కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/15 పేజీలు 20-24
  • అంత్యక్రియల విషయంలో క్రైస్తవ దృక్కోణం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంత్యక్రియల విషయంలో క్రైస్తవ దృక్కోణం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక విశ్వాసంతో ముడిపడివుంది
  • “లైంగికంగా పవిత్రపరచే” విషయమేమిటి?
  • రాత్రంతా మెలకువగా ఉండి చేసే ఆచారకర్మలు
  • మాన్యమైన అంత్యక్రియలు
  • దుఃఖ వస్త్రాలు అంగీకరించదగినవేనా?
  • లేఖనవిరుద్ధ ఆచారాలను అనుకరించడం నుండి తప్పుకోండి
  • క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • అంత్యక్రియల గురించి యెహోవాసాక్షుల అభిప్రాయమేంటి?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • మృతులు గౌరవించబడాలా?
    తేజరిల్లు!—1999
  • మన ప్రియమైనవారి కోసం ముందుగా పథకం వేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/15 పేజీలు 20-24

అంత్యక్రియల విషయంలో క్రైస్తవ దృక్కోణం

అకస్మాత్తుగా, అనుకోకుండా ప్రియమైనవారు మరణిస్తే, చాలా దుఃఖకరంగా ఉంటుంది. అలా తీవ్రమైన భావోద్వేగపు బాధతో తల్లడిల్లిపోతాం. ప్రియతమ వ్యక్తి ఎంతోకాలంగా వేదనకరమైన వ్యాధిని అనుభవించిన తర్వాత చనిపోవడం వేరు. అయినా దుఃఖమూ, కోల్పోయామన్న తీవ్రమైన అనుభూతీ కలుగుతాయి.

ప్రియమైన వ్యక్తి మరణించిన పరిస్థితి ఏమైనప్పటికీ, చనిపోయినవారి సొంత వ్యక్తులకు ఆలంబనా, సాంత్వనా అవసరం. చనిపోయినవారి కుటుంబ సభ్యుడైన క్రైస్తవుడు లేఖనవిరుద్ధమైన అంత్యక్రియల ఆచారాలను పాటించమని బలవంతం చేసేవారి మూలంగా పీడించబడవచ్చు. ఆఫ్రికాలోని అనేక దేశాల్లోనూ, మరి ఇతర ప్రాంతాల్లోనూ ఇది సర్వసాధారణం.

చనిపోయినవారి కుటుంబసభ్యులైన క్రైస్తవులు లేఖనవిరుద్ధమైన అంత్యక్రియల ఆచారాలనుండి తప్పుకోగల్గేందుకు ఏది సహాయపడగలదు? అలాంటి పరీక్షా కాలంలో తోటి విశ్వాసులు ఎలా మద్దతునివ్వగలరు? “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే” గనుక, యెహోవాను ప్రీతిపరచాలని ప్రయత్నించేవారందరూ ఈ ప్రశ్నల జవాబుల కోసం ఆతురతతో ఎదురు చూస్తారు.—యాకోబు 1:27.

ఒక విశ్వాసంతో ముడిపడివుంది

అనేక అంత్యక్రియల ఆచారాలతో ముడిపడివున్న ఒక కారకమేదంటే, చనిపోయినవారు పూర్వీకుల అదృశ్య మండలంలో జీవిస్తారన్న విశ్వాసమే. వాళ్ళను శాంతింపజేసేందుకు, కొన్ని శాంతికర్మలను చేయడానికి తాము బద్ధులై ఉన్నారని దుఃఖించే చాలామంది భావిస్తారు. శాంతికర్మలు చేయకపోతే సమాజానికి ఉపద్రవం కలుగుతుందని భయపడే పొరుగువాళ్ళకు అప్రీతి కలిగిస్తామేమోనని భయపడతారు.

నిజ క్రైస్తవుడు మనుష్య భయానికి లోనై, దేవునికి అప్రీతి కలిగించే ఆచారాల్లో పాల్గొనకూడదు. (సామెతలు 29:25; మత్తయి 10:28) చనిపోయినవారికి స్పృహ ఉండదని బైబిలు తెలియజేస్తుంది. అదిలా అంటుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) కనుక, చనిపోయినవారిని శాంతింపజేయడానికి లేదా వారితో సంభాషణ జరపడానికి ప్రయత్నించకూడదని ప్రాచీన కాలపు తన ప్రజలకు యెహోవా దేవుడు హెచ్చరికనిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 14:1; 18:10-12; యెషయా 8:19, 20) అనేక ప్రసిద్ధ అంత్యక్రియల ఆచారాలు ఈ బైబిలు సత్యాలకు పూర్తి విరుద్ధమైనవి.

“లైంగికంగా పవిత్రపరచే” విషయమేమిటి?

మధ్యాఫ్రికాలోని కొన్ని దేశాల్లో, చనిపోయిన వ్యక్తి యొక్క భార్య/భర్త ఆ చనిపోయిన వ్యక్తి యొక్క దగ్గరి బంధువుతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని అపేక్షించబడుతుంది. అలా జరుగకపోతే, చనిపోయిన వ్యక్తి బ్రతికివున్న కుటుంబ సభ్యులకు హాని తలపెడ్తాడని నమ్ముతారు. ఈ కర్మను “లైంగికంగా పవిత్రపరచుకోవడం” అని అంటారు. అయితే, వివాహేతర లైంగిక సంబంధమేదైనా సరే అది “జారత్వము” అన్నట్లు బైబిలు నిర్వచిస్తుంది. క్రైస్తవులు ‘జారత్వమునకు దూరముగా పారిపోవాలి’ కనుక, వాళ్ళు లేఖనవిరుద్ధమైన ఈ ఆచారాన్ని ధైర్యంగా వ్యతిరేకిస్తారు.—1 కొరింథీయులు 6:18.

మర్సీa అనే విధవరాలు విషయమే తీసుకోండి. ఆమె భర్త 1989లో చనిపోయినప్పుడు, ఆమె బంధువులు తమ బంధువైన ఒక పురుషునితో “లైంగికంగా పవిత్రపరచుకునే” పనిని చేయాలని చెప్పారు. ఆమె ఆ ఆచారం దేవుడి నియమానికి విరుద్ధమని వివరించి నిరాకరించింది. విఫలులైన బంధువులు నానా దుర్భాషలాడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒక నెల తర్వాత వాళ్ళు ఆమె ఇంటికి తిరిగి వచ్చి, ఇంట్లో ఒక్క వస్తువు కూడా ఉంచకుండా పట్టుకెళ్ళారు. ఆమె ఇంటి కప్పుకుండే ఇనుప షీట్లను కూడా పట్టుకుని వెళ్తూ, “నీ మతం నిన్ను చూసుకుంటుందిలే” అన్నారు.

సంఘం మర్సీకి సాంత్వననిచ్చింది, ఆమెకు క్రొత్త ఇంటిని కూడా కట్టించింది. పొరుగువాళ్ళు అది చూసి ముగ్ధులై, ఆ నిర్మాణ ప్రాజెక్టులో పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒక క్యాథలిక్‌ మతనాయకుని భార్య ఇంటి కప్పుకోసం గడ్డిని మొదట తీసుకువచ్చిన వ్యక్తి. మర్సీ నమ్మకమైన నడవడి ఆమె పిల్లలను ప్రోత్సహించింది. ఆ తర్వాత ఆమె పిల్లల్లో నలుగురు యెహోవా దేవునికి సమర్పణ చేసుకున్నారు, ఒకరు ఇటీవలే మినిస్టీరియల్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌కు హాజరయ్యారు.

“లైంగికంగా పవిత్రపరచే” ఆచారం కారణంగా, కొంత మంది క్రైస్తవులు అవిశ్వాసిని వివాహం చేసుకునేలా ఒత్తిడికి లోనయ్యేలా తమను తాము అనుమతించుకున్నారు. ఉదాహరణకు, 70లలో ఉన్న ఒక వ్యక్తి తన భార్య చనిపోయినప్పపుడు ఆమె బంధువైన ఒక అమ్మాయిని వెంటనే పెళ్ళి చేసుకున్నాడు. ఆ విధంగా చేయడం ద్వారా, తను “లైంగికంగా పవిత్రపరచుకునే” పని చేసేశానని చెప్పవచ్చనుకున్నాడు. అయితే, అలాంటి పని, “ప్రభువునందు మాత్రమే” పెండ్లి చేసుకోవాలన్న బైబిలు సలహాకు విరుద్ధమైనది.—1 కొరింథీయులు 7:39.

రాత్రంతా మెలకువగా ఉండి చేసే ఆచారకర్మలు

అనేక దేశాల్లో, అద్దెకు ఏడ్చేవాళ్ళు చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర కూడుకుని రాత్రంతా మెలకువగా ఉంటారు. ఇలా మెలకువగా ఉన్నప్పుడు భోజనకార్యక్రమాలూ, పెద్దగా సంగీతం పెట్టడమూ కూడా జరుగుతాయి. ఇది చనిపోయిన వ్యక్తిని శాంతింపజేస్తుందనీ, బ్రతికివున్న కుటుంబ సభ్యులను ప్రేతబాధ నుండి కాపాడుతుందనీ నమ్ముతారు. చనిపోయిన వ్యక్తిని ప్రీతిపరచేందుకు పొగడ్త ప్రసంగాలు ఇవ్వబడతాయి. ఒక ప్రసంగం తర్వాత, మరొక వ్యక్తి లేచి ప్రసంగమిచ్చే ముందు, అద్దెకు ఏడ్చేవాళ్ళు మత సంబంధమైన ఒక పాట పాడవచ్చు. అలా ఆ తంతు తెల్లవారే వరకూ కొనసాగుతుంది.b

నిజ క్రైస్తవుడు, రాత్రంతా మేల్కొని ఉండే అలాంటి ఆచారాల్లో పాల్గొనడు. ఎందుకంటే, చనిపోయినవారు బ్రతికివున్నవారికి మేలు గానీ కీడు గానీ చేయలేరు అని బైబిలు చూపిస్తుంది. (ఆదికాండము 3:19; కీర్తన 146:3, 4; యోహాను 11:11-14) లేఖనాలు ప్రేతవాద ఆచారాలను ఖండిస్తున్నాయి. (ప్రకటన 9:21; 22:15) అయితే, మిగతావాళ్ళు ఇతరులు అభిచార ఆచారకర్మలను చేయకుండా ఆపడం కష్టమని ఒక క్రైస్తవ విధవరాలు కనుగొనవచ్చు. ఆమె ఇంట రాత్రంతా మెలకువగా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని వాళ్ళు ఆమెను ఒత్తిడి చేయవచ్చు. చనిపోయినవారి సొంత వ్యక్తులు ఈ అదనపు కష్టాన్ని అధిగమించేందుకు సహాయపడేందుకు తోటి విశ్వాసులు ఏమి చేయగలరు?

చనిపోయిన వారి క్రైస్తవ కుటుంబం యొక్క బంధువులతోనూ, పొరుగువాళ్ళతోనూ హేతుబద్ధంగా మాట్లాడడం ద్వారా సంఘ పెద్దలు వారికి తరచూ మద్దతునివ్వడం జరిగింది. అలా సహేతుకంగా తర్కించడం వల్ల, ఆ వ్యక్తులు ఆ కుటుంబాన్ని మనశ్శాంతిగా ఉండనిచ్చి, మరొక రోజు శాంతికర్మల కోసం తిరిగి కలుసుకుంటామని ఒప్పుకుంటారు. కొందరు కయ్యానికి కాలు దువ్వితే అప్పుడేమిటి? తర్కించడానికి ఎడతెగక ప్రయత్నించడం హింసకు దారితీయవచ్చు. ‘[ప్రభువు దాసుడు] నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించాలి.’ (2 తిమోతి 2:23) కనుక, సహకరణ మనోభావంలేని బంధువులు బలవంతంగా అలాంటి కార్యక్రమాన్ని మొదలుపెడితే, క్రైస్తవ విధవరాలూ, ఆమె పిల్లలూ దాన్ని వారించలేకపోవచ్చు. కాని తమ ఇంట్లో జరుగుతున్న ఏ అబద్ధ మత ఆచారాల్లోను పాల్గొనరు. ఎందుకంటే, బైబిలు వారికిలా ఆజ్ఞాపిస్తుంది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.”—2 కొరింథీయులు 6:14.

ఈ సూత్రం అంత్యక్రియల్లోనూ వర్తిస్తుంది. అబద్ధ మత సేవకుడు నేతృత్వం వహించే పాటల్లోనూ, ప్రార్థనల్లోనూ లేదా ఆయన నిర్దేశించే ఆచారాల్లోనూ యెహోవాసాక్షులు పాల్గొనరు. సన్నిహిత కుటుంబ సభ్యులైన క్రైస్తవులు తప్పనిసరియై, అలాంటి కార్యక్రమానికి హాజరు కావలసి వచ్చినా, వాటిలో పాల్గొనరు.—2 కొరింథీయులు 6:17; ప్రకటన 18:4.

మాన్యమైన అంత్యక్రియలు

యెహోవాసాక్షులు నిర్వహించే అంత్యక్రియల్లో మృతులను శాంతింపజేసే క్రియలుండవు. రాజ్యమందిరం దగ్గర, సమాధి ఏర్పాట్లు చేసే దగ్గర లేదా చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర లేదా సమాధి చేసే దగ్గర బైబిలు ప్రసంగమివ్వబడుతుంది. మరణం గురించీ, పునరుత్థాన నిరీక్షణను గురించీ బైబిలు ఏమి చెబుతుందనే విషయాన్ని వివరించడం ద్వారా చనిపోయినవారి ప్రియులకు సాంత్వననివ్వాలన్నదే ఆ ప్రసంగం ఉద్దేశం. (యోహాను 11:25; రోమీయులు 5:12; 2 పేతురు 3:13) లేఖనాధారమైన ఒక పాటను పాడవచ్చు. ఓదార్పుకరమైన ఒక ప్రార్థనతో ఆ కార్యక్రమం ముగుస్తుంది.

ఇటీవల, ఇలాంటి సేవాకార్యక్రమం, ఒక యెహోవాసాక్షి చనిపోయినప్పుడు జరిగింది. ఆమె దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ నెల్సన్‌ మండేలా చిన్న చెల్లెలు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత, ఆ ప్రెసిడెంట్‌ ప్రసంగీకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మంచి హోదాలో ఉన్న అనేక వ్యక్తులూ, ఉన్నతాధికారులు దానికి హాజరయ్యారు. “నేను ఇదివరకెన్నడూ ఇంత మాన్యమైనటువంటి అంత్యక్రియలను చూడలేదని” ఒక క్యాబినెట్‌ మంత్రి అన్నారు.

దుఃఖ వస్త్రాలు అంగీకరించదగినవేనా?

యెహోవాసాక్షులు తమకు ప్రియమైనవారు చనిపోయినప్పుడు ఏడుస్తారు. యేసులాగే, వాళ్ళు కూడా కన్నీరు విడుస్తారు. (యోహాను 11:35, 36) బహిరంగమైన ఏదో సంకేతం ద్వారా తమ దుఃఖాన్ని బహిర్గతం చేయవలసినవసరం ఉందని వాళ్ళు అనుకోరు. (పోల్చండి మత్తయి 6:16-18.) అనేక దేశాల్లో, చనిపోయినవారిని శాంతింపజేసేందుకు, విధవరాలు ప్రత్యేక వస్త్రాన్ని ధరించుకోవాలని అపేక్షించబడుతుంది. ఆ వస్త్రాలను అంత్యక్రియలు జరిగిన అనేక నెలలు లేదా ఒక సంవత్సరం వరకూ ధరించుకోవాలి. ఆ వస్త్రాలను మార్చుకునే రోజున మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేస్తారు.

దుఃఖాన్ని ఈ విధాల్లో వెల్లడి చేయకపోతే మృతుడ్ని అవమానించినట్లు పరిగణించబడేది. ఆ కారణాన, స్వాజిలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల నాయకులు యెహోవాసాక్షులను వాళ్ళ సొంత ఇండ్లనుండి వాళ్ళ భూముల నుండి వెళ్ళగొట్టారు. అయినప్పటికీ, అలాంటి నమ్మకమైన క్రైస్తవులను వేరేచోట్ల ఉన్న వాళ్ళ ఆధ్యాత్మిక సహోదరులు పోషించారు.

స్వాజీలాండ్‌ హైకోర్ట్‌ యెహోవాసాక్షులకు అనుకూలమైన తీర్పును ప్రకటిస్తూ, వాళ్ళను వాళ్ళ ఇండ్లలోకి, భూముల్లోకి తిరిగి వెళ్ళనివ్వాలని చెప్పింది. మరో కేసులో, తన భార్య దుఃఖ వస్త్రాలను ధరించకూడదని చనిపోయిన భర్త తను మరణించక ముందు తెలియజేసిన ఉత్తరాన్నీ టేప్‌నూ అందించిన తర్వాత ఆ క్రైస్తవ విధవరాలు తిరిగి తన సొంత ఇంట్లో నివసించేందుకు అనుమతించబడింది. కనుక, ఆ విధంగా నిజానికి తనకు భర్త అంటే గౌరవభావం ఉందని ఆమె నిరూపించగల్గింది.

ఒకరు తన మరణానికి ముందు, ముఖ్యంగా, లేఖనవిరుద్ధ ఆచారాలు సర్వసాధారణంగా ఉన్న ప్రాంతాల్లో, తన అంత్యక్రియలను గురించిన నిర్దేశాలను తెలియజేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కామెరూన్‌ నివాసియైన విక్టర్‌ ఉదాహరణనే తీసుకోండి. తన అంత్యక్రియలు జరగవలసిన పద్ధతిని గురించి ఆయన వ్రాసి ఉంచాడు. మానవ కపాలాన్ని ఆరాధించడంతో సహా చనిపోయినవారి సంబంధంగా చాలా ఘోరమైన ఆచారాలు పాటించే, చాలా పలుకుబడిగల అనేక మంది వ్యక్తులున్న కుటుంబం ఆయనది. ఆ కుటుంబంలో విక్టర్‌ గౌరవించబడిన ఒక వ్యక్తి గనుక, తన కపాలం కూడా అదే విధంగా ఉపయోగించబడగలదని ఆయనకు తెలుసు. కనుక, ఆయన తన అంత్యక్రియలను యెహోవాసాక్షులు ఎలా చేయాలనే విషయంలో స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చాడు. ఇది ఆయన భార్యకు, ఆతని పిల్లలకు పరిస్థితిని సులభతరం చేసింది. సమాజంలో మంచి సాక్ష్యం ఇవ్వబడింది.

లేఖనవిరుద్ధ ఆచారాలను అనుకరించడం నుండి తప్పుకోండి

బైబిలు జ్ఞానం ఉన్న కొందరు ఇతరులకు భిన్నంగా కనిపించడానికి భయపడ్డారు. హింసలను తప్పించుకునేందుకు, సాంప్రదాయకంగా మేలుకొని ఉండే ఆచారాన్ని పాటిస్తున్నారని అనిపించేలా మెలుగుతూ, పొరుగువారిని ప్రీతిపరచేందుకు ప్రయత్నించారు. చనిపోయిన వ్యక్తుల ప్రియమైనవారిని సందర్శించి వారికి సాంత్వననివ్వడం మెచ్చుకోదగ్గ విషయమే అయినప్పటికీ, చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు జరిగే అసలు సమయానికి ముందటి రాత్రుల్లో ఆ ఇంట్లో మేల్కొని ఉండి ఆచార కర్మలను పాటించనసరం లేదు. ఇలా చేయడం ఇతరులకు అభ్యంతరం కలిగించవచ్చు. అందులో పాల్గొనేవారు మృతుల పరిస్థితిని గురించి బైబిలు చెబుతున్నదానిని నిజంగా నమ్మట్లేదన్న భావాన్ని కలిగించవచ్చు కనుక, ఇది గమనించే వ్యక్తులకు అభ్యంతరం కలిగిస్తుంది.—1 కొరింథీయులు 10:32.

దేవుని ఆరాధనకు జీవితంలో మొదటి స్థానాన్నివ్వాలనీ, వాళ్ళు తమ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలనీ బైబిలు ఉద్బోధిస్తుంది. (మత్తయి 6:33; ఎఫెసీయులు 5:15, 16) అయితే కొన్ని ప్రాంతాల్లో, సంఘ కార్యశీలత అంత్యక్రియల కారణంగా ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఆగిపోయింది. ఈ సమస్య ఉన్నది ఆఫ్రికాలో మాత్రమే కాదు. ఒక అంత్యక్రియ గురించి దక్షిణ అమెరికాలోని ఒక రిపోర్టు ఇలా చెబుతుంది: “మూడు క్రైస్తవ కూటాల హాజరు చాలా తగ్గిపోయింది. దాదాపు పదిరోజుల దాకా ప్రాంతీయ పరిచర్యకు మద్దతు ఇవ్వబడనే లేదు. బయటి ప్రజలూ, బైబిలు విద్యార్థులూ కూడా ఆశ్చర్యపోయారు, మన సహోదర సహోదరీల్లో కొందరు శాంతికర్మల్లో పాల్గొనడం చూసి నిరుత్సాహం చెందారు.”

కొన్ని సమాజాల్లో, మృతుని కుటుంబ సభ్యులు అంత్యక్రియల తర్వాత అల్పాహారం కోసం తమ సన్నిహిత స్నేహితులను తమ ఇంటికి ఆహ్వానించవచ్చు. కానీ ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో, మృతుల ఇండ్లలో జంతువుల బలి అర్పణ జరిగేది. అంత్యక్రియల కోసం హాజరయ్యే వందలాది మంది ప్రజలు మృతుని ఇంటికి వెళ్ళి, భోజనాల కోసం ఎదురు చూస్తారు. క్రైస్తవ సంఘంతో సహవసించే కొందరు ఈ ఆచారాన్ని అనుకరించి, చనిపోయినవారిని శాంతింపజేసేందుకు సాంప్రదాయకమైన సంతర్పణ జరుపుతున్నామనే అభిప్రాయాన్ని కలిగిస్తారు.

యెహోవాసాక్షులు నిర్వహించే అంత్యక్రియలు చనిపోయినవారి కుటుంబ సభ్యులపై అదనపు ఖర్చుల భారాన్ని మోపవు. ఎంతో ఖర్చుతోకూడిన అంత్యక్రియల ఖర్చుల నిమిత్తమై, హాజరయ్యేవారు డబ్బు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటేమీ చేయనవసరం లేదు. పేద విధవరాలు దగ్గర అత్యవసర ఖర్చులకు డబ్బులేకపోతే, సంఘంలోని మిగతావాళ్ళు సహాయపడడానికి సంతోషిస్తారన్నదానికి సందేహమే లేదు. అలాంటి సహాయం కూడా సరిపోకపోతే, అలా అర్హతవున్నవారికి ఆర్థిక సహాయం చేసేందుకు సంఘ పెద్దలు ఏర్పాటు చేయవచ్చు.—1 తిమోతి 5:3, 4.

అంత్యక్రియల ఆచారాలు అన్నీ బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయని కాదు. అలా విరుద్ధంగా ఉన్నప్పుడు, క్రైస్తవులు లేఖనాలకు అనుగుణ్యంగా నడుచుకోవాలని నిశ్చయించుకుంటారు.c (అపొస్తలుల కార్యములు 5:29) దీనివల్ల అదనపు శ్రమ కలగవచ్చు. అయినప్పటికీ, చాలా మంది దేవుని సేవకులు అలాంటి పరీక్షలను విజయవంతంగా అధిగమించిన సాక్ష్యాన్ని ఇవ్వగలరు. “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవా ఇచ్చిన బలం వల్లా, తమ కష్టంలో తమకు సాంత్వననిచ్చిన తోటి విశ్వాసుల ప్రేమపూర్వక సహాయం వల్లా వాళ్ళలా అధిగమించగల్గారు.—2 కొరింథీయులు 1:3, 4.

[అధస్సూచీలు]

a ఈ శీర్షికలో ప్రత్యామ్నాయ పేర్లు ఉపయోగించబడ్డాయి.

b కొన్ని భాషా గుంపుల్లోనూ, సంస్కృతుల్లోనూ “మేల్కొని ఉండడం” అనే పదబంధం మృతుని సొంత వ్యక్తులకు సాంత్వననిచ్చేందుకు, అక్కడికి వెళ్ళి, కాసేపుండడాన్ని సూచిస్తుంది. అందులో లేఖనవిరుద్ధమైనదేది ఇమిడి ఉండకపోవచ్చు. తేజరిల్లు! (ఆంగ్లం) మే 22, 1979, పేజీలు 27-8 చూడండి.

c అంత్యక్రియల ఆచారాలు క్రైస్తవునిపై పరీక్షలను తీసుకురాగల ప్రాంతంలో, మున్ముందు ఎదురవ్వగల ఈ విషయమై బాప్తిస్మ అభ్యర్థిని సిద్ధం చేసేందుకు పెద్దలు సహాయం చేయగలరు. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని ప్రశ్నలను చర్చించేటప్పుడు, “ఆత్మ, పాపము మరియు మరణము” “మిశ్రిత విశ్వాసం” అనే భాగాలకు శ్రద్ధాపూర్వక అవధానాన్నివ్వాలి. ఈ రెండు భాగాల్లోను, చర్చకు ఎంపిక చేయగల ప్రశ్నలున్నాయి. తనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు తననుండి ఏమి కోరుకుంటున్నాడు అని బాప్తిస్మ అభ్యర్థి తెలుసుకోగల్గేందుకు, లేఖనవిరుద్ధ అంత్యక్రియల ఆచారాల గురించిన ఈ విషయంలో పెద్దలు అవగాహనను ఏర్పరచగలరు.

[23వ పేజీలోని బాక్సు]

వారి దృఢ నిర్ణయం వల్ల ఆశీర్వాదం

సీబోంగీలీ అనే ధైర్యవంతురాలైన క్రైస్తవురాలైన విధవరాలు స్వాజీలాండ్‌లో నివసిస్తుంది. ఆమె భర్త ఇటీవల మరణించిన తర్వాత, మృతులను శాంతింపజేసే క్రియలని అనేకులు తలంచిన ఆచారాలను పాటించడానికి ఆమె నిరాకరించింది. ఉదాహరణకు, ఆమె గుండు గీయించుకోలేదు. (ద్వితీయోపదేశకాండము 14:1, క్యాథలిక్‌ అనువాదము) ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కోపంతో మండిపోయారు. బలవంతంగా ఆమెకు గుండు గీయించారు. సీబోంగీలీకి సాంత్వననివ్వడానికి యెహోవాసాక్షులు ఆమె ఇంటికి రాకుండా కట్టడి చేశారు. అయినప్పటికీ, రాజ్య సందేశంలో ఆసక్తి ఉండిన వేరే వ్యక్తులు పెద్దలు వ్రాసిన ప్రోత్సాహ లేఖలను తీసుకుని ఆమెను సందర్శించేందుకు సంతోషించారు. సీబోంగీలీ ప్రత్యేక దుఃఖ వస్త్రాలను ధరించాలని నిరీక్షించే రోజున ఆశ్చర్యకరమైనదొకటి సంభవించింది. కుటుంబంలో అందరూ గౌరవించే ఒకాయన సాంప్రదాయక దుఃఖాచారాలను పాటించడానికి ఆమె నిరాకరిస్తున్న విషయాన్ని చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

సీబోంగీలీ ఇలా నివేదించింది: “నల్లటి దుఃఖ వస్త్రాలను ధరించి విచారాన్ని వ్యక్తం చేయడాన్ని నా మత నమ్మకాలు అనుమతిస్తాయా అని వాళ్ళు నన్నడిగారు. నేను నా పరిస్థితిని వివరించిన తర్వాత, వాళ్ళు నన్ను బలవంతపెట్టబోవడం లేదని వాళ్ళు నాకు చెప్పారు. నాతో మొరటుగా వ్యవహరించినందుకూ, నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు గుండు గీయించినందుకూ వాళ్ళు నన్ను క్షమాపణ కోరుకోవడం నన్ను ఆశ్చర్యపరచింది. వాళ్ళందరూ క్షమించమని నన్ను కోరారు.” తర్వాత, సీబోంగీలీ చెల్లెలు, యెహోవాసాక్షులది నిజమైన మతమన్న తన నమ్మకాన్ని వ్యక్తీకరించింది. తనకు బైబిలు పఠనం కావాలని కోరుకుంది కూడా.

మరో ఉదాహరణను తీసుకోండి: తన తండ్రి ఆకస్మిక మరణాన్ని విన్నప్పుడు బెంజమిన్‌ అనే దక్షిణాఫ్రికా దేశస్థునికి 29 సంవత్సరాలు. ఆ సమయంలో బెంజమిన్‌ మాత్రమే ఆ కుటుంబంలో యెహోవాసాక్షి. అంత్యక్రియల కర్మకాండ సమయంలో, ప్రతి ఒక్కరు సమాధి దగ్గర వరుసగా నిలబడి, శవపేటిక మీద గుప్పెడు మట్టి విసరాలని నిరీక్షించబడింది.d సమాధి చేసిన తర్వాత, కుటుంబంలోని సభ్యులందరూ గుండు గీయించుకున్నారు. ఈ ఆచారాల్లో బెంజమిన్‌ పాల్గొనలేదు కనుక, తన తండ్రి ఆత్మ చేత ఆయన శిక్షించబడతాడని పొరుగువాళ్ళూ, కుటుంబ సభ్యులూ ప్రవచించారు.

“నేను యెహోవాయందు నమ్మకముంచాను గనుక, నాకు ఏమీ సంభవించలేదు” అని బెంజమిన్‌ అంటున్నాడు. ఆయనకు ఏమీ సంభవించలేదని కుటుంబ సభ్యులు గమనించారు. కాలక్రమేణా, వారిలో అనేక మంది యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించి, ఆ తర్వాత, దేవుడికి తాము చేసుకున్న సమర్పణకు ప్రతీకగా బాప్తిస్మం పొందారు. బెంజమిన్‌ విషయమేమిటి? ఆయన పూర్తికాల సువార్తపనిలో ప్రవేశించాడు. గత కొన్ని సంవత్సరాలుగా, యెహోవాసాక్షుల సంఘాల్లో ప్రయాణ కాపరిగా సేవచేసే చక్కని ఆధిక్యతలో ఉన్నాడు.

[అధస్సూచి]

d సమాధి స్థలంలో పువ్వులను గానీ, ఒక పిడికిలి మన్నునుగానీ విసరడంలో పెద్ద తప్పేమీ లేదని కొందరికనిపించవచ్చు. అయినప్పటికీ, సమాజం దీన్ని మృతుని శాంతింపజేసే పనిగా దృష్టిస్తున్నట్లయితే, లేదా అబద్ధ మత నాయకుడు నిర్ణయించిన కర్మల్లో అదీ భాగమైతే క్రైస్తవుడు ఆ ఆచారాన్ని అవలంబించ కూడదు.—తేజరిల్లు! మార్చి 22, 1977 (ఆంగ్లం) పేజీ 15 చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి