మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?
“[దేవుని] విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.”—హెబ్రీయులు 4:10.
1. విశ్రాంతి ఎందుకంత అపేక్షించదగినది?
విశ్రాంతి. అది ఎంత ఆహ్లాదకరమైన, ఆనందకరమైన పదం! నేటి హడావుడితో కూడిన, ఊపిరిసలపని లోకంలో జీవిస్తూ, మనలో అనేకులం కొంత విశ్రాంతిని ఎంతగానో కోరుకుంటాము. యౌవనులైనా లేక వృద్ధులైనా, వివాహితులైనా లేక అవివాహితులైనా, మనం కేవలం దైనందిన జీవితంతోనే ఎంతో నలిగిపోయి అలసిపోతుంటాము. శారీరక పరిమితులు లేక అస్వస్థతలు ఉన్న వారికి ప్రతి రోజూ ఒక సవాలే. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని” లేఖనాలు చెబుతున్నాయి. (రోమీయులు 8:22) విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తి సోమరివాడై ఉండనవసరం లేదు. విశ్రాంతి అన్నది మానవునికున్న తృప్తిపర్చబడవలసిన అవసరత.
2. యెహోవా ఎప్పటి నుండి విశ్రాంతి తీసుకుంటున్నాడు?
2 యెహోవా దేవుడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదికాండములో మనమిలా చదువుతాము: “ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.” “యేడవ దినము”కు యెహోవా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఆపాదించాడు, అందుకే ప్రేరేపిత వృత్తాంతం ఇలా కొనసాగుతోంది: “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.”—ఆదికాండము 2:1-3.
దేవుడు తన పనినుండి విశ్రమించాడు
3. దేవుడు విశ్రమించడానికి ఏవి కారణాలు కావు?
3 “యేడవ దినము”న దేవుడు ఎందుకు విశ్రమించాడు? ఆయన విశ్రమించింది అలసిపోయినందుకు కాదు. యెహోవాకు “అధికశక్తి” ఉంది, ఆయన “సొమ్మసిల్లడు అలయడు.” (యెషయా 40:26, 28) లేక దేవుడు తాను చేస్తున్న పని మధ్యలో విరామం కావాలనో లేక మార్పు కావాలనో విశ్రమించలేదు ఎందుకంటే, “నా తండ్రి యదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని” యేసు చెప్పాడు. (యోహాను 5:17) ఏదేమైనప్పటికీ, “దేవుడు ఆత్మ,” గనుక భౌతిక జీవులకు భిన్నంగా ఆయన శారీరక చక్రాలకూ, అవసరతలకూ అతీతుడు.—యోహాను 4:24.
4. గడిచిన ఆరు ‘దినాల’ నుండి “యేడవ దినము” ఏ విధంగా వేరైవుంది?
4 “యేడవ దినము”న దేవుడు ఎందుకు విశ్రమించాడనే దానికి గల కారణాన్ని గురించి మనం కొంత అంతర్దృష్టిని ఎలా పొందవచ్చు? గడిచిన ఆరు సృష్టి ‘దినాల’ సుధీర్ఘ కాలంలో తాను సాధించిన దాన్ని బట్టి దేవుడు అప్పటికే ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ, ఆయన “యేడవ దినము”ను ప్రత్యేకంగా ఆశీర్వదించి, దాన్ని “పరిశుద్ధ”పరిచాడన్న విషయాన్ని గమనించడం ద్వారా మనం కొంత అంతర్దృష్టిని పొందవచ్చు. “పరిశుద్ధ”మైనది అనే పదాన్ని కన్సైస్ ఆక్స్ఫర్డ్ డిక్షనరి, “(ఒక దేవునికి లేక ఏదైనా మతసంబంధ సంకల్పానికి) ప్రత్యేకంగా సమర్పించడం లేక ప్రత్యేకపర్చడం” అని నిర్వచిస్తుంది. కాబట్టి, యెహోవా “యేడవ దినము”ను ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపర్చడం, ఆ దినానికీ ఆయన ‘విశ్రాంతికీ’ ఆయన పరిశుద్ధ చిత్తంతో మరియు సంకల్పంతో కొంత సంబంధం ఉండవచ్చునని సూచిస్తుంది. అంతేగాని ఆయనపక్షంగా ఏదో అవసరత ఉండి కాదు. ఆ సంబంధం ఏమిటి?
5. మొదటి ఆరు సృష్టి ‘దినాల్లో’ దేవుడు ఏమి ప్రారంభించాడు?
5 గడిచిన ఆరు సృష్టి ‘దినాల్లో’ దేవుడు, భూమినీ దాని చుట్టూ ఉన్నదాన్నంతటినీ నియంత్రిస్తున్న అన్ని చక్రాలనూ, సూత్రాలను సిద్ధం చేసి వాటి పనిని ప్రారంభింపజేశాడు. ఇవి ఎంత అద్భుతంగా రూపనిర్మాణం చేయబడ్డాయన్నది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. “ఆరవ దిన” ముగింపు సమయంలో, దేవుడు మొదటి మానవ జతను సృష్టించి, వారిని “తూర్పున ఏదెనులో ఒక తోట”నందు ఉంచాడు. చివరగా, మానవ కుటుంబంపట్లా భూమిపట్లా తనకుగల సంకల్పాన్ని దేవుడు ఈ ప్రవచన వాక్యాల్లో ప్రకటించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలు[డి].”—ఆదికాండము 1:28, 31; 2:8.
6. (ఎ) ‘ఆరవ దినము’ ముగింపులో, తాను సృష్టించినదానంతటిని గురించి దేవుడు ఎలా భావించాడు? (బి) “యేడవ దినము” ఏ భావంలో పరిశుద్ధమైనది?
6 సృష్టి యొక్క ‘ఆరవ దినం’ ముగింపుకు వస్తుండగా, వృత్తాంతం మనకిలా చెబుతుంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆదికాండము 1:31) దేవుడు తాను చేసినదానంతటిని బట్టీ సంతృప్తి చెందాడు. అందుకే ఆయన విశ్రమించాడు, లేదా భూమికి సంబంధించి ఇక ఏ సృష్టి కార్యం చేపట్టకుండా విరమించుకున్నాడు. అయితే, పరదైసు తోట ఎంతో పరిపూర్ణంగా, సుందరంగా ఉన్నప్పటికీ, అది కేవలం కొంత ప్రాంతంలోనే వ్యాపించి ఉంది, భూమి మీద కేవలం ఇద్దరు మానవులే ఉన్నారు. దేవుడు సంకల్పించిన స్థితికి రావడానికి భూమికీ మానవ కుటుంబానికీ సమయం పడుతుంది. ఈ కారణాన్నిబట్టి, తాను గత ఆరు ‘దినాల్లో’ సృష్టించినదంతా తన పరిశుద్ధ చిత్తానికి అనుగుణ్యంగా వృద్ధి చెందడానికై ఆయన ఒక “యేడవ దినము”ను నియమించాడు. (ఎఫెసీయులు 1:11 పోల్చండి.) “యేడవ దినము” దాని ముగింపుకు వస్తుండగా, భూమి పరిపూర్ణ మానవ కుటుంబంతో నిరంతరం నింపబడివుండే ఒక భూవ్యాప్త పరదైసుగా మారిపోయి ఉంటుంది. (యెషయా 45:18) “యేడవ దినము” భూమికీ మరియు మానవజాతికీ సంబంధించి దేవునికిగల చిత్తాన్ని తుదముట్టించడం కొరకూ, నెరవేర్చడం కొరకూ ప్రత్యేకించబడింది, లేక సమర్పించబడింది. ఆ భావంలో అది “పరిశుద్ధ”మైనది.
7. (ఎ) “యేడవ దినము”న దేవుడు ఏ భావంలో విశ్రమించాడు? (బి) “యేడవ దినము” ముగింపుకు వచ్చే సమయానికి అంతా ఎలా మారుతుంది?
7 కాబట్టి “యేడవ దినము”న దేవుడు తన సృష్టి పని నుండి విశ్రమించాడు. తాను ప్రారంభించిన కార్యం, తన పని తాను నిర్వహించుకుంటూ వెళ్లేలా చేసి ఆయన ఒక అడుగు వెనక్కి వేసి చూస్తున్నట్లుగా ఉంది. “యేడవ దినము” ముగింపుకల్లా, అంతా తాను సంకల్పించినట్లుగానే జరిగి తీరుతుందని ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. మధ్యలో అడ్డంకులు ఏర్పడినా అవి అధిగమించబడతాయి. దేవుని చిత్తం పూర్తిగా వాస్తవమైనప్పుడు విధేయతగల మానవజాతి అంతా ప్రయోజనం పొందుతుంది. ఏదీ దీన్ని ఆపలేదు ఎందుకంటే “యేడవ దినము” మీద దేవుని ఆశీర్వాదం ఉంది, ఆయన దాన్ని “పరిశుద్ధ”పరిచాడు. విధేయతగల మానవజాతికి ఎంతటి మహిమాన్విత ఉత్తరాపేక్షో కదా!
ఇశ్రాయేలు జనాంగం దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయింది
8. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని ఎప్పుడు, ఎలా ఆచరించనారంభించారు?
8 పనికి, విశ్రాంతికి సంబంధించి యెహోవా చేసిన ఏర్పాటు నుండి ఇశ్రాయేలు జనాంగం ప్రయోజనం పొందింది. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వక మునుపే, దేవుడు మోషే ద్వారా వారితో ఇలా చెప్పాడు: “చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడ[దు.]” ఫలితమేమిటంటే, “యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.”—నిర్గమకాండము 16:22-30.
9. ఇశ్రాయేలీయులకు విశ్రాంతిదిన నియమం ఎందుకు ఆహ్వానించదగిన మార్పై ఉంది?
9 అప్పుడే ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీయులకు ఈ ఏర్పాటు క్రొత్త. ఐగుప్తీయులూ మరితరులూ సమయాన్ని ఐదు నుండి పది దినాల కాలనిడివిలో లెక్కించినప్పటికీ, దాసులైయున్న ఇశ్రాయేలీయులకు బహుశ విశ్రాంతి దినం అనుమతించబడి ఉండకపోవచ్చు. (నిర్గమకాండము 5:1-9 పోల్చండి.) కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ మార్పును ఆహ్వానించి ఉంటారనడం సహేతుకమైనదే. విశ్రాంతి దిన ఆచరణను ఒక భారంగా లేక కట్టుబాటుగా దృష్టించే బదులు, వాళ్లు దాన్ని ఆచరించడానికి సంతోషించి ఉండవచ్చు. వాస్తవానికి, ఐగుప్తులో వాళ్ల దాసత్వానికీ, దేవుడు వాళ్లను విడుదల చేయడానికీ విశ్రాంతిదినం ఒక జ్ఞాపికగా ఉంటుందని ఆ తర్వాత ఆయన వాళ్లకు చెప్పాడు.—ద్వితీయోపదేశకాండము 5:15.
10, 11. (ఎ) విధేయులుగా ఉండడం ద్వారా, ఇశ్రాయేలీయులు దేన్ని ఆనందించడానికి ఎదురుచూసి ఉండగలిగేవారు? (బి) ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిలోకి ఎందుకు ప్రవేశించలేకపోయారు?
10 మోషేతోపాటు ఐగుప్తులోనుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు విధేయులై ఉండినట్లైతే, “పాలు తేనెలు ప్రవహించు” వాగ్దాన “దేశము”లోకి ప్రవేశించే ఆధిక్యత వాళ్లకు లభించి ఉండేది. (నిర్గమకాండము 3:8) అక్కడ వాళ్లు కేవలం విశ్రాంతి దినాన్నే కాదుగాని తమ జీవితాంతం నిజమైన విశ్రాంతిని ఆనందించి ఉండేవారు. (ద్వితీయోపదేశకాండము 12:9, 10) అయితే, జరిగింది అది కాదు. వారి గురించి, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవారందరే గదా. ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారిమీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా. కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయరని గ్రహించుచున్నాము.”—హెబ్రీయులు 3:16-19.
11 మనకెంతటి శక్తివంతమైన పాఠమోకదా! యెహోవా యందు వారికి విశ్వాసం లేకపోవడం మూలంగా, ఆ తరంవారికి ఆయన వాగ్దానం చేసిన విశ్రాంతిని వారు పొందలేకపోయారు. బదులుగా, వారు అరణ్యంలో నశించిపోయారు. అబ్రాహాము సంతానంగా తాము భూమి మీది జనాంగాలకు ఆశీర్వాదాలను తేవడంలో దేవుని చిత్తంతో సన్నిహిత సంబంధం కల్గివున్నామని వాళ్లు గ్రహించలేకపోయారు. (ఆదికాండము 17:7, 8; 22:18) దైవిక చిత్తానికి అనుగుణ్యంగా పనిచేసే బదులు, వాళ్లు తమ ఐహిక, స్వార్థపూరిత కోరికలతో పూర్తిగా ప్రక్కకు తొలగిపోయారు. మనమెన్నడూ అలాంటి ఉరిలో చిక్కుకోకుండా ఉందుముగాక!—1 కొరింథీయులు 10:6, 10.
విశ్రాంతి నిలిచివుంది
12. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇంకా ఏ ఉత్తరాపేక్ష నిలిచి ఉంది, వాళ్లు దాన్ని ఎలా పొందగల్గివుండేవారు?
12 అవిశ్వాసం మూలంగా ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోవడాన్ని నొక్కి చెప్పిన తర్వాత, పౌలు తన అవధానాన్ని తన తోటి విశ్వాసులవైపుకు మళ్లించాడు. హెబ్రీయులు 4:1-5 నందు వ్రాయబడివున్నట్లుగా, “[దేవుని] విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచి” ఉందని ఆయన హామీ ఇచ్చాడు. “విశ్వాసులమైన మనము [దేవుని] విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము” గనుక, “సువార్త” యందు విశ్వాసం కల్గివుండమని పౌలు వారిని కోరాడు. యేసు విమోచన క్రయధన బలి ద్వారా ధర్మశాస్త్రం అప్పటికే తీసివేయబడింది గనుక, పౌలు ఇక్కడ విశ్రాంతిదినం తెచ్చే శారీరక విశ్రాంతిని గురించి మాట్లాడడం లేదు. (కొలొస్సయులు 2:13, 14) ఆదికాండము 2:2ను మరియు కీర్తన 95:11ను ఎత్తి వ్రాస్తూ పౌలు, దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించమని హెబ్రీ క్రైస్తవులను కోరుతున్నాడు.
13. కీర్తన 95ను ఎత్తి వ్రాస్తూ, పౌలు “నేడు” అనే పదంవైపుకు ఎందుకు అవధానాన్ని మళ్లించాడు?
13 ఇశ్రాయేలీయులకు విశ్రాంతిదినాన లభించే విశ్రాంతి ఎలాగైతే “సువార్త” అయి ఉండాల్సిందో, అలాగే వారి తర్వాతి వారైన హెబ్రీ క్రైస్తవులకు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించే సాధ్యత “సువార్త” అయి ఉండాలి. గనుక, ఇశ్రాయేలీయులు అరణ్యంలో చేసిన అదే పొరపాటును చేయవద్దని పౌలు తన తోటి విశ్వాసులను కోరాడు. ఇప్పుడు కీర్తన 95:7, 8గా ఉన్న మాటలను ఎత్తివ్రాస్తూ, దేవుడు సృష్టికార్యం నుండి విశ్రమించి ఎంతోకాలం గడిచిపోయినప్పటికీ, ఆయన “నేడు” అనే పదం వైపుకు అవధానాన్ని మళ్లించాడు. (హెబ్రీయులు 4:6, 7) పౌలు చెబుతున్నదేమిటి? భూమికీ మానవజాతికీ సంబంధించిన తన సంకల్పం పూర్తిగా సాధించబడడానికి దేవుడు ప్రక్కకు ఉంచిన ఆ “యేడవ దినము” ఇంకా నడుస్తోందన్నదే ఆయన చెబుతున్న విషయం. కాబట్టి, తమ స్వంత స్వార్థపూరిత లక్ష్యాలలో మునిగిపోయే బదులు ఆ సంకల్పంతోపాటు పనిచేయడం ఆయన తోటి క్రైస్తవులకు అత్యవసరమై ఉంది. ఆయన మళ్లీ ఒకసారి ఈ హెచ్చరికనిచ్చాడు: “మీ హృదయములను కఠినపరచుకొనకు[డి].”
14. దేవుని “విశ్రాంతి” ఇంకా నిలిచివుందని పౌలు ఎలా చూపించాడు?
14 అంతేగాక, వాగ్దానం చేయబడిన “విశ్రాంతి,” కేవలం యెహోషువ నాయకత్వం క్రింద వాగ్దాన దేశంలో స్థిరపడ్డం మాత్రమే కాదని పౌలు చూపించాడు. (యెహోషువ 21:44) “యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును” అని పౌలు వాదించాడు. దాని దృష్ట్యా, పౌలు ఇంకా ఇలా జతచేశాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.” (హెబ్రీయులు 4:8, 9) ఏమిటా “విశ్రాంతి”?
దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించుడి
15, 16. (ఎ) “విశ్రాంతి” అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? (బి) ‘మన కార్యములను ముగించి విశ్రమించడం’ అంటే భావమేమిటి?
15 “విశ్రాంతి” అనే పదం అక్షరార్థంగా “విశ్రాంతి దినాన్ని (సబ్బాతును) ఆచరించడం” అనే భావంగల గ్రీకు పదం నుండి అనువదించబడింది. (కింగ్డమ్ ఇంటర్లీనియర్) ప్రొఫెసర్ విలియమ్ లేన్ ఇలా చెబుతున్నాడు: “విశ్రాంతి మరియు స్తుతి ఒకదానికొకటి సంబంధించినవని నొక్కిచెప్పిన నిర్గమ 20:8-10 ఆధారంగా యూదామతం రూపొందించిన విశ్రాంతిదిన బోధనుండి ఈ పదం ఆ ప్రత్యేకమైన భావాన్ని సంతరించుకుంది . . . [అది] దేవుడ్ని పూజించడంలోనూ స్తుతించడంలోనూ వ్యక్తపర్చబడే ఉత్సాహానందాల ప్రత్యేకమైన అంశాన్ని నొక్కిచెబుతుంది.” కాబట్టి వాగ్దానం చేయబడిన విశ్రాంతి కేవలం పని నుండి విడుదల మాత్రమే కాదు. అది అలసట కలిగించే, సంకల్పరహితమైన శ్రమ నుండి దేవుని ఘనపర్చే ఆనందభరితమైన సేవకు మారడం.
16 పౌలు తర్వాతి మాటల్లో అది స్పష్టమౌతుంది: “ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” (హెబ్రీయులు 4:10) దేవుడు ఏడవ సృష్టిదినాన విశ్రమించింది అలసిపోయినందుకు కాదు. బదులుగా, తన హస్తకృతి వృద్ధి చెంది తనకు స్తుతినీ ఘనతనూ తెచ్చేలా అది పూర్తి మహిమకు వచ్చేందుకుగాను ఆయన భూసంబంధ సృష్టి కార్యం నుండి విరమించుకున్నాడు. దేవుని సృష్టిలో భాగంగా, మనం కూడా ఆయన ఏర్పాటులో ఇమిడిపోవాలి. మనం ‘మన కార్యములను ముగించి విశ్రమించాలి,’ అంటే రక్షణ పొందేందుకైన కృషిలో దేవుని ఎదుట మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. బదులుగా, మన రక్షణ యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిపై ఆధారపడి ఉందన్న విశ్వాసం మనకుండాలి. ఆ బలి ద్వారానే అన్నీ మళ్లీ దేవుని సంకల్పానికి అనుగుణ్యంగా మారతాయి.—ఎఫెసీయులు 1:8-14; కొలొస్సయులు 1:19, 20.
దేవుని వాక్యము బలముగలది
17. శారీరక ఇశ్రాయేలీయులు అనుసరించిన ఏ విధానాన్ని మనం నివారించాలి?
17 ఇశ్రాయేలీయులు తమ అవిధేయత మూలంగా, అవిశ్వాసం మూలంగా దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు. తత్ఫలితంగా, పౌలు హెబ్రీ క్రైస్తవులను ఇలా కోరాడు: “కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయనట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.” (హెబ్రీయులు 4:11) మొదటి శతాబ్దపు యూదులు అనేకులు యేసునందు విశ్వాసముంచలేదు, సా.శ. 70లో యూదా విధానం అంతమైనప్పుడు అనేకులు ఎన్నో బాధలుపడ్డారు. దేవుని వాగ్దాన వాక్యమందు నేడు మనకు విశ్వాసం ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
18. (ఎ) దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడానికి పౌలు ఏ కారణాలను చెప్పాడు? (బి) దేవుని వాక్యము “రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటె” ఎలా “వాడి”యైనది?
18 యెహోవా వాక్యమందు విశ్వాసం ఉంచడానికి మనకు తగిన కారణాలున్నాయి. పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:12) అవును, దేవుని వాక్యం లేక సందేశం “రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడి” గలది. హెబ్రీ క్రైస్తవులు తమ పితరులకు ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకోవల్సిన అవసరం ఉంది. అరణ్యంలో అంతమౌతారని యెహోవా ఇచ్చిన తీర్పును వారు అలక్ష్యం చేసి, వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కాని మోషే వారినిలా హెచ్చరించాడు: “అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు, మీరు ఖడ్గముచేత కూలుదురు.” ఇశ్రాయేలీయులు మొండిగా ముందుకు దూసుకువెళ్లినప్పుడు, “ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.” (సంఖ్యాకాండము 14:39-45) యెహోవా వాక్యము రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటే వాడియైనది, ఉద్దేశపూర్వకంగా దాన్ని అలక్ష్యం చేసేవారు తప్పకుండా దాని పరిణామాలను అనుభవించవలసిందే.—గలతీయులు 6:7-9.
19. దేవుని వాక్యం ఎంత శక్తివంతంగా ‘దూరుతుంది,’ మరియు మనం దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉందని మనం ఎందుకు గుర్తించాలి?
19 దేవుని వాక్యం “ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు” ఎంత శక్తివంతంగా ‘దూరుతుందోకదా’! అది సూచనార్థకంగా, ఎముకల్లోని అంతర్గత భాగమైన మూలుగ వరకు దూరుచూ, వ్యక్తుల తలంపుల్లోకి మరియు దృక్పథాల్లోకి చొచ్చుకుపోతుంది! ఐగుప్తు దాసత్వం నుండి విడుదల చేయబడిన ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి అంగీకరించినప్పటికీ, వారు అంతర్గతంగా తమ హృదయాల్లో తన ఏర్పాట్లనూ, తాను కోరేవాటినీ మెచ్చుకోలేదని యెహోవాకు తెలుసు. (కీర్తన 95:7-11) ఆయన చిత్తాన్ని చేసే బదులు, వారు తమ స్వంత శారీరక కోరికలను తీర్చుకునే విషయంలోనే శ్రద్ధ కల్గివున్నారు. అందుకే, వారు దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతిలో ప్రవేశించలేదు గాని అరణ్యంలో నశించిపోయారు. “[దేవుని] దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” గనుక మనం దాని నుండి పాఠం నేర్చుకోవలసిన అవసరం ఉంది. (హెబ్రీయులు 4:13) కాబట్టి మనం యెహోవాకు చేసుకున్న సమర్పణను నెరవేరుస్తూ, “నశించుటకు వెనుక” తీయకుందాము.—హెబ్రీయులు 10:39.
20. ఇంకా ఏమి జరుగనైయుంది, దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మనం ఇప్పుడు ఏమి చేయాలి?
20 “యేడవ దినము”—దేవుని విశ్రాంతి దినము—ఇంకా కొనసాగుతున్నప్పటికీ, భూమికీ మానవజాతికీ సంబంధించి తన సంకల్పాన్ని నెరవేర్చే విషయం గురించి ఆయన అప్రమత్తంగా ఉన్నాడు. త్వరలోనే, మెస్సీయ రాజైన యేసుక్రీస్తు, అపవాదియైన సాతానుతో సహా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే వారినందరినీ భూమి మీది నుండి తొలగించివేయడానికి చర్య తీసుకుంటాడు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన సమయంలో, యేసూ మరియు ఆయన 1,44,000 మంది తోటి పరిపాలకులూ భూమినీ, మానవజాతినీ దేవుడు సంకల్పించిన స్థితికి తీసుకువస్తారు. (ప్రకటన 14:1; 20:1-6) మన జీవితాలు యెహోవా దేవుని చిత్తం చుట్టూ కేంద్రీకరించబడి ఉన్నాయని నిరూపించుకోవలసిన సమయం ఇదే. దేవుని ఎదుట మనల్ని మనం సమర్థించుకొని, మన స్వంత ఆసక్తులను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే బదులు, ‘మన కార్యములను ముగించి విశ్రమించి,’ రాజ్యాసక్తులను హృదయపూర్వకంగా నెరవేర్చవలసిన సమయమిదే. అలా చేయడం ద్వారా మరియు మన పరలోక తండ్రియైన యెహోవా పక్షాన నమ్మకంగా నిలిచియుండడం ద్వారా, దేవుని విశ్రాంతి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడూ, నిరంతరమూ ఆనందించే ఆధిక్యత మనకుంటుంది.
మీరు వివరించగలరా?
◻ “యేడవ దినము”న దేవుడు ఏ సంకల్పం కొరకు విశ్రమించాడు?
◻ ఇశ్రాయేలీయులు ఏ విశ్రాంతిని అనుభవించివుండేవారు, కాని వారు దానిలోకి ఎందుకు ప్రవేశించలేకపోయారు?
◻ దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మనం ఏమి చేయాలి?
◻ దేవుని వాక్యం ఎలా సజీవమైనది, బలముగలది, రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటే వాడియైనది?
[16, 17వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలీయులు విశ్రాంతిదినాన్ని ఆచరించారు, కాని వాళ్లు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. ఎందుకో మీకు తెలుసా?