భూగ్రహం—ఎందుకిక్కడ ఉంది?
మీరు పరిశీలించాల్సిన ప్రశ్నొకటుంది: అందమైన మన గ్రహం, భూమి ఎడలా దానిపైనున్న మానవుల ఎడలా ఒక సంకల్పం గల జ్ఞానవంతుడైన సృష్టికర్తచే రూపొందించబడిందా? ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబును పొందడం, మన గ్రహానికి ఎటువంటి భవిష్యత్తు ఉందనే విషయాన్ని గ్రహించేందుకు మీకు సహాయపడగలదు.
విశ్వాన్ని గురించీ, మన భూమిని గురించీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనేకమంది సైంటిస్టులు, సృష్టికర్త ఉనికినీ, వీటి వెనుక దేవుడు ఉన్నాడనే విషయాన్నీ సూచించే సాక్ష్యాధారాలను చూశారు. వారిలో ఒకరు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలించండి:
ది మైండ్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ప్రొఫెసర్ పాల్ డేవిస్ ఇలా రాస్తున్నాడు: “స్థిరమైన, సంస్థీకృతమైన, సంకీర్ణమైన నిర్మాణాలను కల్గివున్న క్రమమైన, సంఘటిత విశ్వం ఉనికిలో ఉండాలంటే ప్రత్యేక తరహా నియమాలూ స్థితిగతులూ అవసరమౌతాయి.”
ఖగోళ-భౌతికవేత్తలూ మరితర సైంటిస్టులూ పేర్కొన్న అనేక “యాదృచ్ఛిక ఘటనలను” గురించి చర్చించిన తర్వాత, ప్రొఫెసర్ డేవిస్ ఇలా జోడిస్తున్నాడు: “వీటన్నిటినీ [యాదృచ్ఛిక ఘటనలన్నింటినీ] పరిగణనలోనికి తీసుకుం[టే], అవి [ఆ యాదృచ్ఛిక ఘటనలు] భౌతికశాస్త్ర నియమాల మూల రూపంపైనా, వివిధ కణధాతువుల ద్రవ్యరాశులూ బల సాంద్రతలూ మొదలైన వాటికోసం ప్రకృతి ఎంపికచేసుకొనే అసలు విలువల్లో యాదృచ్ఛికంగా జరిగినట్టన్పించే ప్రమాదాలపైనా జీవం ప్రభావంచెందేలా ఎంతో సున్నితంగా ఆధారపడుతుందనే ఉత్తేజకరమైన రుజువును ఇస్తాయి. . . . మనం దేవుని పాత్రను నిర్వర్తించి, నాబ్‌లను (బుడిపెలను) త్రిప్పడం ద్వారా వాటి పరిమాణాల విలువల్ని అనుకోకుండా ఎంపికచేస్తే, ఇంచుమించుగా నాబ్ సెట్టింగులన్నీ కలిసి విశ్వాన్ని నివాసానికి పనికిరానిదానిగా చేస్తాయనే విషయాన్ని మనం గ్రహిస్తాం. కొన్ని సందర్భాల్లో, విశ్వం జీవం వర్థిల్లేందుకు అనువుగా ఉండాలంటే వేర్వేరు నాబ్‌లు ఇసుమంతైనా తేడాలేకుండా చక్కగా ట్యూన్ చేయాల్సి ఉన్నట్టు కనబడుతుంది. . . . కొద్దిపాటి మార్పుల్ని చేసినా కూడా విశ్వం కన్పించకుండా పోతుందనే వాస్తవం, ఖచ్చితంగా ఎంతో గమనార్హమైన వాస్తవమౌతుంది.”
పై విషయాలు, విశ్వంలో మిగిలిన వాటన్నిటితోసహా మన భూగ్రహం, సంకల్పంగల ఒక సృష్టికర్తచే తయారు చేయబడిందనే విషయాన్ని అనేకులు తెలుసుకునేలా చేస్తున్నాయి. అదే గనుక నిజమైతే, ఆయన భూమిని ఎందుకు రూపొందించాడనే విషయాన్ని మనం మొట్ట మొదట తెలుసుకోవాల్సి ఉంది. మనం తెలుసుకొనగల్గితే, భూమి ఎడల ఆయన సంకల్పం ఏమైవుంది అనే విషయాన్ని కూడా మనం రూఢిపర్చుకోవాలి. దీనికి సంబంధించి ఒక అసాధారణమైన అసంగతం కనిపిస్తుంది. నాస్తికత్వానికి ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ, అనేకమంది ప్రజలు ఇప్పటికీ జ్ఞానవంతుడైన సృష్టికర్త ఒకరు ఉన్నారనే విశ్వాసాన్ని కల్గివున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన అనేక చర్చీలు సర్వోన్నతుడైన దేవుని గురించీ, మన విశ్వ సృష్టికర్తను గురించీ నామమాత్రంగా చర్చిస్తాయి. అయినప్పటికీ, ఈ మతాలు ఏవైనా సరే, దేవుని సంకల్పంలో భూగ్రహపు భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని గురించి నమ్మకంతోనూ, దృఢవిశ్వాసంతోనూ చాలా అరుదుగా మాత్రమే మాట్లాడతాయి.
బైబిలు ఏమి చెబుతోంది?
సృష్టికర్త నుండి వచ్చిన సమాచారంగా అందరిచే అంగీకరించబడిన ఒక సమాచారమూలం వైపుకు చూడడం సహేతుకమైన విషయం. అదే బైబిలు. మన భూగ్రహపు భవిష్యత్తును గురించి తెలియజేసిన ఒక సరళమైన, స్పష్టమైన వ్యాఖ్యానం ప్రసంగి 1:4లో ఉంది. మనమిలా చదువుతాం: “తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.” భూమిని యెహోవా దేవుడు ఎందుకు సృష్టించాడనే విషయాన్ని వివరించడంలో బైబిలు ఖచ్చితంగా ఉంది. భూగ్రహాన్ని విశ్వమందు సరిగ్గా సరైన స్థానంలో ఉంచాడనీ, ఈ గ్రహంపై జీవం వర్థిల్లేలా సూర్యగ్రహానికి తగిన దూరంలో ఉండేలా సరిగ్గా సరైన స్థానంలో దాన్ని ఉంచాడనీ అది చూపిస్తోంది. సర్వోన్నతుడైన దేవుడు ప్రాచీనకాల ప్రవక్తయైన యెషయాను ఇలా రాయడానికి ప్రేరేపించాడు: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను, నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు. నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా—యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.”—యెషయా 45:18.
కానీ భూమిపైనున్న జీవాన్నంతటినీ నాశనం చేసేంతటి మాధ్యమాలను మానవుడు తయారు చేస్తున్న విషయమేమిటి? మన భూగ్రహంపైనున్న జీవాన్నంతటినీ మానవజాతి నాశనం చేయకముందే తాను జోక్యం చేసుకుంటానని దేవుడు తన నిరుపమానమైన జ్ఞానంతో ప్రకటిస్తున్నాడు. బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటనలోని ఈ ఓదార్పుకరమైన వాగ్దానాన్ని గమనించండి: “జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్న[ది].”—ప్రకటన 11:18.
భూగ్రహం చుట్టూ తిరిగి వచ్చిన వ్యోమగామి వర్ణించినట్టుగా అంతరిక్షంలో ఆభరణం వలెనున్న ఈ భూగ్రహాన్ని సృష్టించడంలో తన ఆది సంకల్పమేమిటో యెహోవా మనకు తెలియజేస్తున్నాడు. మానవులంతా అంటే స్త్రీపురుషులంతా శాంతి సమైక్యతలతో జీవిస్తూ సంతృప్తికరంగా నివసించే భూపరదైసుగా ఉండాలని దేవుడు దాన్ని సంకల్పించాడు. పిల్లల్ని కనడానికి మొదటి దంపతుల్ని అనుమతించడం ద్వారా క్రమేణా భూగ్రహం ప్రజలతో నింపబడేందుకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆది దంపతుల సుఖసంతోషాల కోసం, యెహోవా భూమిపైనున్న కొంత భాగాన్ని పరదైసుగా చేశాడు. మానవ సంతానం అభివృద్ధి చెందడానికి సంవత్సరాలూ, శతాబ్దాలూ పడుతుంది గనుక, ఆదికాండము 1:28వ వచనం నెరవేరేంత వరకూ ఏదెను తోట విస్తరణ క్రమేణా జరిగి ఉండేది: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొను[డని] . . . దేవుడు వారితో చెప్పెను.”
భూమినీ, భూమిపై ఉన్న నివాసుల యొక్క విచారకరమైన పరిస్థితినీ మనం చూస్తున్నాం కదా, భూమి ఎడల దేవుని ఆది సంకల్పం విఫలమయ్యిందని దాని భావమా? లేక ఆయన తన సంకల్పాన్ని మార్చుకుని, మానవజాతి అవిధేయతను బట్టి భూగ్రహాన్ని సమూలంగా నాశనమైపోవడానికి అనుమతించి మళ్లీ పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాడా? లేదు, ఈ రెండింట్లో ఏదీ నిజం కాదని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. యెహోవా సంకల్పించినది చివరికి నెరవేరాల్సిందేననీ, ఆయన నిర్ణయించినదానిని ఎవ్వరూ అడ్డగించలేరనీ లేక ఎదురుచూడని ఏ పరిస్థితీ అడ్డగించలేదనీ బైబిలు మనకు చెబుతోంది. ఆయన మనకిలా అభయమిస్తున్నాడు: “ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.
దేవుని సంకల్పానికి అవాంతరమేర్పడింది గానీ, దానిలో మార్పురాలేదు
ఆదాము హవ్వల నిరాకరణతో, ఏదెను తోట నుండి వెళ్లగొట్టబడడంతో, వాళ్లు లేకుండానే పరదైసు భూమిని గూర్చిన దేవుని సంకల్పం సాధించబడుతుందనే విషయం స్పష్టమైంది. అయితే, తన ప్రాథమిక ఆదేశాన్ని వారి సంతానంలో కొందరు నెరవేరుస్తారనే విషయాన్ని యెహోవా అక్కడే, అప్పుడే సూచించాడు. నిజమే, దీనికి సమయం పడుతుంది, బహుశా అనేక శతాబ్దాలే పట్టొచ్చు, కానీ ఆదాము హవ్వలు పరిపూర్ణులై ఉండి జీవిస్తూ ఉండినప్పటికీ కూడా ఆ ప్రాథమిక ఆదేశాన్ని నెరవేర్చడానికి ఎంత సమయం పట్టివుండేదనే విషయాన్ని గురించి ఏ సూచనా ఇవ్వబడలేదు. వాస్తవమేమిటంటే, క్రీస్తుయేసు వెయ్యేండ్ల పరిపాలనాంతం నాటికి—ఇప్పటికి వెయ్యేళ్లకన్నా కొంచెమెక్కువ సంవత్సరాలు గడిచేనాటికి—ఏదెనులో ఉన్న పరదైసు పరిస్థితులు భూమ్యంతా వ్యాపిస్తాయి, మరి మొదటి దంపతుల యొక్క శాంతిప్రియులూ సంతోషవంతులూ అయిన సంతానంతో భూగ్రహం నిండిపోతుంది. వాస్తవానికి, తిరుగులేని సంకల్పకునిగా యెహోవా సామర్థ్యం నిరంతరమూ నిరూపించబడుతుంది!
ఎంతో కాలం క్రితం దేవుడు ప్రేరేపించిన ఉత్తేజవంతమైన ప్రవచనాలు అప్పుడు నెరవేరుతాయి. యెషయా 11:6-9 వంటి లేఖనాలు మహిమకరంగా నెరవేరుతాయి: “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును, చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును; వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును; మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యిచాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు; నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”
అనారోగ్యమూ అనివార్యమైన వ్యాధులూ గతించిన విషయాలై ఉంటాయి, మరణం కూడా గతించిన విషయమై ఉంటుంది. బైబిలులోని చివరి పుస్తకంలో ఉన్న సరళమైన ఈ మాటలకన్నా స్పష్టమైనది ఇంకేదైనా ఉంటుందా? “దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].”—ప్రకటన 21:3, 4.
అవును, మనం ధైర్యం తెచ్చుకోవచ్చు—మన అందమైన భూగ్రహం నిలిచి ఉంటుంది. ఈ దుష్టవిధానం, భూమిని నాశనంచేసే దాని చర్యలన్నిటితో సహా అంతం కాబోతుండగా దాన్నుండి తప్పించుకుని జీవించే ఆధిక్యత మీదై ఉండాలని అభిలషిస్తున్నాం. దేవుని కృతి అయిన పరిశుభ్రమైన క్రొత్తలోకం ఇప్పుడు సమీపంలో ఉంది. పునరుత్థాన అద్భుతం ద్వారా ప్రియమైన అనేకులు మరణం నుండి మేలుకొల్పబడతారు. (యోహాను 5:28, 29) నిజంగానే, మన భూమి నిలిచి ఉంటుంది, మనం దానిలో ఉండి ఆనందించగల్గుతాం.