కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/15 పేజీలు 26-29
  • ఎంపికచేసుకునే హక్కును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎంపికచేసుకునే హక్కును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • పౌర భద్రత, నైతికతలు
  • ఎదురుచూడని ప్రోత్సాహం
  • తీర్పు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/15 పేజీలు 26-29

ఎంపికచేసుకునే హక్కును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు

తెలియజేయబడిన విషయంపై ఆధారపడి ఎంపికచేసుకునే హక్కును (ఇన్ఫామ్‌డ్‌ ఛాయిస్‌ను), మరెవరో కాదుగాని ఈ విశ్వానికంతటికి అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తే సమర్థిస్తున్నాడు. ఆయనే మన సృష్టికర్త. మానవ అవసరాల విషయంలో అపరిమితమైన జ్ఞానాన్ని కలిగివున్న వానిగా, ఆయన జ్ఞానయుక్తమైన నిర్ణయాల్ని తీసుకోవడానికి కావాల్సిన ఉపదేశాన్నీ, హెచ్చరికనూ, నడిపింపునూ ఎంతో ఉదారంగా ఇస్తున్నాడు. అయినా, ఆయన తన తెలివైన ప్రాణులకు అనుగ్రహించిన స్వేచ్ఛాచిత్తాన్ని అలక్ష్యం చేయడు. దేవుని ప్రవక్తయైన మోషే, ఆయన దృక్కోణాన్ని ఇలా ప్రతిబింబించాడు: “జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి[యున్నాను], . . . మీరు నివసించునట్లు . . . నీవును నీ సంతానమును బ్రదుకు[నట్లు], . . . జీవమును కోరుకొనుడి.”—ద్వితీయోపదేశకాండము 30:19, 20.

ఆ నియమం, వైద్యరంగాన్ని ప్రభావితం చేస్తోంది. జపాన్‌లోనూ, మరితర దేశాల్లోనూ ఆ నియమం అంటే తెలియజేయబడిన విషయంపై ఆధారపడి ఎంపికచేసుకునే హక్కు లేక తెలియజేసే సమ్మతి గతంలో అంతగా ఆమోదాన్ని పొందలేదుగానీ ఇప్పుడైతే క్రమేణా ఆమోదాన్ని పొందుతోంది. డా. మిచిటారో నకమూరా తెలియజేయబడిన విషయంపై ఆధారపడి తెలియజేసే సమ్మతిని (ఇన్ఫామ్‌డ్‌ కన్సన్ట్‌ను) గూర్చి ఇలా వర్ణించాడు: “చికిత్సా విధానాన్ని నిర్ణయించుకోవడానికి రోగికి ఉన్న హక్కును గౌరవిస్తూ, రోగాన్ని గూర్చీ, రోగ గమనాన్ని గూర్చీ (ఎంతకాలం ఉంటుంది, ఎప్పటికి తగ్గుతుంది అనే విషయాన్ని గూర్చీ), చికిత్స చేసే విధానాన్ని గూర్చీ, రాగల సైడ్‌ ఎఫెక్ట్‌లను గూర్చీ సులభంగా అర్థంచేసుకొనే భాషలో వైద్యుడు రోగికి వివరించడమే దాని ఉద్దేశం.”—జపాన్‌ మెడికల్‌ జర్నల్‌.

సంవత్సరాలుగా జపాన్‌లోని డాక్టర్లు, రోగులతో ఈ విధంగా వ్యవహరించే విధానాన్ని నిరోధించేందుకు వివిధ కారణాలను చూపించారు, కోర్టులు వైద్య సాంప్రదాయాలను మన్నించడానికే మొగ్గు చూపించాయి. ఆ విధంగా, ఫిబ్రవరి 9, 1998న టోక్యో హైకోర్ట్‌ చీఫ్‌ జడ్జి టకీయో ఇనాబా, తెలియజేయబడిన విషయంపై ఆధారపడి ఎంపిక చేసుకునే హక్కుకు (ఇన్ఫామ్‌డ్‌ ఛాయిస్‌కు) అనుకూలంగా తీర్పును ఇచ్చినప్పుడు అదొక మలుపురాయి అయ్యింది. ఏమిటా తీర్పు, ఆ కేసును కోర్టుల సమక్షానికి తీసుకొచ్చిన ఆ వివాదాంశం ఏమిటి?

జూలై 1992లో 63 సంవత్సరాల మిసాయి టకేడా అనే ఒక యెహోవాసాక్షి యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో నందలి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ హాస్పిటల్‌ను సంప్రదించింది. కాలేయంలో ప్రమాదకరమైన కంతి ఉన్నట్టు రోగ నిర్ధారణలో తేలింది, దాన్ని ఆపరేషన్‌ చేసి తొలగించాల్సి ఉంది. రక్తాన్ని దుర్వినియోగం చేయకూడదని బైబిలు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాలన్న దృఢచిత్తంతో, రక్తరహిత చికిత్సను మాత్రమే చేయించుకోవాలనే తన కోరికను ఆమె వైద్యులకు స్పష్టపర్చింది. (ఆదికాండము 9:3, 4; అపొస్తలులకార్యములు 15:29) తాను తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే ఏ పర్యవసానాలకైనా తానే బాధ్యురాలనీ, దానికి వైద్యులూ, హాస్పిటల్‌ సిబ్బందీ బాధ్యులు కారనీ తెలియజేసే లయబిలిటీ ఫారమ్‌ను వైద్యులకు ఆమె ఇచ్చింది, దాన్ని వాళ్లు అంగీకరించారు. దానికి కట్టుబడి ఉంటామని వాళ్లు ఆమెకు హామీ ఇచ్చారు.

అయినప్పటికీ, ఆపరేషన్‌ తర్వాత, మిసాయి ఇంకా సెడేషన్‌లో అంటే ఇంకా మత్తులో ఉన్నప్పుడు, ఎంతో స్పష్టంగా వ్యక్తపర్చిన ఆమె అభీష్టాలకు విరుద్ధంగా ఆమెకు రక్తమార్పిడి చేశారు. ఆ విషయాన్ని ఆసుపత్రిలో పనిచేసే ఒక ఉద్యోగి పత్రికా విలేఖరికి లీక్‌ చేసి ఉంటాడు, దానితో అనధికారపూర్వకంగా చేసిన ఆ రక్తమార్పిడిని రహస్యంగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అనధికారపూర్వక రక్తమార్పిడిని గూర్చి తెలుసుకోగానే యథార్థపరురాలైన ఆ క్రైస్తవ స్త్రీ దిగ్భ్రాంతికి గురైందన్న విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు. తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనీ, తన మత విశ్వాసాల్ని గౌరవిస్తారనీ విశ్వసిస్తూ, ఆమె వైద్య సిబ్బందిని నమ్మింది. వైద్యుడు/రోగి సంబంధం అతిఘోరంగా ఉల్లంఘించబడడం మూలంగా తాను అనుభవించిన భావోద్రేక మనస్తాపాన్నిబట్టీ, వైద్యపరంగా ఇలాంటి దుర్వ్యవహారానికి ఇతరులు గురికాకుండా తప్పించే ఒక పూర్వప్రమాణాన్ని స్థాపించాలనే ఆశతో, ఆమె ఆ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లింది.

పౌర భద్రత, నైతికతలు

టోక్యో జిల్లా కోర్టులో ముగ్గురు జడ్జీలు ఈ కేసును గూర్చిన వాదోపవాదాల్ని విని, వైద్యులకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు, మరి ఆ విధంగా అది తెలియజేయబడిన విషయంపై ఆధారపడి సమ్మతిని వ్యక్తపర్చే హక్కుకు (ఇన్ఫామ్‌డ్‌ కన్సన్ట్‌కు) వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పైంది. మార్చి 12, 1997న ఇచ్చిన తమ తీర్పులో వాళ్లు, పూర్తిగా రక్తరహితమైన చికిత్స కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా సరే, అది చెల్లదని చెప్పారు. ఎంతటి క్లిష్టపరిస్థితి ఎదురైనా కూడా రక్తం ఎక్కించకుండా చికిత్సచేయడమనే ప్రత్యేక ఒప్పందంలో ఒక వైద్యుడు ప్రవేశించడం, క్యోజో ర్యోజోనుa లేదా సామాజిక ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అవుతుందనేది వాళ్ల తర్కన. ఏ విధంగానైనా ప్రాణాన్ని కాపాడడమే వైద్యుని ప్రథమ కర్తవ్యం గనుక, రోగి మత విశ్వాసం ఏదైనప్పటికీ అలాంటి ఒప్పందం మొదటి నుండీ చెల్లని ఒప్పందం అవుతుందనేది వాళ్ల అభిప్రాయం. వైద్య చికిత్సకు ముందు రోగి చేసుకునే ఏ అభ్యర్థనకన్నా వైద్యుని వృత్తిపరమైన అభిప్రాయమే చివరికి నిలుస్తుందని వాళ్లు తమ చివరి విశ్లేషణలో తెలియజేశారు.

అంతేగాక, తాను చేయబోయే ఆపరేషన్‌కు సంబంధించిన ప్రాథమిక పద్ధతుల్ని గురించీ, కలగబోయే పర్యవసానాల్ని గురించీ, రాబోయే ప్రమాదాల్ని గురించీ వివరించాలని ఎదురుచూసినప్పటికీ వైద్యుడు, పైన తెలియజేసిన అవే కారణాల్ని బట్టి “తాను రక్తాన్ని ఎక్కించాలని అనుకుంటున్నాడా లేదా అన్న విషయాన్ని చెప్పకుండా విడిచిపెట్టవచ్చు” అని న్యాయమూర్తులు తెలియజేశారు. “ప్రతివాదులుగా డాక్టర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, రక్తమార్పిడిని అంగీకరించకూడదన్న ఫిర్యాది అభిప్రాయాల్ని అర్థం చేసుకొని వాటిని గౌరవించినట్లు నటించి, అలా వాళ్లు ప్రశ్నార్థకంగా నిలిచిన ఆ ఆపరేషన్‌ను చేయించుకోవడానికి ఆమె అంగీకరించేలా కారణమయ్యారన్న విషయాన్ని చట్టరహితమైనదిగానో, సక్రమమైన చర్య కాదనో నిర్ణయించకూడదు” అన్నదే వాళ్లిచ్చిన తీర్పు. అలా కాక మరో విధంగా వైద్యులు ప్రవర్తించివుంటే, రోగి ఆపరేషన్‌ చేయించుకోవడానికి నిరాకరించి, ఆసుపత్రిని విడిచివెళ్ళిపోవచ్చనేదే వాళ్ళ అభిప్రాయం.

తెలియజేయబడిన విషయంపై ఆధారపడి సమ్మతిని వ్యక్తపర్చే హక్కు (ఇన్ఫామ్‌డ్‌ కన్సన్ట్‌) తరపున వాదించే వకీళ్లను కోర్టు తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసింది, విస్మయంచెందేలా చేసింది. జపాన్‌లోని తెలియజేయబడిన విషయంపై ఆధారపడి సమ్మతిని వ్యక్తపర్చే హక్కుకు సంబంధించిన టకేడా కేసు తీర్పునూ, దాని పర్యవసానాల్నీ చర్చించడంలో, పౌర న్యాయాలపై మంచి పట్టువున్న అధికారియైన ప్రొఫెసర్‌ టకాయో యమాడా ఇలా వ్రాశాడు: “ఈ తీర్పులో ఉన్న వాదాన్ని చలామణిలోనికి రావడానికి అనుమతిస్తే, రక్తమార్పిడిని నిరాకరించడం, తెలియజేయబడిన విషయంపై ఆధారపడి సమ్మతిని వ్యక్తపర్చే హక్కును గూర్చిన చట్ట నియమం గాలిలో రెపరెపలాడుతున్న క్రొవ్వుత్తులా ఉంటుంది.” బలవంతంగా రక్తమార్పిడిని చేయడాన్ని, “ఘోరమైన నమ్మక ద్రోహ[మనీ], ఎదురుచూడని రీతిలో చేసే దాడికి సమాన[మనీ]” ఆయన పరుషమైన పదజాలంతో ఖండించాడు. అలా నమ్మకాన్ని వమ్ము చేసే చర్యను “ఎప్పటికీ అనుమతించకూడదు” అని ప్రొఫెసర్‌ యమాడా దానికి జోడించారు.

మిసాయి స్వభావసిద్ధంగా బిడియస్థురాలు. దాని మూలంగా ఆమె నలుగురి దృష్టిలోకీ రావడం కష్టతరమైంది. కానీ యెహోవా నామం పక్షంగానూ, ఆయన రక్త పవిత్రతకు సంబంధించిన నీతియుక్తమైన కట్టడల పక్షంగానూ వాదించడంలో తాను భాగంవహించాలని గ్రహించినదై, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆమె నిశ్చయించుకుంది. ఆమె తన లీగల్‌ కౌన్సిల్‌కు ఇలా వ్రాసింది: “నేనొక మంటి ఘటాన్ని, అంతకన్నా అల్పురాల్నే. నాలాంటి ఎందుకూ కొరగాని వ్యక్తి ఎందుకు ఉపయోగించబడుతుందా అని ఆశ్చర్యంగా ఉంది. అయినా రాళ్ళను కేకలు వేయించగల్గే దేవుడైన యెహోవా చెబుతున్నదాన్నే నేను చేయాలని నేను ప్రయత్నించినప్పుడు, ఆయన నాకు శక్తినిస్తాడు.” (మత్తయి 10:18; లూకా19:40) కోర్టు విచారణ జరిగే సమయంలో బోనులో ఆమె, నమ్మకద్రోహం మూలంగా తాను అనుభవించిన భావోద్రేకపు క్షోభను వణుకుతున్న స్వరంతో వర్ణించింది. “అత్యాచారానికి గురైన స్త్రీలా, చెరచబడినట్లు నేను భావించాను.” ఆ రోజు ఆమె చెప్పిన సాక్ష్యం, కోర్టుకు హాజరైన వారందరిచేతా కంటతడి పెట్టించింది.

ఎదురుచూడని ప్రోత్సాహం

జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పునుబట్టి, ఈ కేసును వెంటనే హైకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలు కోర్టులో ప్రారంభపు వాదోపవాదనలు జూలై 1997లో ప్రారంభమయ్యాయి. పాలిపోయినా కృత నిశ్చయంతో ఉన్న మిసాయి, అక్కడకి వీల్‌ఛైర్‌లో హాజరైంది. ఆమెకు కేన్సర్‌ తిరగబెట్టింది, ఆమె నానాటికి కృశించిపోతోంది. ఎదురుచూడని రీతిలో ఛీఫ్‌ జడ్జి, కోర్టు తీసుకోనైవున్న డైరక్షన్‌ గురించి స్పష్టంగా తెలియజేసినప్పుడు, మిసాయి ఎంతగానో ప్రోత్సాహం పొందింది. తాను రోగి అభిప్రాయాలను మన్నించి వాటిని పాటించబోతున్నట్టుగా నటించి, రహస్యంగా వాటికి బదులు మరొకటి చేయాలని నిశ్చయించుకొని రోగి అభిప్రాయాల్ని కాలరాచే హక్కు వైద్యునికి ఉందన్న క్రింది కోర్టు తీర్పుతో అప్పీలు కోర్టు ఏకీభవించదనే విషయాన్ని ఆయన స్పష్టపర్చాడు. “షిరాషిమూ బెకారాజూ యోరాషీమూ బేషి”b అనే పితృస్వామిక నీతిని అంటే వైద్యం విషయంలో వాళ్లను “అజ్ఞానులుగానూ, పరాధీనులుగానూ ఉంచండి” అనే నీతిని కోర్టు సమర్థించదని ఛీఫ్‌ జడ్జి తెలియజేశాడు. “నిజాయితీతో కూడిన జడ్జి వ్యాఖ్యానాన్ని విని తాను ఎంతో ఆనందిస్తున్నాననీ, అది ఇంతకు ముందు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా భిన్నమైందనీ” మిసాయి ఆ తర్వాత తెలియజేసింది. ఆమె ఇంకా ఇలా అంది: “ఇన్నాళ్లుగా యెహోవాకు నేను ప్రార్థిస్తున్నది దానికోసమే.”

ఆ తర్వాత నెలలోనే మిసాయి, తన ప్రియ కుటుంబ సభ్యుల మధ్యా, తన యథార్థమైన నమ్మకాల్ని అర్థంచేసుకొని, గౌరవించిన మరొక హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది మధ్యా మరణించింది. ఆమె కుమారుడైన మసామి, మరితర కుటుంబ సభ్యులూ ఆమె మరణించినందువల్ల విచారసాగరంలో మునిగిపోయి ఉన్నా, ఆమె అభిప్రాయాలకు అనుగుణంగా ఆ కేసును చివరికంటూ చూడాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

తీర్పు

చివరికి, 1998 ఫిబ్రవరి 9న హైకోర్టు ముగ్గురు జడ్జీలు, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేస్తూ తమ తీర్పును వెల్లడిచేశారు. ఆ చిన్న కోర్టు రూమ్‌ పత్రికావిలేఖరులతోనూ, విద్యావేత్తలతోనూ, విచారణ జరుగుతున్న కాలమందంతటా నమ్మకంగా వెంబడించిన ఇతరులతోనూ నిండిపోయింది. ముఖ్య వార్తాపత్రికలూ, టీ.వీ. స్టేషన్‌లూ ఆ తీర్పును నివేదించాయి. కొన్ని పతాక శీర్షికలు ఇలా ఉన్నాయి: “కోర్టు: రోగులు చికిత్సను తిరస్కరించవచ్చు”; “హైకోర్టు: హక్కులను అతిక్రమించే రక్తమార్పిడి”; “బలవంతంగా రక్తమార్పిడి చేసి కోర్టులో ఓడిపోయిన వైద్యుడు”; “రక్తమార్పిడి వల్ల నష్టాన్ని పొందుతున్న యెహోవాసాక్షులు.”

తీర్పుపై వచ్చిన నివేదికలు ఖచ్చితంగానూ, ఎంతో అనుకూలంగానూ ఉన్నాయి. ద డైలీ యోమ్యురీ అనే వార్తాపత్రిక ఇలా నివేదించింది: “రోగి నిరాకరించిన వైద్య పద్ధతుల్ని ఉపయోగించడం వైద్యులకు తగదు అని జడ్జి టకేయో ఇనాబా చెప్పాడు.” అది ఇంకా ఇలా స్పష్టంగా తెలియజేసింది: “[రక్త మార్పిడిని] చేసిన డాక్టర్లు, చికిత్సా విధానాన్ని ఎంపికచేసుకోడానికి ఆమెకున్న అవకాశాన్ని ఆమెకు లేకుండా చేశారు.”

ప్రాణాపాయ స్థితిలో కూడా రక్తాన్ని ఉపయోగించకూడదని ఇరువర్గాలవారూ కుదుర్చుకున్న ఒప్పందం ఉనికిలో ఉందనడానికి రుజువు సరిపడినంతలేదని ఈ కేసులో కోర్టు విశ్వసించినప్పటికీ, అలాంటి ఒప్పందానికున్న చట్టబద్ధత విషయమై క్రింది కోర్టుకున్న అభిప్రాయంతో జడ్జీలు ఏకీభవించలేదని ఆసాహీ షీంబున్‌ అనే వార్తాపత్రిక సూచించింది: “ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్తమార్పిడి చేయకూడదనే విషయంలో బాగా ఆలోచించిన మీదటే ఇరు పక్షాలవారూ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే, దాన్ని ఈ కోర్టు పౌరభద్రతకు వ్యతిరేకమనీ, అందువల్ల అది చెల్లదనీ పరిగణించకూడదు.” అంతేగాక, “ప్రతీ మానవుడూ ఏదో ఒకరోజు చావక తప్పదు, మరణ గడియకు నడిపించే ఆ పద్ధతిని ఆ వ్యక్తిచే నిర్ణయించుకోబడవచ్చు” అన్న జడ్జీల దృక్కోణాన్ని ఆ వార్తాపత్రిక సూచించింది.

నిజానికి, యెహోవాసాక్షులు ఈ విషయాన్ని పరిశోధించి, తాము జీవించడానికి శ్రేష్ఠమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నామని ఒప్పించబడ్డారు. దాంట్లో రక్తమార్పిడుల మూలంగా రాబోయే అపాయాలను నిరాకరించడం, అనేక దేశాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్న, దేవుని చట్టాలకు అనుగుణంగా ఉన్న రక్తరహిత పద్ధతులను అనుమతించడం చేరివున్నాయి. (అపొస్తలుల కార్యములు 21:25) ప్రసిద్ధిగాంచిన రాజ్యాంగ న్యాయశాస్త్ర కోవిదుడైన ఒక జపనీస్‌ ప్రొఫెసర్‌ ఇలా సూచించాడు: “నిజానికి, ప్రశ్నించదగిన [రక్తమార్పిడి] చికిత్సను నిరాకరించడమనేది ‘ఎలా చచ్చిపోవాలనే’ విషయాన్ని ఎంపిక చేసుకునే విషయంగాక ‘ఎలా జీవించాలనే’ ఎంపిక చేసుకొనే విషయమై ఉంది.”

హైకోర్టు ఇచ్చిన తీర్పు, తమ వివేచనపై ఆధారపడి నిర్ణయం తీసుకునే హక్కులు కొంతమంది తలంచినంత విశాలమైనవి కావని వైద్యుల్ని అప్రమత్తులను చేయాలి. అప్పటికే స్థాపించబడిన నైతిక నిర్దేశకాలను కల్గివున్న అనేక హాస్పిటల్స్‌లో ఇది సత్ఫలితాల్ని ఇవ్వాలి. ఈ కోర్టు తీర్పు సాధారణంగా అందరి ఆమోదాన్నీ పొందినప్పటికీ, తమ చికిత్స విషయంలో నిర్ణయించుకునే హక్కు అస్సల్లేని రోగులకు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ఇది అన్ని వర్గాలవారూ దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించబడుతున్న ఆ ఆసుపత్రీ, ఆ ముగ్గురు వైద్యులూ ఆ కేసును సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. కాబట్టి, విశ్వ సర్వాధిపతి చేసినట్లుగానే, జపాన్‌లోని అత్యున్నత న్యాయస్థానం కూడా రోగుల హక్కులను సమర్థిస్తుందో లేదో చూడ్డానికి మనం వేచి ఉందాము.

[అధస్సూచీలు]

a చట్టపరంగా అనిర్వచనీయమైన ఒక భావన. దాని భావాన్ని వివరించి, అన్వయించే బాధ్యత మెజిస్ట్రేట్‌కు విడిచిపెట్టబడింది.

b అది టోకుగావా కాలంనాటి భూస్వాములు తమ ప్రజలను ఎలా పరిపాలించాలన్న విషయానికి సంబంధించిన నీతి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి