కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/1 పేజీలు 22-23
  • బేతేలు—మంచి చెడులుగల నగరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బేతేలు—మంచి చెడులుగల నగరం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బేతేలు మతభ్రష్టత్వానికి కేంద్రమవుతుంది
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “దేవుని మందిరము”ను మెప్పుతో చూచుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/1 పేజీలు 22-23

బేతేలు—మంచి చెడులుగల నగరం

కొన్ని నగరాలు వాటిలో జరిగిన సంఘటనలనుబట్టి ప్రఖ్యాతి గాంచుతాయి లేదా అపకీర్తి పాలౌతాయి. అయితే, ఒక అసాధారణ విషయం ఏమిటంటే, బేతేలు మంచి చెడులకు రెండింటికీ పేరు పొందింది. మూలపురుషుడైన యాకోబు ఆ నగరానికి బేతేలు అని పేరు పెట్టాడు, అంటే “దేవుని గృహము” అని దాని భావం. అయితే ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత, ప్రవక్తయైన హొషేయ ఆ నగరాన్ని “హాని గృహము” అని పిలిచాడు. మంచిగా ఉన్న నగరం చెడ్డగా ఎలా మారింది? దాని చరిత్ర నుండి మనమేమి నేర్చుకోగలం?

అబ్రాహాము జీవించివున్నప్పుడే అంటే సా.శ.పూ 1943 నుండే దేవుని ప్రజలు బేతేలులో నివసించనారంభించారు. ఆ సమయంలో ఆ నగరం లూజు అని పిలువబడేది, అది కనాను భాషలో దానికున్న అసలు పేరు. అది యెరూషలేముకు ఉత్తరాన దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో, గుట్టలుగల దేశంలో ఉంది. అబ్రాహామూ ఆయన సహోదరుని కుమారుడైన లోతూ బేతేలు చుట్టు ప్రక్కలున్న పర్వతాల్లోని ఒక ఎత్తైన స్థలంనుండి క్రిందనున్న యొర్దాను లోయలోని సారవంతమైన పల్లపు ప్రాంతాలను చూడటాన్ని ఊహించుకోండి. తమ విస్తారమైన మందల కొరకు మేతమేసే స్థలాన్ని కేటాయించడంలోని సమస్యలను అబ్రాహాము ఎంతో యుక్తిగా లోతు అవధానానికి తీసుకువస్తూ, ఇలా చెప్పాడు: “మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదు[ను].”—ఆదికాండము 13:3-11.

మొదట ఎంపిక చేసుకునే హక్కు నాకే ఉండాలంటూ అబ్రాహాము పట్టుబట్టలేదు. బదులుగా, ఆయన తనకన్నా చిన్నవాడు మంచి స్థలాన్ని ముందు ఎంపిక చేసుకునేందుకు అనుమతించాడు. మనం అబ్రాహాము కనుపర్చిన చక్కని దృక్పథాన్ని అనుకరించగలం. మనం నెమ్మదిగా మాట్లాడడంలోనూ, నిస్వార్థంగా ప్రవర్తించడంలోనూ ముందుండడం ద్వారా వివాదాస్పదమైన విషయాలను శాంతపర్చగల్గుతాము.—రోమీయులు 12:18.

అనేక సంవత్సరాల తర్వాత, అబ్రాహాము మనుమడైన యాకోబు లూజువద్ద బస చేసినప్పుడు, ఆయనకు ఒక అసాధారణమైన కల వచ్చింది. ఆ కలలో “ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి” ఉండటాన్ని ఆయన చూశాడు. (ఆదికాండము 28:11-19; పోల్చండి యోహాను 1:51.) ఆ కలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. యాకోబు చూసిన దేవదూతలు, ఆయన సంతానం విషయంలో ఆయనకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయనకు పరిచర్య చేస్తారు. నిచ్చెనకు పైగా యెహోవా యొక్క ఉన్నతపర్చబడిన స్థానం, ఈ పనిలో దేవదూతలకు యెహోవా నడిపింపునిస్తాడని చూపించింది.

దైవిక మద్దతు ఉంటుందనే ఈ నిశ్చయత యాకోబును ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన మేలుకున్న తర్వాత ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, దానికి “దేవుని గృహము” అని అర్థం. “నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెద[ను]” అని ఆయన యెహోవాకు ప్రమాణం చేశాడు.a (ఆదికాండము 28:20-22) తనవద్ద ఉన్నదంతా దేవుని నుండే వచ్చిందనే విషయాన్ని గుర్తిస్తూ, దేవుని పట్ల తనకుగల కృతజ్ఞతకు సూచనగా ఉదారంగా తిరిగి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు.

నేడు క్రైస్తవుల పక్షాన కూడా దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. (కీర్తన 91:11; హెబ్రీయులు 1:14) తాము పొందిన దీవెనలన్నింటిని బట్టి “దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు” చెల్లించడం ద్వారా వారు కూడా ఆ దీవెనల పట్ల తమ మెప్పుదలను చూపించవచ్చు.—2 కొరింథీయులు 9:11, 12, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం.

కొంత కాలానికి, యాకోబు వంశస్థులు ఒక జనాంగంగా తయారయ్యారు. వారి నాయకుడైన యెహోషువ కనాను యుద్ధంలో బేతేలు యొక్క అన్య రాజును చాలా కొద్ది వ్యవధిలోనే జయించాడు. (యెహోషువ 12:9-24) న్యాయాధిపతుల కాలంలో, ప్రవక్త్రిని దెబోరా బేతేలు వద్ద నివసిస్తూ, ప్రజలకు యెహోవా మాటలను తెలియజేసేది. సమూయేలు కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయం తీర్చే సమయంలో బేతేలును క్రమంగా దర్శించేవాడు.—న్యాయాధిపతులు 4:4, 5; 1 సమూయేలు 7:15, 16.

బేతేలు మతభ్రష్టత్వానికి కేంద్రమవుతుంది

అయితే సా.శ.పూ 997లో రాజ్యం విభాగించబడిన తర్వాత పవిత్రారాధనతో బేతేలుకున్న సంబంధం తెగిపోయింది. రాజైన యరొబాము బేతేలును దూడ ఆరాధనకు కేంద్రంగా స్థాపించాడు, దూడ యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించబడేది. (1 రాజులు 12:25-29) అందుకే, బేతేలు వినాశనాన్ని గురించి ప్రవచిస్తున్నప్పుడు, హొషేయ దాన్ని “బేతావెను” అని సంభోదించాడు, దానికి “హాని గృహము” అని భావం.—హొషేయ 10:5, 8.

బేతేలు ఆధ్యాత్మిక హానికి కేంద్రమైనప్పటికీ, దానికి సంబంధించిన సంఘటనలు ప్రాముఖ్యమైన పాఠాలు అందిస్తూనే ఉన్నాయి. (రోమీయులు 15:4) అలాంటి ఒక గుణపాఠం, పేరు తెలుపబడని ఒక ప్రవక్తకు సంబంధించినది. ఆయన బేతేలులోని బలిపీఠాల వినాశనాన్నీ, యాజకుల వినాశనాన్నీ ప్రవచించేందుకు యూదా నుండి బేతేలుకు పంపబడ్డాడు. యూదాకు దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలోవున్న బేతేలులో, ఏమీ తినకుండా త్రాగకుండా యూదాకు తిరిగి రమ్మని కూడా యెహోవా ఆయనకు చెప్పాడు. బేతేలు బలిపీఠం నాశనమౌతుందని ఈ ప్రవక్త ఇశ్రాయేలు రాజైన యరొబాము ఎదుట ధైర్యంగా ప్రవచించాడు. అయితే, బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఇంట్లో భోజనం చేయడం ద్వారా ఆయన దేవునికి అవిధేయత చూపించాడు. ఎందుకు? తన తోటి ప్రవక్తకు ఆతిథ్యాన్నివ్వమని యెహోవా దూత తనకు ఆజ్ఞాపించాడని ఈ ముసలి ప్రవక్త అబద్ధం చెబుతాడు. యూదాకు చెందిన ఈ ప్రవక్త చూపిన అవిధేయత ఆయన అకాల మరణానికి కారణమయ్యింది.—1 రాజులు 13:1-25.

మన తోటి విశ్వాసి ఒకరు, ప్రశ్నించదగినదిగా కనిపించేదాన్ని చేయమని మనకు చెబితే, మనమెలా ప్రతిస్పందించాలి? మంచి సంకల్పంతో ఇవ్వబడిన సలహా కూడా, తప్పైనదైతే అది హాని కలిగించగలదనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. (పోల్చండి మత్తయి 16:21-23.) ప్రార్థన ద్వారా, ఆయన వాక్యాన్ని పఠించడం ద్వారా మనం యెహోవా నుండి నడిపింపును కోరితే, పేరు తెలుపబడని ఆ ప్రవక్త చేసిన విషాదకరమైన తప్పిదాన్ని మనం చేయకుండా ఉండగల్గుతాము.—సామెతలు 19:21; 1 యోహాను 4:1.

దాదాపు 150 సంవత్సరాల తర్వాత, బేతేలుకు విరుద్ధంగా ప్రవచించేందుకు, ప్రవక్తయైన ఆమోసు కూడా ఉత్తర దిశగా ప్రయాణం సాగించాడు. “తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము” అని ఆమోసుకు అహంకారంతో చెప్పిన యాజకుడైన అమజ్యాతో సహా కోపోద్రిక్తంగా ఉన్న తన ప్రేక్షకులను ఆమోసు తీవ్రంగా ఖండించాడు. అయితే అమజ్యా యొక్క స్వంత కుటుంబంపైకి రానైయున్న విపత్తులను గురించి కూడా ఆమోసు అమజ్యా ఎదుట నిర్భయంగా మాట్లాడాడు. (ఆమోసు 5:4-6; 7:10-17) ఆయన ఉదాహరణ, వినయస్థులైన తన పరిచారకులకు యెహోవా ధైర్యాన్నివ్వగలడని మనకు జ్ఞాపకం చేస్తోంది.—1 కొరింథీయులు 1:26, 27.

చివరికి, నమ్మకస్థుడైన యూదా రాజగు యోషీయా ‘బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, పడగొట్టించి, దాన్ని కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.’ (2 రాజులు 23:15, 16) దేవుని ఉపదేశములను ఆసక్తితో అనుసరించడంలోనూ, సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ నడిపింపు నివ్వడం ద్వారా, పెద్దలు నేడు ఆయన చక్కని మాదిరిని అనుకరించవచ్చు.

బేతేలు చరిత్రలో జరిగిన ఈ సంఘటనలు, నీతీ అవినీతిల పర్యవసానాలనూ, యెహోవాకు విధేయతా అవిధేయతలను చూపడం వల్ల కలిగే పర్యవసానాలనూ విశదంగా తెలియజేస్తాయి. చాలా సంవత్సరాల క్రితం, మోషే ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఈ ఎంపికను ఉంచాడు: “చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.” (ద్వితీయోపదేశకాండము 30:15, 16) బేతేలు చరిత్రను గురించి ఆలోచించడం, మనం “హాని గృహము”తో కాక, సత్యారాధనకు స్థానమైన “దేవుని గృహము”తో సంబంధం కల్గివుండేలా మనలను ప్రోత్సహిస్తుంది.

[అధస్సూచి]

a యాకోబు, అబ్రాహాములు ఇరువురూ స్వచ్ఛందంగా పదవవంతు చెల్లించేవారు.

[23వ పేజీలోని చిత్రం]

యరొబాము స్థాపించిన దూడ ఆరాధనకు కేంద్రమైన బేతేలు ప్రాంత శిథిలాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి