కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/15 పేజీలు 29-31
  • “సముద్రములో ఆపదలలో”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సముద్రములో ఆపదలలో”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సముద్ర వర్తకం కోసం రోముకున్న అవసరత
  • సరుకుల ఓడలపై ప్రయాణికులా?
  • సముద్ర ప్రయాణం—ఎంత సురక్షితమైనది?
  • సువార్త సుదూర సముద్రాంత ప్రదేశాలకు తీసుకువెళ్లబడింది
  • “మీలో ఏ ఒక్కరూ చనిపోరు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పౌలు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పౌలును రోముకు పంపించారు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/15 పేజీలు 29-31

“సముద్రములో ఆపదలలో”

చీకటి రాత్రిలో, 276 మందిని తీసుకువెళ్తున్న ఒక ఓడ మధ్యధరా సముద్రంలో ఒక ద్వీపాన్ని సమీపిస్తూంది. అల్లకల్లోలంగావున్న సముద్రపు నీటిలో 14 రోజులుగా ఇటు అటు కొట్టుకొనిపోవడం మూలంగా నౌకా సిబ్బందీ, ప్రయాణికులూ పూర్తిగా అలసిపోయారు. పగటి పూట ఒక అఖాతాన్ని చూసి వాళ్లు ఓడను ఆ తీరానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు. కాని అనివి కదలకుండా కూరుకుపోవడంతో అలలు అమరమును బద్దలుకొడతాయి. ఓడ మీద ఉన్నవారందరూ ఓడను విడిచిపెట్టి, ఈతకొడుతూ లేక పలకల ఆధారంగా లేదా ఇతర వస్తువుల ఆధారంగా మెలితే తీరాన్ని చేరుకోగల్గుతారు. చలికి వణికిపోతూ, పూర్తిగా అలసిపోయి వాళ్లు, తీవ్రమైన తరంగ సంక్షోభం నుండి బయటపడతారు. ఆ ప్రయాణికుల్లో క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఉన్నాడు. విచారణ కోసం ఆయనను రోముకు తీసుకువెళ్తున్నారు.—అపొస్తలుల కార్యములు 27:27-44.

పౌలు విషయంలోనైతే, మెలితే ద్వీపం వద్ద ఓడ బద్దలైపోయిన ఉదంతం, సముద్రంలో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న మొదటి సంఘటన కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనిలా వ్రాశాడు: “ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.” తాను “సముద్రములో ఆపదలలో” చిక్కుకున్నాని కూడా ఆయన జతచేశాడు. (2 కొరింథీయులు 11:25-27) ‘అన్యజనులకు అపొస్తలునిగా’ దేవుడు తనకిచ్చిన పాత్రను నిర్వర్తించడానికి సముద్ర ప్రయాణం పౌలుకు సహాయం చేసింది.—రోమీయులు 11:13.

మొదటి శతాబ్దంలో సముద్ర ప్రయాణం ఎంత విస్తృతంగా జరిగేది? క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడంలో అది ఏ పాత్ర నిర్వహించింది? అదెంత సురక్షితమైనదిగా ఉండేది? ఎలాంటి ఓడలు ఉపయోగంలో ఉండేవి? ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి?

సముద్ర వర్తకం కోసం రోముకున్న అవసరత

రోమన్లు మధ్యధరా సముద్రాన్ని మారె నోస్ట్రమ్‌ అని పిలిచేవారు, మా సముద్రం అని దాని భావం. సముద్ర మార్గాలను అదుపు చేయడం రోముకు సైనిక కారణాలను బట్టి మాత్రమేకాక ఇతర కారణాలను బట్టి కూడా అత్యావశ్యకమైంది. రోమా సామ్రాజ్యానికి చెందిన అనేక నగరాలు ఓడ రేవులుగా ఉండేవి లేక ఓడరేవుల నుండి వాటికి సేవలు అందేవి. ఉదాహరణకు, రోముకు దాని ఓడరేవు ఓస్ట్యా పట్టణానికి సమీపంలో ఉండేది, అయితే కొరింథు లేకియమ్‌ ఓడరేవునూ కెంక్రేయ ఓడరేవునూ ఉపయోగించుకునేది, సిరియన్‌ అంతియోకుకు సెలూస్య ఓడరేవు సేవలందించేది. ఈ ఓడరేవుల మధ్యనున్న చక్కని సముద్రయాన సంబంధాలు, కీలకమైన నగరాలతో త్వరితంగా సంప్రదింపులు జరపడానికి తోడ్పడి, రోమా రాష్ట్రాల నిర్వహణాకార్యక్రమాలను ప్రభావవంతంగా జరుపుకోవడానికి దోహదపడేవి.

రోము, ఆహార సరఫరా కోసం కూడా ఓడల పరిశ్రమ మీద ఆధారపడేది. పది లక్షల జనాభా ఉన్న రోముకు, ధాన్యం ఎక్కువగా అవసరమయ్యేది—సంవత్సరానికి దాదాపు 2,50,000 నుండి 4,00,000 టన్నుల వరకు ధాన్యం అవసరమయ్యేది. ఆ ధాన్యమంతా ఎక్కడి నుండి వచ్చేది? సంవత్సరంలోని ఎనిమిది నెలలు ఉత్తర ఆఫ్రికా రోమును పోషించేదని, అయితే మిగిలిన నాలుగు నెలలకు సరిపడా ధాన్యం ఐగుప్తు పంపించేదని హేరోదు అగ్రిప్ప II అన్నట్లు ఫ్లేవియస్‌ జోసీఫస్‌ చెప్తున్నాడు. ఆ నగరానికి ధాన్యాన్ని సరఫరా చేయడంలో వేలాది ఓడలు నిమగ్నమై ఉండేవి.

విలాసాలపట్ల రోముకున్న అభిరుచికి తగినట్లుగా, వర్ధిల్లుతున్న సముద్ర వర్తకం అన్ని రకాలైన వస్తువులను సరఫరా చేసేది. కుప్ర, గ్రీసు, ఐగుప్తుల నుండి ఖనిజాలు, రాళ్లు, పాలరాళ్లు అలాగే లెబనాన్‌ నుండి కలప ఓడలో రవాణా చేయబడేవి. స్ముర్న నుండి ద్రాక్షామద్యం, దమస్కు నుండి పిక్కలు (నట్స్‌), పాలస్తీనా నుండి ఖర్జూరాలు వచ్చేవి. సెలూస్య నుండి లేపనాలు, రబ్బరు; మిలెటస్‌ లవొదికయల నుండి ఉన్ని; సిరియ లెబనాన్‌ల నుండి వస్త్రాలు; తూరు సీదోనుల నుండి ఊదారంగు వస్త్రాలు వచ్చేవి. తుయతైర రంగులను, అలెక్సంద్రియ సీదోనులు గాజుస్పటికాలను పంపేవి. పట్టు, నూలు, దంతం, మసాలా దినుసులు ఇండియా నుండి ఎగుమతి చేయబడేవి.

పౌలు ప్రయాణిస్తున్న, మెలితేలో బ్రద్దలైపోయిన ఓడ గురించి ఏమి చెప్పవచ్చు? అది ధాన్యాన్ని తీసుకువెళ్తున్న, “ఇటలీ వెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ.” (అపొస్తలుల కార్యములు 27:6, అధఃస్సూచి, NW) ధాన్యపు ఓడలు గ్రీకులు, ఫినోసియన్లు, సిరియన్ల ఆధీనంలో ఉండేవి, వాటిపై వారే అజమాయిషీ చేసేవారు, ఆయత్తం చేసేవారు. అయితే, రోమా ప్రభుత్వం ఆ ఓడలను అద్దెకు తీసుకునేది. “పన్నులు వసూలు చేసే విషయంలోలాగే, ఆ గొప్ప సేవకు అవసరమైన శ్రామిక శక్తిని, దానికి అవసరమైన ఉపకరణాలను తానే సంస్థీకరించే బదులు ఆ పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడమే సులభమని రోమా ప్రభుత్వం కనుగొన్నది” అని చరిత్రకారుడైన విలియమ్‌ ఎమ్‌. రామ్‌సే చెప్తున్నాడు.

పౌలు “అశ్విని” చిహ్నం గల ఓడలో ప్రయాణించి రోమును చేరుకున్నాడు. అది కూడా అలెక్సంద్రియ ఓడనే. అది నేపుల్స్‌ సముద్ర అగాధంలోవున్న పొతియొలీ ఓడరేవులో ఆగింది. సాధారణంగా ధాన్యపు ఓడలు ఆ ఓడరేవులోకే చేరుకునేవి. (అపొస్తలుల కార్యములు 28:11-13) పొతియొలీ—ఆధునిక దిన పుజోలి—నుండి సరుకు భూమార్గానగానీ లేక చిన్న చిన్న నావల్లోగానీ తీరం వెంబడి ఉత్తరంగా టైబర్‌ నదికి ఎగువగా రోము అంతర్భాగంలోకి రవాణా చేయబడేది.

సరుకుల ఓడలపై ప్రయాణికులా?

పౌలు మరియు ఆయనకు కాపలావున్న సైనికులు సరుకుల ఓడ మీద ఎందుకు ప్రయాణం చేశారు? ఆ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు, ఆ రోజుల్లో సముద్ర యానం చేయడమంటే ఎలా ఉండేదో మనం తెలుసుకోవాలి.

సా.శ. మొదటి శతాబ్దంలో, ప్రయాణికుల ఓడలంటూ ప్రత్యేకించి ఉండేవి కావు. ప్రయాణికులు వ్యాపారుల ఓడలనే ఉపయోగించేవారు. రాష్ట్ర అధికారులు, విజ్ఞులు, ప్రచారకులు, మాంత్రికులు, కళాకారులు, ఆటగాళ్లు, వర్తకులు, సందర్శకులు, యాత్రికులు వంటివారితో సహా అన్ని రకాల ప్రజలు వాటిలో ప్రయాణించి ఉండవచ్చు.

అయితే సముద్రతీర జలాల్లో ప్రయాణికులను తీసుకువెళ్లడానికి, సరుకులను రవాణా చేయడానికి చిన్న పడవలు ఉండేవి. త్రోయ నుండి ‘మాసిదోనియకు వచ్చేందుకు’ పౌలు బహుశ అలాంటి దాన్నే ఉపయోగించి ఉండవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో చిన్న పడవలు ఆయనను ఏథెన్సుకు తీసుకొచ్చి, ఏథెన్సు నుండి ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లివుండవచ్చు. పౌలు తన తదుపరి ప్రయాణాల్లో, ఆసియా మైనరు తీరం వద్దనున్న ద్వీపాల గుండా త్రోయ నుండి పతారాకు వెళ్లడానికి కూడా చిన్న పడవనే ఉపయోగించుకొని ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 16:8-11; 17:14, 15; 20:1-6, 13-15; 21:1) అలాంటి చిన్న పడవలను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసేది, కాని వాటిపై ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం. కాబట్టి పౌలును కుప్రకు ఆ తర్వాత పంపూలియకు తీసుకువెళ్లిన ఓడలు, అలాగే ఆయన ఎఫెసు నుండి కైసరుకు, పతరకు నుండి తూరుకు ప్రయాణించిన ఓడలు కాస్త పెద్ద సైజు ఓడలై ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 13:4, 13; 18:21, 22; 21:1-3) పౌలు ప్రయాణిస్తున్న ఓడ మెలితే వద్ద బద్దలైపోయింది, అది కూడా పెద్ద ఓడగానే పరిగణించబడి ఉండవచ్చు. అలాంటి ఓడలు ఎంత పెద్దగా ఉండవచ్చు?

సాహిత్య విషయిక మూలాలు ఒక పండితుడు ఇలా చెప్పేలా నడిపించాయి: “ప్రాచీన కాలానికి చెందిన నాగరికులు సాధారణంగా ఉపయోగకరంగా ఉంటుందని కనుగొన్న చిన్న [ఓడ] పరిమాణం దాదాపు 70 నుండి 80 టన్నులు మోసుకువెళ్ల గలిగేంత ఉండేది. కనీసం గ్రీకుల కాలంలో ఎంతో ప్రసిద్ధమైన పరిమాణం 130 టన్నులు. 250 టన్నులది సాధారణంగా కనిపించినప్పటికీ, అది కచ్చితంగా సగటుదాని కన్నా పెద్దగానే ఉండేది. రోమన్ల కాలంలో, సామ్రాజ్య సంబంధ రవాణా సేవలను అందజేసే ఓడలు ఇంకా పెద్దవిగా ఉండేవి, అవి 340 టన్నుల బరువు వరకు తీసుకువెళ్లగలిగే పరిమాణాన్ని కల్గివుండేవి. ఉపయోగంలోవున్న పెద్ద ఓడలు 1300 టన్నులు, బహుశ అంతకన్నా కాస్త ఎక్కువ మోయగలిగేలా ఉండేవి.” సా.శ. రెండవ శతాబ్దంలో వ్రాయబడిన ఒక వివరణ ప్రకారం, అలెక్సంద్రియకు చెందిన ధాన్యాన్ని తీసుకువెళ్లే ఐసిస్‌ 55 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, దాదాపు 14 మీటర్ల వెడల్పు ఉండి, దాదాపు 13 మీటర్ల లోతు కలిగివుండేది, బహుశ వెయ్యి టన్నుల ధాన్యాన్నీ కొన్ని వందలమంది ప్రయాణీకులనూ తీసుకు వెళ్లగలిగేది.

సరుకుల ఓడమీద ప్రయాణం సాగించే ప్రయాణీకుల పట్ల శ్రద్ధ ఎలా చూపించబడేది? ఓడలు ప్రాముఖ్యంగా సరుకుల కోసమే గనుక, ప్రయాణీకులకు అంత ప్రాధాన్యత ఇవ్వబడేది కాదు. నీళ్లు తప్ప ఆహారం గాని ఇతర సేవలు గాని అందజేయబడేవి కావు. వాళ్లు ఓడ డెక్‌పై బహుశ గుడారాలవంటి వాటి క్రింద నిద్రపోయేవారు, ఆ గుడారాల వంటివాటిని రాత్రి వేసి ఉదయం తీసివేసేవారు. ప్రయాణీకులు వంట చేసుకోవడానికి ఓడలోవున్న వంటగదిని ఉపయోగించుకోవడానికి అనుమతించబడినప్పటికీ, వంటచేసుకోవడానికి, తినడానికి, స్నానం చేసుకోవడానికి, నిద్రపోవడానికి అవసరమైన వాటిని అంటే కుండలు, పాత్రలు, పరుపులతో సహా కావలసిన వస్తువులన్నింటినీ వారే తెచ్చుకోవాలి.

సముద్ర ప్రయాణం—ఎంత సురక్షితమైనది?

పరికరాలు—చివరికి దిక్సూచి కూడా—కొరవడిన మొదటి శతాబ్దానికి చెందిన నావికులు కేవలం కంటిచూపు మీద ఆధారపడి వాటిని నడిపించేవారు. కాబట్టి, సముద్రంపై అంతా స్పష్టంగా కనిపించేంత వరకు—సాధారణంగా మే చివరి భాగం నుండి సెప్టెంబరు మధ్య భాగం వరకు—ప్రయాణం సురక్షితమైనదిగా ఉండేది. ఆ కాలానికి ముందు రెండు నెలల్లోనూ, తర్వాతి రెండు నెలల్లోనూ వర్తకులు మాత్రమే ప్రయాణించడానికి ప్రయత్నించేవారు. కాని చలికాలంలో పొగమంచు, మేఘాలు తరచు సరిహద్దు గుర్తులను, పగటి సమయంలో సూర్యుడ్ని, రాత్రి సమయంలో నక్షత్రాలను కనబడకుండా కప్పేసేవి. తప్పనిసరి అవసరతగాని లేక అత్యవసర పరిస్థితిగాని ఏర్పడితే తప్ప, నవంబరు 11 నుండి మార్చి 10 వరకు ఓడల ప్రయాణం నిలిపివేయబడినట్లు (లాటిన్‌, మేర క్లుసుమ్‌) పరిగణించబడేది. సముద్రయానానుకూల సీజను ముగియబోతున్నప్పుడు ప్రయాణించేవారు, విదేశీ ఓడరేవులో చలికాలం గడపవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.—అపొస్తలుల కార్యములు 27:12; 28:11.

ఓడ ప్రయాణం ప్రమాదకరమైనదీ, కేవలం కొన్ని కాలాల్లో మాత్రమే చేయదగినదీ అయినప్పటికీ, భూమార్గాన ప్రయాణించడం కంటే సముద్ర ప్రయాణంలో అదనపు ప్రయోజనాలు ఏమన్నా ఉండేవా? నిజంగా, ఉండేవి! సముద్ర ప్రయాణం ఎక్కువ అలసట కలిగించదు, తక్కువ ఖర్చుతో కూడినది, ఎక్కువ వేగవంతమైనది. గాలులు అనుకూలంగా వీస్తున్నప్పుడు, ఒక ఓడ ఒక రోజుకు బహుశ 150 కిలోమీటర్లు ప్రయాణించగలిగేది. అదే కాలినడకన సాగించే దూర ప్రయాణం సగటు వేగం రోజుకు 25 నుండి 30 కిలోమీటర్లు.

సముద్ర ప్రయాణ వేగం, దాదాపు పూర్తిగా గాలిపైనే ఆధారపడి ఉండేది. సముద్రయానానుకూల కాలంలో కూడా, ఐగుప్తు నుండి ఇటలీకి వెళ్లడానికి ఎదురు గాలులతో ఎడతెగక పోరాడవలసి వచ్చేది. అతి దగ్గరి మార్గయానం సాధారణంగా రొదు లేక మూర లేక ఆసియా మైనరులోని లుకియ తీరానున్న మరితర ఓడ రేవు గుండా సాగేది. తుపానులను ఎదుర్కుని దారి తప్పిపోయిన ఐసిస్‌ అనే ధాన్యపు ఓడ, అలెక్సంద్రియ నుండి బయలుదేరిన 70 రోజుల తర్వాత పిరైవ్స్‌కు చేరుకుంది. వాయవ్య గాలులు వెనుక నుండి కొడుతుండగా ఆ ఓడ ఇటలీ నుండి బహుశ 20 నుండి 25 రోజుల్లో తిరుగు ప్రయాణం చేసి ఉండవచ్చు. అదే భూమార్గానైతే మంచి వాతావరణంలో రానూపోనూ 150 కంటే ఎక్కువ రోజులు పడతాయి.

సువార్త సుదూర సముద్రాంత ప్రదేశాలకు తీసుకువెళ్లబడింది

అననుకూలమైన కాలంలో సముద్రయానం చేయడంలోవున్న ప్రమాదాల గురించి పౌలుకు తెలుసని స్పష్టమౌతుంది. “అయ్యలారా, యూ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమేకాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని” చెప్తూ, సెప్టెంబరు చివరి భాగంలో లేక అక్టోబరు తొలి భాగంలో ఓడ ప్రయాణం చేయడం మంచిది కాదని ఆయన సలహా కూడా ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 27:9, 10) అయితే, సైనికాధికారి ఈ మాటలను పట్టించుకోలేదు, దాని ఫలితంగానే మెలితే వద్ద ఓడ బద్దలైపోయింది.

పౌలు మిషనరీ ప్రయాణం ముగిసే సమయానికి ఆయన ప్రయాణిస్తున్న ఓడలు బద్దలైపోవడం కనీసం నాలుగుసార్లు జరిగింది. (అపొస్తలుల కార్యములు 27:41-44; 2 కొరింథీయులు 11:25) అయినప్పటికీ, అలాంటివి సంభవించగల సాధ్యతను గురించిన అనవసరమైన చింత, తొలి సువార్త ప్రచారకులను సముద్ర ప్రయాణం చేయకుండా ఆపలేకపోయింది. రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అందుబాటులోవున్న ప్రయాణ మాధ్యమాలనన్నింటినీ వాళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. యేసు ఆజ్ఞకు విధేయతగా, అంతటా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) వారి ఆసక్తి మూలంగానూ, వారి మాదిరిని అనుసరించిన వారి విశ్వాసం మూలంగానూ, యెహోవా పరిశుద్ధాత్మ నడిపింపు మూలంగానూ, భూమ్యందంతటా ఉన్న ప్రజలకు సువార్త చేరింది.

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి