర్తింపు చిహ్నాలుగా ఉన్నాయి గనుక, సభ్యులుగా ఉన్నవారికి తమవైన విభిన్న నమ్మకాలు కల్గివుండే స్వేచ్ఛ ఉంది. అయినా కొన్ని సమాంతరమైన నిర్ధారణలు వారిని కలిసికట్టుగా ఉంచాయి. ఉదాహరణకు, వ్యక్తిగత బైబిలు పఠన ప్రాముఖ్యతను కలీజియంట్లు అందరూ గుణగ్రహించారు. ప్రతి సభ్యుడూ “తానుగా పరిశోధన చేయాలి, మరొకరు చెప్పినదాన్నిబట్టి దేవుడ్ని గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు” అని ఒక కలీజియంట్ వ్రాశాడు. వారు అలాగే చేశారు. 19వ శతాబ్దపు చర్చి చరిత్రకారుడైన యాకోబూస్ సి. వాన్ స్లే ప్రకారం, ఆ కాలంలోని ఇతర మతాలవారి దగ్గరకన్నా కలీజియంట్ల దగ్గర ఎక్కువ బైబిలు పరిజ్ఞానం ఉండేది. బైబిలును నైపుణ్యంతో ఉపయోగించడంలో కలీజియంట్లకున్న సామర్థ్యాన్నిబట్టి చివరికి వ్యతిరేకులు కూడా వారిని శ్లాఘించారు.
అయితే, కలీజియంట్లు ఎంత ఎక్కువగా బైబిలు పఠిస్తుంటే అంత ఎక్కువగా, అప్పటి సాంప్రదాయిక చర్చీల అభిప్రాయాలకన్నా భిన్నమైన అభిప్రాయాలను వారు ఏర్పర్చుకోవడం ప్రారంభించారు. వారి నమ్మకాల్లో కొన్నింటిని 17 నుండి 20వ శతాబ్దం మధ్యకాలంలోని సమాచారమూలాలు వివరిస్తున్నాయి:
తొలి చర్చి. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో తొలి చర్చి రాజకీయాల్లో నిమగ్నమైనప్పుడు, అది క్రీస్తుతో చేసుకున్న నిబంధనను త్రుంచివేసిందనీ, పరిశుద్ధాత్మ ప్రేరేపణను కోల్పోయిందనీ 1644లో కలీజియంటూ దైవశాస్త్ర పండితుడూ అయిన ఆడమ్ బోరేల్ వ్రాశాడు. దాని ఫలితంగా అబద్ధ బోధలు దినదిన ప్రవర్థమానం చెంది తన కాలం వరకూ కొనసాగాయని కూడా ఆయన అన్నాడు.
ప్రొటెస్టెంట్ మతసంస్కరణ. లూథర్, కల్విన్, మరితరుల నాయకత్వాన ప్రారంభమైన 16వ శతాబ్దపు ప్రొటెస్టెంట్ మతసంస్కరణ చర్చిని పూర్తిగా సంస్కరించేంత స్థాయికి చేరుకోలేదు. బదులుగా, ప్రముఖ కలీజియంటూ వైద్యుడూ అయిన కాలేనస్ ఆబ్రాహామ్స్జోన్ (1622-1706) చెప్పినదాని ప్రకారం ప్రొటెస్టెంట్ మతసంస్కరణ, పోరాట విద్వేషాలకు కారణమైంది, అలా మతంయొక్క పరిస్థితిని మరింత దిగజార్చింది. నిజమైన సంస్కరణ హృదయాన్ని మార్చాలి, మతసంస్కరణ విఫలమైంది అందులోనే.
చర్చీ, పాదిరి వర్గం. సుస్థాపితమైన చర్చీలు అవినీతితో, లోకాత్మతో నిండివున్నాయి, వాటిలో దైవిక అధికారం శూన్యం. మతాన్ని గంభీరంగా తీసుకునే వారెవరైనా, తన చర్చి పాపాల్లో భాగం కాకుండడానికి దాన్ని విడిచిపెట్టడంకన్నా చేయగల గొప్పపని ఇంకొకటి ఉండదు. కలీజియంట్ల ప్రకారం పాదిరి స్థానం లేఖనాలకు విరుద్ధం, “క్రైస్తవ సంఘ ఆధ్యాత్మిక శ్రేయస్సుకు హానికరం.”
రాజ్యము, పరదైసు. ఆమ్స్టర్డామ్ కాలేజ్ స్థాపకుల్లో ఒకరైన డానియెల్ డ బ్రేన్ (1594-1664) క్రీస్తు రాజ్యం ఒకరి హృదయాల్లో వసించే ఆధ్యాత్మిక రాజ్యం కాదని వ్రాశాడు. రాటర్డామ్లోని కలీజియంట్ బోధకుడు అయిన యాకోబ్ ఓస్టెన్స్ “పితరులు భూసంబంధమైన వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురుచూశారు” అని అన్నాడు. అలాగే, కలీజియంట్లు ఈ భూమి ఒక పరదైసుగా మార్చబడే సమయం కోసం వేచివున్నారు.
త్రిత్వము. సోసీనియన్ నమ్మకాలచే ప్రభావితులైన కొందరు ప్రసిద్ధిచెందిన కలీజియంట్లు త్రిత్వాన్ని తిరస్కరించారు.c ఉదాహరణకు, డేనియల్ జ్వికర్ (1621-78) త్రిత్వంలాంటి తర్క విరుద్ధమైన సిద్ధాంతం ఏదైనా సరే “అసంభవమూ, అసత్యమూ” అని వ్రాశాడు. కలీజియంట్ అయిన రేనీర్ రోలేవో చేసిన బైబిలు అనువాదము 1694లో ప్రచురితమైంది. అందులో యోహాను 1:1లోని చివరి భాగం, సాంప్రదాయికంగా “వాక్యము దేవుడైయుండెను” అని అనువదించడానికి భిన్నంగా ఇలా ఉంది: “వాక్యము ఒక దేవుడైయుండెను.”d
వారపు కూటాలు
నమ్మకాల సంబంధంగా కలీజియంట్లు అందరిలో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ వివిధ నగరాల్లో ఉన్న వారి కాలేజీలు దాదాపు ఒకే విధంగా పనిచేశాయి. కలీజియంట్ ఉద్యమం తొలినాళ్లలో వారు కూటాలకు ముందుగానే సిద్ధపడేవారు కాదని చరిత్రకారుడైన వాన్ స్లే నివేదిస్తున్నాడు. ‘ప్రవచించాలి’ అన్న అపొస్తలుడైన పౌలు మాటల ఆధారంగా పురుషులందరూ స్వేచ్ఛగా కాలేజీని సంబోధించి మాట్లాడవచ్చని కలీజియంట్లు భావించారు. (1 కొరింథీయులు 14:1, 3, 26) దాని ఫలితంగా, కూటాలు ముగిసే సరికి తరచు చాలా పొద్దుపోయేది, కొన్నిసార్లు హాజరైనవారిలో కొందరు “గాఢ నిద్రలోనికి” జారుకునేవారు.
అటుతర్వాత కూటాలను మరింత సంస్థీకరించడం జరిగింది. కలీజియంట్లు కేవలం ఆదివారం మాత్రమే గాక వారం మధ్యలో కూడా సాయంత్రాల్లో కూడుకునేవారు. ప్రసంగీకులూ, సంఘస్థులూ ఆ సంవత్సరంలోని కూటాలన్నింటికీ ముందుగానే సిద్ధపడేందుకుగాను ఒక ముద్రిత కార్యక్రమ పట్టిక తయారుచేయబడేది. పట్టికలో పరిశీలించాల్సిన బైబిలు వచనాలూ, ప్రసంగీకుని పేరు ఉండేవి. కూటాలు ఒక పాట, ఆ తర్వాత ప్రార్థనతో ప్రారంభమైన తర్వాత ఒక ప్రసంగీకుడు పట్టికలోని బైబిలు వచనాలను వివరించేవాడు. తర్వాత తాను అప్పుడే చర్చించిన విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని ఆయన ప్రేక్షకుల్లోని పురుషులను అడిగేవాడు. అటుతర్వాత రెండవ ప్రసంగీకుడు అవే వచనాల అన్వయింపును వివరించేవాడు. చివరికి ప్రార్థన పాటలతో కూటం ముగిసేది.
ఫ్రైస్లాండ్ రాష్ట్రంలోని హార్లింగన్ అనే పట్టణంలోని కలీజియంట్లు కూటాలు నిర్ణీత కాలంలో ముగియడానికి ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. అక్కడ తాను మాట్లాడవలసిన దానికన్నా ఎక్కువసేపు ఎవరైనా ప్రసంగీకుడు మాట్లాడితే ఆయనకు చిన్న మొత్తంలో జరిమానా విధించబడేది.
జాతీయ సమావేశాలు
మరింత పెద్ద సమావేశాల అవసరత కూడా ఉందని కలీజియంట్లు భావించారు. ఆ విధంగా 1640వ సంవత్సరం మొదలుకొని దేశవ్యాప్తంగా ఉన్న కలీజియంట్లు సంవత్సరానికి రెండుసార్లు (వసంతంలోను, వేసవిలోను) రైన్స్బర్క్కి వెళ్లేవారు. “సుదూరంగా, విస్తారమైన పరిధిలో ఉన్న తమ సహోదరుల తలంపులతో, భావాలతో, నమ్మకాలతో, కార్యకలాపాలతో పరిచయం కల్గివుండడానికి” ఈ సమావేశాలు అవకాశమిచ్చాయని చరిత్రకారుడైన ఫిక్స్ వ్రాస్తున్నాడు.
దూరంనుండి వచ్చిన కలీజియంట్లలో కొందరు అక్కడి ప్రజల ఇండ్లలో అద్దెకు ఉండగా, ఇతరులు క్రోటె హోస్లో అంటే ‘పెద్ద ఇల్లు’లో విడిదిచేసేవారు. ఇది కలీజియంట్లకు చెందిన దాదాపు 30 గదుల భవనం. అక్కడ 60 లేదా 70 మందికి ఒకేసారి భోజనం వడ్డించేవారు. సాయంత్రం భోజనం తర్వాత సందర్శకులు ఆ భవనం వెలుపల ఉన్న పెద్ద తోటలో ‘దేవుని హస్తకృతులను చూసి ఆనందించడానికి, చక్కని సంభాషణ కొనసాగించడానికి, లేదా కొంచెంసేపు ధ్యానించడానికి’ అలా వాహ్యాళికి వెళ్లేవారు.
బాప్తిస్మం అవసరమని కలీజియంట్లందరూ భావించకపోయినా, చాలామంది అవసరమేనని భావించారు. అందుకని, పెద్ద సమావేశాల్లో బాప్తిస్మం ఒక అంశంగా ఏర్పడింది. ఈ బాప్తిస్మ కార్యక్రమం సాధారణంగా శనివారం ఉదయం జరిగేదని చరిత్రకారుడైన వాన్ స్లే చెబుతున్నాడు. నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవల్సిన అవసరతను గురించిన ప్రసంగం తర్వాత ఒక పాట ప్రార్థన ఉండేవి. అటుతర్వాత ప్రసంగీకుడు, “యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను” లాంటి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసే మాటలు చెప్పడానికి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న వయోజనులను ఆహ్వానించేవాడు. ప్రసంగం ప్రార్థనతో ముగిసిన తర్వాత అక్కడున్న వారందరూ బాప్తిస్మం ఇచ్చే నీటిదగ్గరికి నడిచేవారు. అక్కడ స్త్రీ పురుషులు భుజాలవరకూ నీరు వచ్చేలా నీటిలో మోకాళ్లూనిన తర్వాత బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి ఆ నూతన విశ్వాసి తలను నెమ్మదిగా ముందుకు వంచి నీటిలో ముంచేవాడు. ఈ కార్యక్రమం తర్వాత అందరూ మళ్లీ మరో ప్రసంగం వినడానికి తమ సీట్లలో కూర్చునేవారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు అసలైన కూటం బైబిల్లోని చిన్న భాగాన్ని చదవడంతోనూ, పాట ప్రార్థనలతోనూ ప్రారంభమయ్యేది. ప్రసంగీకులు అన్ని సమయాల్లోను అందుబాటులో ఉండేలా నిశ్చయపర్చుకోవడానికి రాటర్డామ్, లైడెన్, ఆమ్స్టర్డామ్, ఉత్తర హాలెండ్లలోని కాలేజీలు ప్రతి సమావేశానికి వంతులవారిగా కావల్సిన ప్రసంగీకులను ఏర్పాటు చేసేవి. ఆదివారం ఉదయం మాత్రం ప్రభురాత్రి భోజనం ఆచరించడానికి ప్రత్యేకించబడేది. ఒక ప్రసంగం, ప్రార్థన, పాట తర్వాత స్త్రీపురుషులు రొట్టె ద్రాక్షారసంలో భాగం వహించేవారు. ఆదివారం సాయంత్రం మరిన్ని ప్రసంగాలు ఉండేవి. సోమవారం ఉదయం ప్రతి ఒక్కరు ముగింపు ప్రసంగం వినడానికి వచ్చేవారు. ఈ సమావేశాల్లో ఇవ్వబడే అత్యధిక ప్రసంగాలు ఆచరణాత్మక విలువగలవని, వివరణలకన్నా అన్వయింపు నొక్కిచెప్పబడేదని వాన్ స్లే పేర్కొన్నాడు.
రైన్స్బర్క్ గ్రామం ఈ సమావేశాలకు ఆతిథ్యమివ్వడానికి చాలా సంతోషించేది. వేరేప్రాంతాలవారు వెల్లువలా వచ్చి ఆహారపానీయల కోసం బాగానే ఖర్చు చేసేవారు గనుక ఆ గ్రామానికి ఆదాయం బాగానే వచ్చేదని 18వ శతాబ్దపు పరిశీలకుడు ఒకాయన వ్రాస్తున్నాడు. దానికితోడు, ప్రతి సమావేశం తర్వాత కలీజియంట్లు రైన్స్బర్క్లోని బీదలకు కొంతమొత్తాన్ని విరాళమిచ్చేవారు. ఈ సమావేశాలు 1787వ సంవత్సరం నుండి నిలిపివేయబడ్డంతో ఆ గ్రామస్థులు నష్టపోయారన్నదాన్లో సందేహం లేదు. అటు తర్వాత కలీజియంట్ ఉద్యమం నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకు?
వారెందుకు కనుమరుగైపోయారు
17వ శతాబ్దం చివరికల్లా మతనమ్మకాల్లో తర్కం పాత్ర విషయమై వివాదం లేచింది. కొంతమంది కలీజియంట్లు దైవిక ప్రకటనకన్నా మానవ తర్కానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని భావించారు, కానీ ఇందుకు ఇతరులు ఏకీభవించలేదు. చివరికి ఈ వివాదం పూర్తి కలీజియంట్ ఉద్యమాన్నే చీల్చివేసింది. ఇరుప్రక్కలా ఉన్న ప్రముఖ మద్దతుదారులు మరణించిన తర్వాత మాత్రమే కలీజియంట్లు మళ్లీ ఏకం కాగల్గారు. అయినా, ఈ చీలిక తర్వాత ఉద్యమం “మళ్లీ ఎన్నడూ తన గత వైభవాన్ని సంతరించుకోలేదు” అని చరిత్రకారుడైన ఫిక్స్ అంటున్నాడు.
18వ శతాబ్దపు ప్రొటెస్టెంట్ చర్చీల్లో అభివృద్ధిచెందుతున్న మతసహనం కూడా కలీజియంట్ల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైంది. కలీజియంట్ల ముఖ్య సూత్రాలైన తర్కము, సహనము అనేవాటిని దాదాపు సమాజం అంతా స్వీకరిస్తుండగా, “ఒకప్పుడు చీకట్లో ఏకైక వెలుగు కిరణంగా ఉన్న కలీజియంట్వాదం పునర్జాగరణోద్యమం అనే గొప్ప అరుణోదయ వెలుతురులో కలిసిపోయింది.” 18వ శతాబ్దం ముగింపుకల్లా కలీజియంట్లలో అత్యధికులు మెన్నోనైట్లలో మరితర మత గుంపుల్లో కలిసిపోయారు.
కలీజియంట్లు తమ తలంపుల్లో ఏకత్వం లక్ష్యంగా పెట్టుకోలేదు గనుక ఎంతమంది కలీజియంట్లు ఉండేవారో అన్ని వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. వారు దీన్ని గుర్తించారు, అందుకనే అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోద్బలపర్చినట్లుగా తాము “యేక మనస్సుతో” ఉన్నట్లు వారు చెప్పుకోలేదు. (1 కొరింథీయులు 1:10) అయితే అదే సమయంలో కలీజియంట్లు తలంపుల్లో ఏకత్వం వంటి ప్రాథమిక క్రైస్తవ నమ్మకాలు ఒక వాస్తవరూపం దాల్చే సమయం వస్తుందని ఎదురుచూశారు.
సత్యమైన జ్ఞానము కలీజియంట్ల కాలానికింకా అధికం కాలేదన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, నేటి అనేక మతాలు గమనించగల మాదిరిని వారు ఉంచారు. (పోల్చండి దానియేలు 12:4.) బైబిలు అధ్యయనానికి వారు ప్రాముఖ్యతనివ్వడం అపొస్తలుడైన పౌలు సలహాకు అనుగుణ్యంగా ఉంది: ‘సమస్తమును పరీక్షించుడి.’ (1 థెస్సలొనీకయులు 5:21) దీర్ఘకాలంగా నమ్ముతూ వస్తున్న మత సిద్ధాంతాలూ అభ్యాసాలూ అసలు బైబిలు మీదే ఆధారపడిలేవని వ్యక్తిగత బైబిలు అధ్యయనం, యాకోబస్ ఆర్మినీయస్కూ మరితరులకూ బోధించింది. వారు దీన్ని గుర్తించినప్పుడు సుస్థాపిత మతంలోని నమ్మకాలకు విరుద్ధమైన నమ్మకాలను కల్గివుండే ధైర్యం వారికి ఉంది. మరి మీరు కూడా అలాగే చేసివుండేవారా?
[అధస్సూచీలు]
a అసమ్మతివాదులు 1610లో డచ్ పరిపాలకులకు లాంఛనప్రాయంగా ఒక రెమాన్స్ట్రాన్స్ను (అసమ్మతికి కారణాలను తెల్పే ఒక పత్రం) పంపించారు. ఆ చర్య తర్వాత వారు రెమాన్స్ట్రెంట్లు అని పిలువబడ్డారు.
b ఈ ప్రాంతం మూలంగా కలీజియంట్లు రైన్స్బర్కర్లు అని కూడా పిలువబడ్డారు.
c 1988, నవంబరు 22 (ఆంగ్లం) తేజరిల్లు! సంచికలోని 19 పేజీలో, “సోసీనియన్లు ఎందుకు త్రిత్వాన్ని తిరస్కరించారు?” అనే శీర్షిక చూడండి.
d మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధన (డచ్), రేనీర్ రోలేవో ఎమ్.డి. గ్రీకు నుండి చేసిన అనువాదము.
[24వ పేజీలోని చిత్రం]
రెమ్బ్రాంట్ వాన్ రైన్
[26వ పేజీలోని చిత్రాలు]
కలీజియంట్లు మొట్టమొదట ఏర్పడిన వార్మోంట్ గ్రామం, బాప్తిస్మాలు జరిగిన డ వ్లీట్ నది
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Background: Courtesy of the American Bible Society Library, New York