రాజ్య ప్రచారకుల నివేదిక
సత్య దేవుణ్ని వెదికినందుకు ప్రతిఫలం లభించింది
సా.శ.పూ. పదవ శతాబ్దంలో రెండు గోత్రాలతో కూడిన యూదా రాజ్యంలో అబద్ధ ఆరాధన అమితంగా వ్యాపించింది. అయితే, విగ్రహారాధన అవిచ్ఛిన్నంగా జరుగుతున్న వారి మధ్యన దేవుని దృష్టిలో న్యాయమైన హృదయాన్ని కలిగివున్న ఒక వ్యక్తి జీవించాడు. అతని పేరు యెహోషాపాతు. ప్రవక్తయైన యెహూ ఆయననుద్దేశించి ఈ విధంగా అన్నాడు: “దేవునియొద్ద విచారణచేయుటకు [“సత్య దేవుణ్ని వెదకుటకు,” NW] నీవు మనస్సు నిలుపుకొని యున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.” (2 దినవృత్తాంతములు 19:3) అలాగే ఈ “అపాయకరమైన కాలముల”లో కూడా, లక్షలాది మంది సత్య దేవుడైన యెహోవాను వెదికేందుకు ‘తమ మనస్సు నిలుపుకొని’ ఉన్నారు. (2 తిమోతి 3:1-5) దాన్ని పశ్చిమ ఆఫ్రికాలోని టోగో నుండి వచ్చిన ఈ క్రింది అనుభవం రూఢిపరుస్తుంది.
ఒక క్యాథలిక్ స్కూలుకు వెళ్లే కాజీమర్ తనకు తొమ్మిదేండ్లున్నప్పుడు తన మొదటి మాస్ ఆచరణకు హాజరయ్యాడు. కానీ కాజీమర్కు 14 సంవత్సరాలు వచ్చేసరికెల్లా చర్చికి వెళ్ళడం మానేశాడు. తను ఆ మాస్కు హాజరు కాకపోవడం మూలంగా తను నరకాగ్నిలోకైనా లేక కనీసం పర్గేటరీ లోకైనా వెళ్తాడని ఆలోచిస్తూ భయంతో ఉండేవాడు.
స్కూల్లో కాజీమర్, వారానికి ఒకసారి బైబిలు పఠించేందుకు కూడుకునే యౌవనుల గుంపు ఒకదానిలో చేరాడు. వ్యక్తిగతంగా బైబిలును చదవడం కూడా ప్రారంభించాడు. ఒక సందర్భంలో కాజీమర్ ప్రకటన గ్రంథంలో సముద్రం నుండి వచ్చే భయంకరమైన క్రూరమృగం గురించి చదివాడు. (ప్రకటన 13:1, 2) ఆ బైబిలు పఠన గుంపు నాయకుణ్ణి ఆ విషయాన్ని గురించి అడిగినప్పుడు అతడు ఆ క్రూరమృగం వాస్తవమైనదని అది నిజంగానే సముద్రంలో నుండి వస్తుందని చెప్పాడు. ఈ వివరణ కాజీమర్ను కలవరపెట్టింది, ఎందుకంటే ఆయన అట్లాంటిక్ సముద్రతీరానికి ఎంతో దూరంలో లేడు. ఆ క్రూరమృగానికి బలయ్యే మొట్టమొదటివారిలో తాను కూడా ఉంటాడని నమ్మకం ఏర్పడిపోయింది.
కాజీమర్ ఆ క్రూరమృగాన్నుంచి తప్పించుకునేందుకు ఉత్తరాన ఉన్న ఎడారికి పారిపోవడానికి డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాడు. ఆ తోటి విద్యార్థికి తన ఆలోచనల గురించి తెలియజేశాడు. యెహోవాసాక్షి అయిన తన తోటి విద్యార్థి, సముద్రంలో నుండి అటువంటి క్రూరమృగం ఏమీ రాదని ఆయనకు అభయాన్నిచ్చాడు. ఆ తర్వాత కొద్దికాలానికే కాజీమర్ రాజ్యమందిరంలోని కూటాలకు ఆహ్వానించబడ్డాడు. ఆ కూటాల్లో ఆనందాన్ని పొంది క్రమంగా వాటికి హాజరుకావడం మొదలుపెట్టాడు. గృహబైబిలు పఠనానికి కూడా అంగీకరించాడు.
కాజీమర్ పఠనంలో అభివృద్ధి సాధిస్తుండగా తన కుటుంబం నుండి ఒత్తిడి ప్రారంభమయ్యింది. తన కుటుంబం పూర్వికుల ఆరాధన ఆచరించేది. రక్తం చిందించని బలి అర్పించిన మాంసాన్ని కూడా తినేది. మాంసాన్ని తినేందుకు కాజీమర్ మర్యాదపూర్వకంగా నిరాకరించినప్పుడు వారు ఆయన్ను భయపెట్టారు, ఇల్లు వదలి వెళ్ళిపొమ్మని కూడా అన్నారు. కాజీమర్ ప్రశాంతంగా ఉన్నాడు, వారు బెదరగొట్టినట్లుగా ఏమీ చర్యలు తీసుకోలేదు. ఏమైనప్పటికీ, మూడు నెలల వరకూ, ఇంటిలో భోజనానికి అలాంటి మాంసాన్నే వండేవారు. సరిపడేంత భోజనం లేక బాధపడినప్పటికీ దీనినీ, ఇతర కష్టాలను ఆయన సహించాడు.
కాజీమర్ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకొనే స్థాయికి ఎదిగాడు. తర్వాత పరిచర్య సేవకునిగా నియమించబడి, టోగోలోని మినిస్టీరియల్ ట్రైనింగ్ స్కూల్లో నాలుగవ తరగతికి హాజరయ్యాడు. ప్రస్తుతం టోగో బ్రాంచ్లో ఆయన స్వచ్ఛంద సేవ చేస్తూ ఆనందిస్తున్నాడు.
అవును, దావీదు పలికిన ఈ మాటలు ఎన్నో సందర్భాల్లో వాస్తవమని రుజువయ్యాయి: “[యెహోవాను] వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.”—1 దినవృత్తాంతములు 28:9.
[8వ పేజీలోని చిత్రాలు]
బ్రాంచ్లో స్వచ్ఛంద సేవ చేస్తూ ఆనందిస్తున్న కాజీమర్ (కుడి)