కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/1 పేజీలు 24-28
  • యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కఠిన పరీక్షల ప్రారంభం
  • రాజీకి సంబంధించిన అంశం
  • హింస అధికమవ్వడం
  • తూర్పు దిశగా వెళ్లడం —తర్వాత తప్పించుకోవడం
  • విషాదభరితమైన స్వేచ్ఛ
  • ఎట్టకేలకు స్వేచ్ఛ !
  • దేవుని పరిపాలన పక్షాన ఉండాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/1 పేజీలు 24-28

యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను

యాన్‌ కార్పా-ఓండో చెప్పినది

అది 1942వ సంవత్సరం. రష్యాలోని కర్స్‌క్‌కు సమీపాన హంగెరీ సైనికులు నాకు కాపలాకాస్తున్నారు. మేము రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా వారికి విరుద్ధంగా పోరాడుతున్న అక్షరాజ్య శక్తుల ఆధీనంలో ఉన్న ఖైదీలం. నాకోసం సమాధి సిద్ధమయ్యింది, నేను యెహోవాసాక్షిగా ఉండనని చెప్పే ఒక డాక్యుమెంటు మీద సంతకం చేస్తానో లేదో నిర్ణయించుకునేందుకు నాకు పది నిమిషాల సమయం ఇవ్వబడింది. దాని తర్వాత ఏమి జరిగిందో చెప్పే ముందు, నేను అలాంటి పరిస్థితిలోకి ఎలా వచ్చానో చెబుతాను.

నేను 1904లో జాహార్‌ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాను, అదిప్పుడు తూర్పు స్లోవాక్‌లో ఉంది. కాని అది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత క్రొత్తగా ఏర్పడిన దేశమైన చెకోస్లవేకియాలో భాగమయ్యింది. మా గ్రామంలో దాదాపు 200 ఇళ్లూ రెండు చర్చీలూ ఉండేవి, ఒకటి గ్రీక్‌ క్యాథలిక్‌ చర్చీ మరొకటి కాల్వినిస్ట్‌ చర్చీ.

నేను కాల్వినిస్ట్‌ చర్చికి వెళ్తున్నప్పటికీ, ఎలాంటి నైతిక కట్టుబాట్లూ లేని జీవితాన్ని గడిపేవాడిని. అయితే నాకు కాస్త సమీపంలో నివసించే ఒక వ్యక్తి మాత్రం ఎంతో వేరుగా ఉండేవాడు. ఒక రోజు ఆయన నాతో సంభాషణ ప్రారంభించి, నాకు ఒక బైబిలు అరువిచ్చాడు. నేను ఆ పుస్తకాన్ని నా చేతులతో పట్టుకున్నది నా జీవితంలో అదే మొదటిసారి. దాదాపు ఆ సమయంలోనే, అంటే 1926లో, నేను బార్బరాను వివాహం చేసుకున్నాను, మాకు ఇద్దరు పిల్లలు కలిగారు, వాళ్ల పేర్లు బార్బరా, యాన్‌.

నేను బైబిలు చదవడం ప్రారంభించాను, అయితే అందులోని అనేక సంగతులు నాకు అర్థమయ్యేవి కావు. కాబట్టి నేను మా పాస్టర్‌ దగ్గరికి వెళ్లి, నాకు సహాయం చేయమని ఆయన్ని అడిగాను. “బైబిలు కేవలం చదువుకున్న వారి కొరకే, దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం కూడా చేయకు” అని ఆయన చెప్పాడు. తర్వాత ఆయన నన్ను పేకాటకు ఆహ్వానించాడు.

దాని తర్వాత, నాకు బైబిలును అరువిచ్చిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్లాను. ఆయన ఒక బైబిలు విద్యార్థి, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడే వారు. ఆయన నాకు ఎంతో సంతోషంగా సహాయం చేశాడు, కొంతకాలానికి నా కళ్లు తెరుచుకోనారంభించాయి. నేను అతిగా త్రాగడం మానేసి, నైతికంగా పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం మొదలు పెట్టాను; నేను ఇతరులతో యెహోవాను గురించి మాట్లాడటం కూడా ప్రారంభించాను. 1920ల తొలిభాగంలో బైబిలు సత్యం జాహార్‌లో స్థాపించబడింది, మరి త్వరలోనే బైబిలు విద్యార్థుల ఒక చురుకైన గుంపు కూడా ఏర్పడింది.

అయినప్పటికీ, మాకు మతసంబంధంగా తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. స్థానిక ప్రీస్టు, నాకు పిచ్చిపట్టిందని చెబుతూ నా కుటుంబ సభ్యుల్లో అనేకులను నాకు వ్యతిరేకులనుగా చేశాడు. అయితే నా జీవితానికి ఒక సంకల్పం ఏర్పడటం ప్రారంభమయ్యింది, నేను సత్య దేవుడైన యెహోవాకు సేవ చేసేందుకు దృఢంగా నిర్ణయించుకున్నాను. అలా, 1930లో, నేను యెహోవాకు చేసుకున్న సమర్పణను సూచిస్తూ బాప్తిస్మం తీసుకున్నాను.

కఠిన పరీక్షల ప్రారంభం

1938లో మా ప్రాంతం హంగెరీ పరిపాలన క్రిందకు వచ్చింది, హంగెరీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ పక్షం వహించింది. అప్పటికల్లా, వేయికంటే తక్కువమంది ప్రజలుగల మా గ్రామంలో దాదాపు 50 మంది సాక్షులున్నారు. ప్రకటించడం మా జీవితాలనూ మా స్వేచ్ఛనూ ప్రమాదంలో పడవేసినప్పటికీ మేము ప్రకటించడంలో కొనసాగాము.

1940లో, నన్ను హంగెరీ సైన్యం కోసం ఎంపిక చేశారు. నేనేం చేస్తాను? ప్రజలు తమ యుద్ధోపకరణాలను శాంతికి ఉపకరించే వాటిగా మార్చుకోవడాన్ని గురించి బైబిలు ప్రవచించడాన్ని నేను చదివాను, కొంత కాలానికి దేవుడు భూమి మీద యుద్ధాలు లేకుండా చేస్తాడని నాకు తెలుసు. (కీర్తన 46:9; యెషయా 2:4) అలా, నేను యుద్ధాన్ని ద్వేషించేవాడినయ్యాను, పర్యవసానమేదైనప్పటికీ నేను సైన్యంలో చేరకూడదని నిర్ణయించుకున్నాను.

నాకు 14 నెలల ఖైదు విధించబడింది, నేను హంగెరీలోని పెక్‌లో శిక్షను అనుభవించాను. చెరసాలలో నాతోపాటూ మరో ఐదుగురు సాక్షులున్నారు, మేము అలా కలిసి ఉండగలిగినందుకు ఎంతో ఆనందించాం. అయితే, కొంతకాలం వరకూ, నా కాళ్లకు బంధకాలు వేసి నాకు ఒంటరి ఖైదు విధించారు. మేము యుద్ధ ప్రయత్నాలకు సంబంధించిన పని చేసేందుకు నిరాకరించినప్పుడు, మమ్మల్ని కొట్టేవారు. దానికి తోడు, దినమంతా మమ్మల్ని కదలకుండా నిలుచోబెట్టే వాళ్లు, మాకు మధ్యాహ్నం రెండు గంటలు విరామం ఇవ్వబడేది. ఈ విధమైన శిక్ష కొన్ని నెలల వరకూ కొనసాగింది. అయినప్పటికీ మేము సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మాకు మా దేవుని ఎదుట స్వచ్ఛమైన మనస్సాక్షి ఉంది.

రాజీకి సంబంధించిన అంశం

ఒకరోజు, మేము సైన్యంలో చేరి యుద్ధ ప్రయత్నాలకు మద్దతునివ్వడం ఎంతో ప్రాముఖ్యమని మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించేందుకు 15 మంది క్యాథలిక్‌ ప్రీస్టులు గుంపుగా వచ్చారు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు మేమిలా అన్నాము: “ఆత్మ అమర్త్యమైనదనీ, మేము యుద్ధంలో చనిపోతే పరలోకానికి వెళ్తామనీ బైబిలునుండి మీరు గనుక నిరూపించగలిగితే, మేము సైన్యంలో చేరతాం.” వాళ్లు అది నిరూపించలేకపోయారు, దాంతో వాళ్లా చర్చ కొనసాగించేందుకు ఇష్టపడలేదు.

1941లో నా చెరసాల శిక్ష ముగిసింది, నేను నా కుటుంబాన్ని తిరిగి కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. దానికి బదులుగా, నాకు గొలుసులు వేసి, హంగెరీలోని షేర్స్‌పాటక్‌లోని ఒక సైనిక స్థావరానికి నన్ను తీసుకెళ్లారు. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, నన్ను వదిలేసేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వబడింది. “నీవు చేయవలసిందల్లా, ఇల్లు చేరుకున్న తర్వాత 200 పెంగోలు చెల్లిస్తానని చెప్పే వాగ్దానపత్రంపై సంతకం చేయడమే” అని నాకు చెప్పారు.

“అదెలా సాధ్యం? అయినా మీకు నేనా డబ్బు ఎందుకు చెల్లించాలి?” అని నేనడిగాను.

“ఆ డబ్బుకు ప్రతిగా, సైన్యం కొరకైన వైద్య పరీక్షలో నువ్వు పాస్‌ కాలేదనే ధృవీకరణ పత్రాన్ని అందుకుంటావు” అని వాళ్లు నాకు చెప్పారు.

ఈ విషయంలో నేనో నిర్ణయానికి రావడం చాలా కష్టమైంది. దాదాపు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా నేను అమానుష వ్యవహారానికి గురయ్యాను; నేను అలసిపోతున్నాను. ఇప్పుడు కొంత డబ్బు చెల్లించేందుకు అంగీకరించడం ద్వారా, నేను స్వతంత్రుడ్ని కాగలను. “నేను దాని గురించి ఆలోచిస్తాను” అని నేను గొణిగాను.

నేనే నిర్ణయం తీసుకుంటాను? నేను నా భార్యా పిల్లల గురించి ఆలోచించాల్సి ఉంది. అయితే, ఆ సమయానికి తోటి క్రైస్తవుని నుండి నాకో ఉత్తరం వచ్చింది, అందులో ఆయన నన్ను ప్రోత్సహిస్తూ వ్రాశాడు. “నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు” అన్న యెహోవా మాటలను పౌలు ఉల్లేఖిస్తున్న హెబ్రీయులు 10:38వ వచనాన్ని ఆయన ఉత్తరంలో వ్రాశాడు. కొంత సమయానికే, హంగెరీకి చెందిన ఇద్దరు బరాక్స్‌ అధికారులు నాతో మాట్లాడారు, వారిలో ఒకరిలా వ్యాఖ్యానించారు: “మీరు బైబిలు సూత్రాలను అంత దృఢంగా సమర్థిస్తూ ఉన్నందుకు మేము మిమ్మల్ని ఎంతగా గౌరవిస్తున్నామో మీకు తెలియదు! మీరు వెనుదీయకండి!”

ఆ మర్నాడు, నాకు 200 పెంగోలకు స్వేచ్ఛను ఇవ్వజూపిన వాళ్లదగ్గరికెళ్లి, “నేను నిర్బంధించబడేందుకు యెహోవా దేవుడే అనుమతించాడు గనుక, నేను విడిపించబడే విషయంలో కూడా ఆయనే శ్రద్ధ తీసుకుంటాడు. నేను విడుదల పొందేందుకు డబ్బు చెల్లించను” అని చెప్పాను. కాబట్టి నాకు పది సంవత్సరాల చెరసాల శిక్ష విధించబడింది. అయితే నేను రాజీపడేలా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు అక్కడితో ఆగిపోలేదు. నేను కేవలం రెండు నెలల కొరకు సైన్యంలో పని చేసేందుకు అంగీకరిస్తే నన్ను క్షమించేందుకు కోర్టు సిద్ధపడింది, నేను ఆయుధాలను పట్టుకోవలసిన అవసరం కూడా ఉండదు! నేను ఆ ప్రతిపాదనను కూడా నిరాకరించాను, నా చెరసాల శిక్ష మళ్లా ప్రారంభమైంది.

హింస అధికమవ్వడం

నన్ను మళ్లీ పెక్‌లోని చెరసాలకు తీసుకెళ్లారు. ఈసారి చిత్రహింస మరీ తీవ్రమైంది. నా చేతులను వెనక్కి విరిచి కట్టి వాటిని పైకి తీసి అలా నా చేతులపై నా బరువంతా పడేలా నన్ను రెండు గంటలపాటు వేలాడదీసేవారు. దాని ఫలితంగా, నా రెండు భుజాలూ డిస్‌లొకేట్‌ అయ్యాయి (సడలిపోయాయి). దాదాపు ఆరు నెలల పాటు అలాంటి చిత్రహింస పునరావృతం చేయబడింది. నేను నా విశ్వాసాన్ని వదులుకోలేదంటే దానికి నేను యెహోవాకే కృతజ్ఞతలు చెల్లిస్తాను.

1942లో మా గుంపును కర్స్‌క్‌ నగరంలో జర్మనీ సైన్యాలున్న ప్రాంతానికి తీసుకెళ్లారు, ఆ గుంపులో రాజకీయ ఖైదీలూ, యూదులూ, 26 మంది యెహోవాసాక్షులూ ఉన్నారు. మమ్మల్ని జర్మనీవారికి అప్పగించారు, వాళ్లు ఖైదీలమైన మమ్మల్ని యుద్ధ క్షేత్రంలో ఉన్న సైనికులకు ఆహారాన్నీ, ఆయుధాలనూ బట్టలనూ తీసుకెళ్లేందుకు నియమించారు. ఆ పని, మేము మా క్రైస్తవ తటస్థతను కోల్పోయేలా చేస్తుంది గనుక సాక్షులమైన మేము ఆ పని చేయడానికి నిరాకరించాం. దాని ఫలితంగా, మమ్మల్ని హంగెరీ వాళ్లకు తిరిగి అప్పగించేశారు.

తుదకు, మమ్మల్ని కర్స్‌క్‌లోని ఒక స్థానిక జైలులో పెట్టారు. అనేక రోజుల వరకూ మమ్మల్ని రబ్బర్‌తో చేయబడిన దుడ్డుకర్రలతో రోజుకు మూడుసార్లు కొట్టేవారు. అలా కొడుతున్నప్పుడు నా కణతలకు దెబ్బతగిలి నేను మోకాళ్లపై పడిపోయాను. నాకు దెబ్బలు తగులుతుండగా, ‘చనిపోవడం ఏమంత కష్టం కాదని’ నాకనిపించింది. నా శరీరమంతా స్తబ్ధుగా అయిపోయింది, కాబట్టి నాకు ఏ స్పర్శా తెలియలేదు. మూడు రోజుల పాటూ మాకు తినేందుకు ఏమీ ఇవ్వలేదు. తర్వాత మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు, ఆరుగురికి మరణ శిక్ష విధించబడింది. ఆ శిక్ష అమలు చేయబడినప్పుడు, మేము 20 మందిమి మిగిలాం.

1942 అక్టోబరులో కర్స్‌క్‌లోని ఆ రోజుల్లో మా విశ్వాసానికి ఎదురైన పరీక్షలు, నేను ఇంతవరకూ ఎదుర్కొన్న వాటిలోకెల్లా తీవ్రమైనవి. ప్రాచీన కాలానికి చెందిన రాజైన యెహోషాపాతు తన ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నప్పుడు, “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు” అని ఆయన పలికిన మాటలు మా భావాలను చక్కగా వ్యక్తం చేస్తాయి.—2 దినవృత్తాంతములు 20:12.

మా అందరికీ కలిపి ఒకే సమాధిని త్రవ్వుకునేందుకు మమ్మల్ని 20 మందిని తీసుకెళ్లారు, మాకు 18 మంది హంగెరీ సైనికులు కాపలా ఉన్నారు. మేము త్రవ్వడం ముగించినప్పుడు, ఒక డాక్యుమెంటుపై సంతకం చేసేందుకు మాకు పది నిమిషాల సమయం ఇస్తున్నామని చెప్పారు, ఆ డాక్యుమెంటులో కొంత భాగం ఇలా ఉంది: “యెహోవాసాక్షుల బోధ తప్పు. నేను దాన్ని ఇక విశ్వసించను లేక దానికి మద్దతునివ్వను. నేను నా స్వదేశమైన హంగెరీ కొరకు పోరాడతాను . . . రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలో చేరుతున్నానని నా సంతకం ద్వారా నేను ధృవీకరిస్తున్నాను.”

పది నిమిషాల తర్వాత ఇలా ఆజ్ఞ జారీ చేయబడింది, “కుడివైపు తిరగండి! సమాధిలోకి నడవండి!” తర్వాత మళ్లీ ఇలా ఆజ్ఞాపించారు: “మొదటి ఖైదీ, మూడవ ఖైదీ అందులోకి వెళ్లాలి!” ఆ డాక్యుమెంటుపై సంతకం చేయడాన్ని గురించి నిర్ణయించుకునేందుకు ఆ ఇద్దరికి మరో పది నిమిషాలు ఇచ్చారు. సైనికుల్లో ఒకతను ఇలా వేడుకున్నాడు, “మీ విశ్వాసాన్ని వదిలేసి, సమాధిలోనుండి బయటకు వచ్చేయండి!” ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అధికారి వాళ్లిద్దరినీ కాల్చి చంపాడు.

“మిగతా వాళ్ల సంగతేమిటి?” అని ఒక సైనికుడు అధికారిని అడిగాడు.

“వాళ్లను కట్టి పడేయండి, వాళ్లను మనం ఇంకాస్త హింసిద్దాం, తర్వాత రేపు ఉదయం ఆరుగంటలకు కాల్చేద్దాం” అని ఆయన సమాధానమిచ్చాడు.

అకస్మాత్తుగా నాకు చాలా భయమేసింది, అయితే నేను చనిపోతాననే భయం కాదది, కానీ నేను ఆ హింసను సహించలేక ఒకవేళ రాజీపడిపోతానేమోనన్న భయం. అందుకే నేను ముందుకెళ్లి ఇలా అడిగాను: “సర్‌, మేము కూడా మీరు ఇందాక చంపిన మా సహోదరుల్లాగే తప్పు చేశాంకదా. మీరు మమ్మల్ని కూడా ఇప్పుడే చంపేయొచ్చు కదా?”

కాని వాళ్లు చంపలేదు. మా చేతులను వెనక్కి కట్టేశారు. తర్వాత మా చేతులను పైకి తీసి వాటిపై మా బరువంతా పడేలా వాటిని పైకి కట్టి మమ్మల్ని వ్రేలాడదీశారు. మాకు స్పృహ తప్పిపోతే వాళ్లు మా మీద నీళ్లు జల్లేవారు. మా శరీరాల బరువు మూలంగా మా భుజాలు డిస్‌లొకేట్‌ అయ్యేవి (సడలిపోయేవి) గనుక మాకు విపరీతమైన నొప్పి కలిగేది. ఈ విధమైన హింస దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. తర్వాత అకస్మాత్తుగా, యెహోవాసాక్షుల్లో ఇక ఎవరినీ కాల్చి చంపవద్దని ఆజ్ఞ వచ్చింది.

తూర్పు దిశగా వెళ్లడం —తర్వాత తప్పించుకోవడం

మూడు వారాల తర్వాత, మమ్మల్ని కొన్ని రోజుల కొరకు అంటే మేము డాన్‌ నది తీరం చేరుకునే వరకు వరుసలో నడిపించారు. మమ్మల్ని సజీవంగా వెనక్కు తీసుకురాకూడదని తమకు చెప్పబడినట్లు అధికారులు మాతో చెప్పారు. పగటి వేళ, గోతులు త్రవ్వి మళ్లీ వాటిని పూడ్చే సంకల్పరహిత పనిని మాకిచ్చేవారు. సాయంత్రం వేళ, కాస్త అటు ఇటు తిరిగే స్వేచ్ఛ మాకుండేది.

ఆ పరిస్థితిని నేను చూసినప్పుడు నాకు రెండు మార్గాలు కనిపించాయి. మేము అక్కడే మరణించవచ్చు, లేదా జర్మనీ వారినుండి తప్పించుకుని పారిపోయి రష్యా వారికి లొంగిపోవచ్చు. మంచుతో గడ్డకట్టిన డాన్‌ నది దాటి పారిపోయేందుకు కేవలం ముగ్గురమే నిర్ణయించుకున్నాం. 1942 డిసెంబరు 12న, మేము యెహోవాకు ప్రార్థన చేసి బయల్దేరాము. మేము రష్యా శివార్లకు చేరుకున్న వెంటనే మమ్మల్ని 35,000 మంది ఖైదీలుగల చెరసాల క్యాంపులో పెట్టారు. వసంతకాలం వచ్చేసరికల్లా, అందులో 2,300 మంది ఖైదిలే సజీవంగా ఉన్నారు. మిగతా వారంతా ఆకలితో చనిపోయారు.

విషాదభరితమైన స్వేచ్ఛ

యుద్ధ కాలంలోనూ ఆ తర్వాత యుద్ధం ముగిశాక కూడా నేను చాలా నెలలపాటు రష్యా ఖైదీగానే ఉన్నాను. తుదకు, 1945 నవంబరులో, నేను జాహార్‌కు తిరిగి వచ్చాను. మా పొలం పూర్తిగా పాడైపోయింది, నేను దాన్ని మళ్లీ సాగు చేసుకోవాలి. నా భార్యా పిల్లలు యుద్ధ సమయంలో పొలంలో పని చేశారు, అయితే 1944 అక్టోబరులో, రష్యావారు సమీపిస్తుండగా, వాళ్లు ఉత్తరం వైపుకు తరలించబడ్డారు. మాకున్నదంతా దోచుకోబడింది.

అన్నింటికంటే ఘోరంగా, నేను ఇంటికి చేరుకునే సరికి, నా భార్య చాలా అస్వస్థతగా ఉంది. 1946 ఫిబ్రవరిలో ఆమె మరణించింది. ఆమె వయస్సు 38 సంవత్సరాలే. ఐదు సుదీర్ఘ, కష్టతర సంవత్సరాల ఎడబాటు తర్వాత మేము మళ్లీ కలిసి ఆనందంగా గడిపేందుకు మాకు చాలా తక్కువ సమయం లభించింది.

నేను నా ఆధ్యాత్మిక సహోదరుల నుండి, కూటాలకు హాజరవ్వడం, ఇంటింటి పరిచర్యలో భాగం వహించడం నుండి ఆదరణను పొందాను. 1947లో, ఒక సమావేశానికి హాజరయ్యేందుకు, దాదాపు 400 కిలోమీటర్ల దూరానున్న బర్‌నోకు ప్రయాణించేందుకు నేను కొంత డబ్బు అప్పు తీసుకున్నాను. అక్కడ, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ యొక్క అప్పటి అధ్యక్షుడైన నేథన్‌ హెచ్‌. నార్‌తో సహా నా క్రైస్తవ సహోదరుల మధ్య నేను ఆదరణనూ ప్రోత్సాహాన్నీ పొందాను.

యుద్ధం తర్వాత మాకు లభించిన స్వాతంత్ర్యాన్ని మేము ఎంతోకాలం ఆనందించలేకపోయాం. 1948లో కమ్యూనిస్టులు మమ్మల్ని అణచివేయడం ప్రారంభించారు. చెకోస్లవేకియాలోని యెహోవాసాక్షుల పనిలో నాయకత్వం వహిస్తున్న సహోదరుల్లో అనేకులు 1952లో అరెస్టు అయ్యారు, మరి నాకు సంఘాల గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత ఇవ్వబడింది. 1954లో, నన్ను కూడా అరెస్టు చేశారు, నాకు నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. క్రైస్తవ తటస్థతను కల్గివున్నందుకు మా అబ్బాయి యాన్‌, మనుమడు యూరైని కూడా జైల్లో వేశారు. నేను ప్రాగ్‌లో ఉన్న పాన్‌క్రాట్స్‌ రాష్ట్ర సంస్కరణ కారాగారంలో రెండు సంవత్సరాలు గడిపాను. 1956లో ఆమ్నెస్టీని ప్రకటించారు, నేను విడదలయ్యాను.

ఎట్టకేలకు స్వేచ్ఛ !

చివరికి, 1989లో, చెకోస్లవేకియాలో కమ్యూనిజమ్‌ పట్టు సడలింది, యెహోవాసాక్షుల పని న్యాయబద్ధంగా రిజిస్టర్‌ చేయబడింది. అలా, మేము కూడుకునేందుకూ బహిరంగంగా ప్రకటించేందుకూ స్వేచ్ఛ లభించింది. అప్పటికల్లా జాహార్‌లో దాదాపు వందమంది సాక్షులున్నారు, అంటే ఆ గ్రామంలోని ప్రతి పదిమందిలో ఒకరు యెహోవాసాక్షి అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం, జాహార్‌లో మేము, 200 మంది కూర్చోగల, అందమైన, విశాలమైన రాజ్యమందిరాన్ని నిర్మించాం.

నా ఆరోగ్యం ఇప్పుడిక ఎంతమాత్రం బాగుండటంలేదు, కాబట్టి సహోదరులు నన్ను రాజ్యమందిరానికి కారులో తీసుకెళ్లి తీసుకువస్తారు. నేను కూటాలకు హాజరవ్వడానికీ, కావలికోట పఠనంలో వ్యాఖ్యానించడానికీ ఎంతో ఇష్టపడతాను. నా మనుమలు మనుమరాళ్లతో సహా నా కుటుంబంలోని మూడు తరాల ప్రతినిధులు యెహోవాను నమ్మకంగా ఆరాధించడాన్ని చూడటం నాకు ప్రత్యేకంగా ఆనందం కలిగిస్తోంది. నా మనుమళ్లలో ఒకరు, చెకోస్లవేకియాలోని యెహోవాసాక్షుల ప్రయాణ కాపరిగా సేవ చేశాడు, తన కుటుంబ బాధ్యతల మూలంగా ఆ పని చేయడం కుదరకుండా అయ్యేంత వరకూ అతడలా సేవ చేశాడు.

నాకు అనేకసార్లు ఎదురైన పరీక్షల్లో నాకు శక్తిని ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడను. నా ధ్యాసనంతా యెహోవా మీద ఉంచడం ద్వారా అంటే ‘అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు’ ఉండటం ద్వారానే నేను తట్టుకోగలిగాను. (హెబ్రీయులు 11:27) అవును, నేను ఆయన బాహుబలం చేత విడిపించబడడాన్ని చూశాను. అందుకే, ఇప్పుడు కూడా, నేను సంఘ కూటాలకు హాజరయ్యేందుకూ, నాకు వీలైనంత వరకు బహిరంగ సేవలో ఆయన నామాన్ని ప్రకటించడంలో భాగం వహించేందుకూ ప్రయత్నిస్తున్నాను.

[25వ పేజీలోని చిత్రం]

జాహార్‌లోని రాజ్యమందిరం

[26వ పేజీలోని చిత్రం]

కావలికోట పఠనంలో వ్యాఖ్యానించగల ఆధిక్యతను నేను గుణగ్రహిస్తున్నాను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి