కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/15 పేజీలు 15-20
  • ఇదే రక్షణ దినం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇదే రక్షణ దినం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మనుష్యులను ప్రేరేపిస్తూ వచ్చాం’
  • క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుందా?
  • ‘దేవునితో సమాధానపడండి’
  • “మిక్కిలి అనుకూలమైన సమయము”
  • ‘దేవుడి పరిచారకులుగా మనల్ని మనం సిఫారసు చేసుకోవడం’
  • యెహోవా ఇచ్చే రక్షణలో నమ్మకం ఉంచండి
  • “ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు విశ్వాసముగలవారైయున్నారో లేదో పరీక్షించుకొనుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/15 పేజీలు 15-20

ఇదే రక్షణ దినం!

“ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.”—2 కొరింథీయులు 6:2.

1. దేవుడి ఎదుటా, క్రీస్తు ఎదుటా అంగీకృతమైన స్థానం మనకుండాలంటే ఏవి అవసరం?

మానవజాతికి తీర్పు తీర్చేందుకు యెహోవా ఒక రోజును నిర్ణయించాడు. (అపొస్తలుల కార్యములు 17:31) అది మనకు రక్షణ దినంగా ఉండాలంటే, ఆయన ఎదుటా, ఆయన నియమించిన న్యాయాధిపతియైన యేసుక్రీస్తు ఎదుటా అంగీకృతమైన స్థానం మనకుండాలి. (యోహాను 5:22, 23) మనకు అలాంటి స్థానం ఉండాలంటే, దేవుడి వాక్యానికి అనుగుణ్యంగా ఉండే ప్రవర్తనా, యేసు యొక్క నిజమైన శిష్యులుగా ఉండేందుకు ఇతరులకు సహాయం చేయాలని మనల్ని పురికొల్పే విశ్వాసమూ అవసరం.

2. భూమిమీద ఉన్న మానవులందరూ దేవుడి నుండి ఎందుకు వేరైపోయారు?

2 వారసత్వంగా వచ్చిన పాపం కారణంగా, మానవజాతి దేవుడి నుండి వేరై పోయింది. (రోమీయులు 5:12; ఎఫెసీయులు 4:17, 18) కనుక, మనం ఎవరికైతే బోధిస్తున్నామో వాళ్ళు ఆయనతో సమాధానపడితేనే వాళ్ళు రక్షణను పొందగల్గుతారు. అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు దీనిని స్పష్టం చేశాడు. పౌలు తీర్పును గురించీ, దేవుడితో సమాధానపడడం గురించీ, రక్షణను గురించీ ఏమి మాట్లాడాడో చూసేందుకు 2 కొరింథీయులు 5:10–6:10 పరిశీలిద్దాం.

‘మనుష్యులను ప్రేరేపిస్తూ వచ్చాం’

3. పౌలు ఎలా ‘మనుష్యులను ప్రేరేపిస్తూ వచ్చాడు,’ నేడు మనమెందుకు అలా చేయాలి?

3 “తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము” అని పౌలు వ్రాసినప్పుడు, బోధించడంతో తీర్పును ముడిపెట్టాడు. (2 కొరింథీయులు 5:10, 11) అపొస్తలుడు సువార్తను బోధించడం ద్వారా, ‘మనుష్యులను ప్రేరేపిస్తూ వచ్చాడు.’ మన విషయమేమిటి? మనం ఈ విధానాంతాన్ని ఎదుర్కోబోతున్నాం గనుక, యేసు యొక్క అనుకూలమైన తీర్పునూ, రక్షణకు మూలమైన యెహోవా దేవుడి అంగీకారాన్నీ తాము పొందేందుకు అవసరమైన చర్యలను తీసుకొమ్మని ఇతరులను ప్రేరేపించేందుకు మనకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నించాలి.

4, 5. (ఎ) యెహోవా సేవలో మనం సాధించిన కార్యాల విషయమై మనమెందుకు గొప్పలు చెప్పుకోకూడదు? (బి) పౌలు “దేవుని నిమిత్తమే” అతిశయపడ్డాడని ఎలా చెప్పవచ్చు?

4 దేవుడు మన పరిచర్యను ఆశీర్వదించినప్పటికీ, మనం గొప్పలు చెప్పుకోకూడదు. కొరింథులో కొందరు, తమ విషయమై తాము, లేదా ఇతరుల విషయమై గర్వంతో విఱ్ఱవీగారు. అలా, సంఘంలో విభజనలకు కారణమయ్యారు. (1 కొరింథీయులు 1:10-13; 3:3, 4) ఈ పరిస్థితిని సూచిస్తూ, “మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుటలేదు [“సిఫారసు చేసుకోవడం లేదు,” NW] గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెఱ్ఱివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే” అని పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 5:12, 13) అహంకారులు సంఘం యొక్క ఐక్యత విషయంలోనూ, ఆధ్యాత్మిక క్షేమం విషయంలోనూ ఆసక్తి చూపించలేదు. తోటి క్రైస్తవులు దేవుడి ఎదుట సహృదయాలను పెంపొందించుకునేందుకు సహాయపడే బదులు బాహ్యరూపాల విషయమై గొప్పలు చెప్పుకోవాలనే వాళ్ళు చూశారు. అలా, సంఘాన్ని గద్దించి, తర్వాత, “అతిశయంచువాడు ప్రభువునందే అతిశయంపవలెను” అని పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 10:17.

5 పౌలు తన గురించి తాను గొప్ప చెప్పుకోలేదా? అపొస్తలుడుగా తన స్థానాన్ని గురించి ఆయన చెప్పుకున్న దాన్నిబట్టి, కొందరు అలా తలంచివుండవచ్చు. ఆయన “దేవుని నిమిత్తమే” అతిశయపడవలసి వచ్చింది. ఆ కొరింథీయులు యెహోవాను విడిచిపెట్టకుండా ఉండేందుకు, తను అపొస్తలుడని నమ్మదగిన ఆధారాల విషయమై ఆయన ప్రశంసాపూర్వకంగా మాట్లాడాడు. వాళ్ళను దేవుడివైపుకు తిరిగి తీసుకువచ్చేందుకే పౌలు అలా చేశాడు. ఎందుకంటే, అప్పట్లో, అబద్ధ అపొస్తలులు వారిని తప్పుడు దిశలోకి మళ్ళిస్తున్నారు. (2 కొరింథీయులు 11:16-21; 12:11, 12, 19-21; 13:10) అయితే, పౌలు తాను సాధించిన కార్యాలను ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళను ముగ్ధులను చేయాలని ఎడతెగక ప్రయత్నించలేదు.—సామెతలు 21:4.

క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుందా?

6. క్రీస్తు ప్రేమ మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

6 నిజమైన అపొస్తలుడుగా, పౌలు ఇతరులకు యేసు క్రయధన బలి గురించి వివరంగా తెలియజేశాడు. అది పౌలు జీవితంపై ప్రభావం చూపింది. అందుకే, “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయంచు కొనుచున్నాము” అని ఆయన వ్రాశాడు. (2 కొరింథీయులు 5:14, 15) యేసు మనకోసం తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా ఎంతటి ప్రేమను కనబరచాడు! తప్పకుండా అది మన జీవితంలో బలవంతపెట్టే ప్రేరకం అయ్యుండాలి. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చినందుకు మనకు యేసు ఎడల గల కృతజ్ఞతా భావం, యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు ద్వారా ప్రధానం చేసిన రక్షణను గూర్చిన సువార్తను ప్రకటించడంలో మనం ఆసక్తిగా క్రియాశీలంగా ఉండేందుకు మనలను పురికొల్పాలి. (యోహాను 3:16; పోల్చండి కీర్తన 96:2.) రాజ్యాన్ని ప్రకటించి, శిష్యులను తయారు చేసే పనిలో ఆసక్తిగా భాగం వహించేందుకు “క్రీస్తు ప్రేమ” మిమ్మల్ని బలవంతపెడుతుందా?—మత్తయి 28:19, 20.

7. ‘శరీరరీతిగా ఎవనినైనను ఎరుగరు’ అంటే ఏమిటి అర్థం?

7 క్రీస్తు తమ కోసం చేసిన దాని విషయమై తమకు గల కృతజ్ఞతా భావాన్ని తెలియజేసేలా తమ జీవితాలను ఉపయోగించడం ద్వారా, అభిషిక్త క్రైస్తవులు ‘ఇక మీదట తమకొరకు కాక, ఆయన కొరకే జీవిస్తారు.’ “కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము” అని పౌలు అన్నాడు. (2 కొరింథీయులు 5:16) క్రైస్తవులు అన్యులకన్నా ఎక్కువగా యూదులపైనా, బీదవాళ్ళ కన్నా ఎక్కువగా ధనికులపైనా మక్కువను చూపించడంలాంటివి చేస్తూ, వ్యక్తులను శారీరకమైన విధంగా దృష్టించకుండా ఉండడం తప్పనిసరి. అభిషిక్త క్రైస్తవులు ‘శరీరరీతిగా ఎవనినైనను ఎరుగరు.’ ఎందుకంటే, తమ తోటి విశ్వాసులతో తమకుండే ఆధ్యాత్మిక సంబంధమే వారికి ముఖ్యం. “క్రీస్తును శరీరరీతిగా ఎరిగి”యున్నది యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనను చూసినవారు మాత్రమే కాదు. కొందరు మెస్సీయ కోసం నిరీక్షిస్తూ క్రీస్తును ఒకప్పుడు శారీరక దృష్టితో చూసినప్పటికీ, వారు తర్వాత ఇక ఎంత మాత్రమూ అలా దృష్టించకూడదు. ఆయన తన శరీరాన్ని క్రయధనంగా ఇచ్చి, జీవాన్నిచ్చే ఆత్మగా పునరుత్థానం చేయబడ్డాడు. పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడే ఇతరులు యేసుక్రీస్తును శారీరకంగా ఎన్నడూ చూడకుండానే తమ భౌతిక శరీరాలను వదిలిపెడతారు.—1 కొరింథీయులు 15:45, 50; 2 కొరింథీయులు 5:1-5.

8. వ్యక్తులు ఎలా “క్రీస్తునందున్న”వారిగా అయ్యారు?

8 అభిషక్తులనే ఉద్దేశిస్తూ, “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” అని కూడా పౌలు అన్నాడు. (2 కొరింథీయులు 5:17) “క్రీస్తునందున్న” అంటే, ఆయనయందు ఏకమైయుండు అని అర్థం. (యోహాను 17:20) యెహోవా ఒక వ్యక్తిని తన కుమారునివైపుకు ఆకర్షించి, అతనికి పరిశుద్ధాత్మతో జన్మనిచ్చినప్పుడు ఇలాంటి సంబంధం అస్తిత్వంలోకి వచ్చింది. ఆ వ్యక్తి దేవుడి ఆత్మజనిత కుమారుడిగా, ఆయన పరలోక రాజ్యంలో క్రీస్తుతో భాగస్వామ్యం వహించే ఉత్తరాపేక్ష గల “నూతన సృష్టి” అయ్యాడు. (యోహాను 3:3-8; 6:44; గలతీయులు 4:6, 7) అలాంటి అభిషిక్త క్రైస్తవులకు చాలా గొప్ప సేవాధిక్యత ఇవ్వబడింది.

‘దేవునితో సమాధానపడండి’

9. దేవుడితో సమాధానపడడాన్ని సాధ్యం చేసేందుకు ఆయన ఏమి చేశాడు?

9 యెహోవా “నూతన సృష్టి” మీద ఎంత ప్రీతి చూపించాడు! “సమస్తమును దేవునివలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.” (2 కొరింథీయులు 5:18, 19) ఆదాము పాపం చేసినప్పటి నుండి మానవజాతి దేవుడి నుండి వేరైపోయింది. కానీ, యేసు బలి ద్వారా సమాధానపడే మార్గాన్ని తెరిచేందుకు యెహోవా ప్రేమపూర్వకంగా చొరవ తీసుకున్నాడు.—రోమీయులు 5:6-12.

10. సమాధానపర్చే పరిచర్యను యెహోవా ఎవరికి అప్పగించాడు, వాళ్ళు దానిని నెరవేర్చేందుకు ఏమి చేశారు?

10 యెహోవా సమాధానపరచే పరిచర్యను అభిషిక్తులకు అప్పగించాడు. అందుకే పౌలు ఇలా చెప్పగలిగాడు: “కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై—దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.” (2 కొరింథీయులు 5:20) ప్రాచీన కాలాల్లో, ముఖ్యంగా శత్రుత్వమున్న కాలాల్లో, యుద్ధాలను నివారించే అవకాశమేమైనా ఉందా అని తెలుసుకునేందుకు రాయబారులను పంపేవారు. (లూకా 14:31, 32) పాపభరితమైన మానవజాతి దేవుడి నుండి వేరైపోయింది మొదలుకొని, ఆయన తన సమాధాన నిబంధనలను ప్రజలకు తెలిపేందుకు అభిషిక్త రాయబారులను పంపాడు. అభిషిక్తులు క్రీస్తు ప్రతినిధులుగా ‘దేవునితో సమాధానపడండి’ అని కోరుతున్నారు. దేవుడితో సమాధానపడేందుకూ, క్రీస్తు ద్వారా ఆయన సాధ్యం చేసే రక్షణను అంగీకరించేందుకు ప్రయత్నించమని కోరుతున్న కరుణతో కూడిన విజ్ఞప్తి ఇది.

11. చివరికి ఎవరు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుడి ఎదుట నీతిమంతులు అనే స్థానాన్ని పొందుతారు?

11 విమోచన క్రయధనంలో విశ్వాసాన్ని అభ్యసించే మానవులందరూ, దేవుడితో సమాధానపడగలరు. (యోహాను 3:36) “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను [యేసును] మన కోసము [యెహోవా] పాపముగా చేసెను” అని పౌలు అంటున్నాడు. (2 కొరింథీయులు 5:21) మానవులందరినీ స్వభావసిద్ధంగా ఉన్న పాపం నుండి విడుదల చేసేందుకు పరిపూర్ణుడైన మానవుడైన యేసు పాప పరిహార బలి అయ్యాడు. వాళ్ళు యేసు ద్వారా “దేవుని నీతి” అవుతారు. ఈ నీతి లేదా, దేవుడి ఎదుట నీతియుక్తమైన స్థానం మొదట 1,44,000 మంది క్రీస్తు సహవారసులకు వస్తుంది. ఆయన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, పరిపూర్ణ మానవులుగా నీతియుక్తమైన స్థానం, నిత్యతండ్రియైన యేసు క్రీస్తు యొక్క భూమి మీద ఉన్న పిల్లలకు వస్తుంది. ఆయన వాళ్ళను పరిపూర్ణతలో నీతియుక్తమైన స్థానానికి తీసుకువస్తాడు, అలా వాళ్ళు దేవుడికి నమ్మకస్తులని నిరూపించుకుని, నిత్యజీవమనే బహుమానాన్ని పొందవచ్చు.—యెషయా 9:6; ప్రకటన 14:1; 20:4-6, 11-15.

“మిక్కిలి అనుకూలమైన సమయము”

12. యెహోవా రాయబారులు, ఉపరాయబారులూ ఏ ప్రాముఖ్యమైన పరిచర్యను నెరవేరుస్తున్నారు?

12 రక్షణ కావాలంటే, “కాగా మేమాయన [యెహోవా] తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను [“అనర్హదయను,” NW] వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.—అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” అని పౌలు చెప్పిన మాటలకు అనుగుణ్యంగా మనం ప్రవర్తించడం తప్పనిసరి. (2 కొరింథీయులు 6:1, 2) యెహోవా అభిషిక్త రాయబారులూ, “వేరే గొఱ్ఱెల”కు చెందినవారైన ఆయన ఉప రాయబారులూ తమ పరలోక తండ్రి చూపిన అనర్హదయను స్వీకరించి, దాని అసలు ఉద్దేశాన్ని తప్పిపోరు. (యోహాను 10:16) ఈ “అనుకూలమైన సమయము”లో నీతివంతమైన తమ ప్రవర్తన ద్వారా ఆసక్తిగా పరిచర్య చేయడం ద్వారా, వాళ్ళు దైవిక అనుగ్రహాన్ని పొందడానికి కృషి చేస్తున్నారు, “ఇదే రక్షణ దినము” అని భూనివాసులందరికీ తెలియజేస్తున్నారు.

13. యెషయా 49:8లోని సారాంశం ఏమిటి, అది మొదటిసారి ఎలా నెరవేరింది?

13 “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—అనుకూలసమయమందు [“కరుణించు సమయము,” క్యాథలిక్‌ అనువాదము] నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింబడినవారితోను—బయటికి రండి అని చీకటిలోనున్నవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని” అన్న యెషయా 49:8లోని మాటలను పౌలు ఉటంకిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం బబులోను దాసత్వం నుండి విముక్తులై, తర్వాత, పాడుచేయబడిన తమ స్వదేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు ఈ ప్రవచనం మొదటి సారిగా నెరవేరింది.—యెషయా 49:3, 9.

14. యెషయా 49:8 యేసు విషయంలో ఎలా నెరవేరింది?

14 యెషయా ప్రవచనపు తర్వాతి నెరవేర్పుగా, ‘భూదిగంతములవరకు, [దేవుడు] కలుగజేయు రక్షణ సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు’ తన ‘సేవకుడు’ అయిన యేసును యెహోవా ఇచ్చాడు. (యెషయా 49:6, 8; పోల్చండి యెషయా 42:1-4, 6, 7; మత్తయి 12:18-21.) “కరుణించు సమయము” లేదా “అనుకూల సమయము” యేసుకు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్వయించబడిందన్నది స్పష్టం. ఆయన ప్రార్థించాడు, దేవుడు ఆయనకు ‘ఉత్తరమిచ్చాడు.’ యేసు, తన పరిపూర్ణ యథార్థతను నిలబెట్టుకుని, తద్వారా “తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను” గనుక, ఆ దినము ఆయనకు “రక్షణ దినము”గా నిరూపించబడింది.—హెబ్రీయులు 5:7, 9; యోహాను 12:27, 28.

15. ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు దేవుడి అనర్హదయకు యోగ్యులుగా నిరూపించుకునేందుకు ఎప్పటి నుండి శ్రమించారు, ఏ లక్ష్యంతో?

15 యెషయా 49:8ని అభిషిక్త క్రైస్తవులకు అన్వయిస్తూ, “అనుకూల సమయము”లో, ఆయన ఇచ్చే “రక్షణ దినము”లో ఆయన కరుణను సంపాదించడంలో పరాజితులవ్వడం ద్వారా, ‘దేవుని కృపను [అనర్హదయను] వ్యర్థము చేసికొనవద్దని’ పౌలు వారికి విజ్ఞప్తి చేసుకున్నాడు. “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” అని కూడా పౌలు అన్నాడు. (2 కొరింథీయులు 6:2) ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు “అనుకూల సమయము” తమకు “రక్షణ దినము”గా ఉండేందుకుగాను, తాము దేవుడి అనర్హదయకు యోగ్యులుగా నిరూపించుకునేందుకు పెంతెకొస్తు సా.శ. 33 మొదలుకొని శ్రమించారు.

‘దేవుడి పరిచారకులుగా మనల్ని మనం సిఫారసు చేసుకోవడం’

16. ఓర్పును పరీక్షించే ఎలాంటి పరిస్థితుల్లో, పౌలు తనను తాను దేవుడి పరిచారకుడుగా సిఫారసు చేసుకున్నాడు?

16 క్రైస్తవ సంఘంతో సహవసించిన కొందరు వ్యక్తులు దేవుడి అనర్హదయకు తాము యోగ్యులమని నిరూపించుకోలేదు. పౌలు “ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయ”కుండా ఉన్నప్పటికీ, వాళ్ళు పౌలుకున్న అపొస్తలత్వపు అధికారాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తూ, ఆయనపై అపవాదులను మోపారు. ఆయన ‘శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, దెబ్బల్లోనూ, చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను ఎంతో ఓర్పుగలవాడై’ ఉండడం ద్వారా ఎంతో నిశ్చయతతో తనను తాను దేవుడి పరిచారకుడుగా సిఫారసు చేసుకున్నాడు. (2 కొరింథీయులు 6:3-5) తర్వాత, తాను ఖైదులను, దెబ్బలను, అపాయాలనూ, లేమిలను అనుభవించాడు గనుక, తన వ్యతిరేకులు పరిచారకులైతే, తాను “మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను” అని తర్కించాడు.—2 కొరింథీయులు 11:23-27.

17. (ఎ) ఎలాంటి గుణాలను ప్రదర్శించడం ద్వారా మనల్ని మనం దేవుడి పరిచారకులుగా సిఫారసు చేసుకోవచ్చు? (బి) “నీతి ఆయుధములు” ఏవి?

17 పౌలువలె, ఆయన సహచరులవలె, మనల్ని మనం దేవుడి పరిచారకులుగా సిఫారసు చేసుకోవచ్చు. ఎలా? “పవిత్రతతోనూ” లేదా నిర్మలతతోనూ, ఖచ్చితమైన బైబిలు జ్ఞానానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం ద్వారానూ మనల్ని మనం అలా సిఫారసు చేసుకోవచ్చు. మనం తప్పిదాలను లేదా రెచ్చగొట్టే ప్రవర్తనను “దీర్ఘశాంతముతో,” ఓపికగా సహించడం ద్వారా, ఇతరులకు సహాయకరంగా ఉండే విషయాలను చేస్తూ “దయతో” ఉండడం ద్వారా మనల్ని మనం సిఫారసు చేసుకోగలం. అంతేకాక, మనం పరిచారకులుగా దేవుడి ఆత్మ నడిపింపును అంగీకరిస్తూ, “నిష్కపటమైన ప్రేమ”ను కనబరుస్తూ, నిజాయితీగా మాట్లాడుతూ, పరిచర్యను కొనసాగించే శక్తి కోసం ఆయనపై ఆధారపడుతూ మనల్ని మనం దేవుడి పరిచారకులముగా సిఫారసు చేసుకోవచ్చు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, “కుడియెడమల నీతి ఆయుధముల” ద్వారా పౌలు కూడా పరిచారకుడిగా తన హోదాను నిరూపించుకున్నాడు. ప్రాచీనకాల యుద్ధాల్లో, కుడి చేతితో సాధారణంగా కత్తిని, ఎడమ చేతితో డాలును పట్టుకునేవారు. అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో పౌలు పాపభరితమైన శారీరక ఆయుధాలను—మోసమూ, కుతంత్రాలు, వంచనను—ఉపయోగించలేదు. (2 కొరింథీయులు 6:6, 7; 11:12-14; సామెతలు 3:32) సత్యారాధనను విస్తృతపర్చేందుకు ఆయన నీతివంతమైన “ఆయుధములను” లేదా మాధ్యమాలను ఉపయోగించాడు. మనం కూడా అలాగే చేయాలి.

18. మనం దేవుడి పరిచారకులమైతే, మనం ఎలా ప్రవర్తిస్తాం?

18 మనం దేవుడి పరిచారకులమైతే, పౌలూ, ఆయన జతపనివారూ ప్రవర్తించినట్లే, మనమూ ప్రవర్తిస్తాం. మనం గౌరవించబడినా, అవమానించబడినా క్రైస్తవుల్లాగే ప్రవర్తిస్తాం. మనల్ని గురించిన ప్రతికూలమైన నివేదికలు మన ప్రకటనా పనిని ఆపలేవు, లేదా అనుకూలంగా నివేదించబడినప్పుడు, అహంకరించం. మనం సత్యం మాట్లాడుతాం, అలా మనం దైవిక క్రియలకు గుర్తింపును పొందవచ్చు. మనం శత్రువుల ముట్టడి క్రింద ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, మనం యెహోవాయందు నమ్మకం ఉంచుతాం. మనం క్రమశిక్షణను కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరిస్తాం.—2 కొరింథీయులు 6:8, 10ఎ.

19. ఆధ్యాత్మికంగా ‘అనేకులను ఐశ్వర్యవంతులను చేయడం’ ఎలా సాధ్యం?

19 సమాధానపర్చే పరిచర్య గురించిన తన చర్చను ముగిస్తూ, పౌలు తన గురించీ, తన సహవాసుల గురించీ, “దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము” అని చెప్పాడు. (2 కొరింథీయులు 6:10బి) ఆ పరిచారకులు తాము పడిన కష్టాల విషయమై బాధపడేందుకు కారణమున్నప్పటికీ, వారి హృదయాంతరంలో ఆనందమే ఉండేది. వాళ్ళు భౌతికంగా బీదవాళ్ళే. కాని వాళ్ళు ఆధ్యాత్మికంగా ‘అనేకులను ఐశ్వర్యవంతులను చేశారు.’ వాస్తవానికి, వాళ్ళ విశ్వాసం ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను—దేవుడి పరలోక కుమారులయ్యే ఉత్తరాపేక్షను సహితం—తెచ్చింది గనుక, వాళ్ళు ‘సమస్తమును కలిగినవారయ్యారు.’ వాళ్ళు క్రైస్తవ పరిచారకులుగా ఐశ్వర్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించారు. (అపొస్తలుల కార్యములు 20:35) వాళ్ళలాగే, సమాధానపర్చే పరిచర్యలో ఇప్పుడే—ఈ రక్షణ దినంలోనే—పాల్గొనడం ద్వారా మనం ‘అనేకులను ఐశ్వర్యవంతులముగా’ చేయగలం!

యెహోవా ఇచ్చే రక్షణలో నమ్మకం ఉంచండి

20. (ఎ) పౌలు హృదయపూర్వకంగా కోరుకున్నదేమిటి, అప్పట్లో వృథా చేయడానికి ఏ మాత్రం సమయం లేకుండా పోయింది ఎందుకని? (బి) మనం ఇప్పుడు నివసిస్తున్న రక్షణ దినాన్ని ఏది సూచిస్తుంది?

20 సా.శ. 55లో పౌలు కొరింథీయులకు రెండవ లేఖ వ్రాసినప్పుడు, యూదా విధానానికి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే శేషించి ఉన్నాయి. యూదులూ, అన్యులూ క్రీస్తు ద్వారా దేవుడితో సమాధానపడాలని ఈ అపొస్తలుడు హృదయపూర్వకంగా కోరుకున్నాడు. అది రక్షణ దినం. అప్పుడు వృథా చేయడానికి ఏ మాత్రం సమయం లేదు. 1914 నుండి, మనం దానికి సాదృశ్యమైన విధానాంతంలో ఉంటున్నాం. పురోగమన పథంలో ఉన్న భూగోళవ్యాప్త రాజ్య ప్రకటనాపని రక్షణ దినం ఇదేనని చూపిస్తుంది.

21. (ఎ) 1999 వార్షిక వచనానికి ఏ వాక్యం ఎంపిక చేయబడింది? (బి) ఈ రక్షణ దినంలో మనం ఏమి చేస్తుండాలి?

21 అన్ని దేశాల్లోని ప్రజలూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన రక్షణ ఏర్పాటును గురించి వినవలసిన అవసరం ఉంది. ఆలస్యం చేయడానికి ఇక ఏ మాత్రం సమయం లేదు. “ఇదిగో ఇదే రక్షణ దినము” అని పౌలు వ్రాశాడు. 2 కొరింథీయులు 6:2లోని ఆ మాటలే యెహోవాసాక్షుల 1999 వార్షికవచనం. యెరూషలేముకూ, అందులోని ఆలయానికీ జరిగిన నాశనానికన్నా ఎంతో ఘోరమైనదానినే మనం ఎదుర్కోబోతున్నాం గనుక, ఈ వాక్యం ఎంత సముచితమైనది! భూమి మీది ప్రతి ఒక్కరూ ఇమిడి ఉండే మొత్తం విధానపు అంతం మన ముందుంది. రేపు కాదు ఇప్పుడే చర్య తీసుకోవలసిన సమయం. రక్షణ యెహోవా నుండి వస్తుంది అని మనం నమ్మితే, మనం ఆయనను ప్రేమిస్తే, మనం అనంతకాల జీవితాన్ని విలువైనదిగా ఎంచుతున్నట్లయితే, మనం దేవుడు చూపే అనర్హదయ యొక్క ఉద్దేశాన్ని వ్యర్థం చేసుకోం. యెహోవాకు ఘనతనివ్వాలనే హృదయపూర్వక కోరికతో మనం, “ఇదిగో ఇదే రక్షణ దినము” అని అన్నామంటే, మనం నిజంగానే అలా అనుకుంటున్నామని మన మాటల ద్వారా, క్రియల ద్వారా నిరూపిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

◻ దేవుడితో సమాధానపడడం ఎందుకంత ప్రాముఖ్యం?

◻ సమాధానపర్చే పరిచర్యలో నిమగ్నమైవున్న రాయబారులు, ఉపరాయబారులు ఎవరు?

◻ దేవుడి పరిచారకులుగా మనల్ని మనం ఎలా సిఫారసు చేసుకోవచ్చు?

◻ యెహోవాసాక్షుల 1999 వార్షిక వచనం మీకు ఏ భావాన్నిస్తుంది?

[17వ పేజీలోని చిత్రాలు]

పౌలులా, మీరు ఆసక్తిగా బోధిస్తున్నారా, ఇతరులు దేవుడితో సమాధానపడేందుకు సహాయపడుతున్నారా?

అమెరికా

ఫ్రాన్స్‌

కోటీ డీఐవరీ

[18వ పేజీలోని చిత్రం]

ఈ రక్షణ దినంలో, యెహోవాదేవుడితో సమాధానపడుతున్న అనేకులలో మీరూ ఉన్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి