రక్షణ యెహోవాది
“దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు [“రక్షణ కార్యాలు చేసే,” NW] దేవుడై యున్నాడు.”—కీర్తన 68:20.
1, 2. (ఎ) రక్షణకు మూలం యెహోవా అని మనం ఎందుకు చెప్పవచ్చు? (బి) సామెతలు 21:31ని మీరు ఎలా వివరిస్తారు?
యెహోవా తనను ప్రేమించే వారి రక్షకుడైయున్నాడు. (యెషయా 43:11) ఇశ్రాయేలీయుల ప్రఖ్యాత రాజైన దావీదుకు తన వ్యక్తిగత అనుభవం నుండి ఆ విషయం తెలుసు, అందుకే ఆయన, “రక్షణ యెహోవాది” అని హృదయపూర్వకంగా పాడాడు. (కీర్తన 3:8) ప్రవక్తయైన యోనా పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు పట్టుదలతో చేసిన తన ప్రార్థనలో ఇంచుమించు అవే పదాలను ఉపయోగించాడు.—యోనా 2:9.
2 రక్షణకు మూలం యెహోవాయేనని దావీదు కుమారుడైన సొలొమోనుకు కూడా తెలుసు, అందుకే ఆయనిలా అన్నాడు: “యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.” (సామెతలు 21:31) ప్రాచీన మధ్య ప్రాచ్యంలో, దున్నడానికి ఎద్దులను, బరువులు మోయడానికి గాడిదలను, మనుష్యులు సవారీ చేయడానికి కంచెర గాడిదలను, యుద్ధాల్లో గుఱ్ఱాలను ఉపయోగించేవారు. అయితే, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించక ముందు, వారి భవిష్యత్ రాజు “గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు” అని దేవుడు ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 17:16) యుద్ధ గుఱ్ఱాలు అవసరం లేదు ఎందుకంటే, యెహోవాయే తన ప్రజలను రక్షిస్తాడు.
3. ఏ ప్రశ్నలు మనం పరిశీలించదగినవి?
3 సర్వోన్నత ప్రభువైన యెహోవా “పూర్ణరక్షణ కలుగజేయు [“రక్షణ కార్యాలు చేసే,” NW] దేవుడై యున్నాడు.” (కీర్తన 68:20) ఎంత ప్రోత్సాహకరమైన తలంపు! మరి యెహోవా ఏ “రక్షణ కార్యాలు” చేశాడు? ఆయన ఎవరిని రక్షించాడు?
యెహోవా నీతిమంతులను రక్షిస్తాడు
4. యెహోవా తన భక్తులను కాపాడతాడని మనకెలా తెలుసు?
4 దేవుని సమర్పిత సేవకులుగా నీతియుక్తమైన మార్గాన్ని అవలంభిస్తున్న వారందరూ, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, . . . శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు” అని వ్రాసిన అపొస్తలుడైన పేతురు మాటల నుండి ఓదార్పు పొందవచ్చు. ఆ విషయాన్ని నిరూపిస్తూ పేతురు, దేవుడు “పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అని చెబుతున్నాడు.—2 పేతురు 2:5, 9.
5. ఏ పరిస్థితుల్లో నోవహు ‘నీతిని ప్రకటించిన వానిగా’ సేవచేశాడు?
5 మీరు నోవహు కాలంనాటి పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకోండి. శరీరాలు దాల్చిన దయ్యాలు భూమిమీదున్నాయి. అవిధేయులైన ఈ దేవదూతల సంతానం ప్రజలను క్రూరంగా హింసించేవారు, “భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” (ఆదికాండము 6:1-12) అయినప్పటికీ, నోవహు యెహోవా సేవను విడిచిపెట్టేలా చేయబడిన ఒత్తిడికి లొంగిపోలేదు. బదులుగా, ఆయన ‘నీతిని ప్రకటించాడు.’ తమ జీవితకాలంలో దుష్టత్వం నిర్మూలించబడుతుందన్న విషయాన్ని ఎంతమాత్రం శంకించకుండా ఆయన, ఆయన కుటుంబం ఒక ఓడను నిర్మించారు. నోవహు విశ్వాసం ఆ లోకం మీద నేరస్థాపన చేస్తోంది. (హెబ్రీయులు 11:7) ప్రస్తుతదిన పరిస్థితులు నోవహు కాలంనాటి పరిస్థితులకు సమాంతరంగా ఉండి, వీటిని ఈ దుష్ట విధానానికి అంత్య దినాలుగా సూచిస్తున్నాయి. (మత్తయి 24:37-39; 2 తిమోతి 3:1-5) కాబట్టి, నోవహు వలె యెహోవా రక్షణ కోసం మీరు ఎదురు చూస్తుండగా దేవుని ప్రజలతోపాటు సేవ చేస్తూ నీతిని ప్రకటించేవారిగా మిమ్మల్ని మీరు నమ్మకమైనవారిగా నిరూపించుకుంటారా?
6. యెహోవా నీతిమంతులను రక్షిస్తాడని 2 పేతురు 2:7, 8 ఎలా నిరూపిస్తుంది?
6 యెహోవా నీతిమంతులను రక్షిస్తాడన్నదానికి పేతురు మరింత సాక్ష్యాధారాన్ని ఇస్తున్నాడు. అపొస్తలుడు ఇలా చెబుతున్నాడు: “[దేవుడు] దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.” (2 పేతురు 2:7, 8; ఆదికాండము 19:1-29) ఈ అంత్యదినాల్లో లక్షలాదిమందికి లైంగిక దుర్నీతే తమ జీవన విధానం అయిపోయింది. అనేకులు నేడు ‘కామ వికారయుక్తమైన నడవడి’ కల్గివున్నందుకు లోతువలె మీరూ ‘బహు బాధపడుతున్నారా’? అలా బాధపడుతూ నీతిని అనుసరిస్తుంటే, ఈ దుష్ట విధానం నాశనం చేయబడేటప్పుడు యెహోవా రక్షించే వారిలో మీరూ ఒకరై ఉండవచ్చు.
యెహోవా తన ప్రజలను వ్యతిరేకుల చేతుల్లో నుండి రక్షిస్తాడు
7. ఐగుప్తులో యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన విధానం, ఆయన తన ప్రజలను అణచివేత నుండి తప్పిస్తాడని ఎలా నిరూపిస్తుంది?
7 ఈ పాత విధానం ఉన్నంత వరకూ, యెహోవా సేవకులు హింసనూ, శత్రువుల అణచివేతను అనుభవిస్తారు. కాని అణచివేయబడిన తన ప్రజలను యెహోవా గతంలో రక్షించాడు గనుక ఆయన తమను కూడా విడిపిస్తాడని వారు దృఢనిశ్చయత కలిగివుండవచ్చు. మీరు మోషే కాలంనాటి ఐగుప్తీయుల చేతుల్లో అణచివేతను అనుభవిస్తున్న ఇశ్రాయేలీయుల్లో ఒకరిగా ఊహించుకోండి. (నిర్గమకాండము 1:1-14; 6:8) దేవుడు ఐగుప్తు మీదికి ఒక తెగులు తర్వాత మరొకటి రప్పించాడు. (నిర్గమకాండము 8:5–10:29) మరణకరమైన పదవ తెగులు ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్ని హతమార్చినప్పుడు, ఫరో ఇశ్రాయేలీయులు వెళ్లడానికి అనుమతిస్తాడు కాని తర్వాత తన సైన్యాన్ని వారి వెనుక పంపించి వారిని తరుముకొచ్చాడు. అయితే, త్వరలోనే ఆయన, ఆయన సైన్యం ఎఱ్ఱ సముద్రంలో నాశనమైపోయారు. (నిర్గమకాండము 14:23-28) మోషే ఇశ్రాయేలీయులతోపాటు ఈ పాట పాడుతూ ఉండగా మీరూ వారితో కలుస్తారు: “యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి. అగాధజలములు వారిని కప్పెను. వారు రాతివలె అడుగంటిపోయిరి.” (నిర్గమకాండము 15:3-5) ఈ అంత్య దినాల్లో, దేవుని ప్రజలను అణచివేసే వారందరికీ అలాంటి నాశనమే సంభస్తుంది.
8, 9. న్యాయాధిపతుల పుస్తకం నుండి, యెహోవా తన ప్రజలను అణచివేసే వారిచేతుల్లో నుండి వారిని రక్షిస్తాడని నిరూపించే ఒక ఉదాహరణను ఇవ్వండి.
8 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన చాలా సంవత్సరాల వరకు, న్యాయాధిపతులు వారి మధ్యన న్యాయం జరిగించారు. కొన్నిసార్లు ప్రజలు విదేశీ అణచివేతను అనుభవించినప్పటికీ, వారిని విడిపించడానికి దేవుడు నమ్మకమైన న్యాయాధిపతులను ఉపయోగించాడు. అలాగే మనమూ ‘శత్రువులు మనల్ని బాధింపగా నిట్టూర్పులు విడుస్తుండవచ్చు,’ యెహోవా తన నమ్మకమైన సేవకులవలె మనల్ని కూడా రక్షిస్తాడు. (న్యాయాధిపతులు 2:16-18; 3:9, 15) వాస్తవానికి, బైబిలు పుస్తకమైన న్యాయాధిపతులు దీని గురించీ, అలాగే దేవుడు తన నియమిత న్యాయాధిపతియైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించే గొప్ప రక్షణను గురించీ మనకు హామీ ఇస్తుంది.
9 న్యాయాధిపతియైన బారాకు దినాలకు వెళదాం. అబద్ధ ఆరాధన, దైవిక అనంగీకారం మూలంగా ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు కనాను రాజైన యాబీను కఠిన పరిపాలనను అనుభవించారు. కనానీయుల పెద్ద సైన్యానికి సీసెరా సేనాధిపతి. కాని, దేశ ప్రజల సంఖ్య దాదాపు నలభై లక్షలు అయినప్పటికీ, “ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యూటెయే గాని కనబడలేదు.” (న్యాయాధిపతులు 5:6-8) ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి యెహోవాకు మొరపెట్టుకున్నారు. ప్రవక్త్రియైన దెబోరా ద్వారా దేవుడు నిర్దేశించినట్లుగా, బారాకు 10,000 మందిని తాబోరు పర్వతం మీద సమావేశపర్చాడు, యెహోవా ఎత్తైన తాబోరు పర్వతం దిగువన ఉన్న లోయలో నుండి శత్రువులను పైకి రప్పించాడు. లోయ గుండా, ఎండిపోయిన కీషోను వాగు గుండా సీసెరా సైన్యాలు 900 ఇనుప రథాలు దద్దరిల్లజేసే భయంకరమైన శబ్దం చేస్తూ వస్తున్నాయి. కాని కుంభవృష్టి మూలంగా కీషోను వాగులోకి ప్రవాహ జలాలు పొర్లి పారాయి. బారాకు ఆయన మనుష్యులు కుంభవృష్టి కురుస్తుండగా తాబోరు పర్వతం మీది నుండి క్రిందికి దిగుతూ యెహోవా వెళ్లగ్రక్కిన ఆగ్రహ తీవ్రతను వారు చూశారు. భయంతో పారిపోతున్న కనానీయులను పట్టుకుని బారాకు మనుష్యులు ప్రతీ ఒక్కరినీ చంపారు, ఎవరూ తప్పించుకోలేకపోయారు. దేవునికి వ్యతిరేకంగా పోరాడాలని చూస్తున్న మన వ్యతిరేకులకు ఎంతటి హెచ్చరిక !—న్యాయాధిపతులు 4:3-16; 5:19-22.
10. దేవుడు తన ప్రస్తుత దిన సేవకులను అణచివేసే వారందరి చేతుల్లో నుండి రక్షిస్తాడని మనం ఎందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?
10 దైవభయం గల ఇశ్రాయేలీయులను యెహోవా కష్ట సమయంలో రక్షించినట్లుగానే తన ప్రస్తుత దిన సేవకులను తమ శత్రువులు పెట్టే బాధలన్నిటిలో నుండి కాపాడతాడు. (యెషయా 43:3; యిర్మీయా 14:8) దేవుడు దావీదును “తన శత్రువులందరి చేతిలోనుండి” తప్పించాడు. (2 సమూయేలు 22:1-3) కాబట్టి మనం యెహోవా ప్రజలుగా అణచివేయబడినా లేక హింసించబడినా, మనం ధైర్యంగా ఉందాము, ఎందుకంటే ఆయన మెస్సీయా రాజు మనల్ని అణచివేత నుండి విడిపిస్తాడు. అవును, “బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.” (కీర్తన 72:13, 14) వాస్తవానికి ఆ విమోచన ఎంతో దగ్గరలో ఉంది.
తనయందు నమ్మకం ఉంచే వారిని దేవుడు రక్షిస్తాడు
11. యౌవనుడైన దావీదు యెహోవాపై ఆధారపడడం విషయంలో ఏ మాదిరిని ఉంచాడు?
11 యెహోవా రక్షణను చూసేందుకు, మనం ధైర్యంగా ఆయన యందు నమ్మకముంచాలి. భారీకాయుడైన గొల్యాతును ఎదుర్కోవడానికి వెళ్లేటప్పుడు దావీదు ధైర్యంగా దేవుని మీద ఆధారపడ్డాడు. పొడుగరియైన ఫిలిష్తీయుడు యౌవనుడైన దావీదు ఎదుట నిలబడి ఉండగా, దావీదు ఇలా చెప్పడాన్ని ఊహించుకోండి: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యూ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే.” కొద్దిసేపటిలోనే గొల్యాతు చనిపోయాడు, ఫిలిష్తీయులు ఓడిపోయారు. స్పష్టంగా యెహోవా తన ప్రజలను రక్షించాడు.—1 సమూయేలు 17:45-54.
12. దావీదు యొక్క బలాఢ్యుడైన ఎలియాజరును జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?
12 హింసించే వారిని ఎదుర్కునేటప్పుడు, మనం ‘ధైర్యంగా ఉండి,’ దేవునియందు మరింత పూర్తిగా నమ్మకం ఉంచవలసిన అవసరం ఉంటుంది. (యెషయా 46:8-13; సామెతలు 3:5, 6) పస్దమ్మీము అనే స్థలంలో జరిగిన ఈ సంఘటనను గమనించండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయ సైనికుల ఎదుటి నుండి పారిపోయారు. దావీదు దగ్గరున్న ముగ్గురు విశేషమైన బలాఢ్యులలో ఒకరైన ఎలియాజరు భయపడలేదు. అతడు ఒక్కడే యవల చేనిలో నిలబడి ఖడ్గముతో ఫిలిష్తీయులను హతము చేశాడు. అలా ‘యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశాడు.’ (1 దినవృత్తాంతములు 11:12-14; 2 సమూయేలు 23:9, 10) మనం ఒక్కరమే ఒంటరిగా సైనిక సమూహంతో పోరాడాలని ఎవరూ అనుకోరు. అయినప్పటికీ, మనం కొన్నిసార్లు శత్రువుల ఒత్తిడిని ఒంటరిగా ఎదుర్కోవలసి రావచ్చు. రక్షణ కార్యాల దేవుడైన యెహోవా మీద మనం ప్రార్థనాపూర్వకంగా ఆధారపడతామా? మన తోటి విశ్వాసులను హింసించేవారికి అప్పగించకుండా ఉండేందుకు మనం ఆయన సహాయాన్ని తీసుకుంటామా?
యథార్థవంతులను యెహోవా రక్షిస్తాడు
13. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో దేవుని పట్ల గల తమ యథార్థతను కాపాడుకోవడం ఎందుకు కష్టమయ్యింది?
13 యెహోవా రక్షణను అనుభవించడానికి, మనం మూల్యంగా ఏమి చెల్లించవలసి వచ్చినప్పటికీ మనం మన యథార్థతను కాపాడుకోవాలి. ప్రాచీన కాలాలకు చెందిన దేవుని ప్రజలు అనేక శ్రమలను అనుభవించారు. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో మీరు జీవించివుంటే మీరు ఏమి ఎదుర్కోవలసి వచ్చేదో ఆలోచించండి. రెహబాము కఠినత్వం పది గోత్రాలు ఆయనకు మద్దతు నివ్వకుండా, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని ఏర్పరచుకొనేలా చేసింది. (2 దినవృత్తాంతములు 10:16, 17; 11:13, 14) దాని అనేకమంది రాజుల్లో, యెహూ చాలా శ్రేష్ఠుడు, కాని ఆయన కూడా ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించలేదు.’ (2 రాజులు 10:30, 31) అయినప్పటికీ, పది గోత్రాల రాజ్యంలో కూడా యథార్థవంతులు ఉన్నారు. (1 రాజులు 19:18) వారు దేవునియందు విశ్వాసముంచారు, ఆయన తాను వారితో ఉన్నట్లు నిరూపించుకున్నాడు. మీకు విశ్వాస పరీక్షలు ఎదురైనప్పటికీ, యెహోవా పట్ల మీకుగల యథార్థతను మీరు కాపాడుకుంటున్నారా?
14. రాజైన హిజ్కియా కాలంలో యెహోవా ఏ రక్షణను కలుగజేశాడు, బబులోనీయులు యూదయను జయించడానికి ఏది కారణమయ్యింది?
14 దేవుని ధర్మశాస్త్రం పట్ల సర్వత్రా ఉన్న అలక్ష్యం ఇశ్రాయేలు రాజ్యానికి నాశనాన్ని తెచ్చింది. సా.శ.పూ. 740లో అష్షూరీయులు దాన్ని జయించినప్పుడు, దాని పది గోత్రాలకు చెందిన వ్యక్తులు యెహోవాను ఆయన ఆలయంలో ఆరాధించగలిగేలా రెండు గోత్రాల రాజ్యమైన యూదయకు పారిపోయి ఉంటారనడంలో సందేహం లేదు. దావీదు వంశానికి చెందిన 19 మంది యూదా రాజులలో నలుగురైన ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, హోషేయా దేవుని పట్ల తమకుగల భక్తి విషయంలో చాలా విశేషమైనవారిగా ఉన్నారు. యథార్థవంతుడైన హిజ్కియా కాలంలో, అష్షూరీయులు చాలా శక్తివంతమైన సైన్యంతో యూదా మీదికి వచ్చారు. హిజ్కియా చేసిన విజ్ఞాపనలకు జవాబుగా, ఒక్కరాత్రిలో 1,85,000 మంది అష్షూరీయులను చంపడానికి దేవుడు కేవలం ఒకే ఒక్క దేవదూతను ఉపయోగించి, తద్వారా తన ఆరాధకులకు రక్షణను అనుగ్రహించాడు! (యెషయా 37:36-38) తర్వాత, ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం, దేవుని ప్రవక్తల హెచ్చరికలను వినకపోవడం బబులోనీయులు సా.శ.పూ. 607లో యూదాను స్వాధీనం చేసుకుని, దాని రాజధానియైన యెరూషలేమునూ ఆలయాన్నీ నాశనం చేయడానికి కారణమయ్యింది.
15. బబులోనులో ఉన్న యూదా పరవాసులకు సహనం ఎందుకు అవసరమయ్యింది, చివరికి యెహోవా విడుదలను ఎలా అనుగ్రహించాడు?
15 దాదాపు 70 దుఃఖకరమైన సంవత్సరాల పాటు బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు దేవుని పట్ల తమ యథార్థతను కాపాడుకోవడానికి యూదా పరవాసులకు సహనం అవసరమయ్యింది. (కీర్తన 137:1-6) యథార్థంగా ఉన్నవారిలో ప్రముఖుడు ప్రవక్తయైన దానియేలు. (దానియేలు 1:1-7; 9:1-3) సా.శ.పూ. 537లో యూదులు ఆలయాన్ని పునర్నిర్మించడానికి యూదయకు తిరిగి వెళ్లడాన్ని అనుమతిస్తూ పారసీక రాజైన కోరెషు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయనకు ఎంత ఆనందం కలిగివుంటుందో ఊహించండి ! (ఎజ్రా 1:1-4) దానియేలు మరితరులు సంవత్సరాలపాటు సహించారు, అయితే వారు చివరికి బబులోను పడద్రోయబడటం, యెహోవా ప్రజలకు విడుదల లభించడం చూశారు. మనం ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” నాశనం కోసం ఎదురు చూస్తుండగా సహనాన్ని చూపించడానికి ఇది మనకు సహాయం చేయాలి.—ప్రకటన 18:1-5.
యెహోవా ఎల్లప్పుడూ తన ప్రజలను రక్షిస్తాడు
16. రాణియైన ఎస్తేరు దినాల్లో దేవుడు ఏ రక్షణను అనుగ్రహించాడు?
16 తన ప్రజలు తన నామానికి యథార్థంగా ఉన్నప్పుడు యెహోవా వారిని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. (1 సమూయేలు 12:22; యెషయా 43:10-12) సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన రాణియైన ఎస్తేరు దినాల గురించి ఆలోచించండి. రాజైన అహష్వేరోషు (క్సెర్‌క్సెస్ I) హామానును ప్రధాన మంత్రిగా నియమించాడు. యూదుడైన మొర్దెకై తనకు నమస్కరించడానికి నిరాకరించినందుకు ఉగ్రుడైన హామాను ఆయనను, పారసీక సామ్రాజ్యంలో ఉన్న యూదులనందరినీ నాశనం చేయడానికి కుట్ర పన్నాడు. వారు చట్టాన్ని ఉల్లంఘించేవారన్నట్లు వారిని చిత్రీకరించి, వారిని నిర్మూలించడానికి డబ్బు ఎర చూపెట్టాడు, వారిని నిర్మూలించమని ఆజ్ఞాపించే శాసనాన్ని ముద్రించడానికి రాజుగారి ఉంగరాన్ని ఉపయోగించడానికి అతడికి అనుమతి లభిస్తుంది. ఎస్తేరు తన యూదా నేపథ్యాన్ని ధైర్యంగా రాజుకు చెప్పి, హామాను పన్నిన కుట్రను బయటపెడుతుంది. త్వరలోనే హామాను తాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన అదే మ్రానుపై వ్రేలాడదీయబడతాడు. యూదులు తమను తాము కాపాడుకోవడానికి అధికారం ఇవ్వబడుతుంది, మొర్దెకై ప్రధాన మంత్రి అవుతాడు. వారు తమ శత్రువులపై గొప్ప విజయాన్ని సాధిస్తారు. (ఎస్తేరు 3:1–9:19) యెహోవా విధేయులైన తన ప్రస్తుత దిన సేవకుల పక్షాన రక్షణ కార్యాలు చేస్తాడన్న మన విశ్వాసాన్ని ఈ సంఘటన బలపర్చాలి.
17. యూదయలో నివసిస్తున్న మొదటి శతాబ్దపు యూదా క్రైస్తవుల విడుదలలో విధేయత ఎలా ఒక పాత్ర నిర్వహించింది?
17 దేవుడు తన ప్రజలను రక్షించడానికి మరో కారణం ఏమిటంటే వారు ఆయనకూ, ఆయన కుమారునికీ విధేయులై ఉంటారు. మిమ్మల్ని మీరు యేసు యొక్క మొదటి శతాబ్దపు యూదా శిష్యుల స్థానంలో ఉంచుకోండి. ఆయన వారికిలా చెప్పాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (లూకా 21:20-22) సంవత్సరాలు జరిగిపోతుంటాయి, ఈ మాటలు ఎప్పుడు నెరవేరుతాయా అని మీరు ఆలోచిస్తుంటారు. అప్పుడు సా.శ. 66లో యూదా తిరుగుబాటు జరుగుతుంది. సస్టీస్ గాలస్ ఆధ్వర్యం క్రింద రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టి, ఆలయ గోడల వరకు వెళ్లారు. హఠాత్తుగా, స్పష్టమైన ఏ కారణం లేకుండానే, రోమన్లు వెనక్కి వెళ్లిపోయారు. యూదా క్రైస్తవులు ఏం చేశారు? ఈసుబియస్ తన ఎక్లియాస్టికల్ హిస్టరీలో, (పుస్తకం III, అధ్యాయం V, 3) వారు యెరూషలేము యూదయల నుండి పారిపోయారని చెబుతున్నాడు. వారు యేసు ప్రవచనార్థక హెచ్చరికకు విధేయత చూపించారు గనుక వారు తప్పించుకున్నారు. యేసుకు “కలిగినదాని” అంతటి మీద నియమింపబడిన ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ ద్వారా అందజేయబడుతున్న లేఖనాధార నడిపింపుకు అనుగుణ్యంగా నడుచుకోవడానికి మీరూ అలాగే సుముఖత కల్గివున్నారా?—లూకా 12:42-44.
నిజ్యజీవానికై రక్షించబడటం
18, 19. (ఎ) యేసు మరణం ఏ రక్షణను సాధ్యం చేసింది, ఎవరి కోసం? (బి) అపొస్తలుడైన పౌలు ఏమని నిశ్చయించుకున్నాడు?
18 యేసు ఇచ్చిన హెచ్చరికను వినడం యూదయలోని యూదా క్రైస్తవుల ప్రాణాలను రక్షించింది. కాని యేసు మరణం “మనుష్యులకందరికి” నిత్య రక్షణను సాధ్యం చేస్తుంది. (1 తిమోతి 4:10) ఆదాము పాపం చేసి తద్వారా తన జీవాన్ని కోల్పోయి మానవజాతిని పాపానికీ మరణానికీ బానిసలుగా అమ్మివేసినప్పుడు మానవజాతికి విమోచన క్రయధన అవసరత ఏర్పడింది. (రోమీయులు 5:12-19) మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పించబడిన జంతు బలులు పాపాన్ని కేవలం నామమాత్రంగా కప్పగలిగేవి. (హెబ్రీయులు 10:1-4) యేసుకు మానవ తండ్రి లేడు గనుక, మరియ గర్భం దాల్చినప్పటి నుండీ యేసు జననం వరకు దేవుని పరిశుద్ధాత్మ ఆమెను ‘కమ్ముకొంది’ గనుక ఆయన పాపాన్ని లేక అపరిపూర్ణతను వారసత్వంగా పొందలేదు. (లూకా 1:35; యోహాను 1:29; 1 పేతురు 1:18, 19) యేసు పరిపూర్ణ యథార్థవంతునిగా మరణించినప్పుడు, మానవజాతిని తిరిగి కొని వారిని విడిపించడానికి ఆయన తన పరిపూర్ణ జీవాన్ని అర్పించాడు. (హెబ్రీయులు 2:14) అలా క్రీస్తు “అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1 తిమోతి 2:5, 6) రక్షణ కొరకైన ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందాలని అందరూ కోరుకోరు, కాని విశ్వాసంతో దాన్ని అంగీకరించేవారు దాని అన్వయింపు నుండి ప్రయోజనం పొందడానికి దేవుడు ఆమోదిస్తాడు.
19 క్రీస్తు తన విమోచనా క్రయధన బలి విలువను పరలోకంలో దేవునికి సమర్పించడం ద్వారా ఆదాము సంతానాన్ని తిరిగి కొన్నాడు. (హెబ్రీయులు 9:24) అలా యేసు, పరలోక జీవానికి లేపబడిన తన 1,44,000 మంది అభిషిక్త అనుచరులచే రూపొందించబడిన పెండ్లి కుమార్తెను పొందుతాడు. (ఎఫెసీయులు 5:25; ప్రకటన 14:3, 4; 21:9) తన బలిని అంగీకరించి, నిరంతర భూ జీవితాన్ని పొందే వారికి ఆయన “నిత్యుడగు తండ్రి” కూడా అవుతాడు. (యెషయా 9:6, 7; 1 యోహాను 2:1, 2) ఎంత ప్రేమపూర్వకమైన ఏర్పాటు! తదుపరి శీర్షిక చూపిస్తున్నట్లు, కొరింథులోవున్న క్రైస్తవులకు తాను వ్రాసిన రెండవ ప్రేరేపిత పత్రిక నుండి పౌలుకు ఆ ఏర్పాటు పట్లనున్న మెప్పు స్పష్టమౌతుంది. వాస్తవానికి, నిత్యజీవానికై రక్షించబడడానికి యెహోవా చేసిన అద్భుతమైన ఏర్పాటు నుండి ప్రజలు ప్రయోజనం పొందడానికి వారికి సహాయం చేయనీయకుండా ఏది తనకు ఆటంకం కలిగించడానికి అనుమతించకూడదని పౌలు నిశ్చయించుకున్నాడు.
మీరెలా సమాధానమిస్తారు?
◻ దేవుడు నీతిమంతులైన తన ప్రజలను రక్షిస్తాడనడానికి ఏ లేఖనాధార నిదర్శనం ఉంది?
◻ తన యందు నమ్మకముంచి తమ యథార్థతను కాపాడుకునే వారిని యెహోవా రక్షిస్తాడని మనకెలా తెలుసు?
◻ నిత్యజీవానికై రక్షించబడడానికి దేవుడు ఏ ఏర్పాటు చేశాడు?
[12వ పేజీలోని చిత్రం]
‘రక్షణ కార్యాలు చేసే దేవుడైన’ యెహోవా యందు దావీదు నమ్మకముంచాడు. మరి మీరు?
[15వ పేజీలోని చిత్రం]
రాణీయైన ఎస్తేరు దినాల్లో నిరూపించుకున్నట్లుగా, యెహోవా ఎల్లప్పుడూ తన ప్రజలను రక్షిస్తాడు